‘అల్లరిమూకల మారణ హోమం ఆగేదెప్పుడు?’

  • 7 జూలై 2018
అల్లరిమూకల రాజ్యం Image copyright AFP

మాబ్ సైకాలజీ అనే అంశం సాధారణంగా సోషల్ సైన్స్‌లో(సామాజిక శాస్త్రం) అంతగా ఆకట్టుకోని ఒక చిన్న భాగంగా ఉండేది. కానీ అదిప్పుడు సమాజంలో ఒక ప్రధాన సమస్యగా, శాంతిభద్రతలకు ముప్పుగా మారిపోయింది.

ఫ్రెంచ్ విప్లవంలో గుంపుల గురించి, 'కు క్లక్స్ క్లాన్' వంటి  జాత్యహంకార ముఠాల గురించి చెప్పుకున్నప్పుడు మాబ్ సైకాలజీని మనకు పరిచయం లేని ఒక అంశంలా చర్చించుకునేవాళ్లు.

ఒక నల్లవాడిని తెల్లవాళ్లు కొట్టి చంపితే అది మాబ్ సైకాలజీ చర్చల్లో ఒక భాగమయ్యేది.

గోర్డాన్ ఆల్‌పోర్ట్, రోజర్ బ్రౌన్ లాంటి సైకాలజిస్టులు కూడా మాబ్ సైకాలజీని ఒక సబ్జెక్టుగా చేయలేకపోయారు.

ఒకరైతే సోషియాలజీ, సైకాలజీ చివర్లో దీన్ని ఒక పాథాలజీగా, అరుదైన విషయంగా ఉంచేశారు.

Image copyright Getty Images

హీరోలుగా అల్లరిమూకలు

ఇటీవల కాలంలో ఇష్టానుసారం ఇతరులను కొట్టిచంపుతున్న అల్లరి మూకలు హీరోలుగా చలామణీ అవుతున్నాయి. ఈ అల్లరిమూకలు రెండు రూపాల్లో హీరోల అవతారమెత్తుతున్నాయని పరిశీలకులు గుర్తించారు.

మొదటి వాళ్లు మెజారిటీ ప్రజాస్వామ్య సమాజంలో ఒక భాగంగా కనిపిస్తారు. అక్కడ ఈ అల్లరి మూకలు చట్టం చేయాల్సిన పనులు చేస్తాయి. ఆహారం నుంచి ఆహార్యం వరకూ అన్నింటినీ అదుపు చేయాలని చూస్తుంటాయి.

తాము ఏం చేసినా చట్టబద్ధమే అనుకుంటారు వీరు. తమ హింసాత్మక చర్యలను సమర్థించుకుంటారు.

అఫ్రజుల్, అఖ్తలాఖ్ కేసుల్లో అల్లరిమూకల స్పందన చూసినా, కథువా, ఉన్నావ్ అత్యాచార నిందితులను వెనకేసుకు రావడం గమనించినా.. ఈ గుంపులు తమను తామే న్యాయ నిర్ణేతలుగా, సమాంతర పాలకులుగా భావిస్తున్నట్టు కనిపిస్తుంది.

ఈ అల్లరి మూకలు సభ్యసమాజం ఆలోచనలనే మార్చేయాలని చూస్తున్నాయి. తాము చేసే పనుల గురించి అందరూ చర్చించుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.

Image copyright Getty Images

అల్లరిమూకల మరో రూపం

ఇటీవల పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే వదంతుల నేపథ్యంలో అల్లరి మూకల రెండో రూపం కూడా వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన భయాందోళనలు కలిగించి హింస ప్రజ్వరిల్లేలా చేయడమన్నది ఇక్కడ కనిపిస్తోంది.

మారుతున్న సమాజంలో పిల్లలను ఎత్తుకెళ్లడం అనేది చాలా భయం కలిగించే విషయం. పిల్లల దుర్భలత్వం కలవరపరుస్తోంది. ఇక్కడ పిల్లలను ఎత్తుకెళ్లడాన్నిఅడ్డుకునే క్రమంలో అల్లరి మూకల హింసకు మరో కారణం ఉంది. ఇక్కడ బలం కాకుండా ఆందోళన, భయం హింసకు కారణం అవుతున్నాయి.

ఇక్కడ మైనారిటీలపై దాడి చేయడం లాంటి ఘటనలేవీ జరగవు. ఇక్కడ అపరిచితులు, బయటివారు, సమాజంలో సరిగా ఇమడలేకపోతున్న వారిపై దాడులు జరుగుతాయి. ఇక్కడ ఇద్దరిపైనా అనుమానాలు ఉన్నాయి. కానీ వారిపై దాడులకు కారణాలు మాత్రం వేరు వేరు. మొదటి దానిలో మైనారిటీలు తమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారని దాడులు జరిగితే, రెండో దానిలో అపరిచితులను, బయటివారిని నేరస్థులుగా భావించడం వల్ల హింస జరుగుతోంది.

రెండు రకాల ఘటనలకూ ఒక ప్రత్యేక రకమైన వైరస్ కారణం అవుతోంది. అదే డిజిటల్. ఒకరి నుంచి మరొకరికి సందేశాలు వెళ్లడం వల్ల డిజిటల్ టెక్నాలజీ వదంతులను వేగంగా వ్యాపించేలా చేస్తోంది. వాటికి ఎలక్ట్రానిక్ వాహకం అవుతోంది. డిజిటల్ టెక్నాలజీ వదంతులను అందరూ నమ్మేలా చేస్తోంది.

మొదట్లో టెక్నాలజీ, ప్రసారాలు లేనపుడు మాటల ద్వారా వ్యాపించే పుకార్లు అంత ప్రమాదంగా ఉండేవి కావు. ఈరోజుల్లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ద్వారా ఈ వదంతులు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి.

నిజానికి చిన్న పట్టణాల్లో, కొన్ని మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ హింస స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రజలు సమాజంలో అవసరమైన మార్పులు తామే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

Image copyright Getty Images

రెండో రకం హింస ఒక మహమ్మారి లాంటిది. ప్రతిసారీ ఇవి ఒకేలా మొదలవుతాయి. ఈ హింసాత్మక ఘటనలు ఒకేలా ఉంటాయి. ఏ కేసు చూసినా వదంతులకు ఎలాంటి ఆధారాలు ఉండవు. కానీ ఇవి ఒకరి నుంచి ఒకరికి చేరుతాయి.

పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో త్రిపురలో ముగ్గుర్ని కొట్టారు. ఒక్క సోషల్ మీడియా మెసేజ్ వల్ల ఒక వ్యక్తిని క్రికెట్ బ్యాట్, కట్టెలతో దారుణంగా కొట్టి చంపారు.

తమిళనాడులో హిందీ మాట్లాడే ఒక వ్యక్తిని కొట్టడానికి వాట్సాప్ వైరల్ మెసేజే కారణం. అగర్తలలో పిల్లల్ని కిడ్నాపర్లనే అనుమానంతో ఇద్దర్ని కొట్టారు. వీటన్నిటికీ సోషల్ మీడియానే కారణం.

ఇదంతా చాలా వేగంగా జరిగిపోతుంది. అనుమానం రాగానే, మెసేజ్ పంపితే చాలు, జనం గుమిగూడుతారు. దాడి చేస్తారు. ఇలాంటి ఘటనల్లో న్యాయం జరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

Image copyright Ravi prakash

స్థానికేతరులకు పెద్ద సమస్య

ముఖ్యంగా అపరిచితులు, స్థానికేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగాయి. వారి పట్ల స్థానికుల్లో ఉన్న ఆందోళనకు తోడు వదంతులు వైరల్ కావడంతో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్లు ఉంటున్నారు. స్థానికేతరులు అక్కడ ఉన్న వారికంటే ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి దాడులు జరిగాయి. వాళ్లు కూడా మామూలు మనుషులే. కానీ వారిపై జనాలకు నమ్మకం ఉండదు. వారి మాట వినే సమయం కూడా ఉండదు.

ఆ వ్యక్తి తమ సమాజంలో భాగం కాకపోవడం, సోషల్ మీడియా సందేశాలు అతడికి వ్యతిరేకంగా ఉండడంతో వారిలో ఉన్న ఆలోచనలకు మరింత బలం చేకూరుతుంది.

అధికారులు వాటిని అదుపు చేయాలని చూశారు. కానీ ఇలాంటి వాటిని పూర్తిగా శాంతిభద్రతల సమస్యగా భావించలేం.

దీనిని శాంతిభద్రతల సమస్యగా భావించడానికి బదులు, సామాజిక సమస్యలుగా భావించి పరిష్కరించవచ్చు.

Image copyright Ravi prakash/bbc

ఆలోచనను చంపేస్తున్న టెక్నాలజీ

ఇటీవల అగర్తలలో ఇలా ఒక వ్యక్తిపై దాడి చేశారు. వందతులను ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో కొందరు గ్రామస్తులు 33 ఏళ్ల వ్యక్తి సుకాంత చక్రబొర్తిని కొట్టి చంపారు. నిజానికి, ఈ కథలో మరో కోణం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని వస్తున్న వదంతులపై అవగాహన కల్పించేందుకు సుకాంత చక్రబొర్తిని నియమించారు. వాటిని నమ్మద్దని ఊరూరా తిరుగుతూ లౌడ్ స్పీకరులో ప్రచారం చేయమన్నారు. కానీ సుకాంతతోపాటూ అతడితో ఉన్న మరో ఇద్దరిపై కూడా జనం దాడి చేశారు.

చక్రబొర్తిపై దాడి టెక్నాలజీ వల్లే జరిగింది. ఇక్కడ ఒక చిన్న పట్టణంలో వేగంగా వ్యాపించిన సోషల్ మీడియా మెసేజి ముందు అతడి లౌడ్ స్పీకర్ ఓడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగిగా చెబుతున్న చక్రబొర్తి జనం దగ్గర దెబ్బలు తినాల్సివచ్చింది.

టెక్నాలజీ వల్ల సమాజంలో అనాగరికత ఎంత వేగంగా వ్యాపిస్తోందో అనడానికి ఇది ఒక ఉదాహరణ. సమాజంలో కొన్ని నియమాలను అనుసరించే అల్లరిమూకలు హింస వ్యాపించేలా చేస్తాయి.

టెక్నాలజీ వేగం, అల్లరి మూకల మూఢత్వం కలగలిసి మారుతున్న సమాజానికి ఒక ప్రమాదకరమైన లక్షణంగా మారాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు