తెలంగాణ ఎంసెట్ పేప‌ర్ లీకేజీ కేసు: శ్రీచైత‌న్య డీన్, నారాయ‌ణ ఏజెంట్ అరెస్ట్

  • 5 జూలై 2018
పరీక్ష రాస్తున్న విద్యార్థులు Image copyright Getty Images

తెలుగునాట ఏ కీలక పరీక్ష జరిగినా కార్పొరేట్ కళాశాలల అవకతవకలపై ఆరోపణలు వస్తుంటాయి. అయితే, తొలిసారి అధికారికంగా రెండు ప్రైవేటు కళాశాలలకు చెందిన వ్యక్తులు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో అరెస్టయ్యారు.

శ్రీ చైత‌న్య జూనియ‌ర్ కాలేజ్ డీన్.. శ్రీచైత‌న్య‌, నారాయ‌ణ కాలేజీల‌కి ఏజెంట్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

పేప‌ర్ లీకేజ్, ఇంట‌ర్ బోర్డుతో సంబంధాలు, కాలేజీల నిర్వ‌హ‌ణ‌లో నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంపై కొన్ని కార్పొరేట్ కాలేజీల‌పై చాలా కాలంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొట్టమొద‌టిసారి 2016 తెలంగాణ ఎంసెట్-2 కేసులో ఇలా రెండు కార్పొరేట్ క‌ళాశాల‌ల అధికారి, ఏజెంట్ అరెస్టయ్యారు.

తెలంగాణ సీఐడీ అధికారుల క‌థ‌నం ప్ర‌కారం..

వేలేటి వాసుబాబు హైద‌రాబాద్ చైత‌న్య‌పురి శ్రీ చైత‌న్య జూనియ‌ర్ కాలేజీ డీన్‌గా పనిచేస్తున్నారు. ఆయ‌న ప‌రిధిలో మొత్తం 6 కాలేజీలు ఉన్నాయి. ఆయ‌న ఈ కేసులో ఎ-89 నిందితుడు. మ‌రో వ్య‌క్తి, క‌మ్మ వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ శ్రీచైత‌న్య‌, నారాయ‌ణ కాలేజీల‌కు అడ్మిష‌న్ ఏజెంటుగా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌ ఈ కేసులో ఎ-90.

2016లో తెలంగాణ ఎంసెట్ పేప‌ర్ లీకేజీ సంచ‌ల‌నం సృష్టించింది. ఆ కేసులో భాగంగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పరీక్షకు ప్రిపేరవుతున్న విద్యార్థులు(ప్రతీకాత్మక చిత్రం)

లీకేజీలో వీరి పాత్ర‌!

2016లో లీకైన ఎంసెట్ పేప‌ర్‌తో ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో కొంద‌రు విద్యార్థుల‌తో ప్రిప‌రేష‌న్ క్యాంప్ నిర్వ‌హించారు. డాక్టర్ ధనుంజ‌య‌, తాఖీర్, డాక్టర్ సందీప్ కుమార్‌లు ఆ క్యాంపు నిర్వ‌హించారు. తాజాగా అరెస్ట‌యిన నిందితులు ఇద్ద‌రూ ఆ ముగ్గురితో ఫోన్‌లో ట‌చ్‌లో ఉంటూ నేరానికి స‌హ‌క‌రించారు.

2016 ఫిబ్ర‌వ‌రి నుంచి జులై వ‌ర‌కూ వీరిద్ద‌రూ ప్ర‌ధాన నిందితుల‌ను ప‌లుమార్లు క‌లిసి పేప‌ర్ లీకేజీ, విద్యార్థుల‌కు క్యాంపు ఏర్పాటుపై చ‌ర్చించారు. (క్యాంపు అంటే.. కొంద‌రు విద్యార్థుల‌ను వేరే చోటుకు త‌ర‌లించి లీక్ చేసిన ప్ర‌శ్న‌లు వారికిస్తారు. విద్యార్థులు అక్క‌డే ప్రిపేరవుతారు. ఈ కేసులో విద్యార్థుల‌ను ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో కాకుండా ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లో ఉంచారు).

ప‌థ‌కం ప్ర‌కారం ఈ ఇద్ద‌రు నిందితులూ మొత్తం ఆరుగురు విద్యార్థుల‌ను ఎంచుకుని భువ‌నేశ్వ‌ర్‌ తీసుకువెళ్లి పరీక్ష‌కు సిద్ధం చేయించారు.

అక్క‌డ ఇత‌ర ఏజెంట్లు తీసుకువ‌చ్చిన మిగిలిన విద్యార్థులు కూడా ఉన్నారు. 2016 జూలై 9న ఆ ఆరుగురూ ఎంసెట్ రాయ‌గా, అందులో ముగ్గురికి మంచి ర్యాంకులు వ‌చ్చాయి. వారికి వచ్చిన పేప‌ర్, లీక్ అయిన ప్రశ్నపత్రంతో స‌రిపోలింది. ఆ త‌రువాత ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 ల‌క్ష‌లు వ‌సూలు చేసి జులై 12, 14 తేదీల్లో ప్ర‌ధాన నిందితుల‌కు ఇచ్చారు.

డ‌బ్బు సంపాద‌న‌కు, త‌మ సంస్థ‌కు పేరు తేవ‌డానికి మీ పిల్ల‌ల‌కు ర్యాంకులు తెప్పిస్తామంటూ త‌ల్లిదండ్రులతో, బ్రోక‌ర్ల‌తో, ప్ర‌ధాన నిందితుల‌తో వీరు నిరంత‌రం టచ్‌లో ఉండేవార‌ని తెలంగాణ సీఐడీ తెలిపింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు(ప్రతీకాత్మక చిత్రం)

అస‌లేం జ‌రిగిందంటే...

2016 జూలై 9న ఎంసెట్ మెడిక‌ల్ విభాగం ప‌రీక్ష జేఎన్‌టీయూ నిర్వ‌హించింది. ఫ‌లితాలు జులై 14న వ‌చ్చాయి. జులై 25న కేసు సిఐడి కేసు న‌మోదు చేసింది.

ఆ ఫ‌లితాల్లో ఆంధ్రా ఎంసెట్‌లో వెయ్యికి పైగా ర్యాంకు వ‌చ్చిన విద్యార్థుల‌కు, తెలంగాణ ఎంసెట్‌లో వందలోపు ర్యాంకులు రావ‌డం.. కొంద‌రికి ఇంట‌ర్‌లో చాలా త‌క్కువ మార్కులు రావ‌డం, ఎంసెట్-1 లో స‌రైన ర్యాంకు రాని వారికి ఎంసెట్-2లో మంచి ర్యాంకులు రావ‌డం వంటి అంశాల‌పై ప‌లువురు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీంతో ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపిన జేఎన్‌టీయూ అధికారులు, సీఐడీకి ఫిర్యాదు చేశారు. దిల్లీ సమీపంలోని గురుగావ్ వద్ద ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి ద్వారా పేప‌ర్ లీక్ అయింద‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు పోలీసులు.

నీట్ నేపథ్యంలో ఎంసెట్ రెండోసారి నిర్వహించారు. దానికి తోడు ఈ వివాదం కుదిపేసింది. అప్ప‌ట్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ కేసుపై విద్యా శాఖ‌, పోలీసు శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

‘‘ఈ కేసులో మొత్తం 90 మంది నిందితులున్నారు. వారిలో 64 మందిని ఇప్ప‌టి వ‌ర‌కూ అరెస్టు చేశాం. అరెస్టు అయిన వారిలో బిహార్ నుంచి 20 మంది వ‌ర‌కూ ఉన్నారు. వారిలో డాక్ట‌ర్లు కూడా ఉన్నారు. కార్పొరేట్ క‌ళాశాల‌ల‌కు చెందిన వారిని అరెస్టు చేయ‌డం మాత్రం ఇదే మొద‌టిసారి. చార్జిషీటు మీద ప‌నిచేస్తున్నాం. త్వ‌ర‌లోనే ఛార్జిషీట్ వేస్తాం’’ అని తెలంగాణ సీఐడీ ఉన్న‌తాధికారి బీబీసీతో చెప్పారు.

1996 లో తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ ఎంసెట్ నిర్వ‌హించిన‌ప్పుడు ఇంజినీరింగ్ పేప‌ర్ లీక్ అయింది. ఆ త‌రువాత తిరిగి 2016లో ఎంసెట్ మెడిసిన్ పేప‌ర్ లీక్ అయింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు