‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?

  • 6 జూలై 2018
జీబ్రా చేప Image copyright Getty Images

సాధార‌ణంగా మ‌నుషుల‌కు సంబంధించిన వ్యాధుల‌ను అధ్య‌య‌నం చేయాలంటే ఆయా శ‌రీర భాగాలు ఎలా పుడ‌తాయి? ఎలా పెరుగుతాయి? ఎలా ప‌నిచేస్తాయి? వ్యాధి కార‌కాలు ఎలా పెరుగుతాయి? క‌ణాల‌పై వాటి ప్ర‌భావం ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? వంటివి అధ్య‌య‌నం చేయాలి. మామూలుగా జంతువుల‌పై ప్ర‌యోగాలు చేస్తుంటారు కానీ అది చాలా క్లిష్ట‌మైన‌ ప్రక్రియ. ఈ స‌మ‌స్య‌కు ఓ చేప పిల్ల పరిష్కారం అయ్యింది.

అదే జీబ్రా చేప. ‘‘దీని నిర్మాణం ప‌రిశోధ‌న‌ల‌కు అనుకూలం. దీనికి మ‌నిషికి ఉన్న‌ట్టే ర‌క్తం, క‌ళ్లు, మెద‌డు, కిడ్నీ, లివ‌ర్.. ఇలా అన్ని భాగాలూ ఉంటాయి. ఈ చేప‌పై ప‌రిశోధ‌న‌ల వ‌ల్ల ఆయా అవయ‌వాల‌కు జ‌బ్బు వ‌స్తే ఎలాంటి మార్పులు వ‌స్తాయో స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు’’ అని శాస్త్రవేత్తలు వివరించారు.

"వైద్య‌, జ‌న్యు ప‌రిశోధ‌న‌ల‌కు ఈ చేప అత్యంత శ‌క్తిమంతమైనది" అని సీసీఎంబీ డైరెక్ట‌ర్ డా. రాకేశ్ కుమార్ మిశ్రా చెప్పారు.

‘వ్యాధుల‌కు మ‌నిషి శ‌రీరం ఎలా స్పందిస్తుందో ఈ చేప కూడా దాదాపు 90 శాతం అలానే స్పందిస్తుంది. అందుకే జీబ్రా ఫిష్ ఇప్పుడు వ్యాధి, జ‌న్యు ప‌రిశోధ‌కుల‌కు వ‌రంగా మారింది.’ అని ఆయన తెలిపారు.

ఇంకా ఈ చేపకు సంబంధించి శాస్త్రవేత్తలు చెప్పిన మరిన్ని ఆసక్తికర వివరాలు..

వేగంగా కేన్స‌ర్ ప‌రిశోధ‌న‌లు!

ఉదాహ‌ర‌ణ‌కు మ‌నుషుల‌కు వ‌చ్చేకేన్సర్‌ ఎలా పెరుగుతుందో తెలుసుకోవాల‌నుకుంటే, అదే త‌ర‌హా కేన్సర్‌ క‌ణాల‌ను ఈ చేప‌లో ప్ర‌వేశపెడ‌తారు. దానికి త‌గిన మందులు వేస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో కేవ‌లం వారంలోనే ఫ‌లితం తెలిసిపోతుంది. ఇలా మ‌నుషుల‌కు వ‌చ్చే క్యాన్సర్ల గురించి ఈ చేప‌ల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లు ఈ చేప‌ల‌పై రొమ్ము కేన్సర్‌ పరిశోధ‌న‌లు చేస్తున్నారు. అంటే రొమ్ము కేన్సర్‌ త‌ర‌హా క‌ణాల‌ను ఈ చేప‌ల‌కు ఎక్కించారు. చేప‌లో ఆ క‌ణాలు ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నాయో, విస్త‌రిస్తున్నాయో, ఎలా మారుతున్నాయో తెలుసుకుంటున్నారు.

చిత్రం శీర్షిక డా. మేఘా కుమార్

త‌రువాతి ద‌శ‌లో నిజంగా మ‌నుషుల నుంచి సేక‌రించిన క‌ణాల‌ను వాడుతారని ఆ ప‌రిశోధ‌న చేస్తోన్న‌ డా. మేఘా కుమార్ చెప్పారు. మ‌నిషి శ‌రీరంలో లాగానే చేప శ‌రీరంలో కూడా ఆ క‌ణాలు వివిధ శ‌రీర భాగాల్లోకి వెళ్ల‌డం తాము గ‌మ‌నిస్తున్నామ‌ని మేఘా చెప్పారు .

మ‌నుషులపై లేదా మ‌నుషుల కోసం జ‌రిపే ప్ర‌యోగాల్లో జన్యు మార్పులు, వేర్వేరు జ‌న్యువుల ప్ర‌భావం ఉంటుంది. కానీ ఈ చేప‌ల‌తో ఆ స‌మ‌స్య కూడా రాదు.

ఈ చేప‌ల్లో కేన్సర్‌ దాదాపు మ‌నిషిలో క్యాన్సర్‌ లాగానే ప్ర‌వ‌ర్తించ‌డం అత్యంత కీల‌క‌మైన అంశం.

మ‌నిషి శ‌రీరంలో క్యాన్సర్‌ క‌ణాలు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయో ఈ చేప‌లో కూడా అలానే ప్ర‌వర్తిస్తాయి. అందుకే తాజా ప‌రిశోధ‌న‌ల్లో ఈ చేప కీల‌కమైంది. ప్రాథ‌మిక ప్ర‌యోగాలు ఈ చేప‌పై జ‌రిపితే, తుది ప్ర‌యోగాలు మ‌నిషిపై చేసుకోవ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

కేన్సర్‌ మాత్ర‌మే కాకుండా న్యూరో బ‌యాల‌జీ, జెనిటిక్ మ్యూటేష‌న్, ఎంబ్రియాలజీ, క్షయ జ‌బ్బు ప‌రిశోధ‌న‌ల‌కు ఈ చేప బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ చేపకు కూడా మూడ్ ఉంటుంది!

ఈ చేపకు కూడా మ‌న‌సుంది! మూడ్ బాగోక‌పోతే ఒక్కోసారి రోజంతా క‌ద‌ల‌కుండా ఒక ప‌క్క‌నే ఉండిపోతుంది.

లేక‌పోతే ఈ చేపలు మొత్తం అక్వేరియం తిరిగేయ‌డం వంటివి చేస్తుంటాయి . ఇది వీటి ప్ర‌వ‌ర్త‌న‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి, వివిధ వ్యాధుల‌, ట్యూమ‌ర్ల ప్ర‌భావం మెదడుపై చూపే ప్ర‌భావాన్ని అధ్య‌యనం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

"ఈ చేప ఎంత తెలివైన‌దంటే, సాధార‌ణంగా ఆడ - మ‌గ చేప‌లు ప‌క్క ప‌క్క‌న ఉంటే గుడ్లు పొదిగి పిల్ల‌ల్ని కంటాయి. ఒక‌వేళ మ‌గ చేప ప్ర‌వ‌ర్త‌న‌లో తేడా క‌నిపిస్తే, దానికి ఉన్న వ్యాధుల‌ను ఆడ చేప గుర్తించ‌గ‌ల‌దు. దీంతో గుడ్లు పొద‌గ‌డానికి మ‌గ చేప స‌మ‌ర్థ‌వంత‌మైన‌దా కాదా అని ఆడ చేప నిర్ణ‌యిస్తుంది. ఆడ చేప‌కు మ‌గ చేప ఆరోగ్యంపై అనుమానం ఉంటే మ‌గ చేప‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌దు. మేం మగ చేపకు ఆల్కహాల్ ఇచ్చి పరిశోధన చేసినపుడు ఆడ చేప దాన్ని పక్కకు కూడా రానివ్వలేదు" అని వివ‌రించారు డా. మిశ్రా.

ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో ఈ చేప ఆధారంగా లేదా ఈ చేప‌పై దాదాపు 40 ల్యాబుల్లో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. దేశంలో ఈ జీబ్రా ఫిష్ ఆధారిత‌ ప‌రిశోధ‌న‌ల్లో ఉన్న వారంతా సీసీఎంబీలో రెండు రోజులు స‌మావేశ‌మై ప‌రిశోధ‌న‌ల పురోగ‌తిని చ‌ర్చించారు.

చిత్రం శీర్షిక సీసీఎంబీ డైరెక్ట‌ర్ డా. రాకేశ్ కుమార్ మిశ్రా

జ‌న్యు శాస్త్ర‌వేత్త‌ల‌కు వ‌రం

శ‌రీర భాగాలు ఎలా ఏర్ప‌డ‌తాయి? ఎలా నిర్మాణ‌మ‌వుతాయి? జ‌న్యువుల మార్పు ఎలా ఉంటుంది? జీవ క‌ణాల పెరుగుద‌ల, గుడ్డు నుంచి జీవి పుట్టే విధానం, మ్యూటేష‌న్ ఎలా జ‌రుగుతుంది? అనే అంశాల‌ను ఈ చేపపై అధ్య‌య‌నం చేయ‌డం చాలా సుల‌భం. ఈ చేప‌కున్న మ‌రో ముఖ్య ల‌క్ష‌ణం ఏ శ‌రీర భాగం తెగిపోయినా అది మ‌ళ్లీ పెరుగుతుంది.

అత్యంత చ‌వ‌క

ప‌రిశోధ‌కులు ఈ చేప వైపు మ‌ళ్ల‌డానికి మ‌రో పెద్ద కార‌ణం ఖ‌ర్చు. ఇతర ప్రాణులకు అయ్యే ఖ‌ర్చులో కేవ‌లం 500వ వంతు ఖ‌ర్చుతో ఈ చేప‌పై ప‌రిశోధ‌న‌లు చేయ‌వ‌చ్చు. పైగా అంత‌కంటే కచ్చిత‌మైన ఫ‌లితాలు కూడా వ‌స్తాయి.

ఇతర ప్రాణులపై ప‌రిశోధ‌న చేయాలంటే ర‌క‌ర‌కాల అనుమ‌తులు తెచ్చుకోవాలి. చ‌ట్ట‌ప‌ర‌మైన నిబంధ‌న‌లు చాలా పాటించాలి. నైతిక ప్ర‌శ్నలు అనేకం. ఆ జంతువుల‌కు ప్ర‌త్యేక‌మైన స్థ‌లం, దాన్ని నిత్యం క్రిములు చేర‌కుండా శుభ్రంగా ఉంచ‌డం, రెండు పూట‌లా మేత‌, కాప‌లా కాసే మ‌నుషులు.. ఇదంతా చాలా పెద్ద స‌మ‌స్య‌. అలాగే ఇతర ప్రాణులు పరిమితంగా దొరుకుతుంటాయి. కానీ ఈ చేప‌తో ఆ స‌మ‌స్య లేదు.

పైగా ఈ చేప భార‌తదేశానికి చెందింది. గంగా న‌దీ, హిమాల‌య ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. దీంతో దిగుమ‌తి స‌మ‌స్య కూడా లేదు. కేవ‌లం నీళ్లు, మేత ఉంటే చాలు. ఇంకేం అక్క‌ర్లేదు. అందుకే ఆధునిక జ‌న్యు ప‌రిశోధ‌కులు ఈ చేప వైపు మ‌ళ్లుతున్నారు.

Image copyright ...
చిత్రం శీర్షిక జీబ్రా చేపపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల బృందం

ఈ చేపల‌పై ప‌రిశోధ‌న వ‌ల్ల లాభాలు

చేప‌ల సంఖ్య‌, గుడ్ల సంఖ్య‌తో స‌మ‌స్య లేదు. కావ‌ల్సిన‌న్ని ప‌రిశోధ‌న‌లు చేయ‌వ‌చ్చు.

పాలిచ్చే జంతువులు కాకుండా దోమ‌లు, ఈగ‌లు వంటి కీట‌కాల‌పై వైద్య ప‌రిశోధ‌న‌లు చేసుకోవాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. దానికి ప‌రిష్కారం ఈ చేప‌పై ప‌రిశోధ‌న‌లు.

చుంచుల్లో ఎదుగుద‌ల‌ను అధ్య‌య‌నం చేయ‌డం క‌ష్టం. కానీ ఈ చేప విష‌యంలో అది చాలా సులువు.

ఈ చేప జీవిత కాలం చాలా వేగంగా ఉంటుంది. గుడ్డు నుంచి మిగిలిన శ‌రీర భాగాలు ఏర్ప‌డ‌డం దాదాపు 24 గంట‌ల్లో జ‌రిగిపోతుంది. దీంతో ప‌రిణామ క్ర‌మాన్ని, నిర్మాణ క్ర‌మాన్ని అర్థం చేసుకోవ‌డం శాస్త్ర‌వేత్త‌ల‌కు సులభంగా ఉంటుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)