వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
రైతుల ఆదాయం పెంచుతామంటూ 2014 ఎన్నికలప్పుడు బీజేపీ ఇచ్చిన హామీకి అనుగుణంగా మోదీ ప్రభుత్వం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ నిర్ణయం యువత మీద, సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపనుంది?
అన్న విషయాలను వివరించారు ప్రముఖ వ్యవసాయ వ్యాపార నిపుణులు, ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ గుప్తా.
ప్రభుత్వ నిర్ణయం ఏమిటి?
పంటల సగటు ఉత్పత్తి వ్యయం కన్నా.. కనీసం 50 శాతం అధికంగా రైతులకు మద్దతు ధర చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ నివేదిక పేర్కొంది.
దాంతో అన్ని పంటలకూ కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లకు పెంచనున్నట్లు 2018-19 వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ పెంపునకు తాజాగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు పెంచాలని వ్యవసాయ ఖర్చులు, ధరలు విభాగం కమిషనర్‌కు సూచించింది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 భారం పడుతుందని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు.
అయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం సామాన్య వినియోగదారుడి మీద ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. కానీ, పరోక్షంగా మాత్రం తప్పకుండా ఉండే అవకాశముంది.
ఫొటో సోర్స్, Getty Images
1. ఆర్థిక, ఆరోగ్య పరమైన సంబంధం
వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరమైన అంశాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.
దేశ ఆర్థిక వ్యవస్థతోనూ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.. కాబట్టి సామాన్యుడి జేబు మీద ప్రభావం పడుతుంది.
2- వ్యాపార అవకాశాలు
ఈ కనీస మద్దతు ధరల గురించి లోతుగా తెలుసుకోవడం ద్వారా యువత మరిన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించే వీలుంటుంది.
ఉదాహరణకు.. రైతుల నుంచే పంటలను నేరుగా కొనుగోలు చేసి, వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేయవచ్చు. లేదా ఆ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి(ప్రాసెస్ చేసి) మార్కెట్లోకి తీసుకురావచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
3. ధర తక్కువ, పోషకాలు ఎక్కువ
మంచి పోషక విలువలు కలిగి ఉండి.. తక్కువ ధరకే లభించే పంట రాగి. ఇందులో క్యాల్షియం దండిగా ఉంటుంది.
అనేక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా... రాగులతో చేసిన వంటకాలకు పట్టణాలు, నగరాల్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది.
దాన్ని యువత, గృహిణులు ఒక వ్యాపార అవకాశంగా మలచుకుని రాగులతో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రజలకు మెరుగైన పోషక పదార్థాలు కూడా అందే వీలుంటుంది.
4. పోషకాహార లోపంపై యుద్ధం
రాగుల వంటకాలను క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే పోషకాహార లోపాన్ని తరిమికొట్టొచ్చు.
రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా తయారయ్యేలా చేస్తుంది.
ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి.
పైగా.. రాగి వర్షాధార పంట కాబట్టి నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు.
రాగులు ఒక్కటే కాదు.. ఇంకా ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు అనుగుణంగా యువత ఆలోచించాలి.
ఫొటో సోర్స్, Getty Images
5. ద్రవ్యోల్బణం నియంత్రణ
మార్కెట్లో పంటలకు డిమాండ్ బాగుంటే.. రైతులు కూడా వాటిని పండించేందుకు ఆసక్తి చూపుతారు. దాంతో దేశంలో డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుంది.
ఫలితంగా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయి. వినియోగదారుడికి నేరుగా లబ్ధి చేకూరుతుంది.
డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గినప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.
6. రైతు, వినియోగదారుడు ఇద్దరికీ మేలే
ప్రతిదానికీ మార్కెట్‌కి వెళ్లకుండా.. వినియోగదారులు చిన్న బృందంగా ఏర్పడి ఆహార ధాన్యాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయాలి.
అది ఇరువురికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
రైతుకు మంచి రేటు వస్తుంది. మరోవైపు వినియోగదారుడికి కూడా మార్కెట్లో కంటే తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు దొరుకుతాయి.
మధ్యలో దళారుల ప్రమేయం లేనప్పుడు కమీషన్లు, పన్నులు ఉండవు కాబట్టి ధరలు తక్కువగా ఉంటాయి.
ఫొటో సోర్స్, NOAH SEELAM/GETTY
7. ఆ అంతరం తగ్గాలి
ప్రభుత్వం పంటల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ.. ఆ ధరలకు పంటలను కొనుగోలు చేసినప్పుడే రైతు ప్రయోజనం కలుగుతుంది.
ఒకవేళ ప్రభుత్వం కనీస మద్దతు ధరలు చెల్లించకపోతే.. సమస్య అలాగే ఉండిపోతుంది.
కొనుగోలు చేసినా.. ఆ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గిడ్డంగులు ఉండాలి.
రైతులు పండించిన పంట వినియోగదారులకు చేరే వరకు ధరలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ ధరలతో పోల్చితే రైతుకు అందే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది.
ధరలో ఆ అంతరాలు తగ్గి, రైతుకు ఎక్కువ ప్రయోజనం కలగాలి. అప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది.
రైతులు మరింత ఎక్కువ పండించేందుకు ఆసక్తి చూపిస్తారు.
దాంతో చివరికి ఎక్కువ లబ్ధి చేకూరేది వినియోగదారుడికే.
ఫొటో సోర్స్, Getty Images
పెరిగిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు
ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరలు(ఎంఎస్పీ) ఈ కింది విధంగా ఉన్నాయి:
- వరి రూ.1,750(క్వింటాకు రూ.200 పెరిగింది)
- జొన్నలు కొత్త ధర క్వింటా రూ.1,950
- రాగులు 50% (కనీస మద్దతు ధర అత్యధికంగా రాగుల మీద పెరిగింది)
- నువ్వులు 45.11% పెరిగింది(గతంలో రూ. 4,050, ఇప్పుడు రూ.5,877)
- కందులు 4.13% (కొత్త ధర క్వింటాకు రూ. 5,675)
- మినుములు 3.70% పెరిగింది (కొత్త ధర రూ. 5,600)
- వేరుశనగలు 9.87%
- పత్తి 28.11% పెరిగింది(కొత్త ధర క్వింటాకు రూ.5,150)
- పెసలు(పెసర్లు) 25% పెరిగింది( కొత్త ధర క్వింటా రూ.6,975)
వీడియో: వరి సాగుకన్నా యాపిల్ తోటలే నయమంటున్న కశ్మీరీలు
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర: రైతుల లాంగ్ మార్చ్ వెనుక 7 కారణాలు!
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- ఈ రైతులు కరువు నేలలో కోట్లు పండిస్తున్నారు
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
- మంత్రిగారూ... రైతుల నిరసనలు ‘పబ్లిసిటీ స్టంట్’ అని ఎన్నికల ముందు అనగలరా?
- ఒంటి చేత్తో సిరుల పంట పండిస్తున్నాడు!
- బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- కేంద్ర బడ్జెట్: ‘ఓట్ల కోసం కలల వల’
- నన్ను రేప్ చేసినా, చివరకు చంపినా.. నా పోరాటం ఆగదు!
- అప్పుడే పుట్టిన చిన్నారికి పాలిచ్చిన తండ్రి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)