రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- పద్మ మీనాక్షి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Facebook/RenuDesai
(ఇది 2018 జూన్ 6న చేసిన ఇంటర్వ్యూ. అప్పుడు చదవని వారి కోసం మళ్లీ పబ్లిష్ చేస్తున్నాం.)
రేణూ దేశాయ్, పవన్ 2012 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇలా ఆమె రెండో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె బీబీసీ తెలుగుతో ప్రత్యేకంగా మాట్లాడారు.
పవన్‌తో విడిపోయిన తర్వాత ఆమె జీవితం ఎలా గడిచింది? ఎవరి ఆసరా లేకుండా ఆమె పిల్లలను ఒంటరిగా ఎలా పెంచారు? ఇవాళ పెళ్లి నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చింది అన్న అంశాలను వివరించారు.
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు: పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది?
మేము ఇద్దరం విడిపోయే నాటికి పిల్లలు ఇద్దరూ చాలా చిన్న వాళ్ళు. ఆద్యకి అపుడు కేవలం నాలుగు సంవత్సరాలు. ఇంట్లో పెద్దగా ఎవరి సహకారం లేకుండా పిల్లలను పెంచడం, నా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో రోజులను నెట్టుకు రావడం.. చాలా కష్టంగా ఉండేది.
విడాకుల తర్వాత నేను ఎటువంటి భరణం తీసుకోలేదు. నా పిల్లలకు న్యాయంగా రావాల్సింది వచ్చింది. విడాకులు తీసుకున్నాక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో నేను సంపాదిస్తున్నాను. కానీ.. ఆర్థిక సమస్యలు తప్పలేదు.
ఇండియాలో చాలా మంది మహిళలు పెళ్లి అవ్వగానే తమ కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి, కెరీర్‌ను పక్కన పెట్టేస్తారు. నేను కూడా పెళ్లి తర్వాత నా వృత్తిని వదులుకున్నాను.
ఆ ప్రయాణం చాలా కష్టం గా ఉండేది. నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. హాస్పిటల్స్ లో చాలా సార్లు చేరాను. ఒకసారి శ్వాశకోశ సమస్య, మరోసారి గుండె సమస్య.. ఇలా నేను హాస్పిటల్ చుట్టూ తిరగడంతో పిల్లలు చాలా మానసిక వేదన అనుభవించారు. మధ్య మధ్యలో వాళ్ల ఆరోగ్యం కూడా పాడయ్యింది.
మహిళలకి కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు చాలా అవసరం. నాకు పెద్ద కుటుంబం ఏమీ లేదు. మా నాన్నగారు ఉద్యోగ నిమిత్తం లండన్ వెళ్లిపోయారు. నా కజిన్స్, స్నేహితులు ఎవ్వరూ పూణెలో లేరు. ఒంటరిగా వ్యవహారాలను చూసుకోవడం చాలా కష్టంగా ఉండేది.
ఈ రోజుల్లో స్నేహితులే కుటుంబంగా మారిపోతున్నారు. పరిస్థితులు చాలా మారుతున్నాయి. కానీ, ఇంకా మారాల్సి ఉంది. వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చి బ్రతకాలనుకునే ఆడవాళ్లకు కుటుంబం అండగా ఉండాలి.
ఫొటో సోర్స్, Renudesai
బీబీసీ తెలుగు: మీ కష్టాలని ఎలా అధిగమించారు?
నేను ఒకే ఒక మంత్రాన్ని నమ్ముతాను. నా దగ్గర ఏమి లేదో దాని గురించి ఆలోచించడం మానేసి, నా దగ్గర ఉన్నదేంటో ఆలోచించడం మొదలు పెట్టాను. నాకు ఉండటానికి ఇల్లు ఉంది. హాస్పిటల్ బిల్లులు కట్టడానికి డబ్బులున్నాయి. ఇవేవీ లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అందుకే.. నాకున్న వాటితో సంతోషంగా జీవించడం మొదలు పెట్టాను.
కృతజ్ఞత - జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే నేను సాధన చేసిన మంత్రం. నాకు నేను చెప్పుకున్న నా మంత్రం - 'ఒక రోజు అన్నీ మంచిగా అవుతాయి (ఓ డి ఏ ఏ టి ) వన్ డే ఎట్ ఏ టైం'. ఇదే మంత్రాన్ని హెన్నాతో రాసుకునేదానిని . ఇదే నాకు సహాయ పడింది.
మనిషికి కష్టాలు ఎదురైనపుడే తన లోపలికి తరచి చూసుకుంటాడు. ఆధ్యాత్మికంగా ఆలోచించడం మొదలు అవుతుంది. నేనేమన్నా తప్పు చేశానా? నాకే ఎందుకు ఇలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలెన్నో మెదులుతాయి. కర్మ గురించి ఆలోచించడం మొదలు పెడతాం.
ఈ ప్రయాణం.. నేను ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిగా రూపాంతరం చెందడానికి చాలా సహాయ పడింది.
ఫొటో సోర్స్, Renudesai
బీబీసీ తెలుగు : ఒక పురుషుడు జీవితంలో ఎన్ని వివాహాలు చేసుకున్నా సమాజం వారిని నాయకులుగా, సెలబ్రిటీస్‌గా ఆమోదించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అదే పని ఒక మహిళ చేస్తే ఎందుకు ఆమోదించదంటారు?
దురదృష్టవశాత్తు, మనం ఇంకా పురుషాధిక్య సమాజం లోనే బతుకుతున్నాం. చాలా కొంత మంది పురుషులు మాత్రమే మహిళ కూడా ఒక మనిషే అని గుర్తిస్తారు.
ప్రతి పురుషుడూ.. 'స్త్రీ తన సొంతం' అనుకుంటాడు.
ఒక మహిళ తన భర్తని పేరుతో పిలవడం ఒక పెద్ద తప్పు గా చూసే సమాజంలో ఉన్నాం మనం. ఒక మహిళ గౌరవాన్ని తన రెండు కాళ్ళ మధ్య దాచేశాం మనం. తనని ఒక ఆబ్జెక్ట్‌గా మాత్రమే చూస్తారు కానీ మనసున్న మనిషిగా కాదు.
పురుషులు కూడా తామే మహిళల గౌరవాన్ని నిలబెట్టే ప్రతినిధులు అనుకుంటారు. చివరికి చేసేది ఏమి ఉండదు.
మహిళలు శారీరకంగా కాస్త బలహీనులు కావచ్చు కానీ వ్యక్తులుగా సమాన హక్కులు కలిగి ఉంటారని, మహిళ కూడా ఒక మనిషేనని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది.
తల్లులు తమ కొడుకుల్ని సరిగ్గా పెంచితే సమాజం బాగుపడుతుంది. మహిళలే మహిళలకి శత్రువులు అన్నది చాలా నిజం. ఒక అత్తగారు తన అత్తగారితో కష్టాలు భరిస్తే, తన కోడలు కూడా అవే కష్టాలు పడాలని అనుకుంటుంది కానీ, కోడలు సుఖంగా ఉండాలని, తాను పడిన కష్టాలు తన కోడలు పడకూడదని అనుకోదు. ఈ ధోరణి మారాలి.
రేపు పొద్దున్న ఒకవేళ నా కొడుకే తన గర్ల్ ఫ్రెండ్‌తో అనుచితంగా ప్రవర్తిస్తే, నేను ఆ అమ్మాయి వైపు నుంచి సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను కానీ.. నా కొడుకుని గుడ్డిగా సమర్థించను.
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు : మీరు మరో పెళ్లి చేసుకుందామని ప్రకటించగానే మీ ట్విటర్ అకౌంట్లో పవన్ కల్యాణ్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. అపుడు మీరు.. 'విడాకులు తీసుకోవడానికి గల కారణాలు చెప్పానంటే మీరు నోరు మూస్తారు' అని సమాధానం చెప్పారు. దీని గురించి ఏమన్నా చెబుతారా?
నేను ఏమీ చెప్పదలచుకోవటం లేదు. తెలివైన వాళ్ళు తప్పు ఎవరిదో అర్థం చేసుకుంటారు. తెలివి లేని వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ ట్వీట్ చూసి అర్ధం చేసుకోండి. ఇంతకన్నా నేను ఏమీ చెప్పదలుచుకోవటం లేదు.
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు: ఈ అభిమానుల నుంచి వచ్చే ఒత్తిడి ఎలా ఎదుర్కొంటారు?
నేను తీసుకునే నిర్ణయాలు మంచివా, చెడువా అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. రాజకీయ నాయకులు, సినిమా తారల దగ్గరకి వచ్చేసరికి సమాజం వాళ్ళని తమ సొంతం అనేసుకుంటుంది. ఒక సినిమా బాగుండకపోతే.. వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమా చూస్తారు కాబట్టి మా నటన, పాత్రలు గురించి అడిగే హక్కు ఉంటుంది.
కానీ మా ప్రైవేట్ జీవితాల గురించి అడిగే హక్కు ఎవరికీ లేదు. ఒకరి ప్రైవేట్ స్పేస్‌లోకి అడుగు పెట్టడం అనేది పూర్తిగా వారి భావ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడమే తప్ప ఇంకొకటి కాదు.
సెల్ ఫోన్ లు, ఇంటర్నెట్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డానికి, మాటల యుద్ధం చేయడానికి బాగా పనికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు, తెర వెనుక మాటల యుద్ధం చేసే సైనికులులా మారిపోతున్నారు.
అలాగే ఒక నలుగురు కూడితే చర్చకు వచ్చేవి సినిమాలు, స్పోర్ట్స్, రాజకీయాలు. వాళ్ళ వాళ్ళ జీవితాలలో ఏముందో చూసుకోకుండా, పక్క వాడి పర్సనల్ జీవితాల్లోకి తొంగిచూడటం ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి సినిమా వాళ్ళు, రాజకీయ వ్యక్తులు, ప్రముఖులు ఎప్పుడూ బలి అవుతూనే ఉంటారు.
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు: మీ నిర్ణయాన్ని మీ పిల్లలు ఆమోదించారా? మీ నిర్ణయాల ప్రభావం మీ పిల్లలపై ఎలా ఉంది?
నేను విడాకులు తీసుకునే నాటికి నా పిల్లలు చిన్న వాళ్ళు. వాళ్ళ మీద చాలా ప్రభావం పడింది. నా కూతురు నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, బయటకి రావడం చూసింది. అది వాళ్ళకెంతో ఇబ్బంది కలిగించిన విషయం.
పిల్లలు ఒప్పుకోకుండా ఏ తల్లీ నిర్ణయం తీసుకోలేదు. నాకేదో మద్దతు కావాల్సివచ్చి ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగానే బతుకుతున్నా.
కానీ ఈ మనిషితో కలిసి జీవించగలను.. అతను కూడా నా పిల్లలతో కలిసి జీవించగలడు అనే నమ్మకం వచ్చాక ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక పురుషుడిగా వేరొకరి పిల్లల్ని ఆమోదించడం అతనికెంత కష్టమో కూడా సమాజం ఆలోచించాలి.
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు : మహిళా స్వాతంత్ర్యం అంటే?
ఒంటరిగా ఉన్నాం కదా అని అమ్మాయిలు ఎదో ఒక సంబంధంలోకి వెళ్లడం మంచిది కాదు. పురుషుడు లేకపోతే వాళ్ళ జీవితం సంపూర్ణం కాదు అనే ఆలోచన నుంచి అమ్మాయిలు దూరంగా జరగాలి. అమ్మాయిలు తమకి తామే పరిపూర్ణమైన వ్యక్తులు అని గుర్తించగలగాలి.
ఎవరైనా ఒంటరిగా ఉంటే ఈ సమాజం కూడా.. 'ఒక్కదానివే ఎలా బతుకుతావు ఎవరి తోడు లేకుండా?' అని ప్రశ్నలతో చంపుతారు. అబ్బాయికి గాని, అమ్మాయికి గాని 30 సంవత్సరాలు రాగానే, ఇంకా పెళ్లి చేసుకోవా అని అడుగుతారు.
వారి జీవితాలు వారు గడుపుతున్నారు, సరైన వ్యక్తి తారసపడినపుడు వారే నిర్ణయం తీసుకుంటారులే.. అని ఎందుకు ఆలోచించరో అర్ధం కాదు.
ఎవరో వచ్చి తమ జీవితాన్ని ఆనందమయం చేస్తారని ఎదురు చూడకండి. ఒక అబ్బాయి వచ్చి తమ జీవితాన్ని పూరిస్తాడని ఆశపడకండి. మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోండి.
19వ శతాబ్దం మొదలు నుంచి షేక్స్పియర్ రచనలు కాని, మరో సాహిత్యం కాని, ప్రేమని రొమాంటిసైజ్ చేయడం మొదలైంది. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ ప్రేమే జీవితం కాదు. మీకు మంచి తోడు దొరికితే ఆనందించండి. కానీ ఆ వ్యక్తి మాత్రమే మీ జీవితాన్ని ఆనందమయం చేయగలరని అనుకోకండి. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా!
ఫొటో సోర్స్, facebook/Renu Desai
బీబీసీ తెలుగు : మీ జీవితంలో మీకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన?
నాకు అత్యంత ఆనంద దాయక క్షణాలు నా పిల్లలు పుట్టడమే. ఇవి కాకుండా సమాజసేవ చేసినపుడు, ఎవరినైనా మరణంలోంచి జీవితాన్ని చిగురించేలా చేయగలిగినపుడు వాళ్ళు వచ్చి తమ కృతజ్ఞత ప్రదర్శించినపుడు ఎనలేని సంతోషం కలుగుతుంది. ఇలాంటి క్షణాలకి కొదవ లేదు.
బీబీసీ తెలుగు : అత్యంత కష్టంగా అనిపించిన క్షణం?
ప్రతి రోజూ నాకు, జీవితానికి మధ్య జరిగిన యుద్ధం. నా అనుకున్న దగ్గర మనుషులు నన్ను తీవ్రంగా బాధకి గురి చేసినా వారిని క్షమించడానికి నేను చేసిన ప్రయత్నమే అత్యంత కష్టమైన క్షణం. నా తల్లిదండ్రులు కూడా అమ్మాయిగా పుట్టినందుకు ప్రేమగా చూడకపోవడం నాకు బాధ కలిగించే విషయం.
నా తల్లిదండ్రులు, నా భర్త ... వీళ్లందరినీ క్షమించడానికి నేను చేసిన ప్రయత్నమే నాకు ఓ సవాలు. క్షమించకపోతే నేను జీవితంలో ముందుకు సాగలేను.
ఇవి కూడా చదవండి:
- లవ్ బ్యాంక్: ప్రేమ లేఖ నుంచి సినిమా టికెట్ వరకు.. ప్రతీ జ్ఞాపకం పదిలం
- “భార్య ఇంటిపేరును భర్త ఎందుకు పెట్టుకోడు?”
- ‘ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశం’
- ఆయుష్షు పెరగాలంటే.. పెళ్లి చేసుకోండి
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
- పెళ్లి ఫొటోలను పోర్న్ ఫొటోలుగా మార్చి.. వివాహితుల బ్లాక్ మెయిల్
- 'కట్నం కోసం' ఆమె 'అతడు'గా మారింది.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడింది!
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- #HerChoice: ‘మా ఆయనకు తీరిక లేదు, వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- ఆమె అతడై.. అతడు ఆమెయై.. తర్వాత ఒక్కటై
- రాషిద్ ఖాన్: క్రికెట్ పాకిస్తాన్లో నేర్చుకున్నా.. ప్రేమించటం భారతీయుల నుంచి నేర్చుకున్నా
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- పాత ఫొటో స్టూడియోలు ఏమవుతున్నాయి?
- డిజిటల్ యుగంలో సాంప్రదాయ గడియారాలతో ‘ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు’
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)