ప్రెస్‌రివ్యూ: స్వాతంత్ర్య పోరాటంలో క్రిస్టియన్ల పాత్రలేదన్న బీజేపీ ఎంపీ

  • 7 జూలై 2018
Image copyright Gopalshetty/facebook

స్వాతంత్ర్య పోరాటంలో క్రిస్టియన్ల పాత్ర ఏమీ లేదని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ గోపాల్‌శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నవతెలంగాణ పేర్కొంది.

భారత స్వాతంత్ర్య పోరాటంలో హిందువులు, ముస్లింలు పాల్గొన్నారని గోపాల్‌శెట్టి అన్నారు. క్రిస్టియన్లు బ్రిటీష్‌వారని, అందువల్లే వారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదని ఆయన ఆరోపించారు.

షియా కబరస్తాన్‌ కమిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. రైతుల ఆత్మహత్యలు ఫ్యాషన్‌గా మారాయంటూ రెండేళ్ల కిందట ఇదే ఎంపీ వ్యాఖ్యానించారని నవతెలంగాణ వెల్లడించింది.

Image copyright Getty Images

'ఎంసెట్' లీకేజీకి వంద సిమ్ కార్డులతో ఫిబ్రవరిలోనే కుట్ర

సంచలనం సృష్టించిన ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోందని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

తాజా అరెస్టుల నేపథ్యంలో ఈ కుంభకోణంలో కార్పొరేట్‌ కళాశాలల పాత్రపైనా సీఐడీ కన్నేసింది.

ఆరు నెలల ముందే ఆర్బీ సింగ్‌ ముఠా ఈ కుట్రకు వ్యూహం పన్నిందనీ, ఎంసెట్‌ ప్రశ్నపత్రం తమ చేతికి వస్తుందని 2016 ఫిబ్రవరిలోనే దళారులను సంప్రదించినట్లు తేలింది.

దానికి తగ్గట్టుగానే వందకుపైగా సిమ్‌కార్డులు కొనుగోలు చేసి దళారులకు అందజేసిందనీ, అనుకున్నట్లుగానే ఎంసెట్‌ ప్రశ్నపత్రం సాధించడాన్ని బట్టి చూస్తే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉండి ఉంటారా అనే కోణంపైనా సీఐడీ దృష్టి సారించింది.

2016 జులై 9న నిర్వహించిన ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం ముందుగానే బయటికొచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో ప్రశ్నపత్రాల లీకేజీ ముఠాను నడిపిస్తున్న ఉత్తరప్రదేశ్‌ వారణాసికి చెందిన రాజా బహద్దూర్‌ సింగ్‌ (ఆర్బీ సింగ్‌) బాధ్యుడిగా వెల్లడైందని ఈనాడు వెల్లడించింది.

Image copyright chandrababunaidu/facebook

'చట్టం'పై పోరాటం

ప్రత్యేక హోదాతోపాటు కేంద్రం నుంచి దక్కాల్సిన అన్ని అంశాలపైనా న్యాయ పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న, నాడు రాజ్యసభ వేదికగా ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీలన్నీ సాధించుకోవాలని తీర్మానించింది. 'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం! ఇతర విభజన హామీలు అన్నీ అమలు చేశాం' అంటూ ఇటీవల కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను తిప్పికొడుతూ సుప్రీంకోర్టులోనే తమ వాదన వినిపించాలని నిర్ణయించింది.

ఈ అంశంపై శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కౌంటర్‌ అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేస్తున్నామని అధికారులు వివరించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలోని ఒక పులి Image copyright AP Forest Department

పులులను ఆకర్షించేందుకు గడ్డి పెంచుతున్న అటవీ శాఖ

పక్క రాష్ట్ర అడవుల నుంచి పులులను ఆకర్షించడం కోసం తెలంగాణలోని అటవీ అధికారులు అడవుల్లో గడ్డిని పెంచే పనిలో పడ్డారని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఆహారం కోసం వేట సాగించేందుకు పులి గడ్డి ప్రాంతాలను ఎక్కువగా వాడుకుంటుందని, దీని కోసం నల్లమల, కవ్వాల్‌లో గడ్డిని పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు కవ్వాల్‌ అభయారణ్యంలోని 2,700 హెక్టార్లు కేటాయించి ప్రణాళికలు రూపొందించారు.

శాఖాహార అటవీ జంతువులు ఇష్టంగా తినే 14 రకాల గడ్డి జాతులను గుర్తించి ప్రతి బీట్‌లో కనీసం 2.5 హెక్టార్ల చొప్పున పెంచనున్నారు.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా జన్నారం ఫారెస్టు డివిజన్‌లోని 500 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు.

మిగిలిన ప్రాంతాల్లోనూ దశలవారీగా పనులు చేపట్టనున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోనూ గడ్డిని పెంచే ప్రక్రియను మొదలుపెట్టారని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)