ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు

  • విజయ భాస్కర్
  • బీబీసీ కోసం
పాలమూరు మహాసమాఖ్య మహిళా సంఘం

'పాలమూరు వెనుకబడిన జిల్లా, వలసలకు అడ్డా' అని చెబుతుంటారు. కానీ అక్కడి మహిళలు ఉత్తరప్రదేశ్‌ వారికి దారి చూపిస్తున్నారు. పాలమూరు నుంచి వెళ్లి పరాయి రాష్ట్రంలో పొదుపు పాఠాలు నేర్పిస్తున్నారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన ఎన్.కవిత భర్త కొన్నాళ్ల కిందట బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోయారు.

దీంతో ఇద్దరు బిడ్డల పోషణ ఆమెకు కష్టంగా మారింది.

కానీ, మహిళా సంఘంలో చేరడంతో ఆమె పరిస్థితి మారింది.

ఇప్పుడామె తన ఇద్దరు బిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.

సొంతంగా ఇల్లు కట్టుకున్నారు.

అంతేకాదు ఉత్తరప్రదేశ్‌లోని పేద మహిళలకు శిక్షణ ఇస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

కవిత ఒక్కరే కాదు పాలమూరు జిల్లాలోని పలువురు మహిళల విజయగాథ ఇలాంటిదే.

ఈ జిల్లా మహిళలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని మహిళలకు శిక్షణ ఇస్తూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారు.

పాలమూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు..

ఉత్తరప్రదేశ్‌లో మహిళా సంఘాల ఏర్పాటుకు 2014లో అక్కడి ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్దిశాఖ సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా అక్కడి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ శిక్షణ బాధ్యతలు పాలమూరు మహా సమాఖ్య మహిళా సంఘానికి దక్కాయి.

అయితే, ఈ సంఘంలో ఉన్న చాలా మంది పదో తరగతి వరకే చదువుకున్నారు.

హిందీ, ఇంగ్లిష్ మాట్లాడలేరు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు శిక్షణ ఇవ్వాలంటే హిందీ తప్పనిసరిగా రావాలి.

అయితే, జిల్లా అధికారులు దీన్నో సమస్యగానే భావించలేదు. సంఘంలోని కొంతమంది సభ్యులను ఎంపిక చేసి వారికి హిందీలో శిక్షణ ఇచ్చి పంపాలని నిర్ణయించారు.

ప్రత్యేక పరీక్షతో ఎంపిక..హిందీలో శిక్షణ

మహబూబ్‌నగర్ జిల్లాలో 51,394 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 6 లక్షల మంది సభ్యులు ఉన్నారు.

దీంతో ఉత్తరప్రదేశ్‌లో శిక్షణ ఇచ్చే సభ్యులను ఎంపిక చేసేందుకు అధికారులు కొన్ని అర్హతలు నిర్ణయించారు.

45 ఏళ్లకు మించకుండా, 10వ తరగతి పాసై, మహిళా సంఘాల్లో వారాంతపు సమావేశాలు నిర్వహించే అనుభవం ఉన్నవాళ్లను అర్హులుగా ప్రకటించారు.

జనరల్ స్టడీస్, గ్రామీణాభివృద్దిపై ప్రత్యేకంగా సభ్యులకు పరీక్ష నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఇలా అన్ని పరీక్షలు నిర్వహించి వంద మందిని ఎంపిక చేశారు. ఎంపికైన సభ్యులను సీఆర్‌పీ (క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్)లుగా వ్యవహరిస్తారు.

వీరికి 'నేషనల్ రూరల్‌ లైవ్లీహుడ్ మిషన్‌' ద్వారా శిక్షణ ఇప్పించారు.

ముఖ్యంగా హిందీలో మాట్లాడటం, రాయడం, చదవడంపై ఎక్కువ దృష్టి సారించారు.

అలాగే, మహిళా సంఘాల సమావేశాల నిర్వహణ, గ్రామ సంఘాల ఏర్పాటు, స్వయం సహాయక సంఘాలలో నిర్వహించే 7 రకాల పుస్తకాలను సిద్ధం చేయడం తదితర అంశాల్లో ఎంపికైన సభ్యులకు శిక్షణ ఇచ్చారు.

శిక్షణ తర్వాత 75 మంది మిగలగా, వీరిని 5 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 15 మంది సభ్యులను చేర్చారు.

ప్రస్తుతం పాలమూరు మహాసమాఖ్య కింద మహబూబ్‌‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మహిళా సంఘాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ మహిళలకు పాఠాలు

ఎంపికైన 75 మందిని ఉత్తరప్రదేశ్‌లోని 7 జిల్లాల పరిధిలో ఉన్న గ్రామాలకు పంపించారు.

ఒక్కో గ్రూపు ఒక్క గ్రామంలో 15 రోజులు ఉండి అక్కడి మహిళలకు సంఘాల ఏర్పాటు, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై శిక్షణ ఇస్తుంది.

మహిళా సంఘాల ఏర్పాటు వల్ల వచ్చే లాభాలు, తమ అనుభవాలను వారితో పంచుకుంటుంది.

ఉత్తరప్రదేశ్‌లో మహిళా సంఘాలను 'సమూహూ సఖీ' పేరుతో పిలుస్తారు.

అక్కడ శిక్షణ ఇచ్చినందుకుగాను ఒక్కో సీఆర్పీకి రోజుకు రూ.1,150 చెల్లిస్తారు. అదనం రూ.200 డీఏగా ఇస్తారు.

ఇలా వచ్చిన మొత్తంలో రూ.40 సేవా రుసుంగా పాలమూరు మహాసమాఖ్య తీసుకుంటుంది.

ఇలా ఒక్కో సీఆర్పీ 45 రోజులు శిక్షణ ఇస్తే రూ.50 వేలకు పైగా సంపాదించుకోవచ్చు.

ప్రస్తుతం సీఆర్పీల రోజువారి వేతనం రూ.1,550కి, సీనియర్ సీఆర్పీల వేతనం రూ.1,750కి పెంచారు.

నాలుగేళ్లుగా పాలమూరు మహాసమాఖ్య నుంచి 280 మంది సీఆర్పీలు అనేక సార్లు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి వచ్చారు.

'సీఆర్పీగా చేసి నా బిడ్డను సాఫ్ట్‌వేర్‌ను చేశా'

భర్త మృతి తర్వాత కుటుంబ పోషణ తనకు కష్టంగా మారిందని అయితే, మహిళా సంఘం అండతో నిలదొక్కుకున్నానని దామరగిద్దకు చెందిన కె.లక్ష్మీ అన్నారు.

అధికారులు మూడు నెలలు శిక్షణ ఇచ్చి తనకు హిందీ నేర్పడంతో ఉత్తరప్రదేశ్‌ మహిళలకు శిక్షణ ఇవ్వడం సులువైందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ పర్యటన అనుభవాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

'సీఆర్పీగా తొమ్మిదిసార్లు ఉత్తరప్రదేశ్‌ వెళ్లాను. అలా రూ.4 లక్షల వరకు సంపాదించా. కూతురును బీటెక్ చదివించా. ఇప్పుడామెకు సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు'' అని లక్ష్మీ చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌ మహిళల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా కనిపించాయని, అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని ఆమె తెలిపారు.

సంపాదన పెరిగింది.. సంతృప్తి దక్కింది

అధికారులు హిందీలో మాట్లాడేందుకు ఇచ్చిన శిక్షణ తమకు ఎంతో ఉపయోగపడిందని కొల్లాపూర్‌కు చెందిన దీప్తి అన్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు 13 సార్లు ఉత్తరప్రదేశ్‌ వెళ్లొచ్చాను. వెళ్లిన ప్రతిసారి రూ.50 వేల వరకు వచ్చేవి. ఆ డబ్బుతో ఇంటి స్థలంతో పాటు మా ఆయనకు ఆటో కొన్నాను' అని చెప్పారు.

సీఆర్పీగా ఎంపికయ్యాక తన సంపాదన పెరిగిందని, మరికొందరికి శిక్షణ ఇచ్చానన్న సంతృప్తి దక్కిందని ఆమె తెలిపారు.

'రూ.8 కోట్లు సంపాదించారు'

పాలమూరు నుంచి వెళ్లిన సీఆర్పీలు ఉత్తరప్రదేశ్‌లో 6,266 మహిళా సంఘాలను ఏర్పాటు చేశారని డీఆర్‌డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ) అధికారి రేణుకాదేవి తెలిపారు.

పాలమూరు మహిళా సమాఖ్య ప్రగతిపై ఆమె బీబీసీతో మాట్లాడారు.

''ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన సీఆర్పీలు ఇప్పటి వరకు రూ.8 కోట్లు సంపాదించారు. సేవా రుసుం కింద పాలమూరు మహిళా సమాఖ్యకు రూ.26 లక్షలు వచ్చాయి. దీంతో సమాఖ్యలో సభ్యులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించే అవకాశం దొరుకుతుంది'' అని చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి వెంకట ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ మహిళా సంఘాలను ఏర్పాటు చేయటం పాలమూరు మహిళా సమాఖ్యకు గర్వకారణమని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)