ఎంఎస్ ధోనీ జర్నీ... టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్‌ వరకూ

  • నీరజ్ ఝా
  • బీబీసి కోసం
ఎం ఎస్ ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

1981 జూలై 7వ తేదీ.. మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. అంతర్జాతీయ కెరీర్లో ధోనీ సృష్టించినన్ని సంచలనాలు, ఇప్పటివరకూ బహుశా ఏ ఆటగాడికీ సాధ్యం కాలేదు.

ధోనీ క్రికెట్ ప్రపంచంలో బహుశా ఏ ఆటగాడికీ, కెప్టెన్‌కీ దక్కనంత పేరు ప్రతిష్టలు సంపాదించాడు. క్రీడాభిమానులు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అందుకే సోషల్ మీడియా అంతా ధోనీ అభిమానులు పెడుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలతో నిండిపోతోంది.

500లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత ధోనీ మూడో భారతీయ ఆటగాడు అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images

మహీ లక్కీ నెంబర్ 7

7 అంకెతో ధోనీకి చాలా విడదీయరాని బంధం ఉంది. ఏడు అంకెతో తనకు ఉన్న బంధం గురించి ధోనీ కూడా బహిరంగంగా ప్రపంచానికి చెప్పాడు. మొదటి సారి భారత జట్టుతో కలిసి కెన్యా పర్యటనకు వెళ్లినప్పుడు ధోనీ తన కోసం ఒక జెర్సీ నంబర్ వెతుకుతున్నాడు. అప్పుడు ఏడో నంబర్ మాత్రమే ఖాళీగా కనిపించింది. అది అతడికే దక్కింది.

ధోనీకి ఈ అంకెతో ఒక బంధం ఏర్పడింది. అయితే తను పుట్టిన తేదీ ఏడో నెల, ఏడో తేదీ కావడం అనేది యాదృచ్చికం.

జెర్సీ నంబర్ మాత్రమే కాదు, ధోనీ ప్రతి బైకు, కారు మీద ఏడు అంకె కనిపిస్తుంది.

అంతే కాదు 'సెవన్' పేరుతో ఉన్న ఒక పెర్‌ఫ్యూమ్, డియోకు కూడా ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దీనితోపాటు 'ఫిట్ సెవన్' పేరుతో దేశవిదేశాల్లో మహి ఒక జిమ్ చెయిన్ కూడా ప్రారంభించాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ 3 ట్రోఫీలూ అందుకున్న ధోనీ

ఐసీసీ మూడు పెద్ద ఈవెంట్లలో ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ. 2007లో టీ-20 వరల్డ్ కప్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. మొదటిసారి కెప్టెన్సీ చేసిన ధోనీ, తన బ్యాటింగ్‌తో జట్టును టాప్‌కు చేర్చడంతోపాటు, కెప్టెన్సీ ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. దాని గురించి ఇప్పుడు పెద్ద పెద్ద మేనేజ్‌మెంట్ కోర్సుల్లో పాఠాలు కూడా చెబుతున్నారు.

పాకిస్తాన్‌తో ఆడిన ఫైనల్లో జోగీందర్ శర్మను నమ్మిన ధోనీ అతడికి ఆఖరి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. జోగీందర్ కూడా తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఫైనల్లో విజయంతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయాడు.

ధోనీ కెప్టెన్సీకి ఇది ట్రైలర్ మాత్రమే. ఆ తర్వాత మహి ఇలాంటి ఎన్నో మహిమలు చేశాడు. ఆ అద్భుతాలను మర్చిపోవడం అంత సులభం కాదు.

2011 వరల్డ్ కప్‌ విజయంలో మొత్తం స్క్రిప్ట్ ఎం.ఎస్.ధోనీ రాసినట్టే అనిపిస్తుంది. ఆ ఫైనల్ మ్యాచ్‌ బహుశా అందరికీ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను ప్రమోట్ చేసుకుని యువరాజ్ సింగ్‌ కంటే ముందే మైదానంలో అడుగుపెట్టిన ధోనీ, జట్టును గెలిపించే వరకూ అక్కడే నిలిచాడు.

భారత జట్టుకు 28 ఏళ్ల తర్వాత ధోనీ వరల్డ్ కప్ విజయాన్ని అందించాడు. ఫైనల్లో ధోనీ కొట్టిన ఆ సిక్సర్‌ను బహుశా ఈ జన్మలో ఎవరూ మర్చిపోలేరు.

ఈ సిక్స్‌ గురించి చెప్పిన సునీల్ గవాస్కర్ "నా అంతిమ క్షణాల్లో నాకు ఏదైనా చూడాలని అనిపిస్తే, వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఆ విన్నింగ్ సిక్స్ చూడాలనే కోరుకుంటా" అన్నారు.

ఇక, ధోనీ అందుకున్న మూడో ఐసీసీ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ. మినీ వరల్డ్ కప్‌గా చెప్పుకునే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 2013లో ధోనీ విజయాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మూడు ట్రోఫీలు గెలుచుకున్న మొదటి క్రికెట్ కెప్టెన్‌గా రికార్డు సెట్ చేశాడు. ఈ రికార్డ్ ఎవరైనా బ్రేక్ చేయాలంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ధోనీ తన కెప్టెన్సీలో జట్టును టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ స్థానానికి చేర్చాడు.

ఫొటో సోర్స్, Getty Images

కెప్టెన్ ఎలా అయ్యాడంటే..

ధోనీకి కెప్టెన్సీ లభించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట్లో టీ-20కి బీసీసీఐ అంత ప్రాధాన్యం ఇచ్చేది కాదు. 2007లో జరిగిన మొదటి టీ-20 వరల్డ్ కప్‌ కోసం అసలు జట్టును పంపించడానికి కూడా సిద్ధంగా లేదు.

ఐసీసీ ఒత్తిడితో బీసీసీఐ చాలా కష్టంగా జట్టును పంపించడానికి అంగీకరించింది. రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ లాంటి పెద్దపెద్ద పేర్లను టీ-20 వరల్డ్ కప్ నుంచి పక్కకు పెట్టింది.

తప్పనిసరి పరిస్థితుల్లో తమ 'బి' టీమ్‌ను బీసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపించింది. జట్టు కెప్టెన్సీని ధోనీ చేతికి అప్పగించింది.

కానీ ధోనీకి ఈ ఫార్మాట్‌ గురించి బాగా తెలుసు. కెప్టెన్‌గా జట్టును విజేతగా నిలబెట్టడంతోపాటు, ఈ టోర్నీలో బ్యాట్‌తో 120 బంతులు ఎదుర్కున్న ధోనీ 154 పరుగులు చేశాడు.

అద్భుతమైన ఆటగాడు, టీమ్ ప్లేయర్

ధోనీ ఎప్పుడూ ఒక టీమ్ ప్లేయర్‌లాగే ఉంటాడు. జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కెప్టెన్ అయినా.. ఆరు లేదా ఏడో నంబరులో బ్యాటింగ్‌కు దిగడానికి కారణం అదే. ఆ స్థానంలో బ్యాటింగ్ చేసినా వన్డేల్లో ధోనీ సగటు 51 పరుగులు. ఇక టీ-20 ఫార్మాట్‌లో అతడు 36 సగటుతో పరుగులు తీశాడు. టెస్టుల్లో కూడా ధోనీ యావరేజ్ 38 వరకూ ఉంది.

వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయ ఆటగాడు కూడా ధోనీనే. తను ఇప్పటివరకూ మొత్తం 217 సిక్సర్లు బాదాడు.

ఫొటో సోర్స్, AFP

కెప్టెన్ కూల్ ధోనీ

కెరీర్ ప్రారంభంలో టికెట్ కలెక్టర్‌గా ఉన్న ధోనీ, ఆ తర్వాత భారత్ కోసం ట్రోఫీ కలెక్టర్‌గా మారిపోయాడు. ధోనీ అందరితో చాలా మర్యాదపూర్వకంగా, కలుపుగోలుగా ఉంటాడు.

ధోనీ చాలా సింపుల్‌గా ఉంటాడు. ఎంత సింప్లిసిటీ అంటే. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అందరూ అతడిని చూసే ఉంటారు. అసలు ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, మైదానంలో ఉన్న ఆటగాళ్ల కోసం స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చిన మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

క్రికెట్ ప్రపంచంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం చాలా అరుదైన విషయం.

పద్మభూషణ్ పురస్కారం స్వీకరించడానికి వచ్చిన ధోనీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే క్రికెటర్ డ్రెస్‌కు బదులు మహి ఆర్మీ ఆఫీసర్ యూనిఫాంలో అక్కడకు వచ్చాడు. లెఫ్టినెంట్ కల్నల్ ధోనీ తను వేసుకున్న యూనిఫాంకు పూర్తి గౌరవం ఇచ్చాడు. పద్ధతి ప్రకారం డ్రిల్ చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి, తర్వాత పురస్కారం అందుకున్నారు.

పద్మ భూషణ్ పురస్కారం లభించడం చాలా పెద్ద గౌరవంగా భావించిన ధోనీ.. దానిని ఆర్మీ యూనిఫాంలో అందుకోవడం వల్ల తన సంతోషం, గౌరవం పదిరెట్లు అయ్యిందని చెప్పాడు.

ఫొటో సోర్స్, Twitter/president of india

ధోనీ ఒక అద్భుతం

పరిమిత ఓవర్స్ క్రికెట్‌ విషయానికి వస్తే ధోనీ ఛాంపియన్. అందులో అతడికి ఎంతో నైపుణ్యం ఉంది. తన కెప్టెన్సీలో భారత్ 151 విజయాలు అందుకుంది. టెక్నికల్‌గా చూస్తే ధోనీ అంత గొప్ప బ్యాట్స్‌మెన్ అనిపించడు. కానీ జట్టుకు ఎప్పుడు తన అవసరం వచ్చినా మహి బ్యాట్ పవర్ చూపిస్తాడు.

ధోనీ కెప్టెన్సీ ఆధునిక క్రికెట్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. కెప్టెన్ కాగానే అందరూ చాలా దూకుడు చూపిస్తే, కెప్టెన్ కూల్ ధోనీ మాత్రం వినయ విధేయతలు చూపించాడు. కూల్‌గా ఉంటూనే జట్టును శిఖరాలపైకి చేర్చాడు. ప్రపంచమంతా ఫిదా అయిపోయింది ఆ స్టైలుకే.

ధోనీ ఎప్పుడూ వేరే ఆటగాళ్లపై అరవడం, కోప్పడడం బహుశా ఎవరూ చూసుండరు. ఇతర దేశాల క్రికెటర్లతో కూడా గొడవ పడడం లాంటివి కూడా మహి బహుశా ఎప్పుడూ చేయలేదు.

క్రికెట్‌కు సమాధానం క్రికెట్ అని ధోనీ బలంగా నమ్ముతాడు. అదే అతడిని ఈరోజు టాప్ ప్లేయర్స్‌లో ఒకడిగా నిలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)