#గమ్యం: విమానాశ్రయాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు

  • అనిల్ కుమార్
  • బీబీసీ ప్రతినిధి
#గమ్యం: విమానాశ్రయంలో ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

#గమ్యం: విమానాశ్రయంలో ఉద్యోగాలు ఎలాంటివి ఉంటాయి?

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

రెండువారాలుగా మనం విమానయాన రంగంలో ఉద్యోగాల గురించి తెలుసుకుంటున్నాం. సాధారణంగా ఈ రంగంలో ఉద్యోగాలు అనగానే ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, పైలట్... ఇవే గుర్తొస్తాయి. వీటి గురించే అందరూ ఆలోచిస్తారు. కానీ విమానాశ్రయం (ఎయిర్‌పోర్ట్)లో అడ్మినిస్ట్రేషన్, ఫైర్ సర్వీసెస్, సేఫ్టీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్, గ్రౌండ్ స్టాఫ్... ఇలా ఎన్నో ఉద్యోగాలకు నిరంతరం రిక్రూట్‌మెంట్ జరుగుతూనే ఉంటుంది.

ఎయిర్‌పోర్ట్‌లలో ప్రతి ఎయిర్‌లైన్స్‌కు ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ బుకింగ్, చెక్ ఇన్, సెక్యూరిటీ... ఇలాంటి ఎన్నో విభాగాల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంటుంది. పైగా ఆకర్షణీయ రూపం ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. మరి ఈ సమాచారం మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఆ ఉద్యోగాలకు కావలసిన అర్హతలు ఏమిటి... వంటి అంశాలను ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఎడిటర్ ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

వీడియో క్యాప్షన్,

#గమ్యం: విమానాశ్రయాల్లో ఉద్యోగాలు ఏముంటాయి?

ఎలాంటి ఉద్యోగాలుంటాయి?

విమానాశ్రయాల నిర్వహణ అంతా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నియంత్రణ, పర్యవేక్షణలో ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఉద్యోగాల భర్తీ కూడా ఏఏఐ పర్యవేక్షణలోనే జరుగుతుంది. వీళ్లకు ఒక రిక్రూట్‌మెంట్ పోర్టల్ ఉంది. దానిలో ఎప్పటికప్పుడు ఉద్యోగాల వివరాలు ప్రకటిస్తారు.

విమానాశ్రయాల్లో ప్రధానంగా మూడు రకాల ఉద్యోగాలుంటాయి.

  • ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు
  • మేనేజీరియల్ పొజిషన్స్
  • జూనియర్ లేదా సీనియర్ అసిస్టెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వీటికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇవి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఎంట్రీ లెవెల్ జాబ్స్

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అకౌంట్స్, హెచ్ఆర్, ఫైర్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అడ్మిన్, ట్రాన్స్‌లేటర్స్...) ఉద్యోగాలను ఎంట్రీ లెవెల్‌గా చెప్తారు. వీటికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇవి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్‌కు అప్లై చేయాలంటే... సైన్స్‌లో డిగ్రీ లేదా బీటెక్ చేసినవారు అర్హులు. ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.

అలాగే ఫైనాన్స్‌ విభాగంలో చేరాలంటే బీకామ్ డిగ్రీతోపాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ వంటి సర్టిఫికేషన్లు ఉండటం అవసరం.

సైన్స్ గ్రాడ్యుయేషన్ లేదా ఎంబీఏ చేసినవారు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగాలకు అర్హులు. టెక్నికల్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు గేట్ ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

ఇవే కాకుండా నేరుగా కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇవి ఇంజనీరింగ్ అభ్యర్థులకు మాత్రమే. సాధారణ డిగ్రీ చదివినవారు అనర్హులు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కూడా బీటెక్ వాళ్లకు అవకాశం ఉంటుంది.

డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ చదివినవారు ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. దీనికి అనుభవం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇలాంటి పొజిషన్లకు ఆకట్టుకునే మాటతీరు, రూపం కూడా అవసరం. అందువల్ల మహిళలకు అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.

మేనేజీరియల్ పొజిషన్స్

ఇక సీనియర్ లెవెల్ పొజిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. వీటిలో ఎక్కువగా మేనేజర్ స్థాయి ఉద్యోగాలుంటాయి. వీటికి దరఖాస్తు చేయాలంటే కనీస అర్హతలతోపాటు పూర్వ అనుభవం కూడా అవసరం. ఫైనాన్స్, ఫైర్ సర్వీసెస్, అధికార భాష (అఫీషియల్ లాంగ్వేజ్), మార్కెటింగ్ వంటి విభాగాలకు సంబంధిత రంగంలో బీటెక్ చేసినవారు అర్హులు.

వీటన్నింటికీ ఓ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్ష ఒక్కొక్క విభాగానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఫైర్ సర్వీసెస్, మెయింటెనెన్స్ వంటివాటికి ఓ ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వంటి వాటికి ట్రేడ్ టెస్ట్ అనే పరీక్ష ఉంటుంది.

ప్రతి ఎయిర్‌లైన్స్‌ సంస్థకు విమానాశ్రయంలో ఓ ప్రత్యేక ఆఫీస్ ఉంటుంది. దీనిలో స్టాఫ్ ఆ ఎయిర్‌లైన్స్‌కు చెందినవారే ఉంటారు. విమానం ల్యాండ్ అయ్యాక హ్యాంగర్ ప్రాంతంలోకి రావడానికి, టేక్ ఆఫ్ అయ్యేముందు ఈ గ్రౌండ్ స్టాఫ్ పాత్ర చాలా కీలకం. వీటితోపాటు టికెట్ బుకింగ్, లగేజ్ చెక్-ఇన్, కస్టమర్ సర్వీస్... ఇలాంటి పొజిషన్లకు ఆకట్టుకునే మాటతీరు, రూపం కూడా అవసరం. అందువల్ల మహిళలకు అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సెక్యూరిటీ అండ్ ర్యాంప్ సర్వీసెస్‌కు ఎన్‌సీసీ ట్రైనింగ్ ఉన్నవాళ్లను తీసుకుంటారు.

ఫొటో సోర్స్, AAI

ఫొటో క్యాప్షన్,

ఎయిర్‌పోర్టులలో ఉద్యోగాల భర్తీ ఏఏఐ పర్యవేక్షణలో జరుగుతుంది.

ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి?

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఆయా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఇంజనీరింగ్ స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్, పైలట్స్... అని వివిధ విభాగాలవారీగా ఉద్యోగ ప్రకటనలుంటాయి. వాటిలో గ్రౌండ్ స్టాఫ్ విభాగంలో మనం చర్చించిన ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఖాళీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం... అన్నీ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images

మరో జాబ్ పొజిషన్...

జూనియర్ అసిస్టెంట్ అనే మరో ఉద్యోగం ఉంది. దీనికి 30 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. డిగ్రీ చదివి ఉండాలి. టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారికి స్టెనోగ్రాఫర్స్, టెలిఫోన్ ఆపరేటర్స్ వంటి ఎన్నో ఉద్యోగాలు విమానాశ్రయాల్లో ఉంటాయి.

ఈ ఉద్యోగాలన్నింటికీ ప్రవేశపరీక్షలు అన్ని ప్రధాన నగరాల్లో జరుగుతాయి.

ఇవన్నీ పైలట్లు, క్యాబిన్ క్రూ కాకుండా విమానయానరంగంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలు. వచ్చేవారం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు, ప్రవేశ పరీక్ష, ఎంపిక విధానాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)