బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు

  • ప్రతిమ ధర్మరాజు
  • బీబీసీ కోసం

సాధారణంగా ఏ పల్లె చూసినా రైతులు, చేతి వృత్తులవారు, పిల్లలు, పడుచులు... ఇలా రకరకాల మనుషులతో ఉంటుంది. కానీ ఆ ఊళ్లో నలుగురే మనుషులు ఉన్నారు. అది.. అనంతపురం జిల్లా ఓడీసీ మండలం బోడిగుండ్ల పల్లి.

ఒకప్పుడు ఈ ఊళ్లో 45 కుటుంబాలు ఉండేవి. 127 మంది జనాభా ఉండేవారు. అది ఈ ఊరి చరిత్ర.

ప్రస్తుతం ఈ ఊరి నిండా పాడుబడిన ఇళ్లు, విరిగిన తలుపులే! ఇప్పుడు ఈ ఊరిలో మిగిలిన జనాభా నలుగురే!

భార్యాభర్తలు, మరో ఇద్దరు మగవాళ్లే ఇప్పుడు ఈ ఊరి జనం. వాళ్లు కూడా పగలంతా పొలంలో పని చేస్తారు, చీకటవ్వగానే అక్కడ ఉండలేక పక్క ఊరికి పోయి పడుకుంటారు.

వీడియో క్యాప్షన్,

బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు

ఈ పరిస్థితులకు కారణం.. ఊళ్లో కనీస అవసరాలు లేకపోవడమేనని గ్రామస్థులు చెబుతున్నారు.

''రెండేళ్ల కిందటి దాకా కూడా ఊర్లో 17 కుటుంబాలు ఉంటాండె. కానీ తాగేదానికి కనీసం నీళ్లు కూడా లేకపాయె. అంబులెన్స్ ఊర్లోకి రాలేదు. 3 కిలోమీటర్లు నడ్సుకుంటా మేమే రోడ్లోకి పోవల్ల. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాం'' అని ఒక పెద్దాయన అన్నారు.

అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులున్నాయి. జిల్లాలో కరవు అలుముకొంది. అందుకు తోడుగా, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో తమ బిడ్డలు హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి నగరాల్లో వాచ్‌మన్లుగా, చెత్త ఏరుకునేవారిగా, ఇళ్లల్లో, హోటళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతున్నారని వారు కంటనీరు పెట్టుకున్నారు.

ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పండగలకు వాళ్లు ఊరికి వచ్చిపోతారని అన్నారు.

''రాత్రి పూట ఇక్కడ ఉండలేం. గ్లాసు నీళ్లు ఇచ్చేవాడు లేడు, మేం సచ్చినా దిక్కులేదు. మేం తెలుగు దేశం పార్టీకి ఓట్లు వేయలేదు. అందుకే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఇంత వయసు వచ్చినా నాకు పింఛను కూడా ఇవ్వలేదు'' అని వెంకటేశులు అనే వృద్ధుడు అన్నారు.

కానీ.. వెంకటేశులు ఆరోపణలతో అధికారులు విభేదిస్తున్నారు.

‘‘ఏ పార్టీకి ఓట్లు వేసినారనేది మాకు అనవసరం. పెన్షన్ కోసం ఆయన ఇచ్చిన ఆధార్ నంబర్‌లో తప్పులు ఉన్నాయి. అందుకనే రాలేదు. ఆయన మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మేం వెంటనే పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తాం’’ అని ఎంపీడీఓ నాగరాజు అన్నారు.

‘ఇల్లు కడితే, ఊరు ఖాళీ అయ్యింది’

''నేను మూడు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించినాను. కానీ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. నేను ఒంటిగాడిని. ఒక్కడ్నే ఊళ్లో ఉండలేక రాత్రిళ్లు పక్కూరిలో పడుకుంటున్నా. ఇది ఒకప్పుడు బాగా బతికిన ఊరు. ఊరు ఇంత పాడుబడటం నేనెప్పుడూ చూడలేదు. నా కొడుకు కూడా బతుకు కోసం వలస పోయినాడు. నేనొక్కడినే పొలం చూసుకుంటూ ఇక్కడే ఉన్నాను'' అని నరసింహులు అనే వృద్ధుడు వివరించారు.

ఈ గ్రామం కొండకమర్ల పంచాయతీ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం వరకూ 17 కుటుంబాలు కాపురమున్న ఊరు రెండేళ్లలో ఎందుకు ఖాళీ అయ్యిందని పంచాయతీ సర్పంచ్ మారెన్నను ప్రశ్నిస్తే, గత 40 ఏళ్లుగా ఈ ఊరు నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు.

''ఇక్కడ బతికేందుకు అవకాశం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేవు. ఊళ్లో ఉన్న నలుగురూ పగలు పొలాల్లో ఉంటారు, రాత్రిళ్లు పక్క ఊరికి పోతారు. ఊరికి కరెంటు, వీధుల్లో లైట్లు వేయమని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు వినరు. ఊర్లో ఉన్న కొన్ని కరెంటు వైర్లు కూడా పీక్కుపోయినారు. నేను వైఎస్సార్ పార్టీకి చెందిన సర్పంచ్ కాబట్టి నాకు విలువ లేదు. నేను పేరుకు మాత్రమే సర్పంచ్‌ను'' అని మారెన్న తెలిపారు.

మారెన్న అభిప్రాయంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి విభేదించారు. ఆయనకు అవగాహన లేకనే అభివృద్ధి చేయలేకపోతున్నారని రఘునాథ రెడ్డి బీబీసీతో అన్నారు.

‘‘వైఎస్సార్సీపీ సర్పంచ్‌కు అవగాహన లేకనే పంచాయతీని అభివృద్ధి చేయలేకపోతున్నారు. నేను జోక్యం చేసుకుని, నా నిధులతోనే కొండకమర్ల పంచాయతీలో ఇళ్లు, రోడ్లు, పెన్షన్లు.. ఇలా రూ.2 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయించా’’ అన్నారు.

టీడీపీకి ఓటు వేయకపోవడం వల్లే తనకు వృద్దాప్య పెన్షన్ రాలేదని చెబుతున్న వెంకటేశులు గురించి ప్రశ్నిస్తే..

‘‘మేం పార్టీలవారీగా పెన్షన్లు ఇవ్వడం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, వైసీపీ.. ఇలా ఏ పార్టీవారికైనా పెన్షన్లు ఇస్తాం. ఆ ముసలాయన విషయం నా దృష్టికి తెస్తే కచ్చితంగా పెన్షన్ వచ్చేలా చూస్తాం’’ అని రఘునాథ రెడ్డి అన్నారు.

మరోవైపు.. బోడిగుండ్ల పల్లిలో సౌకర్యాలు లేక ప్రజలందరూ వలసపోయినట్టు ఇంతవరకూ తమ దృష్టికి రాలేదని ఓడీసీ మండల ఎంపీడీఓ నాగరాజు అన్నారు.

''30 ఏళ్ల క్రితమే అక్కడ వలసపోయారు. వీటిని వలసలు అనలేం. వాళ్లు సౌకర్యాలు ఉన్న చోటకి వెళ్లారు అంతే..'' అని నాగరాజు బీబీసీతో అన్నారు.

ఈ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నా, వాళ్లు ఇతర సౌకర్యాల కోసమే వేరే ప్రాంతాలకు వెళ్లారని ఆయన చెప్పారు. ఒకవైపు వలసలకు సౌకర్యాల లేమి కారణం కాదంటూనే, గ్రామస్థులు.. సౌకర్యాలు ఉన్న చోటకు వెళ్లారు అని అధికారులు చెప్పడం ఆశ్చర్యం.

ఫొటో క్యాప్షన్,

పల్లె రఘునాథ రెడ్డి

ప్రజల్లో చైతన్యం వచ్చింది.. అందుకే వలస పోయారు!

టీడీపీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా పని చేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పల్లె రఘునాథ రెడ్డి సొంత నియోజకవర్గం పుట్టపర్తిలోనే ఈ బోడిగుండ్ల గ్రామం ఉంది.

ఈ గ్రామంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన.. ''ఇటీవలి కాలంలో ప్రజల్లో చైతన్యం వచ్చింది. స్ఫూర్తి వచ్చింది. పట్టన ప్రాంతాలకు వెళితే పిల్లల చదువు బాగుంటుంది, కూలీ బాగా దొరుకుతుందని కొందరు వలస పోతున్నారు. కరెంటు, నీళ్లు ఇవ్వాలనుకుంటే అదెంతసేపు? అది మా చేతుల్లో పని! కానీ వాళ్లే స్వచ్ఛందంగా వలస పోయారు. ఇక్కడ రోజు కూలీ 200 ఉంటే, బెంగళూరులో రోజుకు 500 ఇస్తారు. అందుకే అందరూ వలస పోయారు. వాళ్లు అడిగితే ఏదన్నా చేయడానికి నేను సిద్ధం. అక్కడ ఒక్క ఇల్లు ఉన్నా, దానికి కూడా కరెంటు ఇస్తాం, నీళ్లు ఇస్తాం..'' అని పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)