ప్రెస్‌రివ్యూ: చంద్రబాబుకు జగన్ అంటే భయం - పవన్‌ కల్యాణ్

పవన్‌కల్యాణ్

ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అంటే భయం. ఆ విషయం నాతోనే స్వయంగా చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే తానేమైపోతానోనని భయంగా ఉందన్నారు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ విమర్శించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. 2014 ఎన్నికల తర్వాత ఫలితాలు వెలువడటానికి ముందు చంద్రబాబు తనను ఇంటికి భోజనానికి పిలిచి.. ఎన్నికల్లో ఆయన ఓడిపోతే టీడీపీకి అండగా ఉండాలని కోరారని పవన్ వివరించారు.

శనివారం సాయంత్రం విశాఖపట్నంలో ఆర్‌కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకూ జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసన కవాతు నిర్వహించారు. అనంతరం పవన్‌ కల్యాణ్ ప్రసంగించారు.

‘జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని దుష్ప్రచారం చేశారు.. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక భూకబ్జాలు, దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒక్క విశాఖలోనే ఎకరం కోటి రూపాయలు విలువ చేసే లక్ష ఎకరాల భూములను దోచుకున్నారు’ అని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడితే.. అవినీతి అనకొండలై భూములన్నీ మింగేస్తారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, మంత్రులు, ఆ పార్టీ నేతల భూదోపిడీపై పోరాటం చేస్తానని పవన్ ప్రకటించారు.

విశాఖకు రైల్వే జోన్ కోసం ఉద్యమాలు అక్కర్లేదని పవన్ అన్నారని.. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, తాను కలిసి రైళ్లకు ఎదురెళ్లి రైల్‌రోకో చేస్తే తప్పకుండా రైల్వే జోన్ వస్తుందన్నారని ‘సాక్షి’ కథనం చెప్పింది.

ఫొటో సోర్స్, NAra Chandrababu Naidu/Facebook

అసెంబ్లీకి 'ముందస్తు' అంటే వ్యతిరేకిద్దాం: చంద్రబాబు

జమిలి ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికలను ముందుకు తేవాలన్న ప్రతిపాదన వస్తే దానిని వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే ప్రతిపాదనపై చర్చించటానికి జాతీయ న్యాయ కమిషన్‌ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. దానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో శనివారం సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మార్గమధ్యంలో చెన్నై విమానాశ్రయం నుంచి కొందరు పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించాలన్న ప్రతిపాదన వస్తే దానిని వ్యతిరేకించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

'కేంద్రం తన కారణాల రీత్యా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి లోక్‌సభకు కూడా ఎన్నికలు పెట్టాలనుకుంటే మనకేమీ అభ్యంతరం లేదు. అది వాళ్లిష్టం. కానీ దానికోసం మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముందుకు జరుపుతామంటే అంగీకరించం. ఇదే విషయం న్యాయ కమిషన్‌ సమావేశంలో స్పష్టంగా చెప్పండి' అని చంద్రబాబు వారికి సూచించారు.

ఇంత పెద్ద దేశంలో ఒకేసారి లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు పెట్టాలనుకోవడం సాధ్యం కాదని, దీనికోసం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల పదవీకాలం పొడిగించడం లేదా కుదించడం చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌ అభివృద్ధికి మూడేళ్లలో రూ. 45 వేల కోట్లు: కేసీఆర్

రానున్న మూడు సంవత్సరాల కాలంలో రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి చె.చంద్రశేఖర్‌రావు వెల్లడించినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

మొత్తం రూ. 55 వేల కోట్ల రూపాయల ప్రణాళికతో ఫోకసింగ్ ఆన్ అర్బన్ తెలంగాణ అన్న కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి 15 వేల కోట్ల రూపాయల చొప్పున 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాజధాని నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలను తీసుకొంటుందని చెప్పారు. మిగతా నగరాల్లో చేపట్టే పనులకోసం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

మూడేండ్లకాలంలో మొత్తం రూ.55 వేల కోట్లతో చేపట్టే పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘నగరాలు, పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి. అక్రమ లేఅవుట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. లే అవుట్లలో గ్రీన్‌ల్యాండ్ కోసం స్థలం తీసినా, తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసే విధానానికి స్వస్తి పలకాలి’ అని కేసీఆర్ ఆదేశించినట్లు ‘నమస్తే తెలంగాణ’ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Vasundhara Raje/Facebook

కాంగ్రెస్‌ ఒక 'బెయిల్‌ గాడీ’: మోదీ

కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది అగ్ర నేతలు, మాజీ మంత్రులు బెయిల్‌పై ఉన్నారని.. అందువల్ల ఆ పార్టీని ఇప్పుడు 'బెయిల్‌ గాడీ' (బెయిలు బండి)గా పిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేసినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని జైపుర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి శనివారం ఆయన ప్రసంగించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులకు ద్వారా శంకుస్థాపనలు చేశారు.

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సైన్యం సామర్థ్యాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించిందని మోదీ పేర్కొన్నారు. తద్వారా పాపం చేసిందన్నారు. ఈ తరహా రాజకీయాలను చేసేవారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని పేర్కొన్నారు.

భాజపా పేరు వినగానే కొందరు కలవరపడుతుంటారని చెప్పారు. మోదీ లేదా వసుంధరా రాజే (రాజస్థాన్‌ ముఖ్యమంత్రి) పేరు వినగానే కొందరికి జ్వరాలు వస్తుంటాయన్నారు. మునుపటి కాంగ్రెస్‌ సర్కారు శిలాఫలకాలకే పరిమితమైందని, భాజపా ప్రభుత్వం మాత్రం అభివృద్ధికే కట్టుబడిందన్నారు.

రాజపుత్ర పాలకుడు మహారాణా ప్రతాప్‌, జాట్‌ రాజు సుర్జామల్‌, కవియత్రి మీరాబాయ్‌ వంటి రాజస్థానీ దిగ్గజాల పేర్లను ఈ సభలో మోదీ ప్రస్తావించారు. ''అద్భుతమైన కోటలు, ఇసుక తిన్నెలు, రంగురంగుల తలపాగాలు, యాసలే ఈ రాష్ట్ర ప్రత్యేకత'' అని ఆయన పేర్కొన్నారు.

ఈ సభలో ఎలాంటి నిరసనలకు అవకాశం లేకుండా.. నల్ల దుస్తులు ధరించినవారిని, నల్ల వస్త్రం కలిగి ఉన్నవారిని అనుమతించలేదని.. అనుమానాస్పదంగా కనిపించిన 60 మందిని అదుపులోకి తీసుకున్నారని ‘ఈనాడు’ కథనం చెప్పింది.

ఫొటో సోర్స్, KCR/Facebook

కేసీఆర్ కానుకలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లోని దేవుండ్లకు కానుకల నిమిత్తం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఆయన్నుంచి రాబట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైనట్లు ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. 2015లో ఆయత చండీ యాగాన్ని నిర్వహించేందుకు సీఎం రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణాలకోసం రూ. 5 కోట్లు, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ముక్కుపుడక కోసం రూ. 45 వేలు, వరంగల్‌లోని భద్రకాళీ అమ్మ వారికి రూ. 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సీఎం సమర్పించారు.

జూన్‌ 28న కేసీఆర్‌ కుటుంబం విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లింది. ఆ సందర్భంగా కనకదుర్గకు రూ. 5 కోట్ల విలువైన వజ్రాలతో కూడిన బంగారు ముక్కుపుడకను సమర్పించారు.

ఈ ఖర్చులన్నింటినీ ప్రభుత్వ ఖజానా నుంచే వినియోగించారు. ఆ మొత్తాలను కేసీఆర్‌ నుంచి వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌.. హైకోర్టును కోరారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగాను హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం తరఫున ప్రతివాదిగా చేర్చారని ‘నవ తెలంగాణ’ కథనం వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)