అభిప్రాయం: ‘ఫాసిజం వైపు ఫాస్ట్ ఫార్వర్డ్?’

  • 10 జూలై 2018
మావోయిస్టులు, రోనా విల్సన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక భీమో కోరెగావ్ అల్లర్లకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన రోనా విల్సన్

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నిర్వహించిన ఓ ప్రదర్శనలో 1934-1945 మధ్య కాలంలో 'ప్రజాకోర్టు' పేరుతో నాజీలు పాల్పడిన చర్యలను వివరించారు.

ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి చూస్తుంటే ఆ 'ప్రజాకోర్టు' గుర్తుకొస్తోంది. మన దేశంలో న్యాయవ్యవస్థ అలా మారిపోయిందని కాదు. కానీ.. కేసులు పెడుతున్న తీరును పరిశీలించినప్పుడు అదే గుర్తుకొస్తోంది.

నాజీల కాలంలో కమ్యూనిస్టు కరపత్రాలను పంచిన ఓ గని కార్మికుడికి, నాజీల మీద జోకులు వేసిన ఓ బ్యాంకు అధికారికి, హిట్లర్ మీద వ్యంగ్యంగా రాసిన కవితల ప్రతులను పంచిన ఓ సౌండ్ టెక్నీషియన్‌కి, హిట్లర్‌ను అనేక రకాల పదాలతో అవమానించిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కు.. నాడు మరణ శిక్ష విధించారు. రాజద్రోహానికి పాల్పడ్డారని, దేశ విశ్వసనీయతను దెబ్బతీశారని, 'శత్రువులకు సాయం' చేస్తున్నారని వారిపై అభియోగాలు మోపారు.

మరో కేసులో ఓ 22 ఏళ్ల మత ప్రచారకుడికి మరణ శిక్ష విధించారు. తొలుత టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడన్న కారణంతో అతణ్ని అరెస్టు చేశారు. తర్వాత కేసు విచారణ సందర్భంగా.. హిట్లర్‌‌ను హత్య చేసేందుకు అతను కుట్ర పన్నాడని ఆరోపించారు.

"8 కోట్ల మంది జర్మన్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞత చూరగొన్న నాయకుడు హిట్లర్. ఆయన నాయకత్వం, శక్తియుక్తులు జర్మనీకి ఎంతో అవసరం. అలాంటి హిట్లర్ అంతానికి ఈ యువకుడు కుట్ర పన్నాడు" అని అభియోగంలో పేర్కొన్నారు.

నాజీల కాలంలో అత్యధిక శాతం మీడియా పాలకులకు సాగిలపడి వ్యవహరించింది. నాజీలు తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను నామరూపాలు లేకుండా చేశారు.

నాజీలకు మద్దతుదారులుగా కొనసాగిన కొందరు జర్నలిస్టులు యుద్ధం తర్వాత తమ గుర్తింపును మార్చుకుని ఉండిపోయేందుకు ప్రయత్నించినా.. చివరికి దొరికిపోయారు.

ప్రస్తుతం దేశంలో పోలీసులు, కొన్ని టెలివిజన్ ఛానెల్స్ కలిసి 'పట్టణ మావోయిస్టు' నెట్‌వర్క్ నిరంతరం విస్తరిస్తోందంటూ చేస్తున్న ప్రచారాన్ని, సృష్టిస్తున్న భయానక వాతావరణాన్ని చూస్తుంటే కాలం ఫాసిజం వైపు 'ఫాస్ట్ ఫార్వార్డ్'గా వెళ్తున్నన్నట్లు కనిపిస్తోంది.

Image copyright Sean Gallup/Getty Images

యాదృచ్ఛిక పరిణామం కాదు

దేశానికి రక్షకుడి లాంటి ప్రధానిని చంపడానికి కుట్ర పన్నారంటూ బయట పడిన ఉత్తరాలు, అత్యంత ఆశ్చర్యకరంగా మొదట టైమ్స్ నౌ ద్వారా బయటపడ్డాయి.

ఇక న్యాయవాది సుధా భరద్వాజ్ కామ్రేడ్ ప్రకాశ్‌కు రాశారని చెబుతున్న ఉత్తరాలను రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఈ ఉత్తరాలలో పలువురి పేర్లను పేర్కొన్నారు. డబ్బు పంపిణీని, కశ్మీర్ వేర్పాటువాదులను, రాళ్లు విసిరేవాళ్లను, మానవ హక్కుల లాయర్లతో సంబంధాలను, జేఎన్‌యూ, టీఐఎస్‌ఎస్ విద్యార్థులను, యూఏపీఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను.. పోలీసులు, బీజేపీకి ఇష్టం లేని అంశాలన్నిటి గురించి ప్రస్తావించారు.

వాటి ఉద్దేశం కొంతమంది వ్యక్తులను అప్రతిష్ట పాలు చేయడం, బెదిరించడం, మనుషుల మధ్య చీలికలు తీసుకురావడం, ప్రజాస్వామ్యవాదులపై, మానవ హక్కులు అన్న భావన పైనే వ్యతిరేకత ఏర్పడేట్లు చేయడం.

ఇప్పటివరకు జర్నలిస్టులు, కార్యకర్తలు, పరిశోధకులు లేదా ఇతరులెవరిపై అయినా కేసులు పెట్టడం జరిగితే లాయర్లు వారి తరపున కేసులు వాదించేవారు. ఇప్పుడు ఆదివాసీలు, దళితులు, రాజకీయ ఖైదీల కోసం పోరాడుతున్న సురేంద్ర గాడ్లింగ్, ట్యూటికోరన్‌లో స్టెరిలైట్ బాధితులు కోసం పోరాడుతునన్ ఎస్.వంచినాథన్, వింత కారణాలతో ఆరు నెలల పాటు ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జైలులో గడిపిన చిక్కుడు ప్రభాకర్ లాంటి వారిని అరెస్ట్ చేయడం అన్నది యాదృచ్ఛిక పరిణామం కాదు.

న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యమా?

రిపబ్లిక్ టీవీలో 'కామ్రేడ్ సుధ'గా అభివర్ణించిన సుధా భరద్వాజ్ ఎంతో మంది గౌరవించే ట్రేడ్ యూనియన్ కార్యకర్త, మానవ హక్కుల లాయర్, పీయూసీఎల్ జాతీయ కార్యదర్శి, దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్.

''న్యాయవాదులు నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల తరపున తమ వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాదించాలి. ఒక న్యాయవాది తాను చట్టానికి విశ్వసనీయుడిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఏ ఒక్క వ్యక్తి కానీ సరైన సాక్ష్యం కానీ లేకుండా శిక్ష పడరాదు'' అని బార్ కౌన్సిల్ న్యాయవాదులకు వృత్తిపరమైన ప్రమాణాలను నిర్దేశిస్తోంది.

దీనిని ఆచరించే న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు తమకు వ్యతిరేకంగా కేసులను వాదించే న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. న్యాయవాదులు వివాదాస్పద కేసులకు దూరంగా ఉండాలనేది వాళ్ల లక్ష్యం.

జూన్ 6న 'మహారాష్ట్ర ఫైవ్'గా పేర్కొంటూ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్, రచయిత సుధీర్ ధావలే, అటవీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్, ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్‌ల అరెస్ట్ అలాంటి సందేశాన్ని పంపేందుకే.

Image copyright Getty Images

అత్యాచార కేసులు, కొట్టి చంపడం, మత ఘర్షణలు తదితర ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే.. కేవలం అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే న్యాయం అందుబాటులో ఉండాలి.

దీనికి ఉదాహరణ పటియాలా హౌజ్ లాయర్లు. విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌పై దాడి చేసిన వారిపై ఇంత వరకు ఎలాంటి చర్యలూ లేవు. అందుకే ఆలస్యం కాక ముందే న్యాయవాదులంతా తమ వృత్తి పరిరక్షణ కొరకు సంఘటితం కావాలి.

మావోయిస్టుల తరపున భీమా కోరెగావ్ అల్లర్లను రెచ్చగొట్టారన్న ఆరోపణల నుంచి మోదీని 'రాజీవ్ గాంధీ తరహా'లో అంతమొందించాలన్న నమ్మశక్యం కాని కుట్ర వరకు - సాక్ష్యాలు, 'రూల్ ఆఫ్ లా' లాంటివి తమకు లెక్క లేదన్న పోలీసుల వైఖరిని చెప్పకనే చెబుతున్నాయి.

పోలీసులంతా వాళ్ల వెనుక ఉన్నారని, అధికారంలో కొనసాగడానికి వాళ్లు ఎంతకైనా తెగిస్తారనే సందేశం దీని వెనుక ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు