చర్చిలో లైంగిక వేధింపులు: కన్ఫెషన్స్‌పై ప్రశ్నలు

  • ఇమ్రాన్ ఖురేషీ
  • బీబీసీ కోసం
రేప్

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages

కేరళలో వివాహిత మహిళలపై కొన్నేళ్లుగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణల్లో నలుగురు మతాధికారుల ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. దీంతో భారతదేశంలోని చర్చిల్లో కన్ఫెషన్స్(ఒప్పుకోలు)ను దుర్వినియోగం చేయడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

క్రైస్తవ మతంలో కన్ఫెషన్ అనేది ఒక ఆచారం. తమ పాపాల గురించి మతాధికారికి చెప్పి పశ్చాత్తాపం చెందడాన్ని దేవుడి ముందు నేరం ఒప్పుకోవడంతో సమానంగా భావిస్తారు.

ప్రీస్టులు కన్ఫెషన్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే విషయం మతాధికారులు, చర్చి ఉన్నతాధికారులకు అప్పటికే తెలుసు.

కానీ కేరళ కేసు... చర్చిలో జరిగే ఈ కన్ఫెషన్ గురించి ఒక కొత్త కోణం చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఏంటీ కేసు?

16 ఏళ్ల వయసు నుంచి పెళ్లయ్యేవరకూ ఒక ప్రీస్ట్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ చర్చిలో మతాధికారికి కన్ఫెషన్ చేయడంతో కేరళ కేసు వెలుగులోకి వచ్చింది.

"ఆమె పెళ్లి తర్వాత చర్చిలో తన కన్ఫెషన్ చేసింది. ఆ ప్రీస్ట్ లైంగిక కోరికలు తీర్చుకోడానికి తనను బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పింది". అని ఒక సీనియర్ పోలీస్ అధికారి బీబీసీకి చెప్పారు.

"ఈ విషయాన్ని తనతోపాటు కాలేజీలో చదివిన మరో మతాధికారికి కన్ఫెషన్ చేసినపుడు, ఆమె మరోసారి లైంగిక వేధింపులకు గురైంది. కుంగిపోయిన ఆ మహిళ ఒక ప్రీస్ట్ కౌన్సిలర్ నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంది. అతడు ఆమె కోసమే దిల్లీ నుంచి కోచికి వచ్చేవాడు". అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి చెప్పారు

బాధితురాలి ఈ మెయిల్లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ బిల్లును ఆమె భర్త చూడడంతో కొన్ని నెలల కిందట ఇది వెలుగులోకి వచ్చింది. "ఆమె తన నగలు అమ్మి హోటల్ బిల్లులు చెల్లించేది" అని అధికారి తెలిపారు.

ప్రస్తుతం మహిళ ఫిర్యాదును బట్టి పోలీసులు దీనిని అత్యాచారం కేసుగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, iStock

"బ్లాక్ మెయిల్ చేసి లోబరుచుకోవడం అనేది అత్యాచారం కిందికే వస్తుంది. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆమెను కోర్టుకు కూడా తీసుకెళ్తాం" అని అధికారి చెప్పారు.

మహిళ భర్త మతాధికారులపై మలంకర ఆర్థొడాక్స్ సిరియన్ చర్చికి ఫిర్యాదు చేసినా, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

"ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగింది, విచారణకు ఆదేశించినా నాలుగు నెలలు వారినేం చేయలేదు. చర్చి విచారణ కమిటీ కనీసం భార్యాభర్తల వాంగ్మూలం కూడా తీసుకోలేదు". అని సిస్టర్ అభయ కేసులో న్యాయపోరాటం చేస్తున్న మానవ హక్కుల సంఘం కార్యకర్త జామన్ పుదెంపురక్కల్ తెలిపారు.

కాథలిక్, నాన్ కాథలిక్ చర్చిల్లో జరిగిన ఈ లైంగిక వేధింపుల అంశం.. చర్చిలో ప్రచారం నిర్వహించే వారిలో పెద్ద చర్చను లేవనెత్తింది.

"భారతదేశంలో, ముఖ్యంగా కేరళలో లైంగిక వేధింపులు ఎక్కువ. చర్చిల్లో లైంగిక వేధింపులు జరిగాయని అందరికీ తెలుసు, కానీ అక్కడ వాటి వివరాలేవీ ఉండవు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గట్టిగా మాట్లాడరు". అని మహిళా మతధర్మవేత్త కొచురాణి అబ్రహాం బీబీసీకి చెప్పారు.

కానీ క్రైస్తవ సమాజానికి సంబంధించిన అంశాల గురించి చెప్పే 'మేటర్స్ ఇండియా' అనే పోర్టల్ ఎడిటర్, వ్యాఖ్యాత జోస్ రవి, క్రైస్తవ సమాజంపై ఈ కేసు ప్రభావం గురించి, ముఖ్యంగా కన్ఫెషన్ నమ్మే వారి గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్,

భారత్‌లో ఎవరు ఎక్కువ సురక్షితం? గోవులా లేక మహిళలా?

"కన్ఫెషన్ చేసిన ఒక రహస్యాన్ని మతాధికారి అతిక్రమించడం అనేది నేను మొదటిసారి వింటున్నా. ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఇది కన్ఫెషన్‌ అంటే అందరికీ ఉన్న నమ్మకంపై ప్రభావం చూపిస్తుంది. అక్కడ వాటిని వినేది ప్రీస్ట్ కాదు, ఆ దేవుడే". అని జోస్ రవి అన్నారు.

కన్ఫెషన్ అనేది స్పష్టంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక వృద్ధిని నిర్దేశిస్తుంది అని కొచురాణి చెప్పారు. వాటితో వేధించడం చాలా ప్రమాదకరమైన లక్షణం. అందుకే "దేని గురించైనా పశ్చాత్తాపం చెందినపుడు ఆ దేవుడికో, లేదా స్నేహితుడికో దాన్ని చెప్పుకోవచ్చు కదా, మతాధికారి దగ్గరికే ఎందుకెళ్లాలి అని జనం నన్ను అడుగుతున్నారు". అని చెప్పారు.

ఇలాంటి కేసులు ఎవరైనా కన్ఫెషన్ కోసం చర్చికి వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేస్తాయని కొచురాణి తెలిపారు. ఎందుకంటే వారు లైంగిక వేధింపులు జరుగుతాయేమోనని భయపడతారు అన్నారు. కానీ, "యువత ఇప్పటికే చర్చిలకు వెళ్లడం లేదు" అని కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) మాజీ వుమెన్ కమిషనర్, కార్యకర్త అయిన వర్జీనియా సల్దన్హా తెలిపారు.

"వేరే రకంగా దేవుడిని నమ్మచ్చు, దానికి మతాధికారి అవసరం లేదు అని చదువుకున్న వారిలో 50 శాతం మంది భావిస్తున్నారు. అందుకే, చర్చికి తక్కువ మంది వెళ్లడం మీరు చూడచ్చు. కానీ, ఛారిటీ కార్యక్రమాల్లో, ఇతర కార్యకలాపాలలో వారు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు" అని సల్దన్హా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2012-2016 మధ్య కాలంలో భారత దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రెట్టింపు అయ్యాయని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి.

కానీ, కార్యకర్తలను, మతధర్మవేత్తలను మరో విషయం ఆందోళనకు గురిచేస్తోంది. "చర్చి ప్రీస్ట్ లైంగిక దాడి చేయడం నిజం. కానీ చర్చి దానిని కప్పిపుచ్చిన తీరు ఆ నేరాన్ని మరింత తీవ్రమైన అంశంగా మార్చాయి". అని ప్రొఫెసర్ సెబాస్టియన్ వట్టమట్టం అన్నారు. 1999లో కేరళలో ప్రీస్ట్ ఒక మైనర్ బాలికను గర్భవతి చేసిన కేసుపై ఆయన పోరాడుతున్నారు.

మైనర్ బాలిక లేదా నన్‌పై జలంధర్ బిషప్ అత్యాచారం, లైంగిక వేధింపుల గురించి ప్రొఫెసర్ సెబాస్టియన్, కొచువాణి వివరించారు.

జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ పై ఫిర్యాదు తర్వాత పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. కొట్టాయం జిల్లాలో మేజిస్ట్రేట్ ముందు నన్ వాంగ్మూలం రికార్డ్ చేశారు. 2014-2016 మధ్య బిషప్ తనపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడని నన్ ఫిర్యాదు చేసింది. చర్చి మాత్రం నన్ నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని చెప్పింది.

"2014లో జరిగిన ఈ ఘటనలో ఆ నన్‌కు నోరు తెరవద్దని చెప్పారు. ఆ ప్రీస్ట్‌ను ఉన్నత చదువుల కోసం రోమ్ పంపించారు" అని కొచురాణి చెప్పారు.

పిల్లలపై, మహిళలపై అందే లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలని గత కొన్నేళ్లుగా కాథలిక్ చర్చి చెబుతోంది. కానీ, మలంకర ఆర్థొడాక్స్ సిరియన్ చర్చ్ మాత్రం ఆ పని చేయడం లేదు.

కేరళలో ఈ కేసుపై, "అంతర్గత విచారణ జరుగుతోంది. అది పూర్తైన తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తాం. ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే, నలుగురు మతాధికారులను వారి విధుల నుంచి తొలగిస్తాం" అని మలంకర ఆర్థొడాక్స్ సిరియన్ చర్చి ప్రతినిధి ప్రొఫెసర్ పీసీ ఇలియాస్ బీబీసీకి చెప్పారు.

అయితే, బాధితురాలి భర్త ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వీఏ అచ్యుతానందన్ రాష్ట్ర పోలీసులను ఆదేశించడంతో చర్చి తమ నియమాలను పక్కనపెట్టింది.

కానీ ప్రైవేట్ లేదా మతంలోని కౌన్సిలర్ దగ్గరకు వెళ్లకుండా బాధితులను కాపాడలేరా అనే ఒక ప్రశ్న కేరళ కేసుతో ఉత్పన్నం అవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)