Reality Check: పిల్లలపై లైంగిక నేరాలు నిజంగానే పెరుగుతున్నాయా?

  • దివ్య ఆర్య
  • బీబీసీ ప్రతినిధి

భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతి వారం ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది.

ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై ఆగ్రహించిన వందలాది ప్రజలు గతనెలలో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

18ఏళ్లలోపు వయసున్న అమ్మాయిలపై నిజంగానే లైంగిక వేధింపులు పెరుగుతున్నాయా? లేక ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయా? అన్నది చర్చనీయాంశమైంది.

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న టీవీ, మొబైల్ మీడియా కారణంగా కూడా ఈ కేసులు ఎక్కువగా బయటికొస్తున్నాయి అనే అభిప్రాయమూ నెలకొంది.

చట్టపరంగా ‘రేప్’కి సంబంధించిన నిర్వచనం కూడా మారిపోయింది.

లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రతి కేసునూ పోలీసులు తప్పనిసరిగా నమోదు చేయాలన్న నిబంధనా అమల్లోకి వచ్చింది.

ఇటీవల కశ్మీర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిన నేపథ్యంలో లైంగిక వేధింపులపై చర్చ మరింత విస్తృతమైంది. ఏప్రిల్‌‌లో కేసు విచారణ మొదలైన నాటి నుంచి చర్చ నలుగుతూనే ఉంది.

కశ్మీర్ రేప్ కేసుతో పాటు అలాంటి మరెన్నో ఘటనలు తనని తీవ్రంగా కలచివేశాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైనవారికి మరణ శిక్ష విధించేలా చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది.

ఫొటో క్యాప్షన్,

మీడియా కారణంగా మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి

రేప్ నిర్వచణంలో మార్పు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం 2012-16 మధ్య ఐదేళ్ల కాలంలో నమోదైన పిల్లల అత్యాచార కేసులు రెట్టింపయ్యాయి.

2012కు ముందు పిల్లలకు సంబంధించిన లైంగిక నేరాలను ప్రత్యేకంగా పరిగణించే చట్టాలేవీ లేవు. ఆ ఏడాది నవంబర్‌లోనే తొలిసారిగా పిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సస్) ప్రవేశ పెట్టారు. (అంతకుముందు స్త్రీ జననాంగంలోకి దేన్నైనా జొప్పించడాన్ని మాత్రమే రేప్‌గా పరిగణించేవారు)

ఆడపిల్లలతో పాటు మగపిల్లలపై జరిగే నేరాలను ఈ చట్టం ఒకేలా పరిగణిస్తుంది. పిల్లలపై జరిగే లైంగిక నేరాలపై ఫిర్యాదు చేయకపోవడంతో పాటు వాటిని నమోదు చేయకపోవడం కూడా ఈ చట్ట ప్రకారం నేరమే. దానికి జైలు శిక్షతో పాటు అపరాధ రుసుం కూడా విధిస్తారు.

ఈ చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే నమోదైన పిల్లల అత్యాచార కేసుల సంఖ్య 45శాతం పెరిగింది.

‘ఈ చట్టం వల్ల వైద్యులకు, పోలీసులకు ‘కుటుంబ సమస్య’గా పేర్కొంటూ ఫిర్యాదుదారులను వెనక్కు పంపే అవకాశం లేదు. అలా చేస్తే వాళ్లు జైలుకెళ్లే అవకాశం కూడా ఉంది’ అంటారు ఆడ్రీ డి’మెల్లో. ముంబైలో లైంగిక వేధింపుల బాధితుల కోసం ఏర్పాటు చేసిన మజ్లీస్ లీగల్ సెంటర్ తరఫున ఆమె పనిచేస్తున్నారు.

ఫిర్యాదులను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కావడంతో నమోదయ్యే వేధింపుల కేసులూ పెరిగిపోయాయని ఆమె అభిప్రాయం.

నిర్భయ ఘటనతో...

2012లో దిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతంతో భారత్‌లో లైంగిక నేరాలు అంతర్జాతీయంగా చర్చల్లోకి వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసుల విచారణ తీరుపైన కూడా దృష్టి పడింది.

ఆ పైన మహిళలపై లైంగిక నేరాల నిర్వచనాన్ని మరింత విస్తృతపరుస్తూ చట్టంలో ప్రభుత్వం మార్పు చేసింది. ఆ ప్రభావం మరుసటి ఏడాది స్పష్టంగా కనిపించింది. 2013లో నమోదైన రేప్ కేసుల సంఖ్య 35శాతం పెరిగింది.

అందరూ ఊహించేదానికంటే ఎక్కువగానే పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చాలామంది భావన.

ఈ విషయంపై 2007లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఓ అధ్యయనం నిర్వహించింది. అందులో భాగంగా 13రాష్ట్రాలకు చెందిన 17వేల మందికి పైగా పిల్లలతో మాట్లాడింది. వాళ్లలో సగానికి పైగా(53.2శాతం) పిల్లలు తాము వివిధ రకాల లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు.

ఆ అధ్యయనాన్ని గమనిస్తే పిల్లల "లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు దేశంలో పూర్తి స్థాయిలో వెలుగులోకి రావట్లేద"నే విషయం అర్థమవుతుందని పిల్లల హక్కుల కోసం పనిచేసే ‘హక్ సెంటర్’ న్యాయవాది కుమార్ శైలభ్ అంటారు.

ఫొటో క్యాప్షన్,

‘నిర్భయ’ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి

విచారణలో లోపాలు

బలమైన చట్టం ఉండటంతో పాటు నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నా, శిక్షపడే వారి సంఖ్య మాత్రం 2012 నుంచి 28.2శాతానికి మించట్లేదు. పిల్లలపై జరిగే లైంగిక నేరాల విషయంలో ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని ఆ చట్టం చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడంలేదు.

నేరాలకు పాల్పడుతున్న వారిలో బాధితులకు తెలిసిన వారే ఎక్కువగా ఉంటుండటంతో కేసులను వెనక్కు తీసుకోమనే ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. కొందరు కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భావనతో కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.

‘ఫిర్యాదు చేసినా కూడా నిందితులపై విచారణ సజావుగా సాగదు. ఇక్కడి వ్యవస్థ ఫిర్యాదుదారుకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది’ అంటారు డి’మెల్లో.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)