హైదరాబాద్ నుంచి పరిపూర్ణానంద బహిష్కరణ

  • 11 జూలై 2018
పరిపూర్ణనంద Image copyright FB / Paripoornananda

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్ -1980 కింద పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌ నగరం నుంచి తరలించారు.

శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులు సోమవారం ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ విధించారు.

కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు సోమవారం పోలీసులు అనుమతి నిరాకరించి గృహ నిర్బంధం చేశారు.

తాజాగా బుధవారం ఉదయం పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

కత్తి మహేశ్ నగర బహిష్కరణపై విమర్శలు వచ్చాయి. దళితుడు అయినందునే ఆయన్ను నగర బహిష్కరణ చేశారనే రీతిలో విమర్శలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో కారణాలు ఏమైనప్పటికీ.. తాజాగా పోలీసులు స్వామి పరిపూర్ణానందను కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించారు.

అయితే, పరిపూర్ణానంద నగర బహిష్కరణకు పాత కారణాలు చెప్పారు.

Image copyright TELANGANA POLICE

పోలీసులు పేర్కొన్న కారణాలు

2017 నవంబర్ 1న మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్‌లో జరిగిన 'రాష్ట్రీయ హిందూ సేన' ఆవిర్భావ సభలో పరిపూర్ణానంద ఇతర మతాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు. 2017 డిసెంబర్ 2న రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలో, 2018 మార్చి 11న కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ యాక్ట్-1980 కింద పరిపూర్ణానందకు 09-07-2018 రోజున బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

ఆ నోటీసులు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అందుకే 6 నెలలపాటు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండా బంజారాహిల్స్ ఏసీపీ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే పరిపూర్ణానందకు పోలీసులు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని ఆయన న్యాయ సలహాదారు అన్నారు.

Image copyright facebook.com/mahesh.kathi

బహిష్కరణలు సరికాదు

వ్యక్తులను ఒక నగరంలో ఉండొద్దు అంటూ బహిష్కరించడం సరికాదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయవాది వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

"మొన్న కత్తి మహేష్, నేడు స్వామి పరిపూర్ణానందలను హైదరాబాద్ నుంచి పోలీసులు బహిష్కరించడం సరికాదు. ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. రాజుల కాలంలో బహిష్కరణలు ఉండేవి. కానీ రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పిస్తోంది" అని ఆయన చెప్పారు.

ఇందిరాగాంధీ సమయంలో మేనకాగాంధీ పాస్‌పోర్టును బ్లాక్ చేశారు. ఆ కేసులో మనిషికి ఎక్కడికైనా వెళ్లి నివసించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా తమ భావాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఆ క్రమంలో ఎవరైనా పొరపాటు చేస్తే చట్టపరంగా కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచాలి. కానీ, ఒక చోటు నుంచి తరలించి మరో చోట ఉంచినంత మాత్రాన ఫలితం ఉండదు" అని వేణుగోపాల్ రెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

మెక్సికో: డ్రగ్ మాఫియాతో దేశమంతా రక్తసిక్తం... ఒక్క ఏడాదిలో 30 వేల హత్యలు

మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణం ఏమిటో తెలుసా...

భారత్‌లో మొబైల్ డేటా రేట్లు ఏ స్థాయిలో పెరిగే అవకాశాలున్నాయి...

బ్యాంకులు మహిళలకు తక్కువ, మగవారికైతే ఎక్కువ రుణాలు ఇస్తున్నాయా...

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆకలి, చలి... బయటకొస్తే జైలు

‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్

చంద్రబాబుపై ఏసీబీ కోర్టు విచారణ.. లక్ష్మీపార్వతి 14 ఏళ్ల కిందట వేసిన కేసులో కదలిక

'శబరిమల ఆలయంలోకి వెళ్తా. నన్ను అడ్డుకోలేరు’ - తృప్తి దేశాయ్