స్వలింగ సంపర్కం నేరస్మృతి నుంచి బయట పడగలుగుతుందా?
- భూమికా రాయ్
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కం నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్-377పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఐపీసీ సెక్షన్-377ను తొలగించాలని దాఖలైన ఎన్నో పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒకేసారి విచారణ చేపట్టింది.
బీబీసీతో మాట్లాడిన ఒక పిటిషనర్ "మొదటి రోజు విచారణలు అనుకూలంగానే జరిగాయని, తమ వాదనలను కోర్టు అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన "కోర్టు వైఖరి చాలా బాగుంది. మా పట్ల సమాజంలో వివక్ష ఉందని కోర్టు భావిస్తోంది. పిటిషనర్ల తరఫున కోర్టులో 'రైట్ టు చాయిస్ ఆఫ్ పార్ట్నర్' ప్రస్తావన కూడా తీసుకొచ్చాం" అన్నారు.
2013లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరస్మృతిలో చేర్చింది.
ఆ తర్వాత దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. ఐఐటీలోని 20 మంది విద్యార్థులు నాజ్ ఫౌండేషన్‌తో కలిసి పిటిషన్ వేశారు.
వీటితోపాటు విడివిడిగా చాలా మంది స్వలింగ సంపర్కులు న్యాయస్థానం తలుపు తట్టారు. వీరిలో లలిత్ గ్రూప్‌కు చెందిన కేశవ్ సూరీ కూడా ఉన్నారు. సెక్షన్-377కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకూ 30కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
అందరి కంటే ముందు పిటిషన్లు వేసిన వారిలో నాజ్ ఫౌండేషన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇది 2001లో సెక్షన్-377ను నేరస్మృతి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
సెక్షన్-377 అంటే?
ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించారు.
ఐపీసీ సెక్షన్-377 ప్రకారం, పురుషులు, మహిళలు లేదా పశువులతో ఎవరైనా అసహజ సంబంధాలు ఏర్పరచుకుంటే, ఆ నేరానికి వారికి పదేళ్ల శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. దీన్లో జరిమానా నియమం కూడా ఉంది. ఈ నేరంలో బెయిల్ లభించదు.
స్వలింగ సంపర్కం గురించి నియమాలు ఏం చెబుతాయి?
భారతదేశంలో స్వలింగ సంపర్కంను నేరస్మృతిలో ఉంచారు. దీనిని నేరాల నుంచి తొలగించాలని వచ్చిన పిటిషన్లపై విచారణలు జరుగుతున్నాయి.
గోప్యత హక్కుపై 2017లో విచారించిన సుప్రీంకోర్టు "సెక్సువల్ ఓరియెంటేషన్, లైంగిక ధోరణి అనే వాటికి నేరుగా గోప్యత అంశంతో సంబంధం ఉంటుంది. లైంగిక ధోరణి ఆధారంగా వివక్ష చూపడం వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తుంది". అని చెప్పింది.
2013లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం ప్రకృతి విరుద్ధం అని, ఇది ఒక నేరమని చెప్పింది.
ఈ అంశంపై ఎల్జీబీటీక్యూఐ(లెస్బియన్, గే, బై సెక్సువల్, క్వీర్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఇంటర్ సెక్స్) కోసం పనిచేసే ఉద్యమకారుడు, న్యాయవాది ఆదిత్య బందోపాధ్యాయ "''మీ వ్యక్తిగత పరిధిలో మీరు స్వలింగ సంపర్కులుగా ఉండడం వరకు ఫర్వాలేదు. కానీ అలాంటి లైంగిక భావాలను మీరు బయట ప్రదర్శించడానికి ప్రయత్నించినపుడు చట్టం దాన్ని నేరంగా భావిస్తుంది'' అన్నారు
ఈ సమాజం కోసం పనిచేస్తున్న నక్షత్ర భాగ్వే స్వలింగ సంపర్కుల ఈ డిమాండ్, సెక్స్ కోసమే అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. "మేం సెక్స్ కోసం పోరాడడం లేదు. మేం మా గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నాం". అన్నారు.
స్వలింగ సంపర్కుల గురించి భయపడాల్సిన అవసరం లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. సమాజం వారిని కూడా అంగీరించాలని అంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కం వ్యాధా?
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తాము విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో "ఇప్పుడు స్వలింగ సంపర్కం వ్యాధి అనుకోవడం సరికాదు అంది".
"గత 50 ఏళ్లలో స్వలింగ సంపర్కం ఒక వ్యాధి అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు" అని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ భిడే చెప్పారు.
"స్వలింగ సంపర్కులుగా ఉండడం భిన్నంగా ఉంటుంది. అది ప్రకృతి విరుద్ధం, అసహజం కాదు" అని భిడే అన్నారు.. అయితే ఐపీసీ సెక్షన్-377 మాత్రం స్వలింగ సంపర్క సంబంధాలను అసహజం, శిక్షార్హమైన నేరంగా భావిస్తుంది.
ఫొటో సోర్స్, Getty Images
మిగతా దేశాల్లో పరిస్థితి?
ఐక్యరాజ్యసమితి ఒక కాంపైన్(మానవ హక్కుగా వచ్చే ఫ్రీ అండ్ ఈక్వల్ కాంపైన్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపేలా చట్టాలు ఉన్నాయి.
ఐదు దేశాల్లో దీనికి మరణ శిక్ష విధించే నియమాలు కూడా ఉన్నాయి.
అయితే గత కొన్నేళ్లుగా స్వలింగ సంపర్కులను సమాజంలో ఆమోదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇటీవల గే మేరేజ్ చట్టబద్ధత కోసం ఓటింగ్ కూడా జరిగింది. బర్ముడాలో కూడా గే వివాహాలకు అడ్డుగా ఉన్న చట్టాలను మార్చారు.
కానీ స్వలింగ సంపర్కులు మాత్రం "తమ లక్ష్యం పెళ్లికి చట్టబద్ధత కల్పించడం కాదంటున్నారు. తమ పోరాటం గుర్తింపు కోసమే" అని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)