‘అది మోక్షం కాదు, మానసిక రుగ్మత’

  • 11 జూలై 2018
భాటియా బంధువులు Image copyright Getty Images

ఇటీవల దిల్లీ సమీపంలో సామూహిక ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది.

ప్రాథమిక సమాచారం మేరకు, ఆ కుటుంబంలోని మూడు తరాలకు చెందిన ఆడ, మగ, చిన్నాపెద్ద.. మొత్తం 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ఆగస్టు నెలలో ఈ ఇంట్లో ఓ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఈలోపలే ఇలా..

పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని తెలుస్తోంది.

ఆత్మహత్యలకు ఉపయోగించిన స్టూలు కూడా పక్కింటివాళ్ల నుంచి తెచ్చుకున్నట్లుగా సీసీటీవీ ఫూటేజ్‌ చూస్తే తెలుస్తుంది.

‘మోక్షం’ పొందడం.. లాంటి ఆలోచనా ధోరణులే ఈ ఆటవిక ఘటనకు పురిగొల్పి ఉండొచ్చు.

ఆత్మహత్య చేసుకున్నవారిలో లలిత్ అనే వ్యక్తికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నట్లు ఆయన డైరీ ద్వారా తెలుస్తోంది. ఆయన డైరీలో ‘మోక్షం’, ‘మరణం తర్వాతి జీవితం’ లాంటి అంశాలతోపాటు, వీటిని సాధించడానికి లలిత్ సంసిద్ధతతో ఉన్నట్లు కూడా అర్థమవుతుంది.

కానీ, ఒక సామాన్య కుటుంబం ఈ విధంగా సామూహిక ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతుంది? అన్నది ప్రతి ఒక్కర్నీ తొలిచే ప్రశ్న.

అయితే.. ఈ ఘటన వెనుక పని చేసిన ఆలోచనా ధోరణి, మూఢ నమ్మకాల గురించి ఓసారి ఆలోచించాలి.

మన చుట్టూ చాలా మంది.. ఆత్మలతో మాట్లాడటం, పునర్జన్మలు, చావు అనుభవాలు.. లాంటి అశాస్త్రీయమైన విషయాలను ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే.. మరణానంతర జీవితానికి హిందూ సంస్కృతిలో ప్రాధాన్యం కూడా ఎక్కువ.

ఇలాంటి విశ్వాసాలకు కారణాలు చాలానే ఉంటాయి. 'మరణ భయం' నుంచి సాంత్వన పొందడానికి ఇలాంటి పునర్జన్మ విశ్వాసాలు కొందరికి అవసరమవుతాయి. ఇలాంటి విశ్వాసాలు వారి మెదడులో బలంగా నాటుకుపోయి ఉంటాయి.

కొందరు.. తమ రోజువారీ సమస్యలకు పరిష్కారం కోసం ఇలాంటి ఊహలపై ఆధారపడతారు. ఆత్మలకు ఆగ్రహం కలగడం, దుష్ట శక్తులు.. వలనే తమకు ఈ సమస్యలన్నీ.. అనుకుంటారు.

దీంతో ఆత్మలను పూజించడం మొదలపెడతారు. తాము ఇబ్బందుల్లో ఉన్నపుడు, లేదా తమ దగ్గరి వాళ్లు చావుబతుకుల్లో ఉన్నపుడు ఆత్మోపాసకులను ఆశ్రయిస్తారు.

ఇలాంటి ఆలోచనా ధోరణే భాటియా కుటుంబానికీ ఉన్నట్లు తెలుస్తోంది. 2008లో తండ్రి చనిపోయినప్పటి నుంచి లలిత్ ఆధ్యాత్మికత పట్ల విపరీతంగా ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది.

తాను ధ్యానంలో ఉన్నపుడు తన తండ్రి తనతో మాట్లాడుతాడని, తాను ఏంచేయాలో, ఏం చేయకూడదో చెబుతాడని భావించేవాడు.

చనిపోయినవాళ్లతో మాట్లాడటం అన్న అలోచనే.. ఒక మానసిక రుగ్మత. చనిపోయినవారి మాటలు వింటాం అని చెప్పడం, లేదా చనిపోయినవాళ్లు ఇంకా బతికే ఉన్నట్లు భావించడం లాంటివి ‘సైకోసిస్’ లక్షణాలు. అంటే మానసిక అనారోగ్యం అని అర్థం.

ఇలాంటి పరిస్థితుల్లో సదరు వ్యక్తి.. వాస్తవానికి దూరంగా, భ్రమల్లో బతుకుతూ ఉంటారు. వారి చేష్టలూ అలాగే ఉంటాయి. వారు.. భ్రమ, కల్పన కలిసిన భావోద్వేగమైన ప్రవర్తన కలిగి ఉంటారు.

కానీ చూడటానికి మాత్రం అందర్లానే మామూలుగా కనిపిస్తారు. వారు ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నారని, అతీంద్రియ శక్తుల అనుగ్రహం పొందుతున్నారని సమాజం భావిస్తుంది.

అలాంటి వారు తమ కుటుంబ సభ్యులను సులభంగా ప్రభావితం చేయగలరు. వారి ఆలోచనలు, అనుభూతులను వాళ్లు కూడా పంచుకోవడం మొదలుపెడతారు. దీన్ని 'షేర్డ్ సైకోసిస్' అంటారు. కుటుంబ సభ్యులందరిపై ఇలాంటి ప్రభావం ఉన్న కేసులను మానసిక వైద్యులు తరచు చూస్తుంటారు.

Image copyright Getty Images

ఇక్కడే కాదు.. అంతటా ఉంది

కొన్నేళ్ల కిందట ముంబయిలో జరిగిన ఇలాంటి పాశవిక ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తోపాటు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి.

మెల్‌బోర్న్‌కు చెందిన ఒక కుటుంబం.. తమను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న భయంతో, కుటుంబంలోని 5 మంది వేరొక ప్రాంతానికి వెళ్లిపోయారు. 2011లో వచ్చిన 'అపార్ట్' అనే సినిమా కూడా 'షేర్డ్ సైకోసిస్' గురించి చెబుతుంది. ఇందులో ఒక జంట.. తమను ఎవరో చంపేస్తారన్న భయంలో ఉంటుంది.

Image copyright Getty Images

ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు.. వైద్యం కంటే ఎక్కువగా స్వాములను నమ్ముతారు.

ఇలాంటి పరిస్థితే భాటియా కుటుంబానికి కూడా ఉన్నట్లుంది. కానీ షేర్డ్ సైకోసిస్ మూలంగా ఇంతమంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇదే తొలిసారి కావచ్చు.

కొన్నిసార్లు ఇలాంటి వాటిని విశ్వసించేవారంతా ఒక బృందంగా చేరి, సామూహిక పూజా విధానాలను అవలంబిస్తారు. గతంలో రెండు హత్య కేసుల్లో పోలీసులు కొందర్ని అరెస్ట్ చేశారు. వీరంతా.. ప్రాణత్యాగం చేయాలని ప్రేరేపించే ఓ సంస్థకు చెందినవారే.

కోల్‌కతాకు చెందిన 'ఆనంద్ మార్గ్', జపాన్‌లోని 'ఓం శిన్రిక్యో' లాంటి సంస్థలు వీటికి కొన్ని ఉదాహరణలు. 1995లో ఓం శిన్రిక్యోకు చెందినవారు ''మేం సత్యాన్ని అన్వేషిస్తున్నాం..'' అంటూ టోక్యో నగరంలోని ఓ సబ్‌-వేలో ‘సారిన్’ అనే విషవాయువును ప్రయోగించారు. వారిని అరెస్టు చేసిన జపాన్ ప్రభుత్వం.. వారిని అతివాదులుగా ప్రకటించింది.

Image copyright Getty Images

బురారి లాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే?

మొదటగా.. పునర్జన్మ, ఆత్మలు వంటి అశాస్త్రీయమైన అంశాల పట్ల లోతుగా చర్చించి విశ్లేషించుకోవాలి. ఇవన్నీ.. సరదా కథలుగా చెప్పుకోవడం వరకూ సరే. కానీ ఈ ఆలోచనలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమే!

జీవితంలో సమస్యలు రావడం సర్వసాధారణం. వాటిని.. మిత్రులు, బంధువుల సాయంతో, తెలివిగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. కానీ ఆత్మహత్యల్లాంటి విపరీతమైన చర్యలు అవసరం లేదు.

భాటియా కుటుంబ సభ్యుల్లో.. ఆత్మహత్య సమయంలో అరవకుండా ఎవ్వరి నోరూ బలవంతంగా మూసివుంచలేదు, కళ్లకు గంతలు కట్టలేదు. అంటే.. వీరిలో అందరికీ ఆత్మహత్యల పట్ల ఉన్న సంసిద్ధత అర్థమవుతోంది.

Image copyright Getty Images

ఇటువంటి ఆలోచనా ధోరణి సమాజంలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించాలంటే.. ఇలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారిని నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్య నిపుణులకు చూపిస్తే.. బురారి లాంటి ఘటనలు పునరావృతం కావు.

ఇలాంటి మానసిక రుగ్మతల గురించి దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.

మోక్షం, పునర్జన్మలు.. ఈ తతంగమేదీ మనకు అక్కరలేదు.. సుఖదు:ఖాలు కలగలసిన సాధారణ జీవితమే అన్నిటికి మించి తృప్తినిస్తుంది.

(డా.హమీద్ దధోల్కర్ మానసిక వైద్య నిపుణులు, అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి సభ్యులు)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు