హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎలా పొందుతున్నారు? ఎందుకు పొందుతున్నారు?

  • 15 జూలై 2018
హైదరాబాద్ పాతబస్తీలోని రోహింజ్యా శరణార్థి శిబిరం నుంచి తొంగి చూస్తున్న నూర్ నషత్. ఈమె 2016లో హైదరాబాద్ వచ్చారు. Image copyright Getty Images
చిత్రం శీర్షిక రెండేళ్ల కిందటే హైదరాబాద్ పాతబస్తీకి వెయ్యికి పైగా రోహింజ్యా శరణార్థులు చేరుకున్నారు. ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది

గత పది రోజుల వ్యవధిలో ఐదుగురు రోహింజ్యా శరణార్థుల్ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా గుర్తింపు పత్రాలు పొందేందుకు భారతీయ పౌరులని చెప్పినందుకు వీరిని అరెస్ట్ చేశారు.

అందులో 34 ఏళ్ల అబ్దుల్ ఖైర్ అలియాస్ షేక్ యూసుఫ్ ఒకడు. 2013లో యూసఫ్ మయాన్మార్ నుంచి ప్రాణాలు చేత పట్టుకొని బాంగ్లాదేశ్ చేరుకొని అక్కడి నుంచి భారతదేశం వచ్చాడు. హైదరాబాద్‌లో ఇంకా రోహింజ్యా శరణార్థులు ఉన్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కూలి పని చేసుకుంటూ బతుకు సాగిస్తున్నాడు.

2017లో స్థానికంగా పరిచయం అయిన జూర్ ఆలం అనే వ్యక్తి సహాయంతో అబ్దుల్ ఆధార్ కార్డు, భారతీయ పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేశాడు. నవంబర్ 2017లో పాస్‌పోర్ట్ వచ్చింది. ఈ పాస్‌పోర్ట్‌పై సౌదీ అరేబియాలో 30 రోజులు ఉండటానికి వీసా దొరికింది. దాంతో అబ్దుల్ సౌదీ అరేబియా వెళ్ళాడు. కానీ అక్కడ ఆరు నెలలు ఉన్నాడు. ఈ విషయం తెలిసి అక్కడి అధికారులు అక్రమంగా దేశంలో ఉంటున్నందుకు అతని జెడ్డా జైల్లో పెట్టారు. తరవాత విడుదలై మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాడు.

జులై 8న తెలంగాణ పోలీసులకు అందిన సమాచారం మేరకు అబ్దుల్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అబ్దుల్‌కు సహాయం చేసిన జూర్ ఆలం మాత్రం పరారీలో ఉన్నాడు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న రోహింజ్యాలు

ఇది ఒక్క అబ్దుల్ ఖైర్ కథ మాత్రమే కాదు. తెలంగాణ పోలీసుల ప్రకారం గత సంవత్సరంలో 28 రోహింజ్యా శరణార్థులను అక్రమంగా గుర్తింపు పత్రాలు పొందినందుకు అరెస్ట్ చేశారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో 7 కేసులు, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 14 కేసులు నమోదై ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి‌లో 90 శాతం రోహింజ్యా శరణార్థులు ఉన్నారు.

"వీరిలో కొంత మంది మెరుగైన బతుకు తెరువు కోసం స్థానిక ఏజెంట్ల సాయంతో ఇలా చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన వారు మిడిల్ ఈస్ట్ దేశాలు, మలేషియాకు వెళ్లేందుకు అక్రమంగా పత్రాలు పొందారు" అని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

2012‌లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో జరిగిన హింస నుంచి తప్పించుకొని వచ్చిన వారు ఈ క్యాంపులలో ఉంటున్నారు. సొంత ఊరు, ఇల్లు, వ్యవసాయం, వ్యాపారం, చదువులు అన్నీ వదిలి ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చారు. అలా గత ఐదారేళ్లుగా దేశంలో పలు చోట్ల రోహింజ్యా ముస్లిం శరణార్థులు ఉంటున్నారు. హైదరాబాద్‌లో మూడు క్యాంపులలో దాదాపు 3,800మంది రోహింజ్యా శరణార్థులు ఉన్నారు.

చిత్రం శీర్షిక హైదరాబాద్‌లో మూడు క్యాంపులలో దాదాపు 3,800మంది రోహింజ్యా శరణార్థులు ఉన్నారు
చిత్రం శీర్షిక ఆధార్ లేకపోవడంతో రోహింజ్యా పిల్లలకు చదువు కూడా దూరమవుతోంది

మియన్మార్ టు హైదరాబాద్. ఇలా..

ఇక్కడ క్యాంపులలో ఉన్న ఎవరిని కదిపినా దుఃఖం‌తో నిండిన కథనాలే. ఆ క్యాంపులోని ఓ పెద్దమనిషి బిలాల్ మాట్లాడుతూ "ఇక్కడ ఎవరూ కూడా మొత్తం కుటుంబంతో రాలేదు. దారిలోనే ఒకరి తల్లి చనిపోతే.. మరొకరి తండ్రి చనిపోయాడు. ఒక అన్నా చెల్లీ జంటగా వస్తే.. మరో తల్లి కొడుకులు వచ్చారు" అని చెప్పాడు. బిలాల్ హైదరాబాద్ వచ్చి ఎనిమిదేళ్ళు అవుతోంది.

అదే క్యాంపులో ఉంటున్న 23 ఏళ్ల సాదిక్ కూలి పనికి వెళ్తాడు. హైదరాబాద్‌కు వచ్చి ఏడేళ్ళు అవుతుంది. "మా నాన్న మియన్మార్‌లో స్పోర్ట్స్ టీచర్. కానీ హింస పెరగటంతో మేము మా ఇల్లు వదిలి కేవలం అవసరమైన గిన్నెలు, దారిలోకి సరిపడా ఒకటి రెండు జతల బట్టలు తీసుకొని వచ్చేశాము. కాలి నడకన బంగ్లాదేశ్‌ చేరాము. దారిలో మాలాంటి ఎంతో మంది కనిపించారు. బంగ్లాదేశ్‌లో ఒక నెల పాటు ఉన్నాము. కానీ అది చిన్న దేశం. ఇంత మంది శరణార్థులను ఆదుకునే శక్తి లేదు.

ఏం చేయాలో పాలుపోని సమయంలో, క్యాంపులోని ఓ వ్యక్తి భారత్‌కు వెళ్లొచ్చని చెప్పాడు. అతనికి డబ్బు ఇస్తే తీసుకొని వెళ్తా అని మాట ఇచ్చాడు. డబ్బిచ్చి అతనితో పాటు కోల్‌కతాకు బస్సులో వచ్చాము. అక్కడ దిల్లీ వెళ్లే ట్రైన్ ఎక్కాము. దిల్లీ వచ్చాక UNHCR వారు మా వివరాలు నమోదు చేసి ఒక క్యాంపుకి పంపారు. దారి పొడవునా ఎవరికో ఒకరికి డబ్బు ఇస్తూనే ఉన్నాము. క్యాంపులో పరిస్థితికి ఆరోగ్యం బాగా దెబ్బ తినింది.

దిల్లీ నుంచి హరియాణా వెళ్ళాము. కానీ బతకడానికి ఆసరా లేకపోయింది. అదే క్యాంపులో పరిచయమైన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో క్యాంపుల గురించి చెప్పాడు. ఆలా ఇక్కడికి వచ్చాము. వచ్చి ఏడేళ్లు అవుతున్నా బతకడానికి చాలీచాలని డబ్బే వస్తున్నా, కనీసం ప్రాణానికైతే ఇక్కడ ఎలాంటి భయం లేదు" అని సాదిక్ తన గురించి చెప్పాడు.

Image copyright Getty Images

ఆధార్ ఎందుకు?

క్యాంపులలో చోటు సరిపోక కొంత మంది శరణార్థులు హైదరాబాద్‌లోని బాబా నగర్ , బార్కాస్ వంటి ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు తీసుకొని ఉంటున్నారు. వీరిలో చాలా మంది దగ్గర ఫోన్ ఉంది. కొంత మంది దగ్గర బండి కూడా ఉంది. మరి అక్రమంగా ఎందుకు గుర్తింపు కార్డులు పొందాల్సి వస్తుంది అని అడిగితే ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు.

కూలి పనికి వెళ్లొచ్చి తన ఇంటి బయట సేద తీరుతున్న నూర్‌తో మాట్లాడితే, "నేను పెయింటర్‌గా పని చేస్తున్నా. నా దగ్గర ఫోన్ లేకపోతే మేస్త్రి నాకు పని గురించి ఎలా చెబుతాడు? బండి లేకపోతే నేను దూరంగా ఉన్న పనికి ఎలా పోతాను? అందుకే ఇక్కడ పరిచయమైన వారిని అడిగి వారి వస్తువులు వాడుకుంటున్నాము. వారి సహాయంతో సిమ్ కార్డు తీసుకున్నాం" అని తెలిపాడు.

పక్కనే ఉన్న అతని స్నేహితుడు మాట్లాడుతూ "ప్రతి దానికి ఆధార్ కార్డు అడుగుతున్నారు. మా దగ్గర ఉన్న రెఫ్యూజీ కార్డు చూపించినా సరిపోవట్లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా చికిత్స కోసం ఆధార్ కార్డు కావాలంటున్నారు. ఇక్కడ ఆధార్ కేంద్రాల్లో మాకు కార్డు ఇవ్వట్లేదు’’ అని చెప్పారు.

"మాకు ఇప్పుడు వెళ్లి ఆధార్ కార్డు అడగాలన్నా భయం వేస్తోంది. ఏమీ చేయలేక స్థానికులకు డబ్బిచ్చి సాయం పొందుతున్నాం" అని ఇంకొందరు చెప్పారు.

చిత్రం శీర్షిక ఎక్కువగా కూలిపనులే చేసుకుంటూ హైదరాబాద్‌లో రోహింజ్యాలు జీవిస్తున్నారు

నిబంధనల ప్రకారం ఆధార్ ఇవ్వొచ్చా?

రోహింజ్యా శరణార్థులకు గుర్తింపు కింద రెఫ్యూజీ కార్డు ఇస్తారు. వాళ్ళు దేశంలోకి వచ్చిన తరవాత యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(UNHCR) వారు శరణార్థుల వివరాలు నమోదు చేసుకుంటారు. హైదరాబాద్‌లో ఉన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్స్ (COVA) సంస్థ UNHCRకి అనుబంధ సంస్థ.

కోవా డైరెక్టర్ డా. మజ్హెర్ హుస్సేన్ ఈ ప్రక్రియను వివరిస్తూ, "శరణార్థులు దేశంలోకి వచ్చిన తరవాత వారి వివరాలు తీసుకుంటాం. ‘అప్లికేషన్ మాండెటరీ ఫర్ రెఫ్యూజీ స్టేటస్’(AMRS) అన్న అప్లికేషన్‌లో వారి వివరాలు పొందు పరిచి UNHCRకు పంపిస్తాం. ఆ తరవాత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో UNHCR బృందం వచ్చి శరణార్థులను, వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూని రెఫ్యూజీ స్టేటస్ డిటర్మినేషన్(RSD) అంటారు. ఆ తరవాత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో 'రెఫ్యూజీ కార్డు' ఇస్తారు. ఇంత కఠినమైన ప్రక్రియలో నకిలీ శరణార్థులకు రెఫ్యూజీ కార్డు దొరకడం కష్టం. కానీ భారత దేశం ఈ కార్డును గుర్తించటం లేదు. 1951 ఐరాస శరణార్థుల ఒప్పందంపై సంతకం చేయలేదు కాబట్టి భారత్‌కు ఈ కార్డును గుర్తించవలసిన అవసరం లేదు" అని చెప్పారు. 1951 యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్‌లో కానీ 1967 ప్రోటోకాల్‌పై కానీ భారత్ సంతకం చేయలేదు. ఈ కన్వెన్షన్‌లో 'శరణార్థులు' అంటే ఏంటి అన్నది వివరిస్తూ వారికి కల్పించాల్సిన హక్కులను ఒక లీగల్ డాక్యుమెంట్ కింద పొందుపరిచారు. దీనిపై దాదాపు 145 దేశాలు సంతకం చేశాయి’’ అన్నారు.

అసలు వీరికి ఆధార్ కార్డు పొందే అర్హత ఉందో లేదోనన్న అంశంపై అధికారులకు కూడా స్పష్టత లేన్నట్టు తెలుస్తోంది. పలు విభాగాల ఉన్నతాధికారులను అడగగా, కొందరు అధికారులు "కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వారిని అడిగితే బెటర్" అని చెప్పారు.

ఆధార్ కేంద్రంలోని ఎంక్వయిరీ కౌంటర్‌లో అడిగితే "భారత దేశంలో 180 రోజులకంటే ఎక్కువ కాలం నివశిస్తున్నవారు ఆధార్ అప్లై చేసుకోవచ్చు" అని చెప్పారు. మరి శరణార్థులైతే ఏం చేయాలన్న ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ఆలా కుదరదు అని మాత్రం చెప్పారు. బాలాపూర్‌లో ఉంటున్న 26 ఏళ్ల శరణార్థి అబ్దుల్లా మాట్లాడుతూ, "నేను కాలేజీకి వెళ్లాలనుకుంటున్నా. నాకు ‘లా’ చదవాలని కోరిక. కానీ అడ్మిషన్‌ కోసం ఆధార్ అడుగుతున్నారు. అది దొరకట్లేదు" అని తెలిపాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాతబస్తీలోని శిబిరాల్లో నివశిస్తున్న చాలామంది రోహింజ్యా శరణార్థులు హైదరాబాద్ నగరంలో రోజువారీ కూలీ పనులు చేసుకుని బతుకుతున్నారు

‘శరణార్థులు వేరు.. అక్రమ వలసదార్లు వేరు’

బాలాపూర్‌లోని డైమండ్ రెస్టారంట్ దగ్గరున్న క్యాంపులో పిల్లలు ఒక ప్రభత్వ పాఠశాలకు వెళ్తున్నారు. అక్కడి ప్రిన్సిపల్ మాట్లాడుతూ, ‘‘చదువు ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. ఆధార్ లేని కారణంగా వారికి విద్యను నిరాకరించలేము" అని చెప్పారు.

శరణార్థుల చదువు కోసం ప్రత్యేక చర్యలేవైనా తీసుకున్నారా అన్న ప్రశ్నకు విద్యా రంగ ఉన్నతాధికారుల దగ్గరా సమాధానం లేదు. వారి చదువు కోసం పనిచేస్తున్న సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ అధికారి మాట్లాడుతూ.. "పోయిన సంవత్సరం ఒక అబ్బాయి పదవ తరగతి పరీక్ష కోసం చదివినా పరీక్ష రాయలేక పోయాడు. ఆధార్ కార్డు విషయంలో అధికారుల నుంచి స్పందన రాకపోవటడంతో అర్హత లేదన్న కారణంగా ఆ అబ్బాయి పరీక్ష రాయలేకపోయాడు. చివరికి ఆ కుర్రాడు కూలీగా మారాడు’’ అని చెప్పారు.

భారతీయులుగా చెప్పుకుంటూ శరణార్థులు అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతుండటమే పోలీసులకు సమస్యగా మారింది. దీని గురించి వివరిస్తూ "మలేషియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లోనూ శరణార్థులున్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ వేరుగా ఉండడంతో అక్కడ వారు కాస్త మెరుగైన జీవితం సాగిస్తున్నారు. వీళ్లు కూడా ఆయా దేశాలకు వెళ్లి మెరుగైన జీవితం పొందేందుకు ఇలాంటి మార్గాలు వెతుక్కుంటున్నారు’’ అని డా. మజ్హెర్ హుసేన్ వివరించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘ప్రపంచంలో మిత్రులెవరూ లేని ప్రజలు’ రోహింజ్యాలు

ఇటీవల ఇలాంటి ఓ కేసులో ఎల్బీ నగర్ పోలీసులు ఇద్దరు శరణార్థులను అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ డీసీపీ ఎం.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, "భారత పాస్‌పోర్టుకు మిగతా దేశాల్లో క్రెడిబిలిటీ ఎక్కువ. మేము అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది శరణార్థులు మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళటానికి పాస్‌పోర్టులు పొందారు" అని తెలిపారు. కొందరు స్థానిక ఏజెంట్లు శరణార్థుల నుంచి డబ్బు తీసుకొని వారిని విదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

‘‘విదేశాల్లో ఉన్న శరణార్థుల బంధువులు వీళ్లకు డబ్బు పంపిస్తున్నారు. వీళ్లకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో హవాలా వ్యాపారులను ఆశ్రయిస్తూ వీరు డబ్బు పొందుతున్నారు. వీరిని తిరిగి తమ దేశాలకు పంపాలంటే ఇంకా అక్కడి పరిస్థితులు సద్దుమణగలేదు. అయినా బతికితే చాలు అనుకునే శరణార్థులను, మెరుగైన జీవితం కోసం వచ్చే అక్రమ వలసదార్లను ఒకలా చూడటం సరికాదు’’ అని డీసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం