యాదాద్రి: ముస్లిం శిల్పులు చెక్కుతున్నారు

  • 12 జూలై 2018
శిల్పి

యాదగిరిగుట్ట మీద కరకు బండలు బద్దలవుతున్నాయి. రాతి శిలలు అపురూప శిల్పాలవుతున్నాయి. శిల్పులు, కూలీలు తమ ఉలులే కుంచెలుగా అద్భుత కళా విన్యాసం చేస్తున్నారు.

షేక్‌ బాబూలాల్‌, మహమ్మద్‌ యూనిస్‌, షేక్‌ రబ్బానీ, షౌకత్‌ అలీ, షేక్‌జానీ.. వీరితో పాటు దాదాపు 120 మంది ముస్లిం శిల్పకళాకారులు గత రెండేళ్లుగా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న ఇతర కూలీలను కూడా కలుపుకొంటే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పని చేస్తున్న ముస్లింల సంఖ్య 200 మందికిపైగా ఉంటుంది.

కృష్ణ శిలలను కళారూపాలుగా మార్చే పనిలో.. ఏడంతస్తులుగా నిర్మిస్తున్న మహారాజగోపురం నిర్మాణంలో పనిచేస్తున్నారు.

మాకు కళే దైవం...

భుక్తి కోసం చేపట్టే ఏ పనికైనా కులం, మతంతో పనిలేదని చాటి చెప్తున్నారు ఈ శిల్పకారులు. వీరందరిదీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా లోని తురకపాలెం గ్రామం.

‘‘మా తాతల కాలం నుంచి దేవతా విగ్రహాల తయారీలోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి. రెండేళ్లుగా యాదాద్రి పనులు చేస్తున్నాం. ఆలయాలే కాదు మసీదులు కూడా కడతాం, మహబూబ్‌నగర్‌ , కల్వకుర్తిలో చర్చిని నిర్మించాం’’ అని చెప్పారు షేక్‌ రబ్బానీ.

‘‘మాకు మతంతో సంబంధం లేదు. పనే దైవం.'' అని చెప్తారాయన. మండపాల నిర్మాణంలో ఆయన బృందం తలమునకలై ఉంది.

కళకు సరిహద్దులు లేవు...

‘‘భిన్న మతాల ప్రాంతాల కళాకారులు ఇక్కడ పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి 600 మంది శిల్పులు, మరో 200 మంది కూలీలు ఇక్కడ శ్రమిస్తున్నారు'' అని స్తపతి ఆనందాచారి వేలు బీబీసీతో చెప్పారు.

ఆలయ శిల్పాలను చెక్కేటపుడు వీరు కఠిన నియమాలను పాటిస్తారు. ఉదయమే స్నానాదికాలు పూర్తి చేసుకొని మాత్రమే పనిని ప్రాంరభిస్తారు. పనిలో ఉన్నప్పుడు మాంసం, మద్యం ముట్టరు.

ఆడ, మగ శిలలుంటాయా?

హైదరాబాద్‌ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి కొండపైన 2.33 ఎకరాల స్థలంలో జరుగుతున్న ఆలయ నిర్మాణంలో విగ్రహాలన్నీ కృష్ణశిలతోనే రూపొందుతున్నాయి.

''ఆలయ నిర్మాణంలో వాడే శిలలను పురుష శిల, స్త్రీ శిల, నపుంసక శిల అంటారు. స్త్రీ, పురుష శిలలను భూమిలోపల నుండి తీస్తారు. వీటినే కృష్ణశిలలంటారు. దేవతా విగ్రహాలకు వాడుతారు’’ అని స్తపతి ఆనందాచారి వేలు బీబీసికి వివరించారు.

ఈ శిలలను గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న గురిజేపల్లి, కోటప్పకొండ ప్రాంతం నుంచి సేకరిస్తున్నారు.

‘‘ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇవ్వడం ఈ కృష్ణశిలల ప్రత్యేకత. ప్రధానాలయం అంతా కృష్ణశిలలతోనే నిర్మించడం దేశంలోనే ప్రథమం'' అని ఆయన తెలిపారు.

కొన్ని తరాల వరకు చెక్కు చెదరవు

కృష్ణశిల దొరికే ప్రాంతంలోని మట్టి నమూనాలను సేకరించి చెన్నై‌లోని ఐఐటీలో పరీక్షలు చేయించిన తరువాతే వాడుతున్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల వరకూ ఈ శిలకు క్షయం ఉండదని ఆ పరీక్షల్లో తేలింది.

గత 500 ఏళ్లలో దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి ఆలయం నిర్మించలేదని స్తపతులు అంటున్నారు.

చిత్రం శీర్షిక స్తపతి ఆనందాచారి

ముడిరాయిని శిల్పంగా మార్చాలంటే?

పేపర్‌ మీద వేసే బొమ్మ సరిగా రాకపోతే రబ్బరుతో చెరిపి మరోసారి వేయొచ్చు. కాని రాతిని శిల్పంగా చెక్కేటప్పుడు అలా కుదరదు.

‘‘స్తపతులు రాయిని కొలతలు వేసి ఇస్తారు. దానికి అనుగుణంగా శిల్పాన్ని చెక్కుతాం. ప్రధానమైన శిల్పాలు చెక్కేటపుడు సాధ్యమైనంత వరకు అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తారు'' అని చెప్పారు రాయల సీమకు చెందిన శిల్పి సంజయ్‌.

ముడిరాయి నుంచి విగ్రహాన్ని తయారు చేయాలంటే ఆ పనిని 124 భాగాలుగా విభజించుకుంటారు. స్తపతులు చెప్పిన కొలతల ప్రకారం రాయిపై మార్కింగ్‌ వేసుకొని, దాన్ని తిరిగి ఎనిమిది నుంచి పది సార్లు సరిచేసుకుంటూ చివరికి శిల్పానికి అనుగుణంగా ఉండే దశకు తీసుకువస్తారు.

రోజుకు రూ. 2,000 పారితోషికం...

దాదాపు రెండు లక్షల టన్నుల రాయితో ఈ శిల్పాలను చెక్కుతున్నారు.

ఉదయం ఏడు గంటలకే మొదలయ్యే వారి దినచర్య సాయంత్రం ఏడున్నర తర్వాత ముగుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం మినహా వారూ శిల్పాలకు ప్రాణం పోసే పనిలోనే నిమగ్నమవుతారు.

రాయిని శిల్పంగా మార్చే క్రమంలో పనులను బట్టి వీరికి రోజుకు రూ. 1,200 నుండి రూ. 2,000 వరకు పారితోషికం ఇస్తున్నారు.

పనులన్నీ వైష్ణవాచారం, ఆగమ, శిల్ప, వాస్తు శాస్త్రం ఆధారంగానే జరుగుతున్నాయంటున్నారు ప్రధాన స్తపతులు.

చిత్రం శీర్షిక యాడా వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌‌రావు

దసరా నాటికి పూర్తిచేయటం లక్ష్యం

గర్భాలయం, ప్రధానాలయం శ్లాబు కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయి. ఆళ్వార్ల శిలారూపాలతో కూడిన స్తంభాలు, కాకతీయ స్తంభాలు కొలువు తీరాయి. ప్రస్తుతం సుదర్శన గోపురాల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి.

‘‘దసరా నాటికి మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 900 కోట్లు, ఇప్పటివరకు రూ. 500 కోట్లు ఖర్చయింది'' అని యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌‌రావు బీబీసీకి తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి