ప్రెస్‌రివ్యూ: ‘మేలో ఎన్నికలు.. ఫిబ్రవరి కల్లా పోలవరం పనులు పూర్తి చేయాలి’ - కేంద్ర మంత్రి గడ్కరీ

  • 12 జూలై 2018
Image copyright Nitin gadkari/facebook

''పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాదు! ఇది మొత్తం భారతదేశానిది. ప్రధాని మోదీ సారథ్యంలో దీనిని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం'' అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

బుధవారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే గడ్కరీ, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు.

పోలవరం పూర్తికి సహకరిస్తామంటూనే... పెరిగిన అంచనాలపై సహేతుక కారణాలను వివరించి, ఆర్థిక శాఖను ఒప్పించాల్సి ఉందని అన్నారు. ''ఒక రైతుగా నీరు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ధికి నీరే కీలకం. నీటి కొరతతో మా ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలవరం చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ది కాదు... మొత్తం దేశానికి చెందినది. ప్రతి ఏటా 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ రైతులకు కొత్త జీవితం అందించవచ్చు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తికి కట్టుబడి ఉంది. కొన్ని సమస్యలున్నాయి. వాటి పరిష్కారంపైనా నిర్ణయాలు తీసుకున్నాం'' అని తెలిపారు.

తొమ్మిది నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు చోటు చేసుకుందన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని గడ్కరీ పేర్కొన్నారు. సివిల్‌ పనులను ఫిబ్రవరి ఆఖరుకల్లా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు గడువు విధించారు.

''ఏప్రిల్‌ ఆఖరుకు పూర్తి చేస్తామని వారంటున్నారు. అయితే... మార్చి మొదటివారంలో మళ్లీ నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను. అప్పటికి ప్రాజెక్టు పూర్తయితే చూడాలని భావిస్తున్నాను. ఎందుకంటే... మేలో ఎన్నికలొస్తాయి. అంతకంటే ముందే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. అందుకే, ఫిబ్రవరి ఆఖరుకల్లా సివిల్‌ పనులు పూర్తి చేయాలి! ఎన్నికల తర్వాత ఏమిటన్నది ప్రజలు నిర్ణయిస్తారు'' అని వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright Hyderabad Metro Rail Limited/facebook

గూగుల్ మ్యాప్స్‌తో మెట్రో పిల్లర్ల అనుసంధానం

త్వరలో హైదరాబాద్‌లోని అడ్రస్‌లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయిని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్‌ సాంకేతికతతో గూగుల్‌ మ్యాప్‌ కు అనుసంధానించనున్నారు.

వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారనున్నాయి.

ఎల్బీనగర్‌-మియాపూర్, జేబీఎస్‌- ఫలక్‌నుమా, నాగోల్‌-రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది.

ఇప్పటికే ప్రకాశ్‌నగర్‌-రసూల్‌పురా మార్గంలో సీ1,300-సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ వర్గాలు తెలిపాయి.

కాగా పీవీ ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌మార్క్‌ చిహ్నలుగా మారనుండటం విశేషం.

మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి.

అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్‌ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్‌ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్‌ సాంకేతికతతో గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్‌ నంబర్‌ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చని సాక్షి పేర్కొంది.

క్రెడిట్ కార్డు మోసాలు ముఠా అరెస్టు Image copyright Getty Images

కాల్ సెంటర్‌లో 'కాల్'కేయులు

హైదరాబాద్‌ కేంద్రంగా క్రెడిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చేస్తామంటూ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు దొంగిలిస్తున్న ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు సాక్షి తెలిపింది.

అచ్చం బ్యాంక్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్లుగానే ఉంటుంది. అవతలి నుంచి మాట్లాడిన టెలికాలర్‌ క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చేస్తామంటూ చెప్పి.. ఖాతాదారుల నుంచి కార్డు వివరాలు, సీవీవీ తీసుకుంటారు.

ఇలా వివరాలు చెబుతుండగానే జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్‌ బ్యాంక్‌ ఖాతాకు రూ. 8,500లు షాపింగ్‌ పేరిట బదిలీ అయ్యాయని ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇలా 2 వేల మంది నుంచి రూ.5 కోట్లు ఆ ముఠా కాజేసింది.

ఈ ముఠాలో 8 మందిని కీలక నిందితులుగా నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు వివరించారు.

నగదు మాయంపై వందలాది కస్టమర్ల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో ఎస్‌బీఐ కార్డు అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మృదుల కొడూరి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు జూన్‌ 25న ఫిర్యాదు చేశారు.

క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా ఆదేశం మేరకు ఏసీపీ వై.శ్రీనివాస్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి టెక్నికల్‌ డేటా సహకారంతో సందీప్‌ను కొంపల్లిలో అరెస్టు చేసింది. ఇతడిచ్చిన వివరాలతో ఢిల్లీలో విజయ్, అభిజిత్, సీత, అశుతోష్, ధరమ్‌రాజ్, రెహన్‌ ఖాన్, విపిన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరితో పాటు 22 మంది టెలికాలర్లను కూడా పట్టుకున్నారని సాక్షి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి