34 ఏళ్ల అన్వేషణ: భారత మొదటి ఒలింపియన్ కుటుంబాన్ని వెతికి పట్టుకున్న జర్నలిస్ట్

ఫొటో సోర్స్, Gulu Ezekeil collection
భారత్‌కు ఒలింపిక్స్‌లో మొట్టమొదటి పతకాన్ని అందించిన వ్యక్తి నార్మన్ గిల్బర్ట్ ప్రిచర్డ్. కానీ అతడి గురించి, అతడి కుటుంబం గురించి చాలా కొద్ది మందికే తెలుసు.
అందుకే దిల్లీకి చెందిన గులు ఎజెకీల్ అనే ఓ క్రీడా పాత్రికేయుడు ప్రిచర్డ్ కుటుంబాన్ని ఎలాగైనా వెతికి పట్టుకొని ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. కానీ దానికి ఆయనకు మూడు దశాబ్దాలకు పైనే పట్టింది. ఆ అన్వేషణ ఎలా సాగిందో ఆయన మాటల్లోనే...
1900 ప్యారిస్ ఒలింపిక్స్‌లో 200మీ హర్డిల్స్, 200మీ స్ప్రింట్ విభాగాల్లో ప్రిచర్డ్ భారత్ తరఫున రజత పతకాలను గెలిచాడు.
దేశానికి తొలి ఒలింపిక్స్ పతకాన్ని అందించిన ప్రిచర్డ్ గురించి తెలుసుకోవాలన్న తపన 1984లో మొదలైంది. ఆ ఏడాది లాస్ ఎంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్ కోసం ఓ కథనం రాసే సమయంలో ప్రిచర్డ్ గురించి చదివా. ఆయన కుటుంబం ఎక్కడుందో తెలుసుకోవాలన్న కుతూహలం అప్పుడే కలిగింది. కానీ 34 ఏళ్ల తరవాత, గత నెలలోనే ఇంగ్లండ్‌లోని మిడిల్‌సెక్స్‌లో ఉంటున్న ఆయన వారసులతో మాట్లాడగలిగా.
ప్రిచర్డ్ ఓ ఆల్‌రౌండర్. 1875లో ఆయన కోల్‌కతాలో పుట్టారు. భారత్‌లో వివిధ క్రీడల్లో శిక్షణ తీసుకున్నారు. 1905లో వ్యాపార నిమిత్తం ఇంగ్లండ్ వెళ్లారు. ఆపైన నటనలో కెరీర్ కొనసాగించేందుకు అమెరికాలో అడుగుపెట్టారు.
1899లో భారత్ తరఫున తొలిసారిగా ప్రిచర్డ్ ఫుట్‌బాల్‌లో హ్యాట్రిక్ నమోదు చేశారు. రగ్బీతో పాటు మరెన్నో క్రీడాంశాల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. భారత్ తరఫున మొట్టమొదటి ఒలింపిక్స్ పతకం మాత్రమే కాదు, ఆసియా నుంచి 200మీ. హర్డిల్స్‌లో, 200మీ. స్ప్రింట్‌లో రజత పతకాలు గెలిచిన తొలి వ్యక్తి కూడా ప్రిచర్డే. ఇంగ్లాండ్‌లో స్టేజీ పైన నటించడంతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన తొలి ఒలింపియన్ కూడా ఆయనే. ఇన్ని చేసినా ఆయన గురించి ఎవరి దగ్గరా ఎక్కువ సమాచారం లేదు.

ఫొటో సోర్స్, Gilbert Cann
ప్రిచర్డ్ సోదరి కుటుంబం.. కోల్‌కతాలో ఉన్నప్పుడు
ప్రిచర్డ్ బంధువుల్నీ, ఆయన వారసుల్నీ కనిపెట్టడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఆయనకు డొరొతి అనే కూతురు ఉందనే విషయం తప్ప మరే సమాచారం నా దగ్గర లేదు. యూకేలో ఉంటోన్న నా స్నేహితులు నటాలీ కుక్, క్రికెట్ చరిత్రకారుడు మార్టిన్ షాండ్లర్‌ల సాయంతో నా అన్వేషణ ముందుకెళ్లింది.
మొదట ప్రిచర్డ్ చెల్లెలు సెలెనా ఫ్రాన్సిస్ కుటుంబాన్ని నటాలీ కనుగొన్నారు. ఆమె మనవడి పేరు గిల్బర్ట్ నార్మన్ ప్రిచర్డ్ కాన్. అతడి వయసు ఇప్పుడు 73ఏళ్లు. అతడు కూడా కోల్‌కతాలోనే పుట్టి 1961లో ఇంగ్లండ్ వచ్చేశాడు.
ఫేస్‌బుక్ సాయంతో నేను ప్రిచర్డ్ కాన్ కూతురు నటాలీ కాన్‌ను కనిపెట్టాను. ఆమె సాయంతో ఆమె తండ్రితో టచ్‌లోకి వచ్చాను.
‘మా కుటుంబమంతా మా తాతగారు నార్మన్ ప్రిచర్డ్‌ను ఆరాధిస్తుంది. కుటుంబంలో మగవాళ్లందరికీ ఇప్పటిదాకా ఆయన పేరే పెడుతూ వస్తున్నాం. ఆయన తెరపైన ‘ట్రెవర్’ అనే పేరుతో నటించారు. అందుకే మా అందరి పేర్లు ప్రిచర్డ్ లేదా ట్రెవర్ అనే ఉంటాయి. మా కుటుంబంలో పెద్దవారికే మా తాతగారి(ప్రిచర్డ్) గురించి పూర్తిగా తెలుసు. కానీ వాళ్లెవరూ ఇప్పుడు బతికిలేరు’ అని ప్రిచర్డ్ కాన్ నాతో చెప్పారు.
ఆయన తాతలానే ప్రిచర్డ్ కాన్ కూడా క్రీడాకారుడే. భారత్‌లో ఉన్నప్పుడు కోల్‌కతా పోలీస్ తరఫున హాకీ ఆడారు. స్కూల్ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్ జట్లకు ఆయన కెప్టెన్‌గానూ ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సారెల్ అండ్ సేన్ అనే సినిమాలో ప్రిచర్డ్(ఎడమ)
బెంగాల్ మాజీ రంజీ జట్టు కెప్టెన్ రాజు ముఖర్జీకి ఇప్పటికీ ప్రిచర్డ్ కాన్ ఆట గుర్తే. ‘కాన్ క్రికెట్ బాగా ఆడేవాడు. బహుశా జన్యుపరంగానే అతడికి సహజంగా క్రీడా నైపుణ్యం అబ్బి ఉంటుంది’ అని రాజు చెబుతారు.
ఆయన మాటలకు తగ్గట్టుగానే, నార్మన్ ప్రిచర్డ్(సీనియర్) కుటుంబంలో చాలామంది ప్రొఫెషనల్ క్రీడాకారులున్నారు.
నార్మన్ ప్రిచర్డ్ 1929లో కాలిఫోర్నియాలో మరణించేనాటికి ఆయన కుమార్తె డొరొతి పెళ్లి చేసుకోలేదు. ఆమెకు పెళ్లయి, పిల్లలు పుడితే చూడాలని ప్రిచర్డ్ కోరుకునేవారు. కానీ ఆయన మరణించాక డొరొతి ఏమైపోయారనే విషయం ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఆమె జీవితం వాళ్ల కుటుంబానికి ఓ మిస్టరీనే.

ఫొటో సోర్స్, Wanda Cann
ప్రిచర్డ్ కాన్.. ప్రిచర్డ్ సీనియర్ సోదరి మనవడు
ఇంగ్లండ్ తిరిగి వెళ్లాక కాన్ మళ్లీ భారత్‌కు రాలేదు. కానీ మరోసారి ఇక్కడికి రావాలని, తాను పెరిగిన నగరాన్ని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఆయనతో మాట్లాడటం నాకో అద్భుతమైన అనుభవం. దేశానికి తొలి ఒలింపిక్స్ పతకాన్ని అందించిన ప్రిచర్డ్ కుటుంబ సభ్యులతో ఎప్పటికైనా మాట్లాడగలనా అనుకునేవాణ్ణి. కానీ నా సుదీర్ఘ ప్రయత్నానికి గత నెలలో తెరపడింది. ఈ సంతోషం, సంతృప్తీ నాకెప్పటికీ మిగిలిపోతాయి.
(గులు ఎజెకీల్ దిల్లీకి చెందిన స్వతంత్ర క్రీడా పాత్రికేయుడు, రచయిత. గ్రేట్ ఇండియన్ ఒలింపియన్స్ లాంటి కొన్ని స్పోర్ట్స్ పుస్తకాలను రచించారు)
ఇవి కూడా చదవండి:
- ఫెడరర్ ఫార్వర్డ్ డిఫెన్స్.. సచిన్ బ్యాక్ హ్యాండ్
- సానుభూతి, సైన్యం, ఫేక్ న్యూస్, మతం: పాక్ ఎన్నికల్లో వీటి మధ్యే పోటీ
- స్వలింగ సంపర్కం నేరస్మృతి నుంచి బయట పడగలుగుతుందా?
- ఒక్క బంగారు నాణెం కోసం మీరెన్ని మిరపకాయలు తినగలరు?
- పిల్లలపై లైంగిక నేరాలు నిజంగానే పెరుగుతున్నాయా?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- కత్తి మహేశ్: పోలీసులు ఎందుకు బహిష్కరించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)