ఫెడరర్ ఫార్వర్డ్ డిఫెన్స్.. సచిన్ బ్యాక్ హ్యాండ్

  • 12 జూలై 2018
ఫెడరర్, సచిన్ Image copyright Getty Images

టెన్నిస్ ఛాంపియన్ రోజర్ ఫెడరర్ కోర్టులో ఓ క్రికెట్ షాట్ ఆడాడు. వెంటనే ‘ఈ షాట్ ఎలా ఉంది?’ అని వింబుల్డన్, ఐసీసీని అడిగింది. దానికి ఐసీసీ తనదైన శైలిలో బదులిచ్చింది. వాళ్ల మాటల మధ్యలోకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కూడా ప్రవేశించాడు. ట్విటర్‌లో సాగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఇంతకీ విషయమేంటంటే... ప్రస్తుతం జరుగుతోన్న వింబుల్డన్‌ టోర్నీలో పాల్గొన్న ఫెడరర్, ఓ మ్యాచ్‌లో భాగంగా టెన్నిస్‌ షాట్‌కి బదులుగా క్రికెట్‌లో పాపులర్‌ అయిన ‘ఫార్వర్డ్ డిఫెన్స్’ షాట్ ఆడాడు. ‘వింబుల్డన్’ ఆ వీడియోను ట్వీట్ చేస్తూ, ‘ఈ షాట్‌కి ఎంత రేటింగ్ ఇస్తారు?’ అని ఐసీసీని అడిగింది.

ఐసీసీ కూడా వింబుల్డన్ ట్వీట్‌కి స్పందించింది. తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్ రోజర్ ఫెడరరే అన్నట్టుగా చూపించే ఓ ఫొటోను వింబుల్డన్‌కు ట్వీట్ చేసింది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి కొత్తగా ప్రవేశించిన ఫెడరర్‌కు సచిన్ తెందూల్కర్‌ కూడా స్వాగతం పలికాడు. ‘ఎప్పటిలానే కంటికీ చేతికీ మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. నువ్వు 9వ వింబుల్డన్ టైటిల్ గెలిచాక నాకు టెన్నిస్ పాఠాలు నేర్పివ్వు, నీకు నేను క్రికెట్ పాఠాలు నేర్పిస్తా’ అని సచిన్ ఫెడరర్‌కు ట్వీట్ చేశాడు.

ఫెడరర్ కూడా సచిన్ ట్వీట్‌కు స్పందించాడు. ‘ఆలస్యమెందుకు.. నేర్చుకోవడానికి నేను సిద్ధం’ అని అతనన్నాడు.

సచిన్ దానికి జవాబిస్తూ, ‘సరే అయితే.. తొలి పాఠంగా నీకు స్ట్రెయిట్ డ్రైవ్ నేర్పిస్తాను. నువ్వు నాకు బ్యాక్‌హ్యాండ్ నేర్చుకోవడంలో సహాయం చేయి’ అన్నాడు.

వీళ్ల సంభాషణకు ఐసీసీ కూడా స్పందించింది. ‘ఇద్దరు గ్రేట్‌లు కలిస్తే ఇలా ఉంటుంది’ అని ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ‘ఈ వ్యక్తి చేయలేనిది ఏదైనా ఉందా? కానీ నెట్స్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ లాంటి పేసర్‌ను ఫెడరర్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి’ అని కూడా ఐసీసీ పేర్కొంది.

ఈ మొత్తం సంభాషణంతా ట్విటర్‌లో వైరల్‌గా మారింది. కానీ ఫెడరర్ 9వ వింబుల్డన్ టైటిల్ గెలవాలన్న సచిన్ కోరిక మాత్రం తీరలేదు. నిన్న జరిగిన వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌లో ఫెడరర్ సుదీర్ఘ పోరాటం అనంతరం కెవిన్ ఆండర్సన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)