ప్రెస్‌రివ్యూ: అన్ని సబ్జెక్టుల్లోనూ అంతంత మాత్రమే.. గణితంలో అయితే దారుణం

  • 13 జూలై 2018
Image copyright Getty Images

తెలంగాణలోని పదోతరగతి విద్యార్థుల అభ్యసనం తీరు దారుణంగా ఉంది. దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. గణితంలో మరీ వెనకబడి ఉన్నారని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

75% మార్కులు సాధించిన వారు ఒకటీరెండు శాతానికి మించి లేకపోవడం గమనార్హం. సర్వే పరీక్షలో 0-35 మార్కుల్లోపు పొందిన వారు 66 శాతానికిపైగా ఉండటం మన చదువుల డొల్లతనాన్ని వెల్లడిస్తోంది.

సైన్స్‌, సాంఘికశాస్త్రం, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టుల్లోనూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యం అంతంతమాత్రమే ఉన్నట్లు తేలింది. పదో తరగతి చదివే విద్యార్థుల ప్రతిభను ఆయా సబ్జెక్టుల్లో పరీక్షించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఈ ఏడాది ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.

దేశంలోని 610 జిల్లాల్లో 44,514 పాఠశాలల్లో 15.44 లక్షల పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అయిదు సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 2,481 పాఠశాలల నుంచి 79,423 మంది విద్యార్థులు హాజరయ్యారు.

అయిదు సబ్జెక్టుల్లో 180 ప్రశ్నలు ఇచ్చి పరీక్షించారు. జిల్లాలవారీగా ఫలితాలను ఎన్‌సీఈఆర్‌టీ గురువారం విడుదల చేసింది.

ఆయా సబ్జెక్టుల్లో 35% కంటే తక్కువ మార్కులు సాధిస్తే అక్కడ విద్యార్థులు విద్యాపరంగా ప్రమాదంలో ఉన్నట్లేనని ఆ సంస్థ అభిప్రాయపడిందని ఈనాడు తెలిపింది.

Image copyright AndhraPradeshCM/facebook

'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మాకు మొదటి ర్యాంకు రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసింది'

సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌)లో ఏపీకి మొదటి స్థానం రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని ఈనాడు పేర్కొంది.

''ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా కేంద్రం ఏం చేయలేకపోయింది. అక్కడికీ కొన్ని అంశాలు తొలగించారు. విధిలేని పరిస్థితుల్లోనే మనకు సులభతర వాణిజ్యంలో మొదటిస్థానం ఇచ్చారు. సమర్థమైన, నీతివంతపాలనకు ఇదే నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై లేని నమ్మకాన్ని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌పై చూపించారు'' అని పేర్కొన్నారు.

ఉండవల్లిలో ప్రజాదర్బార్‌ హాలులో గురువారం నిర్వహించిన తెదేపా కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. కాదంటే కేంద్రం, రాష్ట్రం- రెండు ప్రభుత్వాలు కలిసి నెలకొల్పుదామన్నారు. 'అదీ కాదంటే మేమే ఏర్పాటు చేస్తాం. పదేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వండి. ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తాం. విశాఖ ఉక్కుతీరునే రైల్వేజోన్‌ సాధించేదాకా వదిలేది లేదు' అన్నారని ఈనాడు వెల్లడించింది.

Image copyright Getty Images

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా విమానయానం

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అంతర్జాతీయ ప్రయాణికుల కంటే హైదరాబాద్‌ నుంచి విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు; విజయవాడ నుంచి ముంబై, హైదరాబాద్‌, ఢిల్లీ తదితర నగరాలకు వెళ్లే దేశీయ ప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. దేశంలోని ప్రధాన ఎయిర్‌ పోర్టులతో పోలిస్తే తెలుగునాట విమానాశ్రయాలు ప్రయాణికుల వృద్ధిలో దూసుకుపోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల నుంచి విమానయాన సంస్థలు ఇటీవలి కాలంలో అనేక కొత్త రూట్లలో కనెక్టివిటీ పెంచాయి. సర్వీసులు పెరిగాయి. ప్రయాణికులకు సౌకర్యవంతంగా సేవలందుతున్నాయి.

అదే సమయంలో, విమానయాన సంస్థల మధ్య పోటీ పెరిగి చౌక ధరలకు టికెట్లు లభిస్తున్నాయి. పలు విమానయాన సంస్థలు ప్రతి సీజన్‌లోనూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నెలా రెండు నెలల ముందుగా టికెట్లు తీసుకున్న వారికి తక్కువ ధరకే అందిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణం.

తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాలు గణనీయ పురోగతిని సాధించాయని తెలిపింది. కొత్తగా ఏర్పడిన మన విమానాశ్రయాలు వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉండడమే కాదు.. చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లోని ఎయిర్‌పోర్టులతో పోటీ పడుతున్నాయిని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

పరీక్షలు Image copyright Getty Images

ఎంసెట్‌ ఇక కనుమరుగేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983లో మొదలైన ఎంసెట్‌ ప్రస్థానానికి ఇక తెరపడనుందా? దీనికి విద్యా శాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోందని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ ప్రవేశాలను జాతీయ స్థాయి నీట్‌ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఇకపై జాతీయ స్థాయిలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలను జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అది ఆచరణలోకి వస్తే రాష్ట్రంలో 35 ఏళ్ల పాటు నిర్వహించిన ఎంసెట్‌ అంతర్థానం కానుంది.

ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని (ఎన్‌టీఏ) ఏర్పాటు చేసి నీట్, జేఈఈని ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ షెడ్యూల్‌ కూడా ప్రకటించింది.

ఇంజినీరింగ్‌ కోర్సు ల్లో ప్రవేశాలను కూడా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన ప్రతిపాదనలకు ఇదివరకే ఆమోదం తెలిపింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

వీలైతే 2019-20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 వర్సిటీలు జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితులను చంపేస్తే ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే? ఆ సముద్రంలో ఉష్ణోగ్రతలు మారితే ఏమవుతుంది?

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

హైదరాబాద్ అత్యాచారం, ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"