అభిప్రాయం: 'కేసులతో మీడియా గొంతు నొక్కాలనుకుంటున్నారు'

  • ఎన్.రామ్, చైర్మన్, ద హిందూ గ్రూప్
  • బీబీసీ కోసం
తమిళనాడులో ప్రతికా స్వేచ్ఛకు ఆటంకాలు

ఫొటో సోర్స్, N.RAM

తమిళనాడులో పత్రికా స్వేచ్ఛపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరింతగా దిగజారుతోంది. అయితే, ఇదేమీ కొత్త విషయం కాదు. జయలలిత హయాంలో జర్నలిస్టులు, మీడియాపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావాలు వేసింది.

ఆ కాలంలో జర్నలిస్టులు, మీడియాపై 200 కేసులు నమోదయ్యాయి. మీడియా సంస్థలను బెదిరించడానికే ఇలా కేసులు వేసేవారు.

ప్రభుత్వం తలుచుకుంటే మీడియాపై ఆంక్షలు విధించవచ్చు. కానీ, జర్నలిస్టులను భయపెట్టి, వారు స్వీయ నియంత్రణ పాటించాలనే ప్రభుత్వం ఈ తరహా చర్యలకు దిగుతోంది.

ప్రభుత్వం వేసే పరువు నష్టం దావాల వల్ల ఒరిగేదేమీ ఉండదు. కానీ, కేసులు ఎదుర్కొనేందుకు జర్నలిస్టుల సమయం, డబ్బు వృథా అవుతుంది. కేసుల భయంతో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడానికి మీడియా వెనుకాడుతుందని పాలక వర్గాల ఉద్దేశం. అందుకే జర్నలిస్టులపై పరువు నష్టం దావాను ఒక ఆయుధంగా సర్కారు ప్రయోగిస్తుంటుంది.

ముఖ్యమంత్రికి నచ్చని వార్తలు వచ్చినా, అవినీతి ఆరోపణలు, ఆందోళనలు, నిరసనలపై వార్తలు ప్రసారమైన వెంటనే మీడియాపై కేసులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

జయలలితకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అని చెప్పడానికే వారు ఇలా చేస్తుంటారు. ఈ కేసులతోనే వదిలి పెట్టరు. ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వడం కూడా ఆపేస్తారు.

డీఎంకే హయాంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. వారికి వ్యతిరేకంగా వార్తలు వస్తే ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వడం ఆపేసేవారు. అయితే, ఈ రెండు పార్టీల మధ్య ఒక వ్యత్యాసం ఉంది.

జర్నలిస్టుగా మీరు కరుణానిధిని కలుసుకునే అవకాశం ఉంటుంది. కనీసం ఫోన్‌లోనైనా మాట్లాడొచ్చు. కానీ, జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఆమెను కలుసుకునే అవకాశమే ఉండేది కాదు.

ఫొటో సోర్స్, FACEBOOK / PG / KALAIGNAR89

ఫొటో క్యాప్షన్,

ఎంజీ రాంచంద్రన్

కేసులు ఎలా ఎదుర్కోవాలి

2003లో ద హిందూ దినపత్రికపై పెద్ద దాడి జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. మేం సుప్రీం కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాం. చివరకు జయలలిత కేసు వెనక్కి తీసుకున్నారు. అసలు మేం ఆమెకు వ్యతిరేకంగా ఏమీ రాయలేదు. ప్రభుత్వ అసహనం, అసెంబ్లీ వార్తలకు సంబంధించిన అంశంపై మేం రాసిన సంపాదకీయంపై వారు చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి వాటిపై పోరాడితే మనమే విజయం సాధిస్తామని, సర్కారుపై న్యాయ పోరాటం తర్వాత మాకు అర్థమైంది.

మా కంటే ముందు ఇలాగే, 'ఆనంద వికటన్' పత్రిక ఎడిటర్ బాల సుబ్రమణియన్ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేశారు. సభా గౌరవాన్ని కించపరిచేలా కార్టూన్‌లు వేశారని ఆయనకు శిక్ష వేశారు. ఈ చర్య అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి. రాంచంద్రన్ కల్పించుకొని సుబ్రమణియన్‌ను విడుదల చేయించారు.

జైలు నుంచి విడుదలయ్యాక ఆయన ప్రభుత్వంపై కేసు వేసి గెలిచారు. నష్టపరిహారం కింద ప్రభుత్వం ఆయనకు రూ.వెయ్యి ఇచ్చింది.

ఆ రూ.1000ని తన ఆఫీసులో ఫ్రేమ్ కట్టించి పెట్టారు. ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి ఎలా గెలవచ్చో చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ.

కానీ, ఇప్పటి ప్రభుత్వాలు కొత్త రూపంలో మీడియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. జయలలిత హయాంలో మీడియాపై ఐపీసీ సెక్షన్‌లను ప్రయోగించలేదు. పరువు నష్టం దావాలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు వేస్తే అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి కేసులు ప్రస్తుత ప్రభుత్వం పుతియా తళైమురై టీవీపై పెట్టింది.

తమది బలహీన ప్రభుత్వం కాదని చెప్పుకొనే ప్రయత్నంలో భాగంగా వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.

ఇప్పుడు తమిళనాడులో ఆందోళనలు బాగా జరుగుతున్నాయి. ప్రభుత్వం బలహీనంగా ఉండటం వల్లే ఈ ఆందోళనలు జరుగుతున్నాయనడం పొరపాటు. మొదటి నుంచి తమిళనాడు ప్రగతిశీల రాష్ట్రం.

నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కు. కానీ, ఇలాంటి ఆందోళనలను మీడియా ప్రసారం చేస్తే ప్రభుత్వానికి అది నచ్చదు.

అరసు కేబుల్ (ప్రభుత్వ కేబుల్ ఆపరేటర్)తో మీడియాను ప్రభుత్వం ఏ విధంగా అణగదొక్కిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

తమకు నచ్చని చానెల్‌ను అరసు కేబుల్ లిస్టులో చివరిస్థానంలో ఉండేలా చేస్తున్నారు. లేదంటే బ్లాక్ చేస్తున్నారు. మరోవైపు కేసులు కూడా పెడుతున్నారు.

ఈ రెండు చర్యలతో మీడియా తమ చెప్పుచేతుల్లో ఉంటుందని సర్కారు భావిస్తోంది.

అయితే, ప్రసారాలను ఆపివేస్తే టీవీ చానెల్స్ పోరాడుతుంటాయి. ఒక చానెల్ మరో చానెల్‌కు రహస్యంగా మద్దతిస్తుంది. కానీ, బయటకొచ్చి ఆందోళనలో పాలుపంచుకోవు. ఎవరికో ఏదో అయితే మనమెందుకు వారికి మద్దతుగా నిలబడాలి అనే ప్రశ్న వస్తుంటుంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి.

పుతియా తళైమురై టీవీపై కేసు వేశారు. ఇంతకీ వాళ్లు చేసిన తప్పేంటి?

కోయంబత్తూరులో వారు ఒక చర్చావేదిక నిర్వహించారు. అందులో పాల్గొన్న కొందరు ఉపన్యాసకులపై హిందూ సంప్రదాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కానీ, ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోకుండా టీవీపై కేసు పెట్టింది. అరసు కేబుల్‌లో ఆ టీవీ చానెళ్లను నియంత్రిచడమే కాదు. అదనంగా కేసులు కూడా వేసింది.

ప్రభుత్వం అరసు కేబుల్ కోఆపరేషన్‌ను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో దానిపై భారీ అంచనాలు ఉండేవి. కానీ, ఇప్పుడది ప్రభుత్వ ఆయుధంగా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే అరసులో ప్రసారాలు నిలిపివేస్తున్నారు.

ఇది కూడా బెదిరింపుల్లో భాగమేనని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 60 శాతం టీవీ కేబుల్ నెట్‌వర్క్‌ను అరసు కేబులే నియంత్రిస్తోంది. ఇది చాలా పారదర్శకంగా పనిచేస్తుందని మొదట మేం భావించాం. కానీ, పరిస్థితి అలా లేదు. చెన్నై, ఇతర పట్టణాల్లో నెట్‌వర్క్ నుంచి ఏ చానెల్ ఏ నంబర్‌లో ప్రసారం కావాలో ఒకే వ్యక్తి ఎంఎస్‌వో (మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్)లకు సూచిస్తాడు.

ఆ సూచనలతోనే ఎంఎస్‌వోలు కొన్ని చానెళ్లకు చివరి వరుస నంబర్లు కేటాయిస్తారు. మరికొన్ని చానెళ్లను బ్లాక్ చేస్తుంటారు. కొన్ని చానెళ్లను మసకమసగ్గా కనిపించే నంబర్లకి మారుస్తారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR

ఎంఎస్‌వో ఇలా చేసిన కొన్ని చానెళ్ల గురించి పరిశీలిస్తే...

జల్లికట్టు నిరసన ప్రదర్శనపై పోలీసుల తీరును ప్రసారం చేసినందుకు న్యూస్7, సన్ న్యూస్ చానెల్‌ ప్రసారాలను 23 జనవరి 2017 నుంచి కొన్ని రోజుల పాటు అరసు కేబుల్ నిలిపేసింది.

ఎంఎల్‌ఏల కొనుగోళ్లపై వార్తలు ప్రసారం చేసినందుకు 12 జూన్ 2017 నుంచి టౌమ్స్ నౌ ప్రసారాలను అరసు కేబుల్ నిలిపివేసింది.

2017లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను ప్రసారం చేసినందుకు జయ టీవీని బ్లాక్ చేసింది.

శేఖర్ రెడ్డి డైరీ ఉదంతంపై వార్తలు ప్రసారం చేసిన టౌమ్స్ నౌను 2016 డిసెంబర్ 8 నుంచి కొన్నాళ్ల పాటు బ్లాక్ చేసింది.

ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ వివరాలను ప్రసారం చేసినందుకు కావేరీ టీవీని అరసు కేబుల్ నుంచి పూర్తిగా తొలగించారు. ఇప్పుడు ఆ చానెల్ కోర్టులో పోరాడుతోంది.

అవినీతికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసినందుకు తంతి టీవీ ప్రసారాలను 48 గంటలపాటు నిలిపి వేసింది.

జయ ప్లస్ టీవీ, మతిముగమ్ టీవీ, సతియం, సన్ టీవీ చానెళ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తున్నాయనే ఉద్దేశంతో వాటి ప్రసారాలకు అంతరాయం కలిగించింది.

ఈ లిస్టు చూస్తే ఏ చానెల్‌నూ ప్రభుత్వం వదిలేయలేదని స్పష్టంగా అవగతమవుతోంది.

సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పర్యవసానం ఎలా ఉంటుందో వాళ్లు చెప్పాలనుకున్నారు. కానీ, వాళ్లు ప్రింట్ మీడియాకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయలేరు. మహా అయితే ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం ఆపేస్తారు.

ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, తమిళనాడులో మీడియా ఒక్కతాటిపై లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్‌డీ టీవీ చానెల్ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాళ్లు ప్రెస్‌క్లబ్‌లో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అరుణ్ శౌరీ లాంటి సీనియర్ జర్నలిస్టులు అందులో పాలుపంచుకున్నారు. కానీ, ఇక్కడ కొంతమందైనా అలా ప్రతిసారి పాల్గొనాల్సిన అవసరం ఉంది.

వర్కింగ్ జర్నలిస్టులు ఇలాంటివాటిలో పాల్గొనాలనుకుంటారు. కానీ, మీడియాలోని పరిపాలన బాధ్యులు మాత్రం సంకోచిస్తుంటారు. ఇదే ప్రభుత్వానికి బలంగా మారుతోంది.

బలహీన ప్రభుత్వం ఉన్నసమయంలో మీడియా గొంతు బలహీనంగా ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. టీవీ మీడియా ప్రభుత్వానికి భయపడుతుందని మాకు అర్థమైంది. అయితే, ఎందుకు భయపడుతుందో తెలియడం లేదు.

ఈసారి మేం 'అలయన్స్ ఫర్ మీడియా ఫ్రీడం' పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాం. కొన్ని తీర్మానాలు కూడా ఆమోదించాం. రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే పరిస్థితిపై చర్చించేందుకు మొదట మేం ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నాం. అరసు కేబుల్‌లో నచ్చని చానెల్స్ ప్రసారాలను నిలిపివేయడం, మీడియాపై పరువు నష్టం దావాలు వేయడంపై చర్చిస్తాం.

అంతేకాకుండా, ఈ సమస్యలను నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్, ఎడిటర్స్ గిల్డ్‌ల దృష్టికి తీసుకెళ్తాం. ట్రాయ్‌ని కూడా సంప్రదిస్తాం. మీడియాపై రాష్ట్రంలో జరిగిన దాడులపై పుసక్తం తీసుకొస్తాం.

కోర్టుల్లో పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యరీతిలో న్యాయబద్దంగా ఇవన్నీ చేయాల్సి ఉంది. ఈ కాలాన్ని జయలలిత హయాంతో పోల్చలేం. ఇప్పటికైతే అణచివేత ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీన్ని ఎదుర్కోకపోతే పరిస్థితి మరింత క్షీణిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

దేశవ్యాప్తంగా, తమిళనాడులో పరిస్థితి..

దేశం మొత్తం మీడియాను అదుపు చేసే పరిస్థితే కనిపిస్తోంది. భారత్‌లోని పలు ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే తమిళనాడులో పరిస్థితి అంత దారుణంగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులను హత్య చేశారు. కానీ, అలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కాలేదు.

జయలలిత హయాంలో కొందరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. నక్కీరన్ పత్రిక కార్యాలయంలో ఒక జర్నలిస్టును చంపేశారు. డీఎంకే హయాంలోనే దినకరన్ పత్రిక కార్యాలయంపై జరిగిన దాడిలో ముగ్గురు విలేఖరులు చనిపోయారు.

1992కు ముందు దేశంలో ఒక్క జర్నలిస్టు హత్య కూడా జరగలేదు.

1992 తర్వాత ఇటీవల షుజాత్ బుఖారీ సహా దేశంలో ఇప్పటి వరకు 48 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.

మొదట్లో ఫ్రీలాన్సర్లు, జిల్లాలలో పనిచేసే జర్నలిస్టులు మాత్రమే హత్యకు గురయ్యే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గౌరీ లంకేశ్, షుజాత్ బుఖారీలాంటి ఉద్ధండ జర్నలిస్టులను, పెద్దస్థాయి హిందీ మీడియా విలేఖరులను కూడా హత్య చేశారు.

ముఖ్యంగా రాజకీయాలు, అవినీతి, మానవహక్కులు, హింసకు సంబంధించిన వార్తలను సేకరించే జర్నలిస్టులే ఎక్కువగా హత్యకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు తమిళనాడులో మాత్రం ఎదురుకాలేదు.

ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు ఎలా దిగజారుతోందో 'రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్' తెలిపింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను 'అర్బన్ నక్సలైట్స్'గా అభివర్ణించడం ఆనవాయితీగా మారింది.

కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్.. జర్నలిస్టులపై ఇలాంటి భాషే వాడుతుంటారు.

నక్సలైట్లు.. జర్నలిస్టులను అడవుల్లోకి తీసుకెళ్లి శిక్షణ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, అవన్నీ అబద్ధాలే. జర్నలిస్టులను ఉద్దేశిస్తూ ఆయన ఒకసారి వ్యభిచారులు అనే పదం కూడా వాడారు.

వారి పార్టీ రాష్ట్రంలో బలహీనమైంది. ఆ వాస్తవం కప్పిపుచ్చేందుకే హెచ్.రాజా, పొన్ రాధాకృష్ణన్ లాంటి వారు ఇలా మాట్లాడుతుంటారు.

ఫొటో సోర్స్, FACEBOOK / PG / KALAIGNAR89

మీడియాకూ బాధ్యత ఉంది

మీడియాకు కూడా బాధ్యత ఉంటుంది. సరైన ఆధారాలు లేకుండా వార్తలు ప్రచురించడం/ ప్రసారం చేయడం సరికాదు.

కనీసం ఎడిటర్‌కు అయినా ముందస్తుగా వివరాలు ఇవ్వాలి. ఒకసారి ద హిందూలో అవయవాల మార్పిడి వార్తా కథనంలో డాటా తప్పుగా వచ్చింది. దీనిపై అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నన్ను పిలిచి అడిగారు. దీంతో వెంటనే స్పందించి మేం మరుసటి రోజు సవరణ వార్త ప్రచురించాం. ఎందుకంటే ఒక వార్తను ప్రచురించడంలో మేం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి కదా.

(బీబీసీ ప్రతినిధి మురళీధరన్ కాశీవిశ్వనాథన్‌కు ఎన్.రామ్ చెప్పిన విషయాల ఆధారంగా)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)