హిమా దాస్: పంట పొలాల్లో పెరిగిన నిన్నటి ఫుట్‌బాల్ ప్లేయర్.. నేడు 400 మీటర్ల రేసులో స్వర్ణపతక విజేత

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు భారతదేశం మొదటి వన్డేలో ఇంగ్లండ్‌ను తన సొంతగడ్డపై ఓడిస్తుండగా, ట్వీటర్లో ట్రెండ్ అయింది ఆరు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ కాదు, సెంచరీ చేసిన రోహిత్ శర్మా కాదు.
అసోంకు చెందిన 18 ఏళ్ల హిమా దాస్ పేరు.
దానికి కారణం ఆమె ఫిన్లాండ్లోని టాంపెరెలో ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ పోటీల 400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించడమే.
ఐఏఏఎఫ్ ట్రాక్ పోటీలలో భారతదేశానికి చెందిన అథ్లెట్ ఒకరు స్వర్ణపతకం సాధించడం ఇదే మొదటిసారి. గతంలో భారతదేశానికి మహిళా అథ్లెట్ ఎవరూ జూనియర్ లేదా సీనియర్ విభాగంలో, ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ఏ స్థాయిలోనూ ఇప్పటివరకు స్వర్ణ పతకం గెలుచుకోలేదు.
ఈ పోటీలో 35వ సెకను వరకు హిమ మొదటి మూడు స్థానాలలో కూడా లేదు. కానీ తర్వాత వేగం పెంచిన ఆమె, చరిత్ర సృష్టించింది.
ఈ పోటీలో హిమా దాస్ 51.46 సెకెన్లతో స్వర్ణపతకాన్ని గెల్చుకోగా, రొమేనియాకు చెందిన ఆండ్రియా మిక్లోస్ రజతాన్ని, అమెరికాకు చెందిన టేలర్ మేన్సన్ కాంస్యం గెల్చుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
రెండేళ్లలో ఫుట్‌బాల్ ప్లేయర్ నుంచి ప్రపంచ అథ్లెటిక్స్‌కు..
హిమ తండ్రి అసోం రాష్ట్రం నగావ్ జిల్లాలో ఒక చిన్న రైతు.
2016 వరకు హిమా దాస్‌కు అథ్లెటిక్స్ పరిచయమే లేదు. నిజానికి ఆమె ఫుట్‌బాల్ ప్లేయర్.
2016 అసోం రాష్ట్ర చాంపియన్ షిప్ పోటీల్లో 100 మీటర్ల పోటీలో పాల్గొని రెండో స్థానంలో నిలవడంతో ఆమె పేరు ఒక్కసారి వెలుగులోకి వచ్చింది.
అక్కడి నుంచి ఆమె అతి వేగంగా విజయాలు సాధిస్తూ వచ్చింది.
గత ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 400 మీటర్ల పరుగు పందెంలో ఆమె ఆరోస్థానంలో నిలిచింది. ఆ టోర్నమెంట్లో ఆమె 51.32 సెకన్లలో రేసు పూర్తి చేసింది.
ఇటీవలే గువాహటిలో ముగిసిన అంతర్రాష్ట చాంపియన్‌షిప్ పోటీలలో కూడా ఆమె స్వర్ణపతకాన్ని సాధించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ 400 మీటర్ల హీట్స్‌లో ఆమె 52.25 సెకెన్లతో మొదటి స్థానంలో నిలిచింది.
బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో కూడా హిమ దాస్ 52.10 సెకన్లలో రేసు పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది.
స్వర్ణపతకం సాధించిన హిమా దాస్‌కు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శుభాకాంక్షలుతెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హిమా దాస్ సాధించిన విజయం స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)