పాకిస్తాన్: లాహోర్‌ చేరిన నవాజ్ షరీఫ్... అదుపులోకి తీసుకున్న అధికారులు

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్షను అనుభవించేందుకు బ్రిటన్ రాజధాని లండన్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఏడేళ్ల కారాగార శిక్ష పడిన నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యమ్ కూడా పాకిస్తాన్‌కు వచ్చారు. నవాజ్ షరీఫ్, మర్యమ్ లాహోర్ విమానాశ్రయానికి చేరుకోగానే వారిని పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

లండన్‌లో ఆస్తులకు సంబంధించిన అవినీతి కేసులో గత వారం షరీఫ్‌కు శిక్ష ఖరారైంది.

షరీఫ్ మూడు పర్యాయాలు ప్రధానిగా చేశారు. గత సంవత్సరమే ఆయన పదవీచ్యుతులయ్యారు. ఆయనకు 67 సంవత్సరాలు.

''మన దేశంలో వ్యవస్థలోనే మరో వ్యవస్థ ఉందని మనం అనుకొనేవాళ్లం. ఇప్పుడు వాస్తవానికి వ్యవస్థను మించిన వ్యవస్థ ఉంది'' అని షరీఫ్ పాక్ సైన్యాన్ని ఉద్దేశించి ఇటీవల లండన్‌లో తన పార్టీ 'పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్)' మద్దతుదారులతో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Twitter/Maryam Nawaz Sharif

ఫొటో క్యాప్షన్,

శుక్రవారం అబుధాబి విమానాశ్రయంలో మర్యమ్, నవాజ్ షరీఫ్

లాహోర్‌లో షరీఫ్ మద్దతుదారులు విమానాశ్రయం వద్దకు చేరుకోకుండా నిలువరించేందుకు వేల మంది పోలీసులను మోహరించారు. షరీఫ్ మద్దుతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు కంటెయినర్లు ఏర్పాటు చేశారు.

లాహోర్‌లో తమ కార్యకర్తలను వందల మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకొన్నారని పీఎంఎల్‌-ఎన్ గురువారం పేర్కొంది.

శుక్రవారం అబుధాబిలో విమానం మారడానికి వేచి ఉన్న సమయంలో షరీఫ్ బీబీసీతో మాట్లాడారు. ''మా కార్యకర్తలను పెద్దసంఖ్యలో ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకొంటోంది. దేశమంతటా ఇలాగే చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 25న జరిగే ఎన్నికలకు విశ్వసనీయత ఏముంటుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP

ప్రజల కోసమే: షరీఫ్

ఎన్నికల తరుణంలో పాక్ క్లిష్ట స్థితిలో ఉందని, తాను పాక్ ప్రజల కోసమే స్వదేశానికి తిరిగి వస్తున్నానని షరీఫ్ చెప్పారు.

షరీఫ్‌కు జైలు శిక్షను జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబీ) కోర్టు విధించింది. తీర్పుపై అప్పీలు చేసి, బెయిలుకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందు షరీఫ్ కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంటుందని బీబీసీ ప్రతినిధి ఇలియాస్ ఖాన్ తెలిపారు. ఎన్నికల తర్వాత నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు కూడా షరీఫ్ సన్నాహాలు చేస్తుండొచ్చు.

ఎన్నికల్లో పోటీచేయకుండా షరీఫ్‌పై నిషేధం ఉంది. శిక్ష ఖరారైన తర్వాత మర్యమ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

దాదాపు 18 ఏళ్ల క్రితం కూడా ఒక కేసులో షరీఫ్‌కు జైలు శిక్ష పడింది. అయితే అప్పట్లో సౌదీ అరేబియా చొరవతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయన క్షమాభిక్ష పొంది, ప్రవాస జీవితం గడిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)