అనంతపురం: గెర్దావ్ కార్మికులు ఎలా మరణించారు?

  • 15 జూలై 2018
గెర్దావ్ పరిశ్రమ

అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని గెర్దావ్ స్టీల్ ప్లాంట్‌లో కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకై.. గురువారం నాడు ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనలో పరిశ్రమ భద్రత, నిర్వహణ లోపం బట్టబయలు అయ్యాయని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో జరిగిన ఇలాంటి ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొందరు అనారోగ్యం పాలయ్యారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి, మృతుల కుటుంబాలకు కంటి తుడుపు చర్యగా అంతో ఇంతో విదిలించి, చేతులు దులుపుకోవడం యాజమాన్యానికి అలవాటు అయిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో పరిశ్రమ యాజమాన్యం విఫలమైందని కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేశాయి.

ఈ పరిశ్రమలో అలైడ్ స్టీల్ ఉత్పత్తి జరుగుతుంది. దాదాపు రెండు వేల మంది కార్మికులు మూడు షిఫ్ట్‌లలో వివిధ భాగాల్లో పనిచేస్తారు. ఇందులో కేవలం 1000మంది మాత్రమే కంపెనీ ఉద్యోగులు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ కూలీలుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.

విష వాయువు ఎలా లీకైంది?

ముడి ఇనుమును కరిగించే ప్రక్రియలో భాగంగా వివిధ రకాల రసాయనాలు, మిశ్రమాలను కలిపి వేడిచేస్తారు. ఇదంతా బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో జరుగుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్.. లాంటి విష వాయువులు విడుదలవుతాయి.

ఈ వాయువులను అత్యంత నాణ్యత, భద్రత ప్రమాణాలతో చేసిన పైప్ లైన్ ద్వారా బాయిలర్‌లో ఉంచి, వేడి గాలులను, విషపూరిత వాయు శాతాన్ని తగ్గించి, వాతావరణం కాలుష్యం కాకుండా చూస్తారు.

కానీ ఇందులో కార్బన్ మోనాక్సైడ్‌ను తిరిగి పరిశ్రమలో వినియోగిస్తారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చిన వెంటనే అది.. శరీరంలో ఉన్న ఆక్సిజన్‌ను హరించివేస్తుంది. బాధితులు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణిస్తారు.

"వారంరోజులుగా మా అబ్బాయి చెబుతూనే ఉన్నాడు... లోపల ఏదో సమస్యలు తలెత్తాయి, రిపేరింగ్ జరుగుతోంది అని. ఇప్పుడు ఎన్ని డబ్బులిచ్చినా మా అబ్బాయి తిరిగిరాడు కదా. కన్న కొడుకు చనిపోయి బాధలో ఉంటే కనీసం యాజమాన్యం నుంచి ఒక్కరూ కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు. ఆ కంపెనీలో మానేసి సెల్‌ఫోన్ రిపేరింగ్ షాపు పెట్టుకుందామని అనుకున్నాడు. ఇంతలోనే ఇలా జరిగింది" అని అప్రెంటీస్‌గా పనిచేస్తూ మృతిచెందిన మనోజ్ కుమార్ తల్లి రాజ్యలక్ష్మి బాధపడ్డారు.

ఇలాంటి వాయువులు పరిశ్రమల నుంచి వాతావరణంలోకి వెలువడకుండా ఆపగలిగే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ విషవాయువు తీసుకెళ్లే పైప్ లైన్ భద్రతను తరచూ పరిశీలించకపోవడం, గ్యాస్ లీకైన వెంటనే గుర్తించే డిటెక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి.

కానీ ఈ పరిశ్రమలో కార్మికులు పనిచేసే రోలింగ్ మిల్ విభాగంలో గ్యాస్ లీక్ కావడంతో అక్కడికక్కడే ఆరుగురు మరణిoచారు. విషపూరిత వాయువులు వెలువడే ప్రమాదం పొంచిఉన్న ప్రదేశంలో పనిచేసేవారు ఆక్సిజన్ సిలిండర్‌తో కూడిన మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. కానీ.. అలాంటి భద్రతా సామగ్రిని కార్మికులు ఉపయోగించలేదు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఫ్యాక్టరీ యాజమాన్యం అత్యంత గోప్యంగా ఉంచుతోంది.

విషపూరిత వాయువులు, వేడి ఆవిరిని రవాణా చేసే పైప్‌ల నాణ్యతను తరచూ పరిశీలించాల్సి ఉంటుంది. కార్మికులకు.. ఇందుకు సంబంధించిన సూచనలు చేయాల్సిన బాధ్యత పైఅధికారులదే.

పరిశ్రమలో భద్రతాప్రమాణాలు పరిశీలించాల్సిన ప్రభుత్వ ఆధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

'కారణమేంటో ఇప్పుడే చెప్పలేం'

ఇప్పుడే ప్రమాదానికి కారణమేంటో చెప్పడం తొందరపాటు చర్యే అవుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ కృష్ణమూర్తి బీబీసీకి తెలిపారు.

''కార్మికులు పనిచేసే చోట కార్బన్ మోనాక్సైడ్ లీకైంది. అది పీల్చిన నలుగురు కార్మికులు చనిపోయారు. వాళ్లకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించాం. కానీ, వాళ్లను కాపాడలేకపోయాం.'' అని పేర్కొన్నారు.

బాధిత కుటుంబాలకు అధికారులు చెప్పిన దానికంటే ఎక్కువ పరిహారమే ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు.

బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరలో నష్టపరిహారం అందేలా చూస్తామని తాడిపత్రి ఆర్డీవో మలోలా బీబీసీకి తెలిపారు.

''సంఘటన స్థలాన్ని పరిశీలించాం. అందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేశాం. ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.'' అని ఆయన బీబీసీకి చెప్పారు.

బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందిస్తామని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. కంపెనీ ప్రతినిధులతో చర్చించి మృతుల కుటుంబాలకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఫ్యాక్టరీ ఎవరిది?

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం జంబులపొదలో 2007లో బ్రెజిల్‌కు చెందిన గెర్దావ్ కంపెనీ కల్యాణి గ్రూప్‌కు చెందిన కంపెనీతో కలసి జేఎస్‌డబ్ల్యూ కంపెనీ నిర్వహిస్తున్న పరిశ్రమను కొనుగోలు చేసింది.

అనంతరం కల్యాణి గ్రూప్ షేర్లను కూడా గెర్దావ్ సొంతం చేసుకుంది. బ్రెజిల్ కేoద్రంగా నడిచే గెర్దావ్ కంపెనీ శాఖలు అమెరికాతోపాటు యూరప్, ఆసియా ఖండాల్లో కూడా ఉన్నాయి. 14 దేశాల్లో ఈ కంపెనీ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఏడాదికి 25 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: మిలిటెంట్ల బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మెజారిటీ: ఎగ్జిట్ పోల్ అంచనా

దొంగలు పడ్డారు.. డబ్బులు వదిలేసి, ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

నా చిన్నప్పుడే మా అమ్మను నాన్న చంపేశాడు... ఎందుకంటే?

పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ వాదనలో నిజమెంత...

ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?