ఏడాదిలో రెండు సార్లు ఐఐటీ పరీక్ష పెడితే ఎదురయ్యే సమస్యేంటి?

  • సరోజ్ సింగ్
  • బీబీసీ ప్రతినిధి

2019లో ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.

ఈ విషయాన్ని ప్రకటించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్, అలా చేయడం వల్ల విద్యార్థులకు ఒకే ఏడాదిలో రెండు అవకాశాలు లభిస్తాయని అన్నారు. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు.

2018 వరకూ ఉన్న విధానంలో విద్యార్థులు మూడేళ్లలో మూడు సార్లు మెయిన్స్ పరీక్ష రాయవచ్చు. రెండు సార్లు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు కూర్చోవచ్చు. కానీ 2019 నుంచి ఇదే అవకాశం విద్యార్థులకు ఇక ఆరుసార్లు లభిస్తుంది.

మొదటిసారి పరీక్ష జనవరిలో, రెండోసారి పరీక్ష ఏప్రిల్‌లో జరుగుతుంది. అయితే జేఈఈ అడ్వాన్సుడు పరీక్ష ఏడాదికి ఒకేసారి జరుగుతుంది.

పరీక్షల కోసం ఒక తేదీని నిర్ణయించరు. జేఈఈ మెయిన్స్ పరీక్ష 15 రోజుల వరకూ జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థి తన వీలునుబట్టి పరీక్ష రాయవచ్చు.

జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష 2019 జనవరిలో ఉంటుంది. కానీ అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ నుంచే ప్రారంభమవుతుంది.

పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే విడుదల అవుతాయి.

కొత్త ప్రక్రియలో సమస్యలేంటి?

పరీక్షలపై ప్రభుత్వ ప్రకటనతో ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొదట విద్యార్థుల బోర్డ్ పరీక్షల సన్నాహాలపై దీని ప్రభావం ఏమేరకు ఉంటుందనే ప్రశ్న వస్తోంది.

"ఏడాదికి రెండు సార్లు పరీక్ష రాయడం వల్ల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఏడాది నష్టపోయే సమస్య లేకపోవడం వల్ల వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది" అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ వినిత్ జోషి బీబీసీతో అన్నారు.

జనవరిలో ఐఐటీ పరీక్ష ఉంటుంది, అదే నెలలో ఫలితాలు కూడా విడుదలవుతాయి. కానీ, విద్యార్థి ఆ పరీక్షలో పాస్ కాకుంటే, తర్వాత ఏడాది బోర్డ్ పరీక్షలకు అతడు మానసికంగా సిద్ధం కాగలడా?

ఈ ప్రశ్నకు జవాబుగా "ఏడాదికి రెండు సార్లు పరీక్ష రాయడం తప్పనిసరి చేస్తారు. ఎవరు పరీక్ష రాయాలనుకుంటే వాళ్లు రాయచ్చు. ఎవరైనా ఒక పేపరు సరిగ్గా రాయలేకపోతే, వాళ్లు రెండోసారి బాగా ప్రిపేరై పరీక్ష రాయవచ్చు" అని వినీత్ జోషి చెప్పారు.

విద్యార్థుల అభిప్రాయం

కానీ ఇదే ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్ష పాస్ అయిన ప్రిన్స్ కుమార్... వినీత్ జోషి మాటలతో ఏకీభవించడం లేదు.

"ఒక పరీక్షలో ఫెయిల్ అయిన విషయం తెలిశాక, రెండో పరీక్షకు మళ్లీ అదే విధంగా ప్రిపేరై కూర్చోడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. మొదటి సారి ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి మానసికంగా చాలా కుంగిపోతాడు" అని ప్రిన్స్ చెప్పారు.

కొత్త విధానం గురించి మరో విద్యార్థి రాబిన్ భండారీ తన అభిప్రాయం బీబీసీకి తెలిపారు.

"ఇప్పుడు కోచింగ్ సెంటర్లు సంబరాలు చేసుకుంటాయి. వాటి వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. వాళ్లంతా అప్పుడే సిలబస్ పూర్తి చేసేపనిలో పడ్డారు. ఏడాదంతా వాళ్ల సెంటర్ల ముందు విద్యార్థులు క్యూ కట్టడం ఖాయం" అని రాబిన్ అన్నారు.

సీట్లు పెరుగుతాయా?

ఏడాదికి రెండు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్ష పెట్టడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.

కానీ ప్రిన్స్, రాబిన్ మాత్రం సీట్లు పెంచకుండా రెండు సార్లు పరీక్ష పెట్టడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడానికి బదులు, మరింత పెరుగుతుందని అంటున్నారు.

ఇలా చేయడం వల్ల పరీక్ష కటాఫ్ మార్కులు పెరుగుతాయని, దానితోపాటు విద్యార్థుల మధ్య కాంపిటీషన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. వీటిలో 12 వేల సీట్లు ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు జేఈఈ పరీక్ష రాస్తున్నారు.

"ప్రభుత్వం వైపు నుంచి ఇది మంచి ప్రయత్నమే. విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఏడాదికి రెండు సార్లు పరీక్ష రాయడం విద్యార్థులకు, ఐఐటీలకు కూడా మంచిది. ఇప్పుడు విద్యార్థులు సన్నాహాలపై ఎక్కువ దృష్టి పెడతారు. మిగతా విద్యార్థులతో కాకుండా తమతో తాము పోటీపడతారు" అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ధీరజ్ సంఘీ చెప్పారు.

నార్మలైజేషన్ అంటే?

కానీ ఈ కొత్త నిర్ణయం వల్ల వేరే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రొఫెసర్ సంఘీ చెప్పారు. పరీక్ష ప్రశ్నపత్రాల నార్మలైజేషన్ ఎలా ఉంటుంది? అనేది అతిపెద్ద సవాలుగా నిలుస్తుందని తెలిపారు.

నిజానికి, ఒక పరీక్షను ఎక్కువసార్లు పెట్టినప్పుడు, ప్రశ్నపత్రం డిఫికల్టీ లెవల్ రకరకాలుగా ఉంటుంది.

ఒక పేపర్ సులభంగా ఉంటే, ఇంకో పేపర్ కష్టంగా ఉండచ్చు. కానీ కష్టమైన పేపర్లో కాస్త తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థిని సులభంగా వచ్చిన పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థితో సమానం చేస్తే, దానిని నార్మలైజేషన్ అంటారు.

ఇది ప్రపంచమంతా ఉంది. ఒక పరీక్షను ఎక్కడైనా చాలా సార్లు పెట్టాల్సివస్తే, అక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ పాటిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు కూడా ఐఐటీ పరీక్ష కోసం చాలా సెట్ల ప్రశ్నపత్రాలు తయారవుతున్నాయి.

కానీ సీబీఎస్ఈ మార్కుల్లో నార్మలైజేషన్ చేయడం లేదు.

"ఇప్పుడు జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు, చాలా రోజులపాటు జరుగుతూ ఉంటే, అలాంటప్పుడు నార్మలైజేషన్ లేకుండా ఉండడం అనేది జరగదు. దీనికోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చాలా మంది నిపుణుల అవసరం ఉంటుంది. వాళ్లను ఎక్కడనుంచి తీసుకొస్తారు? ఎలా చేస్తారు? అదేదాని గురించి ఆలోచించాలి" అని సంఘీ అన్నారు.

అయితే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సమస్యలను అధిగమించడంలో ఏమేరకు విజయవంతం అవుతుంది? ఎలాంటి ఏర్పాట్లు చేయగలుగుతుంది? తెలియాలంటే 2019 జనవరి వరకూ వేచిచూడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)