ప్రెస్‌రివ్యూ: ఆంధ్రప్రదేశ్ చేపకు ఏమైంది?

చేపలు ఆంధ్రప్రదేశ్ ఫార్మాలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ చేపలంటే ఎగబడే ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఏపీ నుంచి వచ్చిన చేపలంటేనే బెంబేలెత్తుతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

ఏపీ నుంచి దిగుమతి అయ్యే చేపలను ఫార్మాలిన్‌ ద్రావణంతో నిల్వ చేస్తున్నారన్న వార్తలు రావడంతో వివిధ రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతకుముందు కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ ఏపీ చేపల్లో ఫార్మాలిన్‌ ఆనవాళ్లను అక్కడి అధికారులు గుర్తించి పెద్ద ఎత్తున చేపలను సీజ్‌ చేశారు.

ఈ ఏడాది జూన్‌లో కేరళ రాష్ట్ర ఆహార భద్రత విభాగం అధికారులు ఏపీ నుంచి దిగుమతి అయిన 20 వేల కేజీల చేపలపై ఫార్మాలిన్‌ ఆనవాళ్లు ఉన్నాయంటూ సీజ్‌ చేశారు.

మరోవైపు మన రాష్ట్రానికి చెందిన రైతులు తాము ఫార్మాలిన్‌ను వినియోగించడం లేదని, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక వ్యాపారులే దాన్ని వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దేశంలోనే చేపల ఎగుమతిలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న ఏపీ చేప తాజా పరిణామాల కారణంగా దిక్కుతోచక బిక్కుబిక్కు మంటోంది. ఎగుమతులు తగ్గిపోయి తమ ఉపాధికి ఎక్కడ దెబ్బపడుతుందోనని చేపల చెరువుల రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చేపలను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ఫార్మాలిన్‌ ద్రావణాన్ని చేపలపై పూతగా పూస్తుంటారు. రైతులెవరూ ఈ విధానాన్ని అవలంబించరు. చేపలను కొనుగోలు చేసిన వ్యాపారులే ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.

పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ 300 నుంచి 400 లారీల చేపల లోడ్లు పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, మేఘాలయ, అసోం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఒక్కో లారీలో 10 నుంచి 12 టన్నుల చేపలు ఎగుమతి చేస్తుంటారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో చదువుకు సై.. కొలువుకు నై

అమెరికా కొలువులు ఇక అందని ద్రాక్ష కానున్నాయి. అక్కడ భారత విద్యార్థులకు, వర్క్‌ వీసాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

మూడేళ్ల క్రితమే మొదలైన ఈ తేడా ఈ ఏడాది ఏకంగా రెట్టింపైంది. అమెరికాలో ఉద్యోగం చేయొచ్చన్న ఆశతో లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్తున్నా.. ఆ దేశం ఏటా జారీ చేస్తున్న వర్క్‌ వీసాల సంఖ్య మాత్రం 85 వేలు దాటడం లేదు. దీంతో మున్ముందు ఉద్యోగాలు దొరక్క భారతీయ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను ఏటేటా పెంచుకోవడం ద్వారా గతేడాది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు 70 కోట్ల డాలర్ల టర్నోవర్‌ను దాటాయి. ఇలా అమెరికా ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ఆకర్షిస్తూనే మరోవైపు హెచ్‌1బీ వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధిస్తోంది.

ప్రస్తుతం ఉన్న 85 వేల హెచ్‌1బీ వీసాల గరిష్ట పరిమితి భవిష్యత్‌లోనూ కొనసాగితే 2020 నుంచి ఏటా లక్ష మంది భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుందని కొలంబియా బిజినెస్‌ స్కూల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌ సూరజ్‌ బజాజ్‌ అంచనా వేశారు.

ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదని అమెరికాలో బ్యాంకింగ్‌ నిపుణుడు శ్రీనివాసన్‌ రాధాకృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వీసా గడువు ముగుస్తున్న దశలో రెన్యువల్‌ కోసం వస్తున్న దరఖాస్తులను కూడా యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సీఐఎస్‌) నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తోందని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ సర్కారు ‘పులి’ జూదం

తెలంగాణలో అటవీ శాఖ అధికారులు పులి జూదం ఆడుతున్నారు. పులులు కవ్వాల్ అడవికి వస్తాయో? లేదా? తెలియకపోయినా.. అభయారణ్యం అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తుండగా.. ప్రస్తుతం అవి ఉన్న ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 మండలాల పరిధిలోని అడవిని అభయారణ్యంగా (టైగర్‌ జోన్‌గా) గుర్తించారు. జిన్నారం, దండేపల్లి, కడెం, ఖానాపూర్‌, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ (యూ), ఇచ్చోడ, తిర్యాణి, జైనూర్‌, బెల్లంపల్లి (కొంతభాగం) మండలాలు ఇందులో ఉన్నాయి.

ఇందులో 892 చదరపు కిలోమీటర్లు పులులు సంచరించే కీలక (కోర్‌) ప్రాంతంగా.. 1,123 చదరపు కిలోమీటర్లు అవి తిరిగే అవకాశం ఉన్న (బఫర్‌) ప్రాంతంగా గుర్తించారు.

ప్రాణహిత తీరంలోని సిర్పూరు, బెజ్జూరు, కౌటాల, దహెగాం, వేమనపల్లి, కోటపల్లి మండలాల అడవులను కారిడార్‌గా తేల్చారు. మహారాష్ట్రలోని తాడోబా, మధ్యప్రదేశ్‌లోని ఇంద్రావతి పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులను సంరక్షించాలనే లక్ష్యంతో అభయారణ్యాన్ని గుర్తించినా ఆ లక్ష్యం నెరవేరలేదు.

వేసవిలో నీటి సమస్య కారణంగా తాడోబా అభయారణ్యం నుంచి పక్కనే ఉన్న వార్ధా నదిని దాటుకుని కొమరంభీం జిల్లాలోని సిర్పూరు అడవుల గుండా పులులు తెలంగాణలోకి వస్తున్నాయి. సిర్పూరు అడవుల్లోకి ఇలా 2015లో వచ్చిన పులి (ఫల్గుణ) ఈ మూడేళ్లలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది.

మొత్తంగా సిర్పూరు అటవీ ప్రాంతంలో చిన్నవి, పెద్దవి కలిపి తొమ్మిది పులులున్నట్టుగా నిర్ధారణైంది. మూడేళ్ల కాలంలో వీటిలో ఒక్కటి కూడా టైగర్‌ జోన్‌కు చేరుకోలేదు.

మరోవైపు అధికారులు నిధులన్నింటినీ టైగర్‌జోన్‌కే వెచ్చిస్తూ.. పులులు సురక్షితంగా ఉంటున్న కారిడార్‌ ప్రాంతాన్ని మాత్రం విస్మరిస్తున్నారని ఈనాడు పేర్కొంది.

స్పోర్ట్స్‌ కోటా కేసులో మరొకరి అరెస్టు

స్పోర్ట్స్‌ కోటాలో మెడికల్‌ సీట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై ఏసీబీ మరో కేసు నమోదుచేసిందని సాక్షి వెల్లడించింది.

జూడో అసోసియేషన్‌ సెక్రటరీ కైలాసం యాదవ్‌ను అరెస్టు చేసింది. కైలాసం యాదవ్‌ ద్వారా స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట రమణ డబ్బులు వసూలు చేసినట్టు ఏసీబీ నిర్ధారించింది.

స్పోర్ట్స్‌ కోటాలో 12 సీట్లు కేటాయించగా.. అందులో నాలుగు సింగిల్‌ జూడో విభాగంలో ఉన్నట్టు ఏసీబీ తెలిపింది. ఈ నాలుగు సీట్లు వరంగల్‌ జిల్లాకు చెందిన విద్యార్థులకే ఇచ్చారని గుర్తించింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్‌ అథారిటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారి డిప్యూటీ డైరెక్టర్‌ వెంకట రమణే అని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

సింగిల్‌ జూడో స్పోర్ట్స్‌ కోటా కింద నాలుగు సీట్లు కేటాయింపు జరిగింది. ఈ విభాగంలో ఉన్న వరంగల్‌కు చెందిన విద్యార్థి తోట రుద్రేశ్వర్‌ నుంచి రూ.4 లక్షలను జూడో అసోసియేషన్‌ సెక్రటరీ కైలాసం యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

దీంతో రుద్రేశ్వర్‌ తండ్రి సునీల్‌ కుమార్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షలు కైలాసం యాదవ్‌కు ఇచ్చామని, మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో కేసు నమోదు చేసిన ఏసీబీ.. వరంగల్‌లోని కైలాసం యాదవ్‌ నివాసంతో పాటు స్పోర్ట్స్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో జూడో అసోసియేషన్‌ కార్యదర్శి కైలాసం యాదవ్‌ను ఏసీబీ అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)