అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?

  • లిజ్జీ మెక్‌నెయిల్
  • బీబీసీ రేడియో 4

ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి? ఈ ప్రశ్న మీలో ఎప్పుడైనా మెదిలిందా?

బీబీసీ రేడియో 4లో ప్రసారమయ్యే 'మోర్ ఆర్ లెస్' కార్యక్రమం శ్రోత ఒకరు ఈ ప్రశ్న అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించేముందు.. అసలు 'జంతువు'(యానిమల్) అనే పదానికి అర్థం తెలుసుకోవాలి.

ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువులోని నిర్వచనం ప్రకారం.. ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తీసుకుని జీవిస్తూ... ప్రత్యేకంగా జ్ఞానేంద్రియాలు.. నాడీ వ్యవస్థ కలిగి ఉండి.. చర్యలకు తక్షణం ప్రతిస్పందించే స్వభావం కలిగిన జీవులను జంతువులు(యానిమల్స్) అంటారు.

అంటే.. క్షీరదాలు(పాలిచ్చేవి).. క్షీరదాలు కానివి.. సకశేరుకాలు(వెన్నెముక కలిగినవి).. అకశేరుకాలు(వెన్నెముక లేనివి).. గుడ్లను పొదిగేవి.. ప్రసవం ద్వారా పిల్లలు పెట్టేవి అన్నీ ఆ కోవలేకే వస్తాయి.

పై ప్రశ్నకు సమాధానం కోసం ప్రయత్నంలో భాగంగా కొన్ని జీవుల జననాల లెక్కలను చూద్దాం.

వైల్డ్‌లైఫ్ బ్రిటన్ అనే సంస్థ అంచనాల ప్రకారం.. యూకేలో 4 కోట్ల ఆడ అడవి కుందేళ్లు ఉన్నాయి.

యూకేలోని ఒక్కో కుందేలు తన జీవిత కాలంలో సగటున ఏడు సార్లు పిల్లలను పెడుతుంది(ఈత అంటారు). ఒక్కో ఈతలో మూడు నుంచి ఏడు పిల్లలు పుడతాయి.

అలా ఒక్కో కుందేలు ఏడు సార్లు పిల్లలను పెడితే.. అందులో ఒక్కోసారి ఐదు పిల్లల చొప్పున పుట్టాయి అనుకుంటే... ఆ దేశంలో సగటున ఒక్క రోజులో 19,17,808 కుందేళ్లు పుడుతున్నాయన్నమాట.

గమనిక: అడవి కుందేళ్ల జీవిత కాలం ఒకటి నుంచి రెండేళ్ల మధ్యలో ఉంటుంది.

ఆ లెక్కన చూస్తే కుందేళ్లు మందలు మందలుగా పెరిగిపోవాలి. కానీ.. కుందేలు పిల్లల మరణాల రేటు అధికంగా ఉంటుంది.

కాబట్టి మన లెక్కలకు, వాస్తవ సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉండవచ్చు.

ఫొటో క్యాప్షన్,

లండన్ జూలో హంబోల్డ్ పెంగ్విన్

ఇకపోతే.. భూమ్మీద చాలా తక్కువ సంఖ్యలో ఉన్న జీవుల జాబితాలో హంబోల్డ్ జాతి పెంగ్విన్లు కూడా ఉన్నాయి.

పెరూ, చీలీ దేశాల తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పెంగ్విన్లు.. ఒక్కోసారి రెండు చొప్పున ఏడాదికి పలుమార్లు గుడ్లు పెడతాయి.

కొన్ని సర్వేల ప్రకారం.. ఏడాదిలో 14,400 హంబోల్డ్ పెంగ్విన్లు గుడ్లను పొదుగుతున్నాయి. సగటున చూస్తే రోజుకు 40 పిల్లలు ప్రపంచంలోకి వస్తున్నాయి.

ఈ పెంగ్విన్లతో పోల్చితే కోడి పిల్లల సంఖ్య అనేక రెట్లు ఉంటుంది.

ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహారం మరియు వ్యవసాయం సంస్థ(ఎఫ్‌ఏఓ) అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 6.2 కోట్ల కోడి పిల్లలు పుడుతున్నాయి.

ఫొటో క్యాప్షన్,

కోళ్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల గుడ్లు పెడుతున్నాయి.

కోళ్ల లెక్క భారీగానే ఉంది కదా.

తేనెటీగల లెక్క అంతకు మించి ఉంటుంది.

వేసవి కాలంలో ఒక్క రాణి తేనెటీగ రోజుకు 1,500 గుడ్లు పెడుతుందని అంచనా.

2018 జనవరిలో యూకే వ్యాప్తంగా 2,47,461 తేనెతుట్టెలు ఉన్నాయని ఇంగ్లాండ్‌లోని 'నేషనల్ బీ యూనిట్' ప్రయోగాత్మకంగా జరిపిన సర్వేలో తెలిపింది.

ఒక్కో తేనె తుట్టెకు ఒక రాణి ఈగ ఉంటుంది.

ఆ లెక్కన పరిస్థితులు అనుకూలిస్తే.. ఎండాకాలంలో రోజుకు 37,11,91,500 తేనెటీగలు పుడతాయి.

ఈ లెక్కలన్నీ చూస్తుంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా? లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీకి చెందిన మోనికా బోమ్ కూడా అదే అంటున్నారు.

"ఇంకా అనేక జీవజాతుల పునరుత్పత్తి వ్యవస్థపై మనకు సరైన అవగాహన లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జంతువుల జననాల సంఖ్యను కచ్చితంగా చెప్పడం సాధ్యమయ్యే పని కాదు" అని అంటారు ఆమె.

అయితే.. క్వీన్ మేరీస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆక్సెల్ రోస్‌బర్గ్ మాత్రం ఆ లెక్కలను అంచనా వేయవచ్చని చెబుతున్నారు.

"కొన్ని జంతువులు బరువులో భారీగా ఉంటాయి. కొన్ని చాలా తేలికగా ఉంటాయి. సంఖ్య విషయానికి వచ్చినప్పుడు ఆ భారీ జీవులు తక్కువగా ఉంటాయి. చిన్న జీవులు చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు ఏనుగు బరువులో 1000వ వంతు ఉండే చిన్న జీవుల సంఖ్య.. ఏనుగుల కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. అలా పెద్ద జంతువుల జననాలను లెక్కించగలిగితే.. చిన్న జీవుల పుట్టుకనూ అంచనా వేయవచ్చు" అని ఆక్సెల్ వివరించారు.

భూగోళం మీద అత్యధిక సంఖ్యలో ఉండే జంతువుల్లో నెమటోడ్ జాతి సూక్ష్మ జీవి ఒకటి.

నేల మీద ఒక చదరపు మీటరు స్థలంలో 30 లక్షల నెమటోడ్లు ఉంటాయని అంచనా.

ఈ నెమటోడ్ జాతికి చెందిన 'సీ ఎలీగాన్స్' అనే సూక్ష్మ జీవుల సంఖ్యపై అధ్యయనాలు విస్తృతంగా జరిగాయి.

ఈ జీవులు గంటకు దాదాపు 5 గుడ్లు పెడతాయని తేలింది.

ప్రొఫెసర్ ఆక్సెల్ రోస్‌బర్గ్ అంచనా ప్రకారం.. ఈ జీవులు 100 గుడ్లు పెడితే అందులో 1 గుడ్డు మాత్రమే పొదగబడుతుంది.

అలా భూమి మీద రోజుకు 600 క్వింటిలియన్ల(6 తర్వాత 20 సున్నాలు) సీ ఎలీగాన్స్ నెమటోడ్లు పుడుతున్నాయి.

ఆ సంఖ్య భూమి మీద మాత్రమే. అవి నీటిలోనూ జీవిస్తాయి. అవన్నీ లెక్కిస్తే ఇంకా ఎన్నో రెట్లు ఉంటుంది.

ఇప్పటి వరకు రోజుకు 40 హంబోల్డ్ పెంగ్విన్లు.. 6.2 కోట్ల కోళ్లు.. 19,17,808 కుందేళ్లు(యూకేలో), 37,11,91,500 తేనెటీగలు(యూకే) పుడుతున్నాయన్న అంచనాకు వచ్చాం.

భూగోళం మీద దాదాపు 77 లక్షల జంతుజాతులు ఉన్నాయని అంచనా. ఇంకా 99 శాతం సముద్ర గర్భాల్లో ఏఏ జీవులు ఉన్నాయో పరిశోధించాల్సి ఉంది.

కాబట్టి.. అన్ని రకాల జీవజాతుల జననాలను లెక్కించే వరకూ ఈ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)