ట్విటర్ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరు? నకిలీలెందరో తెలుసా?

ఫొటో సోర్స్, Twitter
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ట్విటర్ ఖాతాలు పరిశీలిస్తే లక్షలు, కోట్లలో ఫాలోవర్లు కనిపిస్తారు. మరి అదంతా వారి బలమేనా..? లేదంటే వాపా?..
కచ్చితంగా వాపేనంటోంది ట్విటర్ సంస్థ. మనుగడలో లేని, నకిలీ ఖాతాల వల్ల ఫాలోవర్ల సంఖ్య వాస్తవానికి మించి ఉంటోందన్నది ఆ సంస్థ మాట. ఇప్పుడు వాటన్నిటినీ ప్రక్షాళన చేసే పనిలో పడింది.
ట్విటర్ అంటే పూర్తి నమ్మకం ఏర్పరచడానికి గాను ఈ చర్యలు చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది.
ఇప్పటికే లక్షలాది ఖాతాలను లాక్ చేయడంతో పలువురు ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
అంతెందుకు ట్విటర్ సంస్థ సొంత ఖాతా ఫాలోవర్ల సంఖ్య కూడా 77 లక్షల మేర తగ్గిపోయిందంటే ఈ మిషన్ ఏ స్థాయిలో చేపట్టారో అర్థం చేసుకోవచ్చు.
ట్విటర్ అకౌంటర్ల ప్రక్షాళన కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ ఫాలోవర్ల సంఖ్యలో భారీ పతనాన్ని చూస్తున్నారు.
అమెరికాలో కేట్ పెర్రీ, లేడీగాగా, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వంటివారి ఖాతాలకు ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తెలుగు ప్రముఖుల ట్విటర్ బలాబలాల్లోనూ మార్పులు రానున్నాయి.
ఫాలోవర్ల సంఖ్య అనేది పారదర్శకంగా ఉండాలని, అందులో కచ్చితత్వం ఉన్నప్పుడే పారదర్శకత సాధ్యమవుతుందని ట్విటర్ 'లీగల్, పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ విభాగాధిపతి' విజయ గద్దె అంటున్నారు.
ట్విటర్ అంటే విశ్వాసం పాదుకొల్పడానికి, ఆరోగ్యకరమైన సంభాషణలను ప్రోత్సహించడానికి ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ట్విటర్ అకౌంట్ ఎప్పుడు లాక్ చేస్తారు?
ఏ ట్విటర్ ఖాతా తీరులోనైనా ఆకస్మిక మార్పులు కనిపిస్తే ఆ ఖాతాదారును సంప్రదిస్తారు.. అప్పుడు వారు తమ ఖాతాను ధ్రువీకరించుకోవడంలో విఫలమై పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోలేకపోతే అలాంటి ఖాతాలను లాక్ చేస్తారు. లాక్ చేసిన ట్విటర్ అకౌంట్‌ను లాగిన్ చేయడం కుదరదు.
స్పామ్, హానికరమైన ఖాతాలను కూడా గుర్తించే సాంకేతికతను ట్విటర్ ఇటీవల కాలంలో పెంచుకుంటూపోతోంది. ఇలా గుర్తించిన అన్ని ఖాతాలను లాక్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా లాక్ చేసిన ఖాతాలను కొద్దిరోజులుగా ఇతరుల ఫాలోవర్ల జాబితాల నుంచి తొలగించడం ప్రారంభించారు. దీంతో ఫాలోవర్ల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.
వాడుకలో లేనివి, స్పామ్, ఆటోమేటెడ్, పెయిడ్ ఖాతాలను ఫాలోవర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు.
ఫొటో సోర్స్, Twitter/bbc
ఈ ఏడాది మేలో ట్విటర్ వారానికి సగటున 99 లక్షల స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్లను గుర్తించింది
కేవలం ఫాలోవర్ల సంఖ్యేనా ట్వీట్లు, రీట్వీట్లు, లైకులపైనా ప్రభావం ఉంటుందా?
దూషణలు, రెచ్చగొట్టే మాటలు, వేధించే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాలు, వదంతులు.. విద్వేష, హింసాంత్మక వైఖరితో పెట్టే కామెంట్లు, పోస్టింగులు సోషల్ మీడియాలో ఎక్కువవుతున్నాయి. దీనికి ట్విటర్ కూడా అతీతమేమీ కాదు. ఆటోమేషన్ ద్వారా ఖాతాలు నిర్వహిస్తూ ట్విటర్లో మంచి వాతావరణాన్ని చెడగొడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఇలాంటి స్పామ్, హానికర అకౌంట్లను గుర్తించేందుకు పెద్ద ఎత్తున మానవ వనరులను, సాంకేతికతను ట్విటర్ సమకూర్చుతోందని ట్విటర్ 'ట్రస్ట్, సేఫ్టీ' విభాగ వైస్ ప్రెసిడెంట్ డెల్ హార్వే తెలిపారు.
ట్విటర్ ట్రస్ట్, సేఫ్టీ విభాగం చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మేలో ట్విటర్ వారానికి సగటున 99 లక్షల స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్లను గుర్తించింది. గత ఏడాది సెప్టెంబరులో వారానికి సగటున ఇలాంటివి 32 లక్షల అకౌంట్లను మాత్రమే గుర్తించారు. అంటే... ట్విటర్ ఈ మేరకు స్పామ్, ఆటోమేటెడ్ అకౌంట్ల ఏరివేతను ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది.
ఇలా గుర్తించిన ఖాతాలను లాక్ చేస్తారు. లాక్ చేసిన ఖాతాల్లోకి లాగిన్ కాలేరు కాబట్టి వాటి నుంచి కొత్తగా ట్వీట్లు, కామెంట్లు, లైకులు, రీట్వీట్లకు అవకాశం ఉండదు. దాంతో దూషణలు వంటివన్నీ తగ్గుతాయి.
ఫొటో సోర్స్, Getty Images
అసలైన ఫాలోవర్లో కాదో తెలుసుకోవడం ఎలా?
ఒక ట్విటర్ అకౌంట్‌కు ఉన్న ఫాలోవర్లలో అసలైనవారు ఎంతమందో తెలుసుకోవడానికి పలు మార్గాలున్నాయి. ఇందులో కొన్ని ట్విటర్ అధికారిక టూల్స్ కాగా మరికొన్ని ట్విటర్‌తో సంబంధం లేనివి. ట్విటర్‌తో సంబంధం లేని టూల్స్‌ను ఉపయోగించుకుని తెలుసుకున్నది ప్రాథమిక అవగాహనకు తీసుకోవచ్చు. కచ్చితంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ట్విటర్ అధికారిక టూల్ 'ట్విటర్ కౌంటర్'(Twitter Counter) వాడొచ్చు.
* ట్విటర్ కౌంటర్‌ను ఉపయోగించి ఫాలోవర్ల సంఖ్యలో పెరుగుదలను విశ్లేషించుకోవచ్చు. నెల రోజుల పాటు ఉచితంగా వాడుకునే అవకాశం ఉన్నా ఆ తరువాత నుంచి దీనికి రుసుం చెల్లించాలి. ఫాలోవర్లలో పెరుగుదల, పోస్టింగ్ యాక్టివిటీ, కొత్తగా ఎప్పుడెంతమంది ఫాలోవర్లు వచ్చారు, ఎంత మంది తగ్గారు, ఎంగేజ్మెంట్ వంటినే అనేక రకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఫాలోవర్ల సంఖ్యలో క్రమంగా పెరుగుదల ఉంటే అనుమానించాల్సిందేమీ ఉండదు.. అలా కాకుండా ఒకట్రెండు రోజుల్లోనే హఠాత్తుగా ఫాలోవర్ల సంఖ్య పెరిగితే వారిని పెయిడ్ ఫాలోవర్లుగా భావించాల్సి ఉంటుంది.
* 'ట్విటర్ ఆడిట్' అనే టూల్ సహాయంతో ఒక అకౌంట్‌కు ఉన్న మొత్తం ఫాలోవర్లు, అందులో ఫేక్ ఫాలోవర్ల సంఖ్య తెలుసుకోవచ్చు. అయితే, ఇది సగటు(యావరేజ్) గణాంకాలను మాత్రమే అందిస్తుంది. మొత్తం ఫాలోవర్లలో 5,000 శాంపిళ్లను తీసుకుని అందులో అసలెన్ని, నకిలీ ఎన్ని నిర్ధారించి ఆ లెక్కను మొత్తం ఫాలోవర్ల సంఖ్యకు వర్తింపజేసి నకిలీ ఫాలోవర్ల లెక్క చెబుతుంది. అయితే, ఇది ట్విటర్ అధికారిక టూల్ కాదు. వీరు అందించే గణాంకాలకు తమకు సంబంధం ఉండదని ట్విటర్ గతంలోనే తెలిపింది.
* 'ఫేక్ ఫాలోవర్స్ చెక్'.. ఇది యాక్టివ్ ఫాలోవర్లు ఎందరు? యాక్టివ్‌గా లేనివారెందరు? నకిలీ ఎందరు? అనేది శాతాల్లో చూపిస్తుంది. దీని సహాయంతో చెక్ చేసుకోవాలంటే తొలుత మీ ట్విటర్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. సొంత అకౌంట్ చెక్ చేయడంతో పాటు రోజుకు అదనంగా మరో మూడు ఖాతాలను ఉచితంగా చెక్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ఖాతాలు చెక్ చేయాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, TwitterAudit
‘ట్విటర్ ఆడిట్’ ప్రకారం మహేశ్ బాబు ట్విటర్ ఖాతా విశ్లేషణ
తెలుగు ప్రముఖుల సంగతేంటి?
తెలుగు రాజకీయ, సినీ ప్రముఖుల్లో చాలామందికి ట్విటర్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజా పరిణామాలతో వీరిలో ఎవరి ఫాలోవర్ల సంఖ్య ఎంత తగ్గనుందో తేలాల్సి ఉంది.
నారా చంద్రబాబునాయుడు: 40 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 'ట్విటర్ ఆడిట్' ప్రకారం విశ్లేషిస్తే ఇందులో 16,50,789 మంది ఫేక్ ఉన్నట్లు చూపుతోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 7 లక్షల మందికిపై ఫాలోవర్లు ఉన్నారు. 'ట్విటర్ ఆడిట్' ప్రకారం విశ్లేషిస్తే ఇందులో 2,76,191 మంది ఫేక్ ఉన్నట్లు చూపుతోంది.
కేటీఆర్: 13 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉండగా ట్విటర్ ఆడిట్ అందులో 3,85,190 ఫేక్‌గా చూపుతోంది.
పవన్ కల్యాణ్: 31 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. అందులో 15,82,267 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపుతోంది.
మహేశ్ బాబు: 66 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా అందులో 31,64,384 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపించింది.
జూనియర్ ఎన్టీఆర్: 24 లక్షలకు పైగా ఫాలోవర్లు.. అందులో 7,88,973 ఫేక్ అని ట్విటర్ ఆడిట్ చూపించింది.
..కాగా ట్విటర్ ఆడిట్ 5 వేల శాంపిళ్లను తీసుకుని ట్వీట్ల సంఖ్య, ఎంత తరచుగా చేస్తున్నారు వంటి వివరాలతో విశ్లేషిస్తుంది. ఇది పూర్తి కచ్చితమైనది కాదని.. అయితే, ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నవారు ప్రాథమికంగా విశ్లేషించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ‘ట్విటర్ ఆడిట్’ వెబ్సైట్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్లో.. నేడు అమ్మగా మరో ఫైనల్లో
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- 2300 ఏళ్ల కిందట అరిస్టాటిల్ వర్ణించిన జలాంతర్గామి ఇది!
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- వాట్సాప్, ఫేస్‌బుక్‌లపై రోజుకు మూడు రూపాయల పన్ను
- వాట్సాప్: భారత మొబైల్ పేమెంట్ మార్కెట్‌ను శాసిస్తుందా?
- 'రేప్ పోర్న్': ఆ అమ్మాయి బట్టలు చింపుతున్న వీడియోను మీరెందుకు చూశారు?
- సిమ్ కార్డు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు.. డేటా వాడుకోవచ్చు!
- ఏ వెలుగు మంచిది? సహజమైనదా, కృత్రిమమైనదా?
- డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం
- అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లు వాడితే ప్రేమలో పడతారా?
- స్మార్ట్‌ఫోన్‌తో ఆడుకునే మీ పిల్లలు పెన్సిల్‌ను సరిగ్గా పట్టుకోగలరా?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- ఎమోజీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)