ఆకాశంలో విమానం.. కాక్‌పిట్‌లో 'సిగరెట్' తాగిన కో- పైలట్

  • 15 జూలై 2018
విమానం Image copyright Reuters

ఆకాశంలో విమానం వెళ్తున్నపుడు కాక్‌పిట్‌లో పైలట్ పొగ తాగితే ఏమవుతుంది? తాజాగా ఎయిర్ చైనా విమానంలో ఓ కో-పైలట్ అదే పనిచేశారు. అతడు చేసిన నిర్వాకం వల్ల ప్రయాణికులు, సిబ్బంది అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

మంగళవారం హాంకాంగ్ నుంచి చైనాలోని డాలియన్ నగరానికి వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

విమానంలో ఒక్కసారిగా ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఆగిపోయింది. ఆక్సీజన్ స్థాయి పడిపోయింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులను విమానం సీలింగ్ నుంచి జారవిడిచారు.

విమానం అత్యవసరంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే 6,500 మీటర్లు కిందికి దిగింది. ఊహించని ఈ పరిణామంతో ఏం జరుగుతోందో అర్ధంకాక ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

కో-పైలట్ చేసిన నిర్వాకం వల్లనే ఇదంతా జరిగిందని చైనా పౌర విమానయాన సంస్థ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఇ-సిగరెట్‌‌తో పొగ తాగుతున్న కో-పైలట్.. తాను వదిలే పొగ ప్రయాణికుల క్యాబిన్‌లోకి వెళ్లకుండా చేసేందుకు ఫ్యాన్‌ను ఆపేయాలని ప్రయత్నించాడు. అయితే.. ఫ్యాన్‌ను కాకుండా.. పొరపాటున ఎయిర్ కండిషన్‌ని స్విచాఫ్ చేశాడు.

దాంతో విమానంలో అంతా కంగారుపడ్డారు.

ఆక్సిజన్ మాస్కులను ప్రయాణికులకు అందించి, అందరూ సీటు బెల్టు పెట్టుకోవాలంటూ సిబ్బంది సూచించారు.

అప్రమత్తమైన పైలట్ విమానాన్ని 6,500 మీటర్లు (21,000 అడుగులు) కిందికి తీసుకొచ్చారు.

తర్వాత ఎయిర్ కండిషన్‌ను స్విచాఫ్ చేశారన్న విషయం తెసుకుని.. తిరిగి స్విచాన్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానం మళ్లీ నిర్ణీత ఎత్తుకు వెళ్లింది.

Image copyright WEIBO
చిత్రం శీర్షిక విమానంలో ఆక్సిజన్ మాస్కులు జారవిడిచిన చిత్రాలను కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులను, సిబ్బందిని కాపాడేందుకు వీలుగా పైలట్ విమానాన్ని కిందికి తీసుకువస్తారని చైనా పౌర విమానయాన సంస్థ భద్రతా అధికారి కియావో యిబిన్ తెలిపారు.

సిబ్బంది నిర్లక్ష్యపూరిత చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎయిర్ చైనా సంస్థ హెచ్చరించింది.

విమానాల్లో పొగతాగడంపై 2006లోనే చైనా నిషేధం విధించింది.

అయినా చైనా విమానాల్లో పైలట్లు పొగ తాగుతున్నారన్న ఆరోపణలున్నాయి.

2015లోనూ ఓ విమానంలో కాక్‌పిట్ నుంచి పొగతాగుతున్నట్టుగా గాఢమైన వాసన వస్తోందంటూ కొందరు ప్రయాణికులు ఫిర్యాదులు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)