మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా

  • ఇమ్రాన్ ఖురేషి
  • బీబీసీ ప్రతినిధి

పిల్లలకు విద్యాబోధన మాతృభాషలో చేయాలా లేక ఇంగ్లిష్ మీడియంలోనా? ఈ అంతులేని చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి.

కర్ణాటక కూడా ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ అంశం మరోసారి వివాదంగా మారి చర్చకు కారణమైంది.

ఇంగ్లిష్ మీద ఉన్న క్రేజ్, ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో ఇంగ్లిష్ ప్రావీణ్యానికి ప్రాధాన్యం ఉండటం ఇందుకు ప్రధాన కారణం. కానీ కొందరు నిపుణుల అభిప్రాయాలు దీనికి భిన్నంగా ఉన్నాయి.

భావి భారత పౌరులకు వారి మాతృభాషలో బోధించటం ఎంత ముఖ్యమైనదో చెప్పటానికి.. కొందరు భాషా, విద్యా నిపుణులు మెదడు అభివృద్ధి, విద్య, భాష, బహు భాషత్వాలపై తాజా పరిశోధనలను ఉటంకిస్తున్నారు.

వీటి ప్రకారం ఆ భాష అధికార భాష కానవసరం లేదు.

తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితిగతులతో నిమిత్తం లేకుండా.. ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకుంటే తమ పిల్లలకు ఉద్యోగాల మార్కెట్‌‌లో ప్రవేశించటానికి వీసా లభిస్తుందన్న ఆశతో ఉన్నారు.

దీంతో తక్కువ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చేర్చటానికి భారీ ఎత్తున డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ దశలో నిపుణుల నుంచి ఈ స్పందన వచ్చింది.

‘‘అసలు దీనిని బోధనా మాధ్యమం అనటం కూడా సరికాదు. బోధన అనేది ఒక నిర్బంధ పదం. పిల్లలు అర్థం చేసుకోగల మాధ్యమంలో వారికి బోధించాల్సిన అవసరముంది. కానీ.. ఇక్కడ అలా అర్థం చేసుకునే మాధ్యమం అనేది రాజకీయ ప్రజాకర్షణకు ఒక పనిముట్టుగా మారింది’’ అని ప్రొఫెసర్ అనితా రామ్‌పాల్ బీబీసీతో చెప్పారు. ఆమె దిల్లీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాజీ డీన్.

ప్రభుత్వ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ కొందరు తరచుగా వినిపించే డిమాండ్ గురించి మాట్లాడుతూ.. ‘‘మనకు అసలు ఒక భాషా విధానమనేదే లేదు. మూడు భాషల సూత్రం ఆ కాలపు అవసరాల కోసం రూపొందించినది. అది ఒక ప్రభుత్వ విధానం కాదు. అయినా ఈ సూత్రాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదు. దీనిని కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే అమలు చేశారు’’ అని ఆమె పేర్కొన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న అంశం.. విద్యారంగ నిపుణులు, సాధారణ ప్రజల్లో ఈ చర్చను రాజేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే అనేక భాషలు, యాసలు మాట్లాడే ఈ దక్షిణాది రాష్ట్రంలో ఇది పెద్ద వివాదానికి దారితీసింది.

కన్నడ అనుకూల కార్యకర్తల అభిప్రాయాలకు విరుద్ధంగా.. రాష్ట్రంలోని 28,847 ప్రభుత్వ కన్నడ ప్రాథమిక పాఠశాలల్లో 1,000 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనను ప్రయోగాత్మక ప్రాతిపదికన ప్రారంభిస్తామని కుమారస్వామి ప్రకటించారు.

ముఖ్యమంత్రి ప్రకటన.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు భారీగా మారిపోతుండటాన్ని నివారించే ప్రయత్నం మాత్రమేనని కర్ణాటక అధికారులు చెప్పారు.

తమ వివరాలు వెల్లడించరాదన్న షరతు మీద వారు బీబీసీ ప్రతినిధితో మాట్లాడారు.

గత మూడు, నాలుగేళ్లలో కన్నడ, ఉర్దూ, ఇతర ప్రాంతీయ మాధ్యమాల్లో నడిచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నుంచి దాదాపు 3.5 లక్షల మంది పిల్లలు మానేశారు. అదే సమయంలో ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో అంతే సంఖ్యలో పిల్లలు చేరటం పెరిగింది.

అయితే.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టటం ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నమని కన్నడ అభివృద్ధి సంస్థ (కేడీఏ) అభిప్రాయపడుతోంది.

‘‘మేం ఇంగ్లిష్‌ని ఒక భాషగా బోధించటానికి వ్యతిరేకం కాదు. కానీ ఒక బోధనా మాధ్యమంగా ఇంగ్లిష్‌ని వ్యతిరేకిస్తున్నాం’’ అని కేడీఏ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.జి.సిద్ధరామయ్య బీబీసీతో పేర్కొన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నరహళ్లి బాలసుబ్రమణ్య పలు ఉదాహరణలతో దీనిని బలపరిచారు.

‘‘ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ద్వారా సృజనాత్మక ప్రతిభకు ప్రోత్సాహం లభించదు. ప్రఖ్యాత రాజకీయవేత్త, ఇంజనీర్ ఎం.విశ్వేశ్వరయ్య, అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ యు.ఆర్.రావు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు.. పదో తరగతి వరకూ కన్నడ మాధ్యమంలోనే చదువుకున్నారు. అయినా వారు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు’’ అని ఆయన చెప్పారు.

‘‘అర్థం చేసుకోగల భాషలోనే రాయటం, చదవటం చేస్తే.. రెండో భాష నేర్చుకోవటం పిల్లలకు ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. మన దేశంలో భాషా బోధనాశాస్త్రం వంటిదేమీ లేదు. ఒక చిన్నారి రెండో, మూడో భాషను నేర్చుకోవటానికి మారే క్రమంలో మాతృభాష పోషించే బోధనాత్మక పాత్రను మనం అర్థం చేసుకోవటం లేదు’’ అని ప్రొఫెసర్ రామ్‌పాల్ అభిప్రాయపడ్డారు.

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గిరిధర్ రావు మరో అడుగు ముందుకు వేసి.. తెలంగాణలో మాట్లాడే తెలుగుకు, ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడే తెలుగు వేర్వేరని ప్రస్తావిస్తున్నారు.

‘‘ఇంట్లో చిన్నారి ‘పానీ’ (నీళ్లు) అంటాడు. కానీ తరగతి గదిలో అది ‘జల్’ (జలం) అవుతుంది. కాబట్టి.. చిన్నారి అర్థం చేసుకోగల భాషలో బోధించటం అవసరం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇందుకోసం.. విద్యారంగ పరిశోధనలు ప్రాతిపదికగా ఉపాధ్యాయుల్లో సామర్థ్య నిర్మాణం అవసరం. ‘‘లేదంటే.. ప్రాథమిక పాఠశాల స్థాయిలో.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన చాలా మంది పిల్లలకు.. క్లాస్ రూమ్‌లో బోధించే భాష, పాఠ్యపుస్తకాల్లోని భాష కూడా ఇంగ్లిష్ మీడియం లాగానే విదేశీ భాష అవుతుంది’’ అని డాక్టర్ రావు వ్యాఖ్యానించారు.

కన్నడ మీడియంలో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 35 శాతం మంది దళిత సమాజాల నుంచి, 60 శాతం మంది ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) నుంచి వచ్చారని, మిగతా వారు సమాజంలోని పేద వర్గాల నుంచి వచ్చారని రెండేళ్ల కిందట నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది’’ అని కర్ణాటక విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఇంగ్లిష్ మీడియం మీద జరుగుతున్న ఈ చర్చలో నాణేనికి రెండోవైపు ఉంది.

‘‘ప్రభుత్వ పాఠశాలల్లో.. సమాజంలోని నిరుపేద వర్గాల నుంచి వచ్చే మెజారిటీ విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. కారణం వారికి ఇంగ్లిష్ బోధించకపోవటం. ఇంగ్లిష్ బోధిస్తామని చెప్పుకునే నాసిరకం స్కూళ్లలో వారిని తల్లిదండ్రులు చేర్చుతారు. వారు డబ్బు ఖర్చుపెట్టి పోగొట్టుకుంటారు. కాబట్టి.. ప్రభుత్వం తన స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టటం ఈ వర్గాల వారికి ప్రయోజనం కలిగిస్తుంది’’ అని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.

పాయ్ అభిప్రాయం తప్పుకాదు. ఉదాహరణకి.. హరీశ్ (28) అనే వ్యక్తికి ఐదున్నరేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారి బెంగళూరులోని ఒక కన్నడ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.

‘‘మేం ఇంటర్వ్యూలకి వెళ్లినపుడు వాళ్లు కన్నడలో ప్రశ్నలు అడగరు. ఇంగ్లిష్‌లో అడుగుతారు. కాబట్టి నా వంటి వాళ్లకి ఉద్యోగాలు రావు. మేం కొరియర్ కంపెనీలకు డెలివరీ బాయ్స్‌గా మారతాం. నేను కానీ, నా కుటుంబం కానీ.. ప్రైవేటు స్కూళ్లకి రూ. 40,000 - రూ.50,000 డొనేషన్లు కట్టగలే స్తోమత లేదు. ఈ స్కూల్లో మేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు’’ అని ఆయన చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించటం పట్ల హరీశ్ సంతోషంగా ఉన్నారు. మామూలుగా అయితే తనకు అందుబాటులో లేనిది ప్రభుత్వ పాఠశాల ద్వారా అందుతుంది.

కానీ.. ఆయన కూతురు.. ప్రైవేటు స్కూళ్లలోని తన సహ విద్యార్థులకన్నా బాగా నేర్చుకోగలదా?

ఆంధ్రప్రదేశ్‌లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ (ఏపీఎఫ్) ఐదేళ్ల పాటు (2008-2013 మధ్య) నిర్వహించిన ఒక అధ్యయనాన్ని డాక్టర్ రావు ఉటంకిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుకోవటానికి సిద్ధమైన కొందరు పిల్లలకు ఏపీఎఫ్ ఫీజులు చెల్లించింది. వారు ఎలా చదువుకుంటున్నారనేదానిని పరిశీలించి.. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్న వారు ఎలా చదువుకుంటున్నారనే దానితో పోల్చటానికి ఇలా చేసింది. తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లిష్ అంశాల్లో ఈ రెండు వర్గాల వారి మధ్య ఎలాంటి తేడా లేదని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

మాతృ భాష లేదా పిల్లలకు అర్థమయ్యే భాష కన్నా ఇంగ్లిష్ మీడియం బోధనకు ప్రాధాన్యం ఇవ్వటానికి అనుకూలంగా, వ్యతిరేకంగా చేస్తున్న వాదనలు ప్రాధమిక పాఠశాల విద్యా రంగంలో నెలకొన్న భారీ సంక్షోభాన్ని చూపుతున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే విద్యారంగానికి సంస్కరణలు అవసరం. దేశ ఆర్థిక రంగానికి 1991లో చేపట్టిన సంస్కరణల వంటి సంస్కరణలు ప్రాథమిక విద్యా రంగంలో అవసరం.

అయితే.. విద్యారంగానికి అటువంటి సంస్కరణలు అందించగల డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎవరైనా ఉంటారా అన్నది ప్రశ్న. ప్రొఫెసర్ రామ్‌పాల్ అన్నట్లుగా విద్యారంగాన్ని ఇలా ఎడతెగని ‘రాజకీయ ప్రజాకర్షణ’కు గురించేయటం కొనసాగుతూనే ఉంటుందా?

వీడియో క్యాప్షన్,

హిజాబ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న విద్యార్థినులు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)