ప్రెస్ రివ్యూ: కత్తి మహేశ్‌, పరిపూర్ణానందలను ఎందుకు బహిష్కరించామంటే.. గవర్నర్‌కు కేసీఆర్ వివరణ

  • 16 జూలై 2018
Image copyright facebook.com/TelanganaCMO
చిత్రం శీర్షిక గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం కలిశారు.

హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, శాంతికి విఘాతం కలగవద్దనే కత్తి మహేశ్, పరిపూర్ణానందలను ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారని 'సాక్షి' పేర్కొంది.

ఆదివారం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిసిన కేసీఆర్.. ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు.

కత్తి మహేశ్‌ అనే వ్యక్తి శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద ఆందోళనకు దిగడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వివాదంలో కొన్ని వార్తా చానళ్లు వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారని సాక్షి రాసింది.

Image copyright Getty Images

రోబోటిక్‌ చికిత్సల్లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌‌

రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని, రోబోటిక్ సర్జరీలో శిక్షణ తీసుకునేందుకు దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు భాగ్యనరానికి బారులు తీరుతున్నారంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

ప్రస్తుతం ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ప్రసిద్ధ ఆసుపత్రులతో పోటీపడుతూ.. హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో వారానికి 24-30 వరకు రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి.

ఇక్కడి ఆరేడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. దాదాపు 22 మంది వరకు నిపుణులు ఈ తరహా శస్త్ర చికిత్సల్లో ప్రావీణ్యం పొందారు.

తొలుత అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న పలువురు వైద్యులు.. మిగతా వైద్యులకు ఇక్కడే శిక్షణ ఇవ్వడంతో అనతి కాలంలో నిపుణుల సంఖ్య పెరిగింది.

దేశంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్యులు.. శిక్షణ కోసం హైదరాబాద్‌కు బారులుదీరుతున్నారు. యశోద లాంటి ఆసుపత్రులు ఈ శిక్షణలో ఫెలోషిప్‌ కూడా అందిస్తున్నాయి.

గతంతో పోల్చితే ఈ చికిత్సల ఖర్చు కూడా 30-40 శాతం మేర తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు.

రోబో చేతులు తక్కువ కోతతో శరీరం లోపలికి ప్రవేశించి.. శస్త్ర చికిత్స పూర్తిచేయగలడం వల్ల గాయం త్వరగా నయమవుతుంది.

రక్తస్రావం కూడా తక్కువే. నొప్పి నివారణ మందులు కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. కచ్చితత్వమూ ఉంటుందని ఈనాడు వివరించింది.

Image copyright Getty Images

కేంద్రంపై మళ్లీ అవిశ్వాసం

''ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం, హామీల అమలులో మొండి వైఖరి నేపథ్యంలో... మోదీ సర్కారుపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించాం. దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను'' అంటూ దేశంలోని రాజకీయ పార్టీలకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

బుధవారం నుంచి సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌, వైసీపీ మినహా మిగిలిన పార్టీల నేతలకు చంద్రబాబు లేఖలు రాశారు.

''రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. రాజ్యసభ వేదికపై నాటి ప్రధాని ఇచ్చిన ఆరు హామీలు, విభజన చట్టంలో పొందుపరిచిన 11 విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాల అమలు అంతంత మాత్రంగానే ఉంది. 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇవ్వాల్సి ఉండగా.. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు, చమురు శుద్ధి కర్మాగారం - పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌; విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి పరచడం, అమరావతికి రైలు, రహదారి కనెక్టివిటీ, విశాఖ, విజయవాడ-గుంటూరు-తెనాలికి మెట్రో రైలు వంటి హామీల అమలు నాలుగేళ్లయినా మొదలే కాలేదు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా 142 సంస్థల ఆస్తులు-అప్పులను విభజించలేదు. దిల్లీలోని ఏపీ భవన్‌దీ ఇదే పరిస్థితి'' అని ఆ లేఖలో వివరించారు.

మేనిఫెస్టోలో సీమాంధ్రకు ఇచ్చిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు.

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలను టీడీపీ ఎంపీలు కోరారు. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీ కేకే తెలిపారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

బోనాలు Image copyright Getty Images

బోనమెత్తిన భాగ్యనరగం

హైదరాబాద్‌లో బోనాల పండుగ ఆదివారం వైభవంగా మొదలైంది. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడికి డప్పు చప్పుళ్లతో తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగిందంటూ 'నమస్తే తెలంగాణ' రాసింది.

ఆదివారం ఉదయం లంగర్‌హౌస్‌ చౌరస్తా నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు అమ్మవారికి పట్టువస్ర్తాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫల, పుష్పాలను సమర్పించారు.

అక్కడ నుంచి ప్రారంభమైన ఊరేగింపు పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాల మధ్య బడాబజార్ మీదుగా మధ్యాహ్నం కోటలోని ఆలయ పూజారి సర్వేశకుమార్‌చారి ఇంటికి చేరింది.

అనంతరం గోల్కొండ కోటలోని పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి అమ్మవారికి సిద్ధం చేసిన బోనాన్ని తీసుకొచ్చారు.

ఆలయ పూజారి ఇంట్లో తెల్లవారుజామనుంచి శుద్ధి, అలంకరణ, పూజా కార్యక్రమాలతో సిద్ధం చేసిన ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి గోల్కొండ కోటకు తొట్టెల ఊరేగింపు బైలెల్లింది.

ఊరేగింపులో 500 మంది కళాకారులు పాల్గొన్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)