బిహార్‌లో ఆంధ్రా చేపల కలకలం : రసాయనాలు పూసిన చేపలు తినొచ్చా.. తినకూడదా

  • అంజయ్య తవిటి
  • బీబీసీ ప్రతినిధి
చేపలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చేపల్లో క్యాన్సర్ కారక, విషపూరిత ఫార్మాలిన్ అనే రసాయనం ఆనవాళ్లు ఉన్నాయంటూ అస్సాం ప్రభుత్వం ఆ చేపలపై గత ఏడాది 10 రోజుల పాటు నిషేధం విధించింది. తాజాగా బిహార్‌లోనూ ఈ చేపల్లో రసాయనాలపై కలకలం రేగింది. ఏపీ నుంచి వచ్చిన చేపల్లో ఫార్మాలిన్ ఉన్నట్లు అక్కడ తేలింది.

ఈ పరిణామాలతో చేపలు తినాలంటే చాలామందిలో భయం కలుగుతోంది. అసలు చేపల్లో ఫార్మాలిన్ ఎందుకు కలుపుతారు?

నిజంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యే చేపలకు ఈ రసాయనాన్ని పూస్తున్నారా?

ఎవరైనా చేపలకు ఫార్మాలిన్ పూస్తే.. ఆ చేపలను గుర్తించడమెలా? ఫార్మాలిన్ పూసిన చేపలను తింటే ఏమవుతుంది?

ఈ ప్రశ్నలకు ముంబయిలోని 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ' పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎల్.ఎన్ మూర్తి అందిస్తున్న సమాధానాలు

ఆ చేప ఎలా ఉంటుంది?

  • సాధారణంగా ఫార్మాలిన్ కలిపిన చేపల వాసనలో తేడా కనిపిస్తుంది.
  • ఆ చేపలను చేతితో తాకినప్పుడు కాస్త గరుకుగా ఉంటాయి.
  • ఈ తేడాలు కనిపిస్తే ఫార్మాలిన్ కలిపినట్టు ఒక అంచనాకు రావచ్చు. కానీ, కచ్చితంగా చెప్పలేం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

మరి స్పష్టంగా గుర్తించేదెలా?

చేపల్లో ఫార్మాలిన్‌ ఆనవాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ' పరిశోధకులు ఓ కిట్ తయారు చేశారు.

చేపకు ఫార్మాలిన్‌ రసాయనం పూశారా.. లేదా అన్నది ఆ కిట్‌ సాయంతో 5 నిమిషాల్లోనే గుర్తించవచ్చని ఎల్.ఎన్ మూర్తి తెలిపారు.

"చిన్నప్పుడు భౌతిక శాస్త్రంలో లిట్మస్ పేపర్ పరీక్ష గురించి చదువుకున్నాం కదా.. అలాగే ఈ కిట్‌తో చేపలను పరీక్షించవచ్చు. ముందుగా ఆ కిట్‌లోని పేపర్ ముక్కతో చేపను రుద్దాలి. తర్వాత ఆ చేప మీద అదే కిట్‌లో ఉండే రసాయనం(కెమికల్) చుక్కలు వేయాలి. అప్పుడు ఫార్మాలిన్ ఉన్న చేప ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది" అని ఆయన వివరించారు.

అయితే ఈ కిట్‌ను 2017 డిసెంబర్‌లోనే కేంద్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఆవిష్కరించారు. కానీ.. ఇంకా అది బహిరంగ మార్కెట్‌లోకి రాలేదు.

ఆగస్టులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

అసలేంటీ ఫార్మాలిన్?

  • అత్యంత ప్రమాదకర వాయువుల్లో వర్ణరహిత ఫార్మాల్డిహైడ్(CH2O) ఒకటి.
  • ఆ వాయువును నీటితో కలిపితే ద్రవరూపంలోకి మారుతుంది. ఆ ద్రావణాన్నే ఫార్మాలిన్ అంటారు. ఇందులో 37 నుంచి 40 శాతం ఫార్మాల్డిహైడ్ ఉంటుంది.
  • మార్చురీలలో శవాలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఎంబాల్మింగ్‌లో ఈ రసాయనం వినియోగిస్తారు.
  • ఇది ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది. మ్యూజియంలలో కళేబరాలను నిల్వ చేసేందుకు కూడా వాడతారు.
  • చైనాలో కూరగాయలు, పండ్లు, చేపలు తాజాగా ఉండేందుకు కొందరు వ్యాపారులు ఈ ప్రమాదకర రసాయనం చల్లుతున్నారన్న విషయం 2012లో బయటపడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మ్యూజియంలలో జంతువుల కళేబరాలను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్‌ను వినియోగిస్తారు.

ఎంత ప్రమాదకరం?

  • ఫార్మాల్డిహైడ్‌కి, కేన్సర్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని 1987లో అమెరికా ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ(ఈపీఏ)కి చెందిన పరిశోధకులు గుర్తించారు.
  • 2011లో దీన్ని కేన్సర్ కారకాల జాబితాలో చేర్చారు.
  • శరీరంలోకి ఫార్మాలిన్ వెళ్తే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
  • 2018 ఏప్రిల్‌లో రష్యాలోని ఓ ఆస్పత్రిలో మహిళకు వైద్యలు సెలైన్‌కు బదులుగా.. ఫార్మాలిన్ ద్రావణాన్ని ఎక్కించడంతో ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయారు.

వైద్యులేమంటున్నారు?

ఫార్మాలిన్‌ ద్రావణం అత్యంత ప్రమాదకరమైందని హైదరాబాద్‌‌‌కు చెందిన సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ శంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

"అస్థిర కర్బన సమ్మేళనాలతో ఫార్మాల్డిహైడ్ వాయువు ఏర్పడుతుంది. ఆ వాయువుతో ఏర్పడే ఫార్మాలిన్ రసాయనం చాలా ప్రమాదకరమైంది. దాన్ని లోపలికి పీల్చితే తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దాని ప్రభావం కాలేయంపై తీవ్రంగా ఉంటుంది. ఆస్తమా బాధితులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బ్లడ్ కేన్సర్‌, గాల్ బ్లాడర్‌ కేన్సర్‌కు దారి తీయవచ్చు. చర్మానికి తాకితే దురద పెడుతుంది. శ్వాస, జీర్ణాశయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాసన పీల్చితే ఆయాసం, దగ్గు, వాంతులు, తలనొప్పి వస్తాయి. మెదడులోనూ సమస్యలు వస్తాయి" అని డాక్టర్ శంకర్ ప్రసాద్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

అస్సాం ఏం తేల్చింది

గువహాటిలోని ప్రయోగశాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేపలపై 2018 జూన్ 29న నిర్వహించిన పరీక్షల్లో కేన్సర్ కారక ఫార్మాలిన్ రసాయనం ఆనవాళ్లు బయటపడ్డాయని అస్సాం ప్రభుత్వం వెల్లడించింది.

10 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి మళ్లీ ఫార్మాలిన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలితే.. 'ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006' ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని మార్కెట్‌‌లో అమ్ముతున్న చేపల్లోనూ ఫార్మాలిన్ ఉన్నట్లు అప్పుడు గుర్తించారని ఎన్‌డీటీవీ ఒక కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

సముద్ర చేపల్లో ఎక్కువ

తాము ముంబయిలో 40 శాంపిళ్లను పరీక్షించగా.. 'బాంబే డక్' చేపలో మాత్రమే ఫార్మాలిన్ ఆనవాళ్లు కనిపించాయని శాస్త్రవేత్త మూర్తి తెలిపారు. బాంబే డక్ చేపకు కూడా ఫార్మాలిన్ పూశారని చెప్పలేమని.. సాధారణంగానే అరేబియా సముద్రంలో దొరికే ఆ చేపల్లో ఫార్మాలిన్ స్థాయి ఎక్కువగా ఉంటుందని ఆయన బీబీసీకి వివరించారు.

నిజానికి రసాయనం కలిపిన చేపలు చాలా తక్కువే ఉంటాయని.. మీడియాలో విస్తృతంగా కథనాలు రావడం వల్లనే ప్రజలు ఎక్కువ భయపడుతున్నారని మూర్తి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, cift

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ అధికారులు, మంత్రి ఆదినారాయణ రెడ్డి వివరణ తీసుకొనేందుకు బీబీసీ ఫోన్‌లో ప్రయత్నించింది. కానీ అటువైపు నుంచి స్పందన లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)