వాట్సాప్‌లో ఫేక్ న్యూస్: వదంతుల నియంత్రణకు వాట్సాప్ చేపడుతున్న చర్యలు ఏమిటి?

  • 16 జూలై 2018
వార్తా పత్రికల్లో వాట్సాప్ ప్రకటన Image copyright Getty Images
చిత్రం శీర్షిక నకిలీ వార్తలపై యూజర్లను అప్రమత్తం చేయటానికి వాట్సాప్ వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది

ఇండియాలో వాట్సాప్‌ వేదికగా నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిని కట్టడి చేయటానికి ఆ మెసేజింగ్ యాప్ పలు చర్యలు చేపట్టింది.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్.. నకిలీ మెసేజ్‌లను గుర్తించడానికి కొన్ని చిట్కాలు చెబుతూ.. జులై 10న భారతదేశంలోని ప్రముఖ హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషా వార్తా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది.

వినియోగదారులు ఆ యాప్ ద్వారా తమకు వచ్చే సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించటానికి వీలుగా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ని కూడా ప్రవేశపెట్టింది.

ఫార్వార్డ్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లో.. అది ఫార్వార్డ్ చేసిన మెసేజ్ అని సూచించే సమాచారం కూడా ఉంటుంది.


నకిలీ వార్తల ప్రమాదాన్ని వాట్సాప్ గుర్తించటానికి కారణమేమిటి?

వాట్సాప్ సందేశాల ద్వారా పిల్లల అపహరణలపై వదంతులు వ్యాప్తిచెంది పలుచోట్ల ప్రజలు అనుమానం వచ్చినవారిపై దాడులు చేసి చంపడంతో వివాదం మొదలైంది.

పిల్లలను కిడ్నాప్ చేసేవారు తిరుగుతున్నారంటూ పెద్దఎత్తున వదంతులు వ్యాపించడంతో మే నుంచి జూలై 13 మధ్య ఏకంగా 17 మందిని కిడ్నాపర్ల అనుమానంతో కొట్టి చంపారు.

వాట్సాప్‌లో వ్యాఅలాంటి మెసేజ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి బూటకపు సందేశాలని ప్రజలను నమ్మించడం చాలా కష్టంగా మారిందని పోలీసులు చెప్పారు.

‘‘బాధ్యతారహితమైన ప్రమాదకర సందేశాల’’ వ్యాప్తిని నివారించటానికి తక్షణమే చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం జులై 2న వాట్సాప్‌కు నిర్దేశించింది.


వాట్సాప్ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

భారత ప్రభుత్వం ఫిర్యాదుపై వాట్సాప్ స్పందిస్తూ.. ఈ హింసాత్మక చర్యలు తనను తీవ్ర ‘‘భయాందోళనలకు’’ గురిచేసిందంటూ.. ఈ సమస్యను పరిష్కరించటానికి తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.

‘‘మొదటి చర్యగా ఇంగ్లిష్, హిందీ, పలు ఇతర భాషల్లోని వార్తా పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తాం. ఈ కృషిని పెంచుతాం’’ అని వాట్సాప్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆ సంస్థ పలు వార్తా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో వాట్సాప్ వినియోగదారులు ఏదైనా సమాచారాన్ని వేరే వారికి పంపించేముందు సరిచూసుకోవాలని.. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించింది.

‘‘అనుమానాస్పద కథనాల్లో ఎక్కువ భాగం అసత్యాలు - కాబట్టి అలాంటి సందేశాలు నిజంగా నిజమేనా అనేది సరిచూసుకోవటానికి వేరే మార్గాల్లో తనిఖీ చేయండి’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.

Image copyright BBC Monitoring
చిత్రం శీర్షిక ఏదైనా మెసేజ్ ఫార్వార్డ్ చేసినదైతే.. ఆ విషయాన్ని సూచించే విధంగా ఒక ఫీచర్‌ని వాట్సాప్ ప్రవేశపెట్టింది

వాట్సాప్ వేదిక మీద అసత్యాల వ్యాప్తిని నివరించటం కోసం సమాచార వివరాలు సేకరించి విశ్లేషించే పరిశోధన బృందాలకు 50,000 డాలర్లు కేటాయించినట్లు ఆ సంస్థ చెప్తోంది.

ఈ ప్రణాళికలో భాగంగా.. వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉన్న ఇండియా వంటి దేశాల నుంచి పరిశోధకులను ఆ సంస్థ ఆహ్వానిస్తోంది. వాట్సాప్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. దేశంలో 20 కోట్ల మందికి పైగా ఈ యాప్ వినియోగదారులున్నారు.


ఇండియాలో వాట్సాప్‌ నకిలీ వార్తల ఘటనలు

2016లో ‘‘పెద్ద నోట్ల రద్దు’’ అనంతరం.. కొత్త కరెన్సీ నోట్లను ప్రపంచంలో ఎక్కడున్నా కనిపెట్టేందుకు వీలుగా వాటిలో ‘నానో-జీపీఎస్ చిప్‌లు’ పెట్టి ముద్రిస్తున్నారంటూ ఒక నకిలీ కథనం వ్యాప్తి చెందింది.

ఈ కథనాన్ని నిజంగా నమ్మి కొన్ని టీవీ చానళ్లు వార్తా కథనాలు కూడా ప్రచారం చేశాయి. దీంతో ప్రభుత్వాధికారులు స్వయంగా అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏదీ లేదని ప్రకటించాల్సి వచ్చింది.

భారత జాతీయగీతం ‘జనగణమన’ను ‘‘ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతం’’గా యునెస్కో ప్రకటించిందన్న వదంతి మరొక ఉదాహరణ.

నిజానికి ఆ నకిలీ వార్త 2008లో ఒక ఈ-మెయిల్ ద్వారా విస్తరించటం మొదలైంది. అది 2016లో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. దీంతో ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో దృష్టికి వచ్చింది.

Image copyright BBC Monitoring
చిత్రం శీర్షిక కొన్నేళ్ల కిందట ఈ-మెయిల్‌లో వ్యాపించిన ఈ సందేశం మళ్లీ వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది

‘‘ఇండియాలోని కొన్ని బ్లాగ్‌లు ఈ కథనాన్ని ప్రచురిస్తున్నట్లు మాకు తెలిసింది. భారత జాతీయ గీతం గురించి కానీ, మరే దేశం జాతీయ గీతం గురించైనా కానీ యునెస్కో ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టంచేస్తున్నాం’’ అని పక్ష పత్రిక ఇండియా టుడేకి యునెస్కో వివరించింది.

మరొక ఉదంతంలో.. ముంబయి సముద్ర తీరంలో నిర్మించ తలపెట్టిన భారత చారిత్రక నాయకుడి విగ్రహాన్ని.. అమార్ఫస్ సిలికాన్, కాడ్మియం టెల్యూరైడ్, కాపర్ ఇండియం గాలియం సెలినైడ్’’తో తయారు చేస్తున్నారని.. దానిని సోలార్ సెల్స్‌తో కప్పుతారని.. దాని ద్వారా ముంబయిలోని ప్రభుత్వ కార్యాలయన్నిటికీ విద్యుత్ లభిస్తుందని ఒక మెసేజ్ వాట్సాప్‌లో వైరల్ అయింది.

ఆ విగ్రహంలో ‘‘రేడియల్ యూనిఫామ్ ప్రొజెక్షన్ అండ్ రేంజింగ్ (రూపార్) టెక్నాలజీ’’ని కూడా అమర్చుతారని.. అరేబియా సముద్రం మీదుగా సాయుధ దాడులను నివారించటం కోసం బోట్లను పసిగట్టటానికి ఇది సాయపడుతుందని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు.

కానీ.. అదంతా అవాస్తవం. రూపార్ అనే సాంకేతికత ఏదీ లేదన్న విషయం వెల్లడైంది.

మరోసారి.. దిల్లీలోని ఒక సీనియర్ పోలీస్ అధికారి పంపించినట్లు ఫార్వార్డ్ చేసిన ఒక నకిలీ మెసేజ్‌లో.. మహిళలు భద్రతా కారణాల రీత్యా తమ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలను డిలీట్ చేయాలని పేర్కొన్నారు.

ఇలాంటి ఫొటోలను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ దుర్వినియోగం చేసే ప్రమాదముందని, ఆ సంస్థ హ్యాకర్లు పౌరుల వివరాలను, వారి డిజిటల్ గుర్తింపును సులభంగా తస్కరించగలరని ఆ నకిలీ సందేశం హెచ్చరించింది.

వాట్సాప్ అప్లికేషన్ సెక్యూరిటీ ఫీచర్లను మార్చటానికి 20, 25 రోజుల సమయం పడుతుందని.. కాబట్టి అన్ని రోజుల పాటు ప్రొఫైల్ ఫొటోలను డిలిట్ చేయాలని వాట్సాప్ సీఈఓ స్వయంగా కోరినట్లు కూడా ఆ బూటకపు మెసేజ్‌లో చెప్పారు.


ఈ చర్యలు సమర్థంగా పనిచేస్తాయా?

వాట్సాప్ చర్యలు చేపడుతున్నప్పటికీ.. భారతదేశంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టటం చాలా కష్టమైన పనిగా మారింది.

నకిలీ వార్తలను గుర్తించడం, వాటిని అరికట్టడం ఎలా అని భారతీయ యూజర్లకు అవగాహన కల్పించేందుకు వాట్సాప్ యత్నిస్తోంది.

Image copyright BBC MONITORING
చిత్రం శీర్షిక నకిలీ వార్తలపై యూజర్లకు అవగాహన పెంపొందించటం కోసం పత్రికల్లో వాట్సాప్ ప్రకటనలు ఇచ్చింది

కానీ.. ఆ యాప్‌లో మెసేజ్‌లన్నీ ఎన్‌క్రిప్టెడ్ కావటం వల్ల.. వాట్సాప్ స్వయంగా సందేశాలపై నిఘా ఉంచటం కానీ, కీవర్డ్స్ ఆధారంగా పసిగట్టటం కానీ చేయటం కుదరదు.

కాబట్టి.. తన మాతృ సంస్థ ఫేస్‌బుక్ తరహాలో స్కానింగ్ ద్వారా నకిలీ వార్తలను గుర్తించటం కానీ, అనుమానాస్పద అంశాల కోసం పబ్లిక్ పోస్టులు, ఫొటోలు, వీడియోలను విశ్లేషించటం కానీ చేయటం సాధ్యం కాదు.

పైగా సమాచారాన్ని తనిఖీ చేయటం సాధ్యమైనా కూడా అది యూజర్ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించటం అవుతుంది కాబట్టి వాట్సాప్ సర్వీస్‌కి అది ప్రతికూలంగా మారుతుంది.

‘‘వ్యక్తిగత గోప్యతతో రాజీపడకుండా వాట్సాప్‌లో అంతర్గతంగా ఎటువంటి తప్పుడు సమాచారం, బూటకపు ప్రచారాన్ని నిలువరించటం సాధ్యం కాదు. ఇది బహిరంగ పోస్టులు ఉండే సోషల్ మీడియా నెట్‌వర్క్ కాదు. ఇది ఇన్‌స్టంట్ మెసేజింగ్ (తక్షణ సందేశం) వేదిక అనేది గుర్తించాలి’’ అని న్యాయవాది అపర్ గుప్తా అభిప్రాయపడ్డట్లు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.

‘‘యూజర్ అకౌంట్లను వారి ప్రవర్తనను అంచనా వేయటం ఆధారంగా సస్పెండ్ చేసే విషయంలో పెద్ద అగాథం ఉంది. ఇందులో భావప్రకటనాస్వేచ్ఛకు సంబంధించిన అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇటువంటి విధానాన్ని జాగ్రత్తగా ఆలోచించి అమలు చేయాల్సి ఉంటుంది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ నిపుణుడు అనంత్ పద్మనాభన్ పేర్కొన్నట్లు ఆ పత్రిక ఒక కథనంలో వివరించింది.

‘‘వాట్సాప్ డిజైన్‌లో లోపాలు.. ఇండియాలో జనం తమ ప్రాణాలను కోల్పోవటానికి కారణమయ్యాయి. సమాచారాన్ని ఎండ్ టు ఎండ్ (సమాచారం పంపే, స్వీకరించే ఇరువైపులా) ఎన్‌క్రిప్షన్ కారణంగా.. పోస్టులను పర్యవేక్షించే మార్గమే లేదు. అందువల్ల వాట్సాప్ అనేది ఫేక్ న్యూస్‌కి, మత విద్వేషానికి హద్దులు లేని వేదికగా మారింది’’ అని సాఫ్ట్‌వేర్ డెవలపర్ దీపాంక్ మొహానీ ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?