బీదర్‌లో హైదరాబాదీ హత్య: ‘అనుమానం వ‌స్తే ఇంత దారుణంగా కొట్టి చంపేస్తారా?’ BBC Special రిపోర్ట్

  • 18 జూలై 2018
బాధితుడు ఆజమ్ తండ్రి ఉస్మాన్
చిత్రం శీర్షిక ఆజం తండ్రి ఉస్మాన్

బీద‌ర్ దాడి ఘ‌ట‌న నుంచి బాధిత కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఆజం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న తన కొడుకు ఇలా అవుతారని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ దాడిలో చ‌నిపోయిన మ‌హమ్మ‌ద్ ఆజం (32) కుటుంబం హైద‌రాబాద్‌లోని బార్క‌స్ ప్రాంతంలో ఉంటోంది.

ఆజం ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ప‌నిచేసేవారు. ఆయ‌న‌కు 2014లో వివాహమైంది. ప్ర‌స్తుతం 18 నెల‌ల కుమారుడు ఉన్నాడు.

ఆజం తండ్రి మహ్మద్ ఉస్మాన్.. రైల్వేలో ఉద్యోగి. త‌ల్లి, భార్య గృహిణులు. అత‌నికి ఒక అక్క‌, ఇద్ద‌రు క‌వ‌ల త‌మ్ముళ్లు ఉన్నారు.

హైద‌రాబాద్‌లో ఇంజినీరింగ్(బీటెక్) పూర్తి చేసిన ఆజం.. తర్వాత ఇంగ్లండ్‌లో మాస్ట‌ర్స్ చదివారు. త‌రువాత లండ‌న్, సౌదీ, ఖ‌తార్, దుబాయ్‌ల‌లో ఉద్యోగాలు చేసి, నాలుగు నెల‌ల క్రిత‌మే హైద‌రాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.

త‌న‌కు వ‌రుస‌కు క‌జిన్, ఖ‌తార్‌లో స్నేహితుడు అయిన స‌లాహ్ అలీ హైద‌రాబాద్ రావ‌డంతో, మరో ఇద్ద‌రు క‌జిన్స్‌తో క‌ల‌సి బీద‌ర్ వెళ్లారు ఆజం. అక్క‌డ జ‌రిగిన దాడిలో మ‌ర‌ణించాడు.

చిత్రం శీర్షిక బీదర్‌లో మరణించిన ఆజం పాత ఫొటో

ఆజం ఒక్క‌సారిగా ఇలా మ‌ర‌ణించ‌డంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది.

"ఆజంకి శుభ్ర‌త ఎక్కువ‌. చాలా మర్యాదగా మాట్లాడ‌తాడు. అంద‌రినీ బాగా గౌరవిస్తాడు. హుందాగా ఉంటాడు. ఇక్క‌డ ఎవ‌రిని అడిగినా ఆయ‌న గురించి చెప్తారు. అత‌నికి మ‌సీదుకి వెళ్ల‌డం, న‌మాజ్ చేయ‌డం, ఇంట్లో వాళ్ల‌తో గ‌డప‌డం ఇవే ఇష్టం. ఎక్కువ స‌మ‌యం తన త‌మ్ముళ్ల‌తో గ‌డుపుతాడు. వారు ఏం చ‌ద‌వాలి, ఎలా ఉండాలి వంటివి చెబుతాడు" అంటూ కొడుకును గుర్తు చేసుక‌ున్నారు ఆజం తండ్రి మ‌హమ్మ‌ద్ ఉస్మాన్.

"ఆజం‌కి బ‌య‌ట తిర‌గ‌డం ఎక్కువ ఇష్టం ఉండ‌దు. ఇల్లు, ప‌ని త‌ప్ప ఏమీ తెలీదు. ఖ‌తార్ నుంచి వ‌చ్చిన మిత్రుడు ఇక్క‌డ‌కు (ఇంటికి) వ‌చ్చి తీసుకెళ్లాడు. వారితో కలిసి కారులో వెళ్లాడు. కాసేపు బయటకు వెళ్లి వస్తారు అనుకున్నాను. కానీ నేరుగా అక్క‌డికే (బీద‌ర్) వెళ్లారు" అని ఉస్మాన్ అన్నారు.

"ఆ రోజు రాత్రి 11 గంట‌ల‌కు మా అబ్బాయి ఫ్రెండ్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఆజం ఫోన్ క‌ల‌వ‌లేద‌ని అత‌డు కంగారు ప‌డ్డాడు. త‌రువాత మ‌ళ్లీ ఫోన్ చేశాడు. మా రెండో అబ్బాయికి ఫోన్ ఇమ్మంటే ఇచ్చాను. నేను ఫోన్ చేసినా ఆజ‌మ్ ఎత్త‌లేదు. కాస్సేప‌టికి పోలీసులు ఫోన్ ఎత్తి, చిన్న ప్ర‌మాదం అని సేఫ్‌గా ఉన్నాడ‌నీ చెప్పారు. మాట్లాడించ‌మంటే, ఇక్క‌డ పెద్ద‌సార్లు ఉన్నారు, త‌రువాత చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. త‌రువాత ఫోన్ స్విచాఫ్ అయింది. రాత్రి 1.30కి ఫోన్ వ‌చ్చింది. ఆజం చ‌నిపోయార‌ని చెప్పారు" అని ఉస్మాన్ తెలిపారు.

చిత్రం శీర్షిక బీదర్‌లో మరణించిన ఆజం పాత ఫొటో

రైల్వేలో సాధార‌ణ ఉద్యోగి అయిన ఆజం తండ్రి ఉస్మాన్, పిల్ల‌ల చ‌దువుల విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకున్నారు.

"మేం పిల్ల‌ల‌ను ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెంచాం. ఇంజినీరింగ్ త‌రువాత వాడు ఇక్క‌డ లేడు. లోన్ తీసుకుని మ‌రీ పిల్ల‌ల‌ను పెద్ద చ‌దువులు చ‌దివించాను. మేం అంత చ‌దువుకోలేదు కాబ‌ట్టి, మాకు చ‌దువు విలువ తెలుసు. అందుకే మా పిల్ల‌ల‌ను బాగా చ‌దివించుకున్నాం. చ‌దువుల రుణాలకు వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఉన్న ఆస్తులు అమ్మేసి వారి చ‌దువు కొన‌సాగించా"

"శాంతి భ‌ద్ర‌త‌లు అనేవి ప‌టిష్టంగా ఉండాలి. అత‌ని గుర్తింపు కార్డులు పరిశీలించాలి. అవేమీ చూడ‌కుండా ఎలా కొట్టేస్తారు? అత‌ని ముఖం ఏమైనా అనుమానాస్ప‌దంగా ఉందా? లోక‌ల్ గూండాలా ఉందా? (జ‌నం) వాళ్ల ప‌ని ఏంటి? అనుమానం వ‌స్తే పట్టుకుని పోలీసుల‌కు అప్ప‌జెప్పాలి. అంత‌గా అనుమానం వ‌స్తే చెట్టుకు క‌ట్టేసి ఉండాల్సింది. లేదా రెండు దెబ్బ‌లు కొట్టి పోలీసుల‌కు అప్ప‌గిస్తే వాళ్లు చూసుకుంటారు క‌దా. మ‌రీ ప్రాణం తీసేంత మూర్ఖ‌త్వ‌మా? ఇలాంటివి చూడ్డానికేనా పిల్ల‌ల్ని ఇంత చ‌దివించి పెద్ద‌ల్ని చేసింది?" అంటూ క‌న్నీటి పర్యంతమయ్యారు ఉస్మాన్.

"నేను షాక్ అయిపోయాను. మా ఆవిడ ఇంకా షాక్‌లోనే ఉంది. నేను క‌ర్ణాట‌క, తెలంగాణ ప్ర‌భుత్వాల‌ను కోరేదేమిటంటే, మేం మ‌ధ్య త‌ర‌గతి వాళ్లం... (క‌న్నీళ్లు) నా కొడుకును ఇంత చ‌దివిస్తే, అత‌ని ప‌రిస్థితి ఇలా అయింది. నేను కోరుకునేది ఒక‌టే మ‌రోసారి ఇలాంటిది ఎవ‌రికీ జ‌ర‌గకూడ‌దు. ఎవ‌రూ ఇలాంటి బాధ అనుభ‌వించ‌కూడ‌దు. ఎప్ప‌టికీ ఇలాంటిది జ‌ర‌గ‌కూడ‌దు" అంటూ విజ్ఞప్తి చేశారు ఉస్మాన్.

చిత్రం శీర్షిక ఆజం తండ్రి ఉస్మాన్

"బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చే వాళ్లు, భార‌త‌దేశాన్ని చూసి వెళ్దాం అనుకుంటారు. ఇలాంటి ఘటనలు జ‌రిగితే ఎవ‌రు వ‌స్తారు ఇండియాకు?" అంటూ ప్ర‌శ్నించారు ఉస్మాన్.

ఆజంకి త‌న త‌మ్ముళ్ల‌తో ఎంతో అనుబంధం ఉంది. స్కూలు వ‌య‌సు ద‌గ్గ‌ర నుంచి కార్పొరేట్ ఉద్యోగం వ‌ర‌కూ అన్ని విష‌యాల్లో త‌మ్ముళ్ల‌ను కంటికి రెప్ప‌లా చూసుకుంటూ వ‌చ్చారు ఆజం.

"మా అన్న టైమ్‌కి, రూల్స్‌కి ప్రాధాన్య‌త ఇస్తారు. ప్ర‌తీదీ రూల్ ప్ర‌కారం జ‌ర‌గాలి. ప్ర‌తీదీ శుభ్రంగా ఉండాలి. చింద‌ర‌వంద‌ర‌గా ఉండ‌కూడ‌దు. ప్ర‌తీ అంశంపైనా ఇంట‌ర్నెట్లో వెతికి నోట్స్ రాసుకునేవాడు. మాకు ఆ నోట్స్ చెప్పేవాడు. అలా ఉండాలి... ఇలా ఉండాలి అంటూ చెప్పేవాడు. చాలా మృదు స్వభావి" అంటూ అన్నయ్య గురించి వివ‌రించాడు ఆజం త‌మ్ముడు అక్ర‌మ్. ప్ర‌స్తుతం అక్ర‌మ్ ఒక కార్పొరేట్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు.

"అన్న ఎక్క‌డ‌కు వెళ్లినా శుక్ర‌వారం సాయంత్రం మాత్రం తొంద‌ర‌గా వ‌చ్చేవాడు. ఎందుకంటే శ‌నివారం తెల్ల‌వారుజామున 3.30కి ఆఫీసు వెళ్లాలి. కానీ ఆరోజు చాలా ఆల‌స్య‌మైంది. మేం కంగారు పడ్డాం. మా అన్న ఫ్రెండ్ ఫోన్ త‌రువాత మేం కూడా కేవ‌లం దెబ్బ‌లు త‌గిలాయ‌నే అనుకున్నాం. అమ్మానాన్న‌కూ అదే చెప్పాం. కానీ, ఇంటికి భౌతిక కాయం వ‌చ్చే వ‌ర‌కూ మేం న‌మ్మ‌లేదు ఇలాంటిది జ‌రిగింద‌ని.. అలాంటి ఆలోచ‌న కూడా రాలేదు మాకు. షాక్ అయ్యాం" అన్నారు అక్ర‌మ్.

"స్కూలు వ‌య‌సు నుంచి ఉద్యోగం వ‌ర‌కూ మాకు ప్ర‌తీ విష‌యంలోనూ త‌నే చెప్పేవాడు. అన్నీ త‌నే వెతికి ఏ కంపెనీ మంచిది, ఎందులో చేరాలి వంటి సూచ‌న‌లు ఇచ్చేవాడు. అత‌ను ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండేవాడు. దేన్నీ నిర్ల‌క్ష్యం చేసేవాడు కాదు. పాస్‌పోర్టు తీసుకోమ‌నేవాడు, కార్డులు అన్నీ పక్కాగా ఉండాల‌ని చెప్పేవాడు. మేం సికింద్రాబాద్ నుంచి ఇల్లు మారిన‌ప్పుడు ఆధార్ కార్డులో అడ్ర‌స్ మార్పించడం నిర్ల‌క్ష్యం చేస్తే, త‌ను ఊరుకోలేదు" అని గుర్తు చేశారు అక్రమ్.

చిత్రం శీర్షిక బాధితుడి తమ్ముడు అక్రమ్

"రోజుకు 5 సార్లు త‌ప్ప‌నిస‌రిగా న‌మాజ్ చేస్తాడు. మాచేత, మా క‌జిన్స్ చేత కూడా న‌మాజ్ చేయిస్తాడు. ఘ‌ట‌న జ‌రిగిన రోజు కూడా మా క‌జిన్స్ రెడీ అయ్యి, అన్న న‌మాజ్ కోసం వ‌స్తాడు అని చూశారు. కాల్ చేస్తే తాను బ‌య‌ట‌కు వెళ్తున్నాన‌ని చెప్పాడ‌ట‌.."

"ఆ రోజు బీద‌ర్ వెళ్లే ముందు అమ్మ‌ను మాత్ర‌మే క‌లిశాడు. నేను ప‌డుకున్నాను క‌ల‌వ‌లేదు. అంద‌రూ క‌ల‌సి భోజ‌నం చేయ‌డం అల‌వాటు. మా మేన‌ల్లుడంటే అన్న‌య్య‌కు చాలా ఇష్టం. త‌న కొడుకు క‌న్నా ఇష్టం. మా అల్లుడు క‌నుక మ‌మ్మ‌ల్ని కొట్ట‌మంటే, అన్న‌య్య మ‌మ్మ‌ల్ని కొట్టేసేవాడు" అంటూ త‌న అన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అక్ర‌మ్.

"ఫేక్ న్యూస్ ఘ‌ట‌న‌లు విన్నాం కానీ, ఇలా జ‌రుగుతుంద‌ని, జ‌నం ఇంత సీరియ‌స్ అవుతార‌ని కానీ అనుకోలేదు. వాట్స‌ాప్, ఫేస్‌బుక్‌లు క‌మ్యూనికేష‌న్ కోసం మంచివే. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు కంటెంట్ రివ్యూ చేస్తాయి. అలాగే వాట్స‌ాప్ కూడా చేయాలి. ఎవ‌రో ఏదో నకిలీ పోస్టు పెట్టేస్తే.. జ‌నం వాటిని న‌మ్మి ఇలాంటివి చేస్తున్నారు. చ‌దువుకున్న కొందరికి తెలుస్తుంది, కానీ మిగిలిన వారి సంగ‌తి? వాట్స‌ాప్‌లో నకిలీ వార్తలను, సందేశాలను కట్టడి చేయాలి" అని డిమాండ్ చేశారు అక్ర‌మ్.

"దీనికి బాధ్యులైన వారికి ఎటువంటి శిక్ష ప‌డాలి అంటే, వాళ్లు మళ్లీ ఇలాంటి దాడులు చేయాలంటే ప‌దిసార్లు ఆలోచించాలి. కానీ మ‌న వ్య‌వ‌స్థ‌లో ప‌దేళ్ల నాటి కేసులకు ఇప్పుడు తీర్పులు వ‌స్తున్నాయి. ఇప్పటి వరకూ మమ్మల్ని ఏ అధికారి కూడా సంప్రదించలేదు" అని అక్ర‌మ్ చెప్పారు.

ఆజం ఎలా చనిపోయారు?

ఆజం ఎలా చ‌నిపోయాడ‌న్న విష‌యాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే ప్ర‌త్య‌క్ష సాక్షులైన కానిస్టేబుల్ మ‌ల్లికార్జున‌, బాధితుడు స‌ల్మాన్ క‌థ‌నాల ప్ర‌కారం కొట్టిన బ‌ల‌మైన దెబ్బ‌లు, మెడ‌లో తాడు వేసి బిగించి లాగ‌డం వ‌ల్ల లేదా రెండిట్లో ఏదైనా ఒక దాని వ‌ల్ల ఆజం చ‌నిపోయి ఉండొచ్చు.

‘‘కారులో ఉన్న ఆజం మెడ‌కు తాడు బిగించి బ‌య‌ట‌కు లాగారు. మేం మేం త‌ప్పుచేశామ‌ని మ‌మ్మ‌ల్ని కొడుతున్నారంటూ ఆజం ప్ర‌శ్నిస్తూనే ఉన్నాడు. బ‌య‌ట‌కు లాగేశారు. త‌రువాత ఏం జ‌రిగిందో నేను చూడ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికి మేం కారులోనే ఉన్నాం. దాదాపు ప‌ది నిమిషాల త‌రువాత న‌న్ను బ‌య‌ట‌కు లాగి కొట్టారు’ అని బాధితుడు స‌ల్మాన్ చెప్పారు.

‘పోలీసులు అక్క‌డ‌కు చేరుకునేప్ప‌టికే జ‌నం ఆజ‌ం‌ని కొడుతున్నారు. పోలీసులు న‌చ్చ‌చెప్ప‌డంతో జ‌నం కాసేపు ఆగారు. ఈలోపు మిగిలిన వారిని బ‌య‌ట‌కు తీద్దాం అని పోలీసులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, బ‌య‌ట ఉన్న‌ ఆజ‌ం‌ని జ‌నం కొట్టడం మొద‌లుపెట్టారు అని పోలీసుల మాట‌ల‌ను, వీడియోల‌నుబ‌ట్టి అర్థం అవుతోంది. మేం ఎంత ఆపినా ఆగ‌కుండా బ‌య‌ట‌కు తీసిన ఆ మనిషిని చాలా దారుణంగా కొట్టారు’ అని కానిస్టేబుల్ మ‌ల్లికార్జున‌ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌ల్లికార్జునకు కాలు విరిగింది.

ఘ‌ట‌న‌కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన దృశ్యాల‌లో పోలీస్ కానిస్టేబుల్ చేతిలో ఉరి త‌ర‌హాలో బిగించిన తాడు క‌నిపించింది. ఆజ‌ం‌ని ర‌క్షించే క్ర‌మంలో బ‌హుశా పోలీసులు తాడు విడిపించి ఉండొచ్చ‌ని ఒక అంచనాకి రావ‌చ్చు. అయితే ఆజ‌ం పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేద‌నీ, వ‌చ్చిన త‌రువాత చెప్ప‌గ‌ల‌మ‌ని బీద‌ర్ ఎస్పీ దేవ‌రాజ్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భార‌త్‌ - చైనా ఉద్రిక్త‌త‌లు: రెండు వైపులా తాత్కాలికంగా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌

బైక్‌లపై బందిపోటు ముఠాలు.. కిడ్నాప్‌లు, హత్యలతో హడలెత్తిస్తున్నారు

‘జోక్యం చేసుకోవద్దు’: బ్రిటన్‌‌కు చైనా హెచ్చరిక... ముదురుతున్న వివాదం

‘స్వలింగ సంపర్కం వ్యాధి కాదు’

‘కోవిడ్ వ్యాక్సిన్ విడుదలకు డెడ్‌లైనా? తొందరపాటు వద్దు’: శాస్త్రవేత్తల హెచ్చరిక

భార‌త్‌ - చైనా స‌రిహ‌ద్దు: బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ శాశ్వ‌త‌మా? తాత్కాలిక‌మా?‌

వికాస్ దుబే: నేర‌స్థులు రాజ‌కీయాల్లోకి ఎలా అడుగుపెడుతున్నారు?

మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది

కరోనా రోజుల్లో పోలీస్ డ్యూటీ: ఒక లేడీ కానిస్టేబుల్ అంతరంగం