#BBCSpecial: బీదర్‌లో అసలేం జరిగిందంటే.. "గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు పట్టుకుని దాదాపు 80 మంది వ‌చ్చారు"

  • 17 జూలై 2018
బీదర్ బాధితులు

హైదరాబాద్‌కు చెందిన యువకులను కిడ్నాపర్లుగా అనుమానిస్తూ బీదర్‌లోని స్థానికులు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ దాడి ఘ‌ట‌న బాధితులు ఇప్పుడిప్పుడే షాక్ నుంచి తేరుకున్నారు. ఆ దాడి జ‌రిగిన తీరును వారు బీబీసీకి వివ‌రించారు.

త‌మ త‌ప్పేమీ లేద‌ని చెబుతున్నా విన‌కుండా, మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా కొట్టార‌ని చెప్పారు.

హైద‌రాబాద్‌లోని బార్క‌స్ ప్రాంతానికి చెందిన ఆజ‌మ్, అత‌నికి క‌జిన్ అయిన స‌లాహ్ అలీ, మ‌హ‌మ్మ‌ద్ స‌ల్మాన్, నూర్ మ‌హ‌మ్మ‌ద్‌లు శుక్ర‌వారం బీద‌ర్ వెళ్లారు.

ఖ‌తార్ నుంచి వ‌చ్చిన స‌లాహ్ కొంద‌రు స్కూలు పిల్ల‌ల‌కు చాక్లెట్లు ఇచ్చారు. దీంతో వీరిని కిడ్నాప‌ర్లుగా అనుమానించి స్థానికులు విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టారు. ఆ దాడిలో ఆజమ్ చ‌నిపోయాడు.

దాడి నుంచి గాయాల‌తో త‌ప్పించుకున్న నూర్ మ‌హ‌మ్మ‌ద్ క‌థ‌నం ప్ర‌కారం...

చిత్రం శీర్షిక దాడిలో గాయపడి చనిపోయిన హైదరాబాద్ వాసి ఆజమ్

"మేం న‌లుగురమూ విహారయాత్ర‌కు ఆ ఊరు వెళ్లాం. అక్కడే మా స్నేహితుడు ఆఫ్రోజ్ ఉంటాడు. ఆ ఊరిలో కాసేపు తిరిగి స్థానికుల‌తో మాట్లాడి, భోజ‌నాల‌కు ఏర్పాట్లు చేసుకున్నాం. త‌రువాత ఊరి బ‌య‌ట ప్ర‌కృతి చూద్దామ‌ని వెళ్లాం.

వెళ్లేటప్పుడు బ‌స్టాండ్ దగ్గ‌ర‌ పిల్ల‌లు ఉంటే వారికి వెళుతోన్న కారులోంచి చాక్లెట్లు విసిరాం.

ఓ అర‌కిలోమీట‌రు వెళ్ల‌గానే ఎడ‌మ‌వైపు చిన్న డ్యామ్ క‌నిపించింది. అక్క‌డ ఆగి ఫోటోలు తీసుకుని, ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నాం.

ఈ లోపు కొంద‌రు వ‌చ్చి మా కారు టైర్లలో గాలి తీసేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. మేం వాళ్ల‌ను ఎందుకిలా చేస్త‌ున్నార‌ని అడిగాం.

పిల్ల‌ల‌కు చాక్లెట్లు ఎందుకిచ్చార‌ని వాళ్లు మ‌మ్మ‌ల్ని ప్రశ్నించారు.

మేం సంతోషం కొద్దీ ఇచ్చామని చెప్పాం. మా అన్నయ్య ఖ‌తార్ నుంచి వ‌స్తూ చాక్లెట్లు తెచ్చారు. వాటినే పిల్లలకు ఇచ్చామని చెప్పాం.

అలా అయితే కారు ఆపి ఇవ్వాలి క‌దా.. అని వారు అన్నారు.

అప్ప‌టికే బండి వేగంలో ఉంది.. స్లో చేయ‌డం క‌ష్ట‌మైంది. అందుకే విసిరాం అని చెప్పాం.

ఇలా మాట్లాడుతుండ‌గానే నెమ్మ‌దిగా జ‌నాలు పెరిగారు. వాళ్ళు కొట్ట‌డం మొద‌లుపెట్టారు. రాళ్ల‌తో కొట్టారు.

నేను, అఫ్రోజ్ వాళ్ల‌ను ఆపేందుకు ప్ర‌య‌త్నించాం. బతిమాలి స‌ముదాయించాల‌ని చూశాం. ఊరు చూడ్డానికి వ‌చ్చామని చెప్పాం.

స్థానికుడైన అఫ్రోజ్, వాళ్లు నా స్నేహితుల‌ని చెప్పాడు. అయినా గ్రామస్థులు విన‌లేదు. మేం ఏం చెప్పినా వాళ్లు విన‌లేదు. దాడి చేస్తూనే ఉన్నారు. కొట్టండి.. కొట్టండి అంటూ పెద్దఎత్తున కేకలు పెట్టారు.

చిత్రం శీర్షిక "గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు పట్టుకుని దాదాపు 70- 80 మంది వ‌చ్చారు. కొట్టండి వ‌ద‌లొద్దు అని అరుస్తూనే ఉన్నారు"

కారులో ఇక్క‌డ‌కు ఎందుకు వ‌చ్చారని అడిగారు. కిడ్నాప‌ర్లు అంటూ అరిచారు.

మేం పిక్నిక్‌కి వ‌చ్చాం.. గంట‌సేపు ఈ ఊరిలో తిరిగాం.. భోజ‌నాల‌ు తయారు చేసేందుకు డ‌బ్బులు కూడా ఇచ్చాం.. వాళ్లు మ‌మ్మ‌ల్ని గుర్తుప‌డ‌తారు అని చెప్పాము. అయినా వారు విన‌లేదు.

అర కిలోమీట‌ర్ దూరంలో ఉన్న గ్రామంలోకి వెళ్దాం. అక్క‌డ మాట్లాడ‌దాం. మా త‌ప్పుంటే పోలీసులను పిల‌వండి అని కూడా అన్నాం. నేను పోలీసుల‌కు ఫోన్ చేస్తాన‌న్నా చేయ‌నీయ‌లేదు.

అప్ప‌టికీ స‌లాహ్, ఆజమ్, స‌ల్మాన్ కారులో కూర్చున్నారు. మేం కారు వైపు వెళుతుంటే మ‌మ్మ‌ల్ని గ్రామస్థులు ప‌ట్టుకున్నారు. కారులోపల ఉన్నవాళ్లను కూడా బయటకు లాగేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ వాళ్లు కారులో ఎలాగోలా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక‌, మా ఇద్ద‌రినీ రాళ్లు, క‌ర్ర‌ల‌తో భ‌యంక‌రంగా కొట్టారు.

ఇదంతా ఆరోజు (శుక్రవారం) సాయంత్రం 3- 4 గంట‌ల ప్రాంతంలో జ‌రిగింది.

స్థానికుడైన ఆఫ్రోజ్ బంధువులు వచ్చి గ్రామస్థులను అదుపు చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు.

70 -80 మంది జ‌నం వ‌చ్చారు. వారి చేతుల్లో గ‌డ్డి కోసే కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు, రాళ్లు ఉన్నాయి. కొట్టండి వ‌ద‌లొద్దు అని అరుస్తూనే ఉన్నారు.

వాళ్లంతా మామూలు వాళ్లే.. మా మాట‌లు ఇద్ద‌రు ముగ్గురు అర్థం చేసుకున్నారు కానీ వాళ్లు కూడా మమ్మల్ని ర‌క్షించ‌లేక‌పోయారు. అంత జ‌నాన్ని న‌లుగురైదుగురు ఏం చేయ‌లేక‌పోయారు.

స‌లాహ్, ఆజమ్, స‌ల్మాన్ వెళ్లిన కారును ఆ గ్రామస్థులు వెంటాడలేదు. కానీ ఆ కారు వెళ్లే దారిలోని తర్వాతి ఊరి వాళ్ల‌కు ఫోన్ చేసి, ఏ బండీ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా రోడ్ బ్లాక్ చేయాలని చెప్పారు.

త‌రువాత కొద్దిసేపటికే ఆ కారుకు యాక్సిడెంట్ అయిందంటూ వారికి ఫోన్ వ‌చ్చింది. దీంతో కొంద‌రు అటు వెళ్లారు.

ఐదుగురు పోలీసులు వ‌చ్చార‌నీ వాళ్ల‌కూ దెబ్బ‌లు త‌గిలాయ‌నీ, ఒక పోలీస్ కాలు విరిగింద‌నీ కూడా వాళ్ల‌కు ఆ స‌మ‌యంలో ఫోన్ వ‌చ్చింది.

కొంద‌రు మ‌మ్మ‌ల్ని కొడుతూనే ఉన్నారు. త‌రువాత వాళ్లు కూడా వెళ్లారు. చివ‌ర‌కు గాయాలతో మేం త‌ప్పించుకుని అఫ్రోజ్ వాళ్ల అంకుల్ ఇంట్లో దాక్కున్నాం.

యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని చూడ్డానికి అఫ్రోజ్ వెళ్లాడు. అప్ప‌టికి అక్క‌డ భారీ జ‌నం పోగ‌య్యారు. దాంతో త‌న‌పై వాళ్లు దాడి చేస్తార‌నే భ‌యంతో అఫ్రోజ్ వెన‌క్కు వ‌చ్చాడు.

ఆ త‌రువాత అఫ్రోజ్ అంకుల్ ఇంట్లోంచి వేరే ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాం.

అప్రోజ్ తన బాబాయితో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

రాత్రి 2 -3 గంట‌ల సమయంలో పోలీసులు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లారు" అని నూర్ మ‌హ‌మ్మ‌ద్ వివరించారు.

చిత్రం శీర్షిక గాయాలతో బయటపడిన నూర్ మహమ్మద్

ఆ దాడి ప్రణాళిక ప్రకారం చేసింది కాద‌నీ, కొద్ది మందే గ్రామస్థులందరినీ రెచ్చ‌గొట్టార‌ని నూర్ అన్నారు.

ఖ‌తార్ నుంచి తెచ్చిన చాక్లెట్లను స‌లాహ్ దారి పొడవునా పంచుతూనే ఉన్నార‌ని ఆయన తెలిపారు.

"ప్ర‌యాణంలో దారి పొడవునా పిల్ల‌లు, పేద‌లు, ఫ‌కీర్లు క‌నిపించిన‌ప్పుడు వాళ్ల‌కు చాక్లెట్లు పంచుతూనే ఉన్నాం. అంత‌కు ముందు ఊరిలో ఆడుకుంటోన్న పిల్ల‌లతో మాట్లాడి వారికీ చాక్లెట్లు ఇచ్చాం" చివరికి మాకు ఇలా అవుతుందని ఊహించలేదు.

"ఫేక్ న్యూస్ విష‌యంలో ప్రభుత్వాలు కఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈ ఘ‌ట‌న బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి" అని కోరుతున్నారు నూర్.

ఈ ఘ‌ట‌న‌లో కారులో ఆజమ్‌తో పాటు వెళ్లిన మ‌హమ్మ‌ద్ స‌ల్మాన్‌ కూడా తీవ్ర‌ంగా గాయపడ్డారు.

కారు ప్ర‌మాదం జ‌రిగిన తీరు, ఆ త‌రువాత జ‌నం ఎలా దాడి చేసిందీ సల్మాన్ వివ‌రించారు.

22 ఏళ్ల స‌ల్మాన్ చిన్నా చిత‌కా ప‌నులు చేసుకుంటాడు. తండ్రి ఆటో డ్రైవ‌ర్.

చిత్రం శీర్షిక గ్రామస్థుల దాడిలో హైదరాబాద్ వాసి ఆజమ్ చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

మ‌హ‌మ్మ‌ద్ స‌ల్మాన్ క‌థ‌నం ప్రకారం..

"డ్యామ్ ద‌గ్గ‌ర దాడి మొదలవ్వగానే.. మేం ముగ్గురమూ కారులో పారిపోయాం. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుకు అడ్డంగా చెట్ల మొద్దులు వేశారు. వాటిని తప్పించబోయి మా కారు అదుపు త‌ప్పి ప‌ల్టీ కొట్టింది.

వెంటనే పెద్దఎత్తున జనాలు వచ్చి ముందు కారును లేప‌డానికి ప్ర‌య‌త్నించారు. కుద‌ర‌లేదు. దాంతో అద్దాలు ప‌గ‌లగొట్టి రాళ్ల‌తో, కర్ర‌ల‌తో దాడి చేశారు.

ఆజ‌మ్ మెడ‌లో తాడు వేసి లాగారు. అప్ప‌టికి నేను కారులోనే ఉన్నాను.

ఆజ‌మ్‌ను బ‌య‌ట‌కు లాగిన త‌రువాత ఏం జ‌రిగిందో నేను చూడ‌లేదు.

ప‌ది నిమిషాల‌కు న‌న్ను బ‌య‌ట‌కు లాగి దారుణంగా కొట్టారు. కొద్దిసేప‌టికి పోలీసులు వ‌చ్చి న‌న్ను కారు డిక్కీలో దాచారు. అక్క‌డ‌కు వ‌చ్చిన ఐదుగురు పోలీసుల‌కూ దెబ్బ‌లు త‌గిలాయి.

రాత్రి 7- 7.30 ప్రాంతంలో ఐదారు పోలీసు బండ్లు వ‌చ్చాయి. అప్పుడు జ‌నం పారిపోయారు. మమ్మల్ని పోలీసులు కారులోంచి తీసి బీద‌ర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్ళారు.

మ‌మ్మ‌ల్ని గూండాలంటూ కొట్టారు. మమ్మల్ని కొట్టిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. హిందువులు, ముస్లింలు ఉన్నారు.

క‌త్తులు, కొడ‌వ‌ళ్లు, క‌ర్ర‌లు ఉన్నాయి. వాళ్లంతా మమ్మల్ని విపరీతంగా కొట్టారు. ఏం చెప్పినా విన‌లేదు. ఎంతమందిని కిడ్నాప్ చేశారో చెప్పండని ప్రశ్నించారు. అలా రెండు గంట‌ల పాటూ కొట్టారు.

మేం ఏ త‌ప్పూ చేయ‌లేదు. ఎందుకు మ‌మ్మ‌ల్ని కొడుతున్నారంటూ ఆజమ్ అడిగారు. కానీ ఆజ‌మ్ మెడ‌లో తాడు వేసి లాగారు. త‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌లేదు.

మేము స‌ర‌దాగా పిక్నిక్‌లా వెళ్దాం అనుకున్నాం.

ఖ‌తార్ నుంచి వ‌చ్చిన మా క‌జిన్‌కి తేనె అంటే ఇష్టం. అక్క‌డ స్వ‌చ్ఛ‌మైన తేనె దొరుకుతుందంటే వెళ్లాం.

కానీ వర్షాలు పడుతున్న‌ప్పుడు తేనె దొర‌క‌ద‌ని తెలిసింది. స‌రే స‌ర‌దాగా ప్ర‌కృతిని చూద్దాం అనుకున్నాం. ఇలా జరిగిపోయింది" అని గుర్తు చేసుకున్నారు స‌ల్మాన్.

Image copyright Getty Images

బాధితుల్లో ఒక‌రైన‌ స‌లాహ్ అలీ ఖ‌తార్‌లో 20 ఏళ్లుగా పోలీసుగా ప‌నిచేస్తున్నారు.

అతనికి త‌ల‌పై, ఇత‌ర శ‌రీర భాగాల‌పై తీవ్ర గాయాల‌య్యాయి.

ఖ‌తార్ రాయ‌బార కార్యాల‌య అధికారులు దిల్లీ నుంచి హైదరాబాద్ వ‌చ్చి అలీని ప‌రామ‌ర్శించి వెళ్లారు. దౌత్య అధికారుల ఆదేశాల మేర‌కు ఆయ‌న మీడియాతో మాట్లాడ‌టానికి నిరాక‌రించారు.

ప్ర‌స్తుతం స‌లాహ్, త‌న బంధువు, మ‌రో బాధితుడు అయిన స‌ల్మాన్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆజమ్‌ మెడకు తాడు బిగించి..

ఆజ‌మ్ క‌చ్చితంగా ఎలా చ‌నిపోయాడ‌న్న విష‌యాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే ప్ర‌త్య‌క్ష సాక్షులైన కానిస్టేబుల్ మ‌ల్లికార్జున‌, బాధితుడు స‌ల్మాన్ క‌థ‌నాల ప్ర‌కారం.. గ్రామస్తులు కొట్టిన బ‌ల‌మైన దెబ్బ‌లు, మెడ‌లో తాడు వేసి బిగించి లాగ‌డం ఈ రెండు కార‌ణాల వ‌ల్ల లేదా రెండిట్లో ఏదైనా ఒక దాని వ‌ల్ల ఆజ‌మ్ చ‌నిపోయి ఉండ‌టానికి అవ‌కాశాలు ఉన్నాయి.

‘‘కారులో ఉన్న ఆజ‌మ్ మెడ‌కు తాడు బిగించి బ‌య‌ట‌కు లాగారు. మేంమేం త‌ప్పుచేశామ‌ని మ‌మ్మ‌ల్ని కొడుతున్నారంటూ ఆజ‌మ్ ప్ర‌శ్నిస్తూనే ఉన్నాడు. బ‌య‌ట‌కు లాగేశారు. త‌రువాత ఏం జ‌రిగిందో నేను చూడ‌లేదు. ఎందుకంటే అప్ప‌టికి మేం కారులోనే ఉన్నాం. దాదాపు ప‌ది నిమిషాల త‌రువాత న‌న్ను బ‌య‌ట‌కు లాగి కొట్టారు’’ అని చెప్పాడు బాధితుడు స‌ల్మాన్.

పోలీసులు అక్క‌డ‌కు చేరుకునేప్ప‌టికే జ‌నం ఆజ‌మ్‌ని కొడుతున్నారు. పోలీసులు న‌చ్చ‌చెప్ప‌డంతో జ‌నం కాసేపు ఆగారు. ఈలోపు మిగిలిన వారిని బ‌య‌ట‌కు తీద్దాం అని పోలీసులు ప్ర‌య‌త్నిస్తుండ‌గా, బ‌య‌ట ఉన్న‌ ఆజ‌మ్‌ని జ‌నం మళ్లీ కొట్టడం మొద‌లుపెట్టారు అని పోలీసుల మాట‌ల‌ను, వీడియోల‌ను బ‌ట్టి అర్థమవుతోంది. ‘‘మేం ఎంత ఆపినా ఆగ‌కుండా బ‌య‌ట‌కు తీసిన ఆ మనిషిని చాలా దారుణంగా కొట్టారు’’ అని చెప్పారు కానిస్టేబుల్ మ‌ల్లికార్జున‌. ఈ ఘ‌ట‌న‌లో మ‌ల్లికార్జునకు కాలు విరిగింది.

ఘ‌ట‌న‌కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన దృశ్యాల్లో పోలీసు కానిస్టేబుల్ చేతిలో ఉరి త‌ర‌హాలో బిగించిన తాడు క‌నిపించింది. ఆజ‌మ్‌ని ర‌క్షించే క్ర‌మంలో బ‌హుశా పోలీసులు తాడు విడిపించి ఉండొచ్చ‌ని ఒక అంచనాకి రావ‌చ్చు. అయితే ఆజ‌మ్ పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేద‌నీ, వ‌చ్చిన త‌రువాత అతను ఎలా చనిపోయిందీ చెప్ప‌గ‌ల‌మ‌ని బీద‌ర్ ఎస్పీ దేవ‌రాజ్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

జపాన్‌లో ఐదు నెలల్లో 1,000 లోపే కోవిడ్ మరణాలు... జపనీయుల అజేయ శక్తి వెనుక మిస్టరీ ఏమిటి?

కరోనావైరస్‌తో పోయిన ‘వాసన, రుచి’ తిరిగి వస్తున్నాయా? ఎంత కాలం పడుతోంది?

చైనాపై అమెరికా, బ్రిటన్ కీలక చర్యలు.. అదే బాటలో ఆస్ట్రేలియా, జపాన్, తైవాన్, కెనడా

నాగాలాండ్‌, మిజోరం‌లలో కుక్క మాంసాన్ని ఇప్పుడే ఎందుకు నిషేధించారు?

బీబీసీ లైవ్‌షోలో మాట్లాడుతున్న అమ్మను కూతురు ఏం చేసిందో చూడండి..

రకుల్ ప్రీత్ సింగ్: ‘దాని గురించి మాట్లాడొద్దు, మగవాళ్లకు లేనప్పుడు మాకెందుకు’

ప్రపంచ పటాన్ని మార్చిన మొక్క ఇది - ఎలా మార్చింది.. చరిత్రలో ఏం జరిగింది

తెలంగాణలో నెల రోజుల్లో 8 రెట్లు పెరిగిన కరోనా కేసులు: ప్రెస్ రివ్యూ

రైల్వే ప్రైవేటీకరణ- ఈ ఒప్పందం వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం, ఎంత లాభం