వండర్ గర్ల్ హిమా‌దాస్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది

  • నితిన్ శ్రీవాస్తవ
  • బీబీసీ ప్రతినిధి

అది 2007లో ఓ వర్షాకాలం సాయంత్రం. అస్సాంలోని నవ్‌గావ్ జిల్లా కాందులీమారి గ్రామంలో ఒక గొడవ జరిగింది.

గ్రామానికి చెందిన రంజిత్ దాస్ బయట ఏదో గొడవ జరుగుతున్న శబ్దం విని బైటికి వచ్చాడు.

బైట ఒక బాలుడు తన కుడిచేతిని పట్టుకుని బాధతో మూలుగుతుంటే, పక్కన నిల్చున్న మరో బాలిక అతణ్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది.

ఏడేళ్ల హిమా దాస్‌ ఆ బాలునితో ఒకర్నొకరు ముట్టుకునే ఆట ఆడుతుండగా, ఆ బాలునికి తీవ్రమైన గాయమైంది. హిమ తండ్రి రంజిత్ దాస్ రావడానికి ముందే ఆమె సోదరులు ఆ బాలునికి కొన్ని డబ్బులు ఇచ్చి, విషయాన్ని అక్కడితో ముగించడానికి ప్రయత్నించారు.

కానీ ఆ బాలుని కుటుంబం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఓ పోలీస్ వచ్చి హిమా దాస్ చేయి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లాడు. అయితే పోలీస్ ఇన్‌స్పెక్టర్ హిమా దాస్‌ను చూసి, ఆమెను వెంటనే ఇంటి వద్ద వదిలిపెట్టమని పోలీస్‌ను ఆదేశించారు. దాంతో హిమా దాస్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

వీడియో క్యాప్షన్,

వండర్ గర్ల్ హిమా‌దాస్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది

చిన్నప్పటి నుంచి ధైర్యవంతురాలే

హిమా దాస్ తండ్రి రంజిత్ దాస్ ఎంతో గర్వంగా నాటి ఘటనను చెబుతారు.

''చిన్నప్పటి నుంచి తను చాలా ధైర్యవంతురాలు. పొలాల్లో పని చేయడం కావచ్చు లేదా ఎవరైనా వృద్ధులను ఆసుపత్రికి తీసుకెళ్లడం కావచ్చు. ఆమె అన్నింట్లోనూ ముందుండేది. ఇప్పడామె అన్ని కష్టాలనూ అధిగమించి, తన లక్ష్యాన్ని చేరుకుంది'' అని రంజిత్ దాస్ తెలిపారు.

హిమా దాస్ ఇప్పుడు ప్రపంచ అండర్-20 చాంపియన్‌షిప్ 400 మీటర్ల పోటీలలో స్వర్ణపతకాన్ని సాధించి మొత్తం దేశానికే పేరు తెచ్చింది.

ఫొటో క్యాప్షన్,

హిమ తండ్రి రంజిత్ దాస్

బయోపిక్‌కు తీసిపోదు

ఆమె గెలుపు ఏ బాలీవుడ్ బయోపిక్‌కూ తీసిపోదు.

హిమా దాస్ గ్రామంలో రోజూ 3-4 గంటలకు మించి కరెంట్ ఉండదు. గ్రామంలో ఆటలాడుకునేందుకు కనీస సౌకర్యాలు కూడా లేవు.

2016లో హిమ ప్రాక్టీస్ చేసే మైదానంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పశువులు గడ్డి మేసేవి. ఏడాదిలో మూడు నెలల పాటు ఆ మైదానంలో వర్షం నీళ్లు ప్రవహించేవి. కానీ అవేవీ ఆమె విజయాలను అడ్డుకోలేకపోయాయి.

ఫొటో క్యాప్షన్,

హిమా దాస్ ఇంటికి పొరుగున ఉండే రత్నేశ్వర్ దాస్

హిమా దాస్ కుటుంబానికి పొరుగున ఉండే రత్నేశ్వర్ దాస్, ''బాల్యంలో ఆమె ఎంత చురుగ్గా ఉండేదంటే - ఏదైనా కారు తనను దాటిపోతే, పరిగెత్తి దాన్ని అందుకునేవరకు ఆగేది కాదు. గ్రామంలో వనరులు ఎక్కువగా లేవని తనకు తెలుసు. అందుకే అందుబాటులో ఉన్నవాటినే సక్రమంగా ఉపయోగించుకునేది.'' అని తెలిపారు.

క్రీడలంటే ఆమెకెంత పిచ్చో ఆమె బాల్యస్నేహితుడు జోయి దాస్ చెబుతాడు.

''చిన్నప్పుడు ఒకసారి మేం మగపిల్లలమంతా ఫుట్ బాల్ ఆడుతుంటే హిమ వచ్చి తానూ ఆడతానని అడిగింది. కానీ నువ్వు ఆడలేవని మేం ఆమెను ఆటలోకి తీసుకోలేదు. అప్పుడు మా ఇద్దిరికీ గొడవ కూడా అయింది. కానీ తర్వాత మేమిద్దరం స్నేహితులమయ్యాం. అప్పటినుంచి హిమ ఎన్ని గోల్స్ కొట్టిందో లెక్కే లేదు.'' అని గర్వంగా తెలిపాడు.

నవ్‌గావ్ ప్రాంతం నుంచి గువాహటికి వెళ్లడానికి ఆమె పడిన కష్టాలపై ఇలాంటి కథనాలు ఎన్నో వినిపిస్తాయి.

ఫొటో క్యాప్షన్,

హిమా దాస్ స్నేహితుడు జాయి దాస్

మూతపడిన విమర్శకుల నోళ్లు

హిమ కుటుంబం వ్యవసాయం చేస్తుంది. వాళ్లు హిమకు వచ్చిన ప్రతి ట్రోఫీని, సర్టిఫికెట్లను చాలా జాగ్రత్తగా దాచారు.

ఆమె తల్లి జోనాలి దాస్ కూతురి గురించి, ''హిమ ఫుట్‌బాల్‌తో తన క్రీడాజీవితాన్ని ప్రారంభించింది. ఫుట్‌బాల్ ఆడడానికి చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్లేది. అక్కడ గెలిస్తే వచ్చిన డబ్బును నాకు తెచ్చి ఇచ్చేది. కానీ తమషా ఏమిటంటే, తనకు ఏదైనా డబ్బు అవసరమైతే మాత్రం నన్ను అడిగేది కాదు, వాళ్ల నాన్నను అడిగేది'' అని తెలిపారు.

ఆడపిల్లలు బయట ఆడుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే వారందరికీ తన కూతురు తగిన జవాబు ఇచ్చిందని జోనాలి దాస్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

హిమా దాస్ తల్లి జోనాలి దాస్

ఆమె పోటీలకు ప్రేక్షకులు కూడా తక్కువ లేరు.

హిమ తండ్రి స్నేహితుడు దీపక్ బోరా ఆమె ఎక్కడ పోటీలో పాల్గొన్నా, తప్పకుండా హాజరవుతారు.

''ఒకసారి నేను గువాహటిలో హిమ పాల్గొంటున్న పోటీని చూస్తున్నాను. ఆరోజు హిమ మూడోస్థానంలో ఉంది. అప్పుడు నాకు గుండె ఆగిపోతుందేమోనన్న వేగంతో కొట్టుకుంది'' అని ఆయన తెలిపారు.

మెడల్ తీసుకోవడం చూడలేకపోయారు

సాయంత్రం మేము హిమ ఇంటి నుంచి బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది.

హిమ తండ్రి రంజిత్ దాస్ స్వయంగా మమ్మల్ని వదిలిపెట్టడినికి రోడ్డు వరకు వచ్చారు. అయితే ఆయన ముఖంలో సంతోషంతో పాటు ఒక చిన్న బాధా వీచిక కదలాడింది.

''ఈ మెడల్ హిమకు, మాకు, మొత్తం భారతదేశానికి కూడా ఎంతో గర్వకారణం. కానీ బాధాకరం ఏమిటంటే, హిమ ఆ పోటీలో పాల్గొంటున్న రాత్రి కరెంటు పోవడం వల్ల ఆమె స్వర్ణపతకాన్ని గెల్చుకున్న ఆ క్షణాన్ని చూడలేకపోయాం'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)