మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?

  • వరికూటి రామకృష్ణ
  • బీబీసీ ప్రతినిధి

మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి బయటి ఆహారాన్ని ఎందుకు అనుమతించరు? బయట అమ్మే రేట్ల కంటే అనేక రెట్లు పెంచి సామాన్యుడిని బాదేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని వినియోగదారుల ఆవేదన ఎప్పటినుంచో ఉంది. బయటి తిండి అస్సలు అనుమతించకపోవడం వివాదాస్పదంగానే ఉంటూ వస్తున్నది. కొన్నిమల్టీప్లెక్సులు అస్సలు మంచినీటి బాటిళ్లను కూడా అనుమతించవు. బయట పది రూపాయలకు దొరికే అరలీటర్ బాటిల్ను కూడా నలభై యాభై రూపాయలకు అమ్మడం ఆనవాయితీ. చిన్న కుటుంబం టిక్కెట్లకు ఆరొందలు పెడితే లోపల పాప్ కార్న్ లాంటి వాటికి అంతకుమించి ఖర్చు పెట్టాల్సివస్తున్నది. ఈ వివాదాల నడుమ మల్టీప్లెక్స్ థియేటర్లు బయటి ఆహారపదార్థాలను లోపలికి అనుమతించాలని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇపుడీ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది.

చట్టం ఏం చెబుతోంది? వినియోగదారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏమంటోంది?

అసలు థియేటర్లలోకి ఆహారాన్ని నిషేధించే నిబంధన ఏదీ లేదని అధికారులు బీబీసీకి వివరించారు. ఆహారాన్ని సైతం బయట మార్కెట్ ధరలకే అమ్మాలని చెబుతున్నారు. కానీ థియేటర్లలో మాత్రం ధరలు బయటికంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.

అలాగే ‘బయటి ఆహారాన్ని థియేటర్లోకి తీసుకురాకూడదు’ అన్న బోర్డులూ కనిపిస్తూనే ఉన్నాయి.

అన్నీ అక్కడే

తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లో మల్టీప్లెక్స్‌ థియేటర్ల సంస్కృతి బాగా విస్తరిస్తోంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌లో ఈ థియేటర్లు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దృశ్యంలో స్పష్టత, శబ్దంలో నాణ్యతతో పాటు సౌకర్యవంతమైన సీట్లు, ఏసీ వంటి హంగులతో ఉండే మల్టీప్లెక్స్ థియేటర్లకు ఆదరణ పెరుగుతోంది. ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలాగా సినిమా వీక్షణం కూడా సౌకర్యవంతంగా ఉంటుందని మధ్యతరగతి వీటిని ఎంచుకుంటోంది. ఇక షాపింగ్ మాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు చిన్న థియేటర్లను కొనేసి వాటిని మల్టీప్లెక్స్‌లుగా తీర్చిదిద్దుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల సామాన్యులు అనివార్యంగా వీటిలోనే సినిమా చూడాల్సిన పరిస్థితి వస్తోంది.

మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒకేసారి రెండుమూడు రకాల సినిమాలు ఆడుతుంటాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లి షాపింగ్‌తో మిళితం చేశారు. ఆ తరువాత ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు తెరిచారు. అంటే సినిమా చూసుకొని.. షాపింగ్ చేసుకొని.. భోజనం ముగించుకొని ఇంటికి రావొచ్చు. సినిమా కోసం వచ్చే వినియోగదారుని చేత సాధ్యమైనంత వరకు ఖర్చుపెట్టించాలన్నది మల్టీప్లెక్స్‌ల ముఖ్యఉద్దేశంగా కనిపిస్తోంది.

బయటి ఆహారపదార్థాలు నిషేధం

బయట నుంచి తెచ్చుకోనివ్వరు లోపల ధరలు మామూలుగా ఉండవు ఇలా అయితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా స్థానిక పత్రిక ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌లో నిర్వహించిన సర్వేలో 83శాతం మంది బయటి స్నాక్స్ అనుమతించాలని అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

ఐనాక్స్ మూవీస్‌లో ఆహారపదార్థాల ధరలు

‘చిన్న పిల్లలని కూడా చూడలేదు’

పొదిలి ధనలక్ష్మి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. పిల్లలతో సినిమాకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె చెబుతున్నారు. "మా పిల్లలు బయటి పదార్థాలు తినరు. అందుకని కొన్ని పండ్ల ముక్కలు తీసుకెళ్లాం. భద్రతా సిబ్బంది వాటిని కూడా లోపలికి అనుమతించలేదు" అని ధనలక్ష్మి అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ధనలక్ష్మి

‘ఎంఆర్‌పీలు విపరీతంగా పెంచుతున్నారు’

విశాఖపట్నానికి చెందిన బోగి ప్రసాద్ కూడా మల్టీప్లెక్స్ థియేటర్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఎంఆర్‌పీకే విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడా అది అమల్లోకి రావడం లేదు. బయట రూ.10 దొరికే వస్తువుపై రూ.50 ఎంఆర్‌పీ వేసి అమ్ముతున్నారు. చిన్న గ్లాసు కోక్‌కు రూ.80, రూ.100 వసూలు చేస్తున్నారు. పాప్ కార్న్ విషయంలో దోచుకుంటున్నారు. కుటుంబంతో వెళ్లినప్పుడు సినిమా టికెట్ కంటే వీటికే ఎక్కువ ఖర్చవుతోంది. ఇప్పుడు చిన్న థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లను చూసి నేర్చుకుంటున్నాయి" అని ప్రసాద్ తన బాధను వెల్లబోసుకున్నారు.

రెండు సమోసా రూ.113

బీబీసీ కూడా కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్ల వెబ్‌సైట్లలో ఆహారపదార్థాల ధరలను పరిశీలించింది. పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్‌లో సినిమా టికెట్ బుక్ చేసుకొని డబ్బులు చెల్లించే ముందు ఒక పాపప్ విండో వచ్చింది. అందులో రకరకాల తినుబండారాలు, పానీయాల జాబితా ఉంది. గ్లాసు పెప్సీ ధర రూ.195 నుంచి రూ.308 మధ్య ఉంది. పాప్ కార్న్ రూ.210 నుంచి రూ.270 మధ్య ఉంది. పీజా ధర రూ.230, బర్గర్ రూ.160-170గా ఉన్నాయి.

అలాగే మరో సంస్థ ఐనాక్స్ మూవీస్ వెబ్‌సైట్‌లో చూసినప్పుడు పాప్‌కార్న్ ధరలు రూ.210 నుంచి రూ.340 మధ్య ఉన్నాయి. గ్లాసు కోక్ రూ.210-240గా ఉంది. రెండు సమోసాల ఖరీదు రూ.113. ఇక కాంబోల విషయానికి వస్తే రూ.380 నుంచి రూ.700 మధ్య ఉన్నాయి. ఇతర సంస్థల్లో కూడా ధరలు అటుఇటుగా ఇలాగే ఉన్నాయి. అధిక ధరలపై ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ సమయంలో అసహనం వ్యక్తం చేసి వదిలేయడం తప్ప దీన్ని పరిశోధించి నిబంధనలపై సంస్థలను నిలదీసేంత సమయమూ తీరిక వారికి ఉండవు.

ఫొటో క్యాప్షన్,

పీవీఆర్ సినిమాస్‌లో ఆహారపదార్థాల ధరలు

అనుమతించొద్దని చట్టంలో ఉందా?

మల్టీప్లెక్స్ థియేటర్లు బయటి ఆహారపదార్థాలను అనుమతించకపోవడం చట్ట విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వికాశ్ పాండే అన్నారు. ఇందుకు సంబంధించి చట్టాల్లో ఎటువంటి నిబంధనలు లేవని తెలిపారు.

"మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రధాన ఉద్దేశం సినిమా మాత్రమే కాదు దాని చుట్టూ భారీ వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడం. టికెట్లతోపాటే ఆహారపదార్థాల రూపంలో భారీ ఆదాయం చేకూరుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అన్నిచోట్లా పరిస్థితి ఇలానే ఉంది. గతంలో నీళ్ల బాటిల్‌ను అనుమతించాలని ఆదేశాలు ఇస్తే సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చాలా థియేటర్లు బడా నాయకులకు చెందినవి కావడం సమస్యను మరింత పెంచుతోంది" అని పాండే అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వికాశ్ పాండే

సంస్థలు ఏమంటున్నాయి?

ఈ విషయమై మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్ మూవీస్‌తో ఈమెయిల్ ద్వారా బీబీసీ సంప్రదింపులు జరిపింది. బయటి ఆహారాన్ని ఎందుకు అనుమతించడంలేదని, ధరలు ఎక్కువ ఎందుకని ప్రశ్నించగా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. బొంబాయి హై కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై తాము ఏమీ మాట్లాడలేమని ఐనాక్స్ మూవీస్ ప్రతినిధి తెలిపారు.

'మాకు తెలియదు'

బయటి ఆహారపదార్థాలను అనుమతించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చినట్లు తమకు తెలియదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫీక్కీ) చెబుతోంది. ఇందుకు సంబంధించి ఎటువంటి నోటీసులు తమకు రాలేదని మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దీపక్ అసర్ పత్రికా ప్రకటనలో తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నందున మరిన్ని వివరాలు చెప్పలేమని అన్నారు.

‘చట్టాల్లో మార్పు చేయాలి’

మల్టీప్లెక్స్‌ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరా, వినియోగదారుల వ్యవహారాలు, ధరలపర్యవేక్షణశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును బీబీసీ సంప్రదించింది. ధరలు, బయట ఆహారపదార్థాలను అనుమతించకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు. గతంలో తాము తనిఖీలు చేసి, కేసులు నమోదు చేయడం వల్ల ధరల విషయంలో కొంత మార్పు వచ్చినట్లు చెప్పారు.

"మల్టీప్లెక్స్‌లు తమకోసం ప్రత్యేకంగా ఉత్పత్తులను తయారు చేయించుకుంటున్నాయి. వాటిపై తమకు కావాల్సిన విధంగా అధిక ఎంఆర్‌పీలు వేస్తున్నాయి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ అధిక ఎంఆర్‌పీలపై తీసుకోలేదు. ఇందుకు సంబంధించి చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి" అని మంత్రి అన్నారు.

ఫొటో క్యాప్షన్,

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

అకున్ సబర్వాల్ సమీక్ష

మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక ధరలపై తెలంగాణ తూనికలు, కొలతలశాఖ తాజాగా సమీక్ష నిర్వహించింది. మల్టీప్లెక్స్ సంస్థలు, థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బయట మార్కెట్లో ఏ ధరకు అమ్ముతారో అదే ధరకు మల్టీప్లెక్స్‌ల్లో విక్రయించాలని తెలంగాణ తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. నాన్ ప్యాకేజ్డ్ ఉత్పత్తులను స్మాల్, మీడియం, బిగ్, జంబో అంటూ విక్రయించడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. పరిమాణం, బరువు వంటి వాటిని కచ్చితంగా ముద్రించాలని స్పష్టం చేశారు. సెప్టెంబరు ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

‘చర్యలు తీసుకుంటాం’

మల్టీప్లెక్స్ థియేటర్లు బయటి ఆహారపదార్థాలు అనుమతించకపోవడంపై హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ఇందుకు సంబంధించి చట్టాల్లో ఎటువంటి నిబంధనలు లేవని, థియేటర్ల యాజమాన్యాలే నిషేధాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అధ్యయనం చేసి, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయస్తామని చెప్పారు.

‘రాజకీయ నాయకుల అండదండలు’

మల్టీప్లెక్స్‌ల వ్యవహారం కొత్తది కాదు. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. మరి ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నిస్తే అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒకటి - పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటం. రెండు- వ్యాపారులే రాజకీయ నాయకులుగా మారుతుండటం. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక మంత్రి మాటల్లోనూ ఇదే అభిప్రాయం ధ్వనించింది. "వెనుకా ముందు ఎవరూ లేని వారు ప్రభుత్వానికి భయపడుతున్నారు. నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ పెద్దపెద్ద థియేటర్లు మాట వినడంలేదు" అని ఆ మంత్రి అన్నారు.

మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. అందువల్ల ఏం చేయలేకపోతున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఒకవైపు, చట్టాల్లోని లొసుగులు మరోవైపు ఇలా మల్టీప్లెక్స్‌ల దోపిడి కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)