అభిప్రాయం: మోదీ అయినా, మన్మోహన్ అయినా ఈ 120 మందికి మాత్రం అన్నీ ‘అచ్ఛే దిన్’లే

  • 18 జూలై 2018
నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ Image copyright Getty Images

ప్రస్తుతం భారతదేశంలో రూ.6836 కోట్ల (వంద కోట్ల డాలర్లు) కన్నా ఎక్కువ సంపద కలిగిన వారు 120 మంది ఉన్నారు. అమెరికా, చైనాలు కాకుండా వేరే ఏ ఇతర దేశాలలోనూ ఇంతమంది బిలియనీర్లు లేరు. అందువల్ల ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి.

ఈ 120 మంది కేవలం భారతీయులు కాదు. వీళ్లు భారతదేశ 'గ్రోత్ స్టోరీ'కి బ్రాండ్ అంబాసిడర్లు. భారతీయులు వాళ్లను చూసి ఆశ్చర్యపోవాలి. వాళ్ల విజయాలను గుర్తించాలి.

వాళ్ల ఇళ్లలో జరిగే వేడుకలు టీవీల్లో లైవ్‌లో చూపిస్తారు. పెద్ద పెద్ద స్టార్లు కూడా అక్కడ ప్రదర్శనలు ఇస్తారు. పెద్దపెద్ద నేతలు వచ్చి నవదంపతులను ఆశీర్వదిస్తారు.

వాళ్లను చూసి దేశప్రజలు మనం కూడా ఎవరికీ తీసిపోమని గర్విస్తారు.

మనదేశంలో కొంతమంది వ్యక్తుల విజయాలను మొత్తం దేశం విజయాలుగా చూపించడం చాలా సులభం.

కేవలం వ్యాపారంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ మనకు ఇదే కనిపిస్తుంది. అమెరికాలో ఇంద్రా నూయి, బ్రిటన్‌లో లక్ష్మీ మిట్టల్, సిలికాన్ వేలీలో సత్య నాదెళ్ల.. వీళ్ల విజయాలను మొత్తం దేశం సాధించిన విజయంగా చూపించడం జరుగుతుంది.

చూడండి... పోయిన ఏడాది ఫలానా స్థానాల్లో ఉన్న అంబానీ, అదానీ ఈ ఏడాది ఫలానా స్థానానికి ఎగబాకారు. ఇలాంటి వార్తల వల్ల దేశంలో 25 కోట్ల మంది ఎలా జీవిస్తున్నారో మర్చిపోవచ్చు. దేశంలో అభివృద్ధి జరుగుతోందని విశ్వసించొచ్చు.

Image copyright Getty Images

సంస్కరణల భ్రమలు

ఇటీవలే భారతదేశ ఆర్థికవ్యవస్థ ఫ్రాన్స్‌ను దాటిపోయింది. ప్రస్తుతం అది ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరుకుంది.

కానీ దేశంలో ఇంకా ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లని 25 కోట్ల మందికి ఈ సక్సెస్ స్టోరీని ఎలా చెప్పాలి?

నిజానికి ఈ విజయాలు దేశానివి కావు, వ్యక్తులవి.

ఒకప్పుడు దేశం అత్యంత ఎక్కువగా గౌరవించే వ్యక్తులలో విజయ్ మాల్యా ఒకరు. ఆయన తనకు కోరిక కలగగానే ఎంపీ అయిపోయారు. ఆయనలాంటి అనేక మంది ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నారు. వాళ్లందరికీ డబ్బు సంపాదించడం చాలా కష్టం కావచ్చు. కానీ పార్లమెంట్‌లో అడుగుపెట్టడం మాత్రం చాలా సులభం.

దీని అర్థం మిలియనీర్లు అంతా అవినీతిపరులు కాదు లేదా అతనిలాగా పారిపోతారని కాదు.

Image copyright Reuters

మాటలకే పరిమితమైన 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'

ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థను కేవలం ఒక వేయి మంది నియంత్రిస్తున్నారు.

వీళ్లే ప్రతి రాజకీయ పార్టీకి విరాళాలు ఇస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, వాళ్ల పనులు మాత్రం జరిగిపోతాయి. ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల జుగల్‌బందీనే ముద్దుగా 'క్రోనీ క్యాపిటలిజం' అని పిలుస్తారు. ఈ జుగల్‌బందీ కొనసాగినంత కాలం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' అన్న నినాదం మాటలకే పరిమితమవుతుంది.

రిలయన్స్‌కు రాఫెల్ కాంట్రాక్ట్, 'జియో'కు, పేటీఎమ్‌కు ప్రభుత్వం నజరానాలు ఇవ్వడం మనం చూశాం. ప్రధాని, అదానీకి ఎంత దగ్గరో విపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ అధికారంలోకి వస్తే విపక్షాలూ దీనికి మినహాయింపు కాదు. అధికారంలో ఎవరు ఉన్నా అంబానీ, విజయ్ మాల్యా, సుబ్రతో రాయ్‌లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ప్రపంచవ్యాప్తంగా మరీ ప్రత్యేకించి భారతదేశంలో ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. భూమిని, మౌలిక సదుపాయాలను సమకూరుస్తాయి. పన్నుల్లో మినహాయింపులు ఇస్తాయి. దీనికి కారణం అవి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే కారణంతోనే. దీనిని అభినందించాల్సిందే.

Image copyright RONNY SEN

ధనికులే మరింత ధనవంతులు

కానీ దేశంలో ఎన్నో ఏళ్లుగా ధనికులే మరింత ధనికులవుతున్నారు. వారి ఆధిక్యత కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ కనిపిస్తుంది. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

దేశంలోని కోట్లాది మంది పేదల ప్రయోజనాలు, బిలియనీర్ల ప్రయోజనాలు ఒకటి కాలేవు. వాటికి ప్రతి చోటా ఘర్షణే. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వం రెండింటికి మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం పేదల పక్షం వహించి ఉంటే, ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గిపోయి ఉండేది.

భారతదేశం కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా విడిపోయి ఉంది. అసమానతలన్నీ సహజమైనవి అని చాలా మంది భావిస్తుంటారు. ఆర్థిక అసమానతలను ప్రజలు చాలా సులభంగా అంగీకరిస్తారు. ఎవరైనా దానిని ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వ వ్యతిరేకులనో, వామపక్షవాదులనే ముద్ర వేయడం జరుగుతుంది.

ప్రభుత్వం రోజువారీ కూలీని కనీసం 10-20 రూపాయలైనా పెంచకుంటే, పరిస్థితులు మారే అవకాశం లేదు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 10 శాతం అభివృద్ధి రేటు గురించి మాట్లాడుతుండేది. ఇప్పుడు బీజేపీ విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని అంటోంది. కానీ దేశంలో ఇంకా ఆకలిచావుల వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని చూస్తే లోలోపల ఎక్కడో చాలా పెద్ద తప్పు జరుగుతోందని అనిపిస్తుంది.

రచయిత జేమ్స్ క్రాబ్‌ట్రీ ఎకనమిక్స్ టైమ్స్ పత్రికలో ''దేశంలోని 55 శాతం సంపద కేవలం అత్యంత సంపన్నులైన 10 మంది చేతుల్లోనే ఉంది. 1980లలో అది 30 మంది చేతుల్లో ఉండేది'' అని రాశారు. ఆ పదిశాతంలోనూ, పైనున్న ఒక్క శాతం వారి చేతిలో 22 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది.

విదేశీ సంస్థలకు ఆర్థిక వ్యవస్థ ద్వారాలను తెరిచినప్పటి నుంచి దేశంలో సంపద పెరిగిపోయింది. మధ్యతరగతి వారి ఆదాయం పెరగడం, కోట్ల మంది ప్రజలు దారిద్ర్యరేఖకు పైకి వచ్చిన మాట నిజం. కానీ ధనికులు, పేదల మధ్య అంతరమే కలవరపెడుతోంది.

'ప్రపంచ అసమానత నివేదిక' 1950- 1980 మధ్యకాలంలో దేశంలోని అతి సంపన్నులైన ఒక శాతం మంది సంపద తగ్గిందని చెబుతోంది. కానీ తర్వాత వినిమయతత్వం పెరిగాక, వాళ్ల సంపద పెరగడం ప్రారంభమైంది. 1980 నుంచి వాళ్ల సంపద ఎన్నడూ తగ్గలేదు.

2014 నాటికి దేశంలోని 39 కోట్ల మంది పేద ప్రజల మొత్తం ఆదాయం అత్యంత ధనవంతులైన ఒక్క శాతం వారి కంటే 33 శాతం తగ్గిపోయినట్లు చెబుతోంది.

మరో అధ్యయనంలో సోషలిస్టు దశాబ్దాలుగా భావించే 60, 70వ దశకాలలో దేశ ఆర్థిక పిరమిడ్‌లో అతి కింద ఉన్న వారి ఆదాయం చాలా వేగంగా పెరిగిందని వెల్లడిస్తోంది. ఆ సమయంలో పేదప్రజల ఆదాయం ధనికుల ఆదాయంకన్నా వేగంగా పెరిగింది. కానీ ఆ తర్వాత అదెప్పుడూ జరగలేదు. అదే ధోరణి కొనసాగి ఉంటే, భారతదేశంలో నేడున్నంత అసమానత ఉండేది కాదు.

ధనికులు, పేదల మధ్య ఈ అంతరం కేవలం వాళ్ల ఆదాయాలలోనే కాదు, విద్య, ఆరోగ్యంలాంటి మౌలిక సదుపాయాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. దాన్ని చూస్తే ఆ అసమానతలను కొనసాగించడానికే నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది.

భారతదేశం నేడు ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. కానీ దేశంలోని 120 కోట్ల మంది ప్రజల ఆదాయం కేవలం 120 మంది వ్యక్తుల ఆదాయంకన్నా వేగంగా పెరగనంత వరకు, భారతదేశం ఫ్రాన్స్‌లా మారలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

భార‌త్‌ - చైనా ఉద్రిక్త‌త‌లు: రెండు వైపులా తాత్కాలికంగా బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌

బైక్‌లపై బందిపోటు ముఠాలు.. కిడ్నాప్‌లు, హత్యలతో హడలెత్తిస్తున్నారు

‘జోక్యం చేసుకోవద్దు’: బ్రిటన్‌‌కు చైనా హెచ్చరిక... ముదురుతున్న వివాదం

‘స్వలింగ సంపర్కం వ్యాధి కాదు’

‘కోవిడ్ వ్యాక్సిన్ విడుదలకు డెడ్‌లైనా? తొందరపాటు వద్దు’: శాస్త్రవేత్తల హెచ్చరిక

భార‌త్‌ - చైనా స‌రిహ‌ద్దు: బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ శాశ్వ‌త‌మా? తాత్కాలిక‌మా?‌

వికాస్ దుబే: నేర‌స్థులు రాజ‌కీయాల్లోకి ఎలా అడుగుపెడుతున్నారు?

మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది

కరోనా రోజుల్లో పోలీస్ డ్యూటీ: ఒక లేడీ కానిస్టేబుల్ అంతరంగం