స్వామి అగ్నివేశ్‌పై దాడి: బీజేవైఎం కార్యకర్తలే కొట్టారని ఆరోపణ

స్వామి అగ్నివేశ్
ఫొటో క్యాప్షన్,

స్వామి అగ్నివేశ్

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై ఝార్ఖండ్‌లోని పాకుర్ ప్రాంతంలో నడిరోడ్డుపైన కొందరు దాడి చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కింద పడేసి తీవ్రంగా కొట్టారు.

అగ్నివేశ్ దుస్తుల్ని చింపేసి, అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దాడిలో ఆయనకు అంతర్గతంగా గాయాలయ్యాయి. దాడి ఆనంతరం ఆయన ప్రభుత్వ చీఫ్ సెక్రటెరీకి ఫోన్ చేసి ఈ ఘటనపై చర్య తీసుకోవాలని కోరారు.

‘ఇది ప్రభుత్వ ప్రయోజనాల కోసం జరిగిన దాడి. అతికష్టమ్మీద జనాల నుంచి స్వామి అగ్నివేశ్‌ను ప్రాణాలతో తప్పించగలిగాం. ఆ సమయంలో పోలీసులు మాకెలాంటి సాయం చేయలేదు. అగ్నివేశ్ ఫోన్ చేశాక కూడా పాకుర్ ఎస్పీ ఆయన్ను కలవడానికి రాలేదు. వాళ్లంతా భాజపా కోసం పనిచేస్తున్నారు’ అని అగ్నివేశ్ ప్రతినిధి, బందువో ముక్తి మోర్చ అధ్యక్షుడు మనోహర్ మానవ్ బీబీసీతో చెప్పారు.

తాను వస్తున్న సమాచారం ముందుగానే పోలీసులకు, అధికారులకు అందించినట్లు దాడి అనంతరం అగ్నివేశ్ చెప్పారు.

‘నేను ఆదివాసీలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను. అధికారులకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. అయినా నాకు ఎలాంటి రక్షణా కల్పించలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా స్పందించలేదు’ అని అగ్నివేశ్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

మరో పక్క అగ్నివేశ్ కార్యక్రమం గురించి తమకు ముందుగానే సమాచారం అందిందన్న విషయాన్ని పాకుర్ ఎస్పీ శైలేంద్ర బర్నవాల్ ఖండించారు. ‘మాకు అగ్నివేశ్ కార్యక్రమం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం మేం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాం. దోషులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అని శైలేంద్ర బీబీసీకి వివరించారు.

దాడి ఎలా జరిగింది?

‘స్వామి అగ్నివేశ్ బస చేసిన హోటల్ బయట భారతీయ జనతా యువ మోర్చ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అగ్నివేశ్ హోటల్ నుంచి కాలు బయటపెట్టగానే 10-12మంది వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. నల్ల జెండాలు చూపించి వెనక్కి వెళ్లిపొమ్మని నినాదాలు చేశారు. ఆయనపై చెప్పులతో దాడి చేయడంతో పాటు తీవ్రంగా దూషించారు’ అని రాం ప్రసాద్ సిన్హా అనే స్థానిక పాత్రికేయుడు చెప్పారు.

తమ కార్యకర్తలే అగ్నివేశ్‌పై దాడి చేశారన్న ఆరోపణలను భారతీయ జనతా యువ మోర్చ పాకుర్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న మిశ్రా ఖండించారు.

‘స్వామి అగ్నివేశ్ క్రైస్తవ మిషనరీల ఏజెంట్. ఆయన ఇక్కడి ఆదివాసీల ఆలోచనలను తప్పుదోవ పట్టించడానికే వచ్చారు. మేం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాన్ని ఖండించాం. అంతేకాని ఆయనపై దాడి చేశామన్న ఆరోపణలు నిరాధారం’ అని ప్రసన్న మిశ్రా అన్నారు.

ఎవరీ అగ్నివేశ్?

చత్తీస్‌గఢ్‌లో పుట్టిన స్వామి అగ్నివేశ్ కోల్‌కతాలో ఎంబీఏ చదివారు. ఆ తరవాత ఆర్య సమాజ్‌లో చేరి సన్యాసం తీసుకున్నారు. 1968లో ఆర్య సభ పేరుతో ఓ పార్టీని స్థాపించారు.

1981లో బందువా ముక్తి మోర్చ(కట్టుబానిసత్వ నిర్మూలన సంస్థ)ను నెలకొల్పారు. హరియాణా నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచి మంత్రిగానూ సేవలందించారు.

కానీ గతంలో కార్మికులపై ఓసారి లాఠీ ఛార్జ్ జరిగిన అనంతరం ఆయన మంత్రి పదవి వదులుకొని రాజకీయాలకు స్వస్తి పలికారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)