గ్రౌండ్ రిపోర్ట్: బీదర్ దగ్గర అసలేం జరిగింది? వాట్సాప్ వదంతులపై ఆ గ్రామస్తులు ఏమంటున్నారు?

  • 18 జూలై 2018
ముర్కి గ్రామానికి వెళ్లే మార్గం

"నేనింకా ప‌డుకోలేక‌పోతున్నాను. క‌ళ్లు మూస్తే.. కారులో ఇరుక్కున్న‌ ముగ్గురూ ముఖాల నిండా ర‌క్తంతో చేతులు జోడించి.. వాళ్ల‌ను ర‌క్షించ‌మంటున్న దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. జ‌నం అంతలా మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తారంటే న‌మ్మ‌లేక‌పోతున్నా’’ అని చెప్పారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పోలీస్ కానిస్టేబుల్.

"ఆ ఘ‌ట‌న త‌రువాత ఊరు ఖాళీ అయిపోయింది. అంద‌రూ షాక్‌లో ఉన్నారు. అరెస్టుల భ‌యంతో స‌గం మంది గ్రామ‌స్తులు ఊరు వ‌దిలి వెళ్లిపోయారు" అని ముర్కికి చెందిన రాజేంద‌ర్ పాటిల్ త‌మ గ్రామం ప‌రిస్థితిని బీబీసీకి వివ‌రించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబీదర్ దగ్గర అసలేం జరిగింది? వాట్సాప్ వదంతులపై ఆ గ్రామస్తులు ఏమంటున్నారు?

చిన్న పిల్ల‌ల కిడ్నాప‌ర్ అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన ఒక మ‌నిషిని చంపింది ఈ గ్రామం ద‌గ్గ‌రే. ఒక వ్య‌క్తి మ‌ర‌ణం, ప‌లువురి గాయాల‌కు దారి తీసిన ఫేక్ న్యూస్ గురించి తెలుసుకోవ‌డానికి బీబీసీ ప్ర‌తినిధి దీప్తి బ‌త్తిని క‌ర్ణాట‌క రాష్ట్రం బీద‌ర్ జిల్లాలోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించారు.

వారాంతంలో విహార యాత్ర కోసం ఈ ప్రాంతానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల‌ ప్రయాణం విషాదంగా మారింది. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్ర‌గాయాల‌తో ఆసుప‌త్రి పాల‌య్యారు.

జూలై 13 సాయంత్రం హైద‌రాబాద్ నుంచి కారులో బ‌య‌ల్దేరిన ఆజ‌మ్, స‌ల్మాన్, స‌లాహ్, నూర్‌లు క‌ర్ణాట‌క బీద‌ర్ ద‌గ్గ‌ర్లోని హండికేర గ్రామం ద‌గ్గ‌ర ఉన్న త‌మ స్నేహితుడు ఆఫ్రోజ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఇది హైద‌రాబాద్‌కి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హండికేర గ్రామం ప‌చ్చ‌టి పొలాల మ‌ధ్య ఉంది. అక్క‌డ 150 వ‌ర‌కూ లింగాయ‌త్, గిరిజ‌న కుటుంబాలు.. సుమారు 20 ముస్లిం కుటుంబాలు ఉంటాయి.

"మా బంధువుల ఇంటికి చేరుకున్నాక వాళ్ల‌ను భోజ‌నాల‌కు ఏర్పాట్లు చేయ‌మ‌ని కోరాం. అక్క‌డికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా పొలాలు చూడ్డానికి వెళ్లాం. దారిలో స్కూలు నుంచి తిరిగివ‌స్తున్న పిల్ల‌ల‌ను చూశాం. ఖ‌తార్ వాసి స‌లాహ్ త‌న దగ్గ‌ర ఉన్న చాక్లెట్లు పిల్ల‌ల‌కు ఇచ్చాడు. కొంచెం దూరం వెళ్లాక రోడ్డు ప‌క్క‌గా కారు ఆపి అక్క‌డ ఉన్న స‌ర‌స్సు ద‌గ్గ‌ర మాతో ఉన్న మ‌డ‌త కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. కొంద‌రు గ్రామ‌స్తులు వ‌చ్చి మా కారు టైర్ల‌లో గాలి తీయ‌డం మొద‌లు పెట్టారు. అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. మ‌మ్మ‌ల్ని పిల్ల‌ల కిడ్నాప‌ర్లని వాళ్లు ఆరోపించారు. మేం వాళ్ల‌కు న‌చ్చ‌చెప్పాల‌ని చూశాం. కానీ ఉప‌యోగం లేక‌పోయింది. మేం సాయం కోసం మా చుట్టాల‌కు ఫోన్ చేశాం" అని వివ‌రించాడు ఆఫ్రోజ్.

చిత్రం శీర్షిక అఫ్రోజ్

అక్క‌డే మిగతా గ్రామ‌స్తుల‌తో ఉన్న అమ‌ర్ పాటిల్ అనే వ్య‌క్తి ఈ గొడ‌వ‌ను రికార్డు చేశారు. దాదాపు 200 మంది సభ్యులున్న మ‌ద‌ర్ ముర్కి అనే వాట్స‌ప్ గ్రూపులో అత‌డు ఈ వీడియో పెట్టారు.

అదే స‌మ‌యంలో అఫ్రోజ్ అంకుల్ మ‌హ‌మ్మ‌ద్ యాకుబ్ అక్క‌డ‌కు వ‌చ్చి గ్రామ‌స్తుల‌కు న‌చ్చ‌చెప్ప‌బోయారు. కానీ వారు విన‌లేదు.

"వాళ్లు మావాళ్ల‌ను పిల్ల‌లు కిడ్నాప‌ర్లు అని ఆరోపిస్తూనే ఉన్నారు. వాళ్ల‌ను కొడుతూ కారుపై రాళ్లు వేయ‌డం మొద‌లుపెట్టారు. ఆ గొడ‌వ‌లో నూర్ త‌ల‌పై దెబ్బ‌లు త‌గిలాయి. నేను, ఇంకొందరు మిత్రులు క‌ల‌సి అత‌ణ్ణి జ‌నం నుంచి త‌ప్పించి బైక్ పై పంపించేశాం. ఆఫ్రోజ్ గ్రామ‌స్త‌ుల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈలోపే స‌లాహ్, స‌ల్మాన్, ఆజ‌మ్‌లు కారులో వేగంగా వెళ్లిపోయారు. దాంతో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింది, ఇంట్లో క‌లుసుకోవ‌చ్చు అనుకున్నాం. కానీ మా వాళ్ల కారు ప‌క్క ఊరి ద‌గ్గ‌ర ఉన్న చిన్న కాలువ‌లో ప‌డిపోయింద‌ని ఐదు నిమిషాల్లోనే ఫోన్ వ‌చ్చింది" అని చెప్పారు యాకుబ్.

త‌న‌కూ, చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ఉన్న త‌మ బంధువుల‌కూ అది ఎంతో భ‌యంక‌ర‌మైన రాత్రి అన్నారు.

"ముర్కిలో ఉన్న వాళ్ల‌ను ర‌క్షించ‌డానికి వెళ్లిన మా వాళ్లు ప్రాణభ‌యంతో వెన‌క్కువ‌చ్చారు. ఆ రాత్రి నా కుటుంబం గురుంచి కూడా భ‌యం వేసింది. నేను అఫ్రోజ్‌ని దాచి పెట్టాను. నా పిల్ల‌ల‌ను కూడా వేరే ఇంట్లో దాచాను" అని చెప్పారు యాకుబ్.

అంతా నిమిషాల‌లో జ‌రిగిపోయింది. హండికేరిలో జ‌రిగిన గ‌లాటా వీడియో సాయంత్రం 5.15 ప్రాంతంలో వాట్స‌ప్ గ్రూపులో పోస్ట్ అయిందని తెలుస్తోంది.

"మాకందరికి ఆ వీడియో గ్రూప్‌లో వచ్చింది. హండికేరి ఊళ్ళో ఒకరు ఇక్కడ నవనీత్ పాటిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసి, ఒక ఎర్ర కల‌ర్ కారులో కిడ్నాప‌ర్లు మా ఊరు వైపు వస్తున్నారని చెప్పారు. దాంతో మా చాయ్ దుకాణంలోంచి కుర్చీలు, బ‌ల్ల‌లు రోడ్డు పైకి లాగి అడ్డంగా పెట్టారు. కార్ చాలా వేగంగా వచ్చి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని రోడ్డు పక్క ఉన్న గుంత లోకి పడిపోయింది. జనం గుమిగూడి రాళ్లు విసరటం మొదలుపెట్టారు. చూస్తూ చూస్తూనే 600 మందికి పైగా వ‌చ్చేశారు. పక్క ఊళ్ళో వాళ్లు అందరూ వచ్చేప్పటికి వెయ్యి మంది దాక అయ్యారు" అని ముర్కి సెంటర్‌లో టీ దుకాణం ఓనర్ విజయ్ పాటిల్ చెప్పారు.

"ఒక మెసేజ్ ఇంత అనర్థానికి దారి తీసింది. అందుకే ఆ వాట్సాప్ గ్రూప్స్ డిలీట్ చేసేసాను" అని ఫోన్ చూపిస్తూ చెప్పాడు విజయ్.

ముర్కి ఊళ్ళో జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి పోలీసులు ద‌గ్గ‌ర‌ ఉంది. ఈ వీడియో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఫోన్లలో రికార్డు చేసింది. దాన్ని వారు విచారణ కోసం తీసుకున్నారు. ఈ వీడియోని విశ్లేషించి దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు.

ఆ వీడియోలో ఒక గుంపు కార్లోంచి ఒక వ్యక్తికి తాడు వేసి లాగి కర్రలు, రాళ్లతో చితక బాదుతున్నట్టు కనిపిస్తోంది. ఇంకొంత మంది కార్లో ఉన్న వారిపై రాళ్లు విసురుతున్నారు. ఈ వీడియోలో కొంత‌ మంది ఒకరిద్దరు ఊళ్ళో వారి సహాయంతో మిగితా వారిని ప్రాధేయపడుతున్నట్టు కనిపిస్తుంది.

క‌మ‌ల్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉండే ముర్కి గ్రామంలో దాదాపు 5,000 జ‌నాభా ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఇటువంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌లేదు. ఈ గ్రామం స‌రిగ్గా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల‌కు మ‌ధ్య‌లో ఉంటుంది.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వెనుక‌బ‌డిన 250 జిల్లాల్లో బీద‌ర్ ఒక‌టి. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం బీద‌ర్‌లో 74 శాతం అక్ష‌రాస్య‌త ఉంది. ముర్కి గ్రామంలో ఒక బ్యాంకు, రెండు చిన్న టీ దుకాణాలు, ఒక హార్డ్ వేర్ దుకాణం, ఇంకా కొన్ని చిన్న చిన్న షాపులు ఉన్నాయి.

అప‌రాల వ్య‌వ‌సాయం మీదే గ్రామం ఎక్కువ‌గా ఆధార‌ప‌డి ఉంది. గ్రామంలో చాలా మంది ఉపాధి కోసం హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల‌కు వ‌చ్చేశారు.

హైద‌రాబాద్‌లోని ఒక ఫుడ్ డెలివ‌రీ యాప్‌లో డెలివ‌రీ బాయ్‌గా పనిచేసే సంతోష్ ఈ వార్త తెలిసిన వెంట‌నే ఊరు వ‌చ్చాడు.

"మాలో చాలా మంది హైద‌రాబాద్‌లో ప‌నిచేస్తాం. నాలానే చాలా మంది అస‌లేం జ‌రిగిందో తెలుసుకుందామ‌ని ఊరొచ్చాం. ఇక్క‌డ వ్య‌వ‌సాయం వ‌ర్షాధారం. వాన‌లు బావుంటే మాకు మంచి సీజ‌న్. లేదంటే వేరే ప‌నులు వెతుక్కోవాలి. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ల‌కు ద‌గ్గ‌రగా ఉండ‌డంతో మాకు వ‌ల‌స వెళ్ళ‌డం సులువు" అని చెప్పారు సంతోష్. ఆ గ్రామానికి వెళ్లే దారిలో చాలా ఖాళీ భూములు క‌నిపిస్తాయి. కానీ చాలా త‌క్కువ నేల మాత్ర‌మే సాగులో ఉంది.

సాధార‌ణంగా ఇక్క‌డ కుటుంబ‌ గొడ‌వ‌లు, చిన్న భూత‌గాదాలు, తాగుబోతుల న్యూసెన్స్ కేసులే ఎక్కువగా వ‌స్తుంటాయ‌ని చెప్పారు ఓ పోలీసు అధికారి. కానీ ఈ గొడ‌వ‌లో 8 మంది పోలీసుల‌కు గాయాల‌య్యాయి. వారిలో చాలా మందికి ఎముక‌లు విరిగాయి.

"నేనింకా ప‌డుకోలేక‌పోతున్నాను. అలా క‌న్నుమూశానో లేదో వెంట‌నే మెల‌కువ వ‌చ్చేస్తోంది. కారులో ఇరుక్కున్న‌ ముగ్గురూ ముఖాల నిండా ర‌క్తంతో చేతులు జోడించి వాళ్ల‌ను ర‌క్షించ‌మంటున్న దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. జ‌నం అంతలా మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తారంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. వాళ్ల‌ను వ‌దిలేయాలని, వెళ్లిపోమ‌నీ జ‌నాల్ని అడుక్కున్నాం మేం. కానీ మేం కిడ్నాప‌ర్ల‌కు మ‌ద్ద‌తిస్తున్నామంటూ వాళ్లు మాతో వాదించారు" అని చెప్పుకొచ్చారు మ‌ల్లికార్జున అనే కానిస్టేబుల్.

ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లిన వాళ్ల‌లో మ‌ల్లికార్జున ఒక‌రు. మ‌ల్లికార్జున ఎడ‌మ కాలికి చాలా ఫ్రాక్చ‌ర్లు అయ్యాయి. అత‌డు బీద‌ర్‌లోని ఒక ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు. ప్ర‌స్తుతం వెల‌వెల‌బోతున్న ఆ గ్రామంలో పోలీసులు ప‌హారా కాస్తున్నారు.

గత రెండు నెలలుగా వాట్సాప్‌లో ఫేక్ న్యూస్ ప్రచారమవుతుండటం.. వాటి ఫలితంగా జరిగిన దారుణాల‌తో బీద‌ర్ జిల్లా పోలీసులు, ఫేక్ న్యూస్ మీద అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు.

ముర్కి గ్రామంలో దాడి త‌రువాత గ‌స్తీలో ఉన్న ఒక పోలీసు అధికారి త‌న ఫోన్ తీసి చూపిస్తూ.. "మేము ఊరూరూ తిరిగి ఒక డప్పులు కొట్టి ప్రచారం చేశాము. ఇలా వాట్సాప్‌లో వచ్చిన వార్తలని నమ్మవద్దని వివరించాము. పిల్లలని ఎత్తుకెళ్లే బృందాలు ఏమీ లేవు. ఉంటే పోలీసులు తమ పని చేస్తారని చెప్పాము. ఎవరైనా చట్టం తమ చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా చెప్పాము. ఇంత చేశాక కూడా ఇలా జరగటం చాలా దురదృష్టకరం’’ అని చెప్పారు.

బీదర్ జిల్లా ఎస్‌పీ డి.దేవరాజా మాట్లాడుతూ గత వారం జరిగిన సంఘటన తరువాత దాదాపు 20 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు గ్రూప్స్‌ని డిలీట్ చేసినట్టు తెలిపారు. ఆ రోజు వీడియో కొన్ని గ్రూపుల్లో తిరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ గ్రూపులు డిలీట్ చేసినట్టు చెప్పారు.

ఇప్ప‌టికే రెండు కేసులు న‌మోద‌య్యాయి. హండికేర గ్రామంలో జ‌రిగిన గొడ‌వ విష‌యంలో వ‌క్రానా స్టేష‌న్‌లో కేసు న‌మోద‌యింది. రెండో కేసు క‌మ‌ల్‌న‌గ‌ర్ స్టేష‌న్లో న‌మోద‌యింది. చ‌ట్ట వ్య‌తిరేకంగా గుమి గూడ‌డం, ప్ర‌భుత్వ అధికారి విధులు నిర్వ‌హించ‌కుండా అడ్డుకోవ‌డం, హ‌త్య కేసులు న‌మోద‌య్యాయి.

"మొద‌టి కేసులో చ‌ట్ట‌వ్య‌తిరేకంగా గుమిగూడ‌డం కింద న‌లుగురిని అరెస్టు చేశాం. రెండో కేసులో 22 మందిని అరెస్టు చేశాం. వాట్స‌ప్ గ్రూపులో ఆ వీడియో పోస్టు చేసిన అడ్మిన్ కూడా అరెస్ట‌యిన వారిలో ఉన్నారు. ఆ గుంపులో ఉన్న ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఇద్ద‌రు టీనేజ‌ర్లు (జువైన‌ల్స్) కూడా అరెస్టయ్యారు" అని చెప్పారు ఎస్పీ దేవ‌రాజా.

అరెస్ట‌యిన వారంద‌రినీ ఆదివారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచి జుడీషియ‌ల్ రిమాండ్ నిమిత్తం ఔరాద్ జైలుకు పంపారు. కేసు త‌దుప‌రి విచార‌ణ జూలై 27న జ‌ర‌గ‌నుంది.

"ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే మేం 50 మందిని క‌స్ట‌డీలోకి తీసుకున్నాం. ప్ర‌త్య‌క్ష సాక్షులు రికార్డు చేసిన వీడియో తీసుకుని ప్ర‌తీ ఫ్రేమునూ ఫొటో తీసుకున్నాం. ఆ వీడియోల‌ను విశ్లేషించి ఎవ‌రు దాడి చేశారో, ఎవ‌రు ర‌క్షించారో గుర్తించాం. అందులో నుంచి 18 మందిని గుర్తించాం. మిగ‌తా యాంగిల్స్‌లో తీసుకున్న వీడియోల‌ను కూడా మేం విశ్లేషిస్తున్నాం. ఇంకెవ‌రినైనా గుర్తిస్తే వారిని కూడా అరెస్టు చేస్తాం" అని చెప్పుకొచ్చారు విచార‌ణ‌లో భాగ‌మైన ఒక సీనియ‌ర్ పోలీసు అధికారి.

జరిగిన ఘ‌ట‌న‌పై గ్రామస్తులు కూడా అసంతృప్తితో ఉన్నారు. అరెస్టైన వారిలో ఒక‌రి సోదరుడు.. "ఆ వీడియో చూసి మాకు కోపం వచ్చింది. నిజమే కాబోలనుకున్నాము. కారు ఆగకుండా వేగంగా రావటంతో వీరు నిజంగానే కిడ్నాప‌ర్లు, పారిపోయే ప్రయత్నంలో ఉన్నవాళ్ల‌ని అనుకున్నాం. కానీ తరువాత పేపర్లలో వారి గురించి చదివి బాధ కలిగింది. మా సోదరుడు జైల్లో ఉన్నాడు. ఆ రోజు నేను ఊళ్ళో లేను. త‌ర్వాత‌ ఏంటి అన్నది చూడాలి. చట్టం తన పని తాను చేస్తుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)