‘మీరు వాస్తవాలను నమ్మాలి’.. ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు చేసిన బరాక్ ఒబామా.. మీరు తెలుసుకోవాల్సిన ఐదు అంశాలు

  • 18 జూలై 2018
బరాక్ ఒబామా Image copyright Nelson Mandela Foundation
చిత్రం శీర్షిక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత బరాక్ ఒబామా తొలిసారి శక్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆయా విషయాలపై తన భావాలను స్పష్టంగా వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై గళం విప్పారు. దక్షిణాఫ్రికా జాతి వివక్ష పోరాట యోధుడు నెల్సన్ మండేలా శతజయంతి సందర్భంగా నెల్సన్ మండేలా ఫౌండేషన్ కార్యక్రమంలో ఒబామా ప్రసంగించారు. అందులోని అయిదు ముఖ్యాంశాలు.

1. వాస్తవాలను నమ్మాలి

పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఒబామా తప్పుబట్టారు. కళ్ల ముందు కనిపించే వాస్తవాలను అంగీకరించాలన్నారు. "ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. కొందరికి అది కనిపించకపోవడం హాస్యాస్పదం."

Image copyright AFP
చిత్రం శీర్షిక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

2. వలసలే బలం

వలసదారులపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై ఒబామా ఇలా స్పందించారు.

"సమాజంలో అంతరాలు తొలగిపోవాలంటే ప్రతిఒక్కరని భాగస్వాములు చేయాలి. అందరి శక్తియుక్తుల మీదనే సమాజం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. విశ్వసమరంలో విజేతగా నిలిచిన ఫ్రెంచ్ ఫుట్‌బాల్ జట్టును చూడండి. ఆ జట్టులో గాలియన్లు (పశ్చిమ యూరప్‌లోని ఒక జాతి ప్రజలు) మాత్రమే లేరు. అయినా వారంతా ఫ్రెంచ్ జాతీయులు. అమెరికాలో, దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష ఇప్పటికీ ఉందన్నది దాచలేని వాస్తవం. "

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టులో ఆఫ్రికా మూలాలు కలిగిన వారు కూడా ఉన్న విషయాన్ని ఒబామా ప్రస్తావించారు.

Image copyright Getty Images

3. సామాన్యులకు దూరంగా శ్రీమంతులు

"ప్రపంచవ్యాప్తంగా శ్రీమంతులు పేదలకు దూరమవుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పేదల బతుకులను సంపన్నులు అర్థం చేసుకోవడం లేదు. అందుకే వారు కంపెనీలను ఇష్టారీతిలో మూసివేస్తుంటారు. కంపెనీ వాటాదార్లకు మాత్రమే జవాబుదారీగా ఉంటే చాలని భావిస్తుంటారు. "

Image copyright AFP
చిత్రం శీర్షిక నెల్సన్ మండేలా స్మారక ఉపన్యాస కార్యక్రమంలో దాదాపు 15 వేల మంది పాల్గొన్నారు

4. నియంతృత్వంతో సరికాదు

"భయపెట్టడం, ఆగ్రహం, తక్కువ చేసి చూడం మునుపెన్నడూ లేనివిధంగా నేడు రాజకీయాల్లో పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని సమస్యలున్నాయి. అంతమాత్రానా నియంతృత్వం సరైనది కాదు. నెల్సన్ మండేలా బోధనలు నేడు ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. శాంతి, సామరస్యం మండేలా సిద్ధాంతాలతోనే సాధ్యం.

ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు విజయపథంలో ముందుకు సాగుతున్నాయంటే అందుకు కారణం ప్రగతిశీల భావనలే. తాత్కాలికంగా సమస్యలు ఎదురు కావొచ్చు.కానీ చివరకు సత్యమే గెలుస్తుంది. "

Image copyright AFP
చిత్రం శీర్షిక దక్షిణాఫ్రికాకు వెళ్లేముందు కెన్యాలో కుటుంబ సభ్యులను కలిశారు

5. ఇదే సరైన సమయం

"యువత నమ్మకం కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ గొంతును బలంగా వినిపించండి. ప్రపంచానికి ఒక్క నాయకత్వం మాత్రమే సరిపోదు. అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలి.

అణచివేతను ఎదుర్కొని స్వేచ్ఛా బావుటను ఎగరవేసే శక్తి యువతకు ఉందని నెల్సన్ మండేలా చెప్పారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. యువత ధైర్యంగా ముందుకు కదలాలి. "

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)