‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

  • కిశోర్ పాండురంగ బేలేకర్
  • బీబీసీ కోసం
రాందాస్ నౌక, జల సమాధి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

టైటానిక్ కథ మనలో చాలా మందికి తెలుసు. కానీ, మనలో ఎంతమందికి ముంబయి టైటానిక్ గురించి తెలుసు? 1947 ఆగస్టు 15న భారత దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోతే ముంబైలోని కొన్ని కుటుంబాలు విషాదంలో మునిగిపోవడం వెనుక ఒక నౌక ఎలా కారణమైంది? దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధించి ఆ వివరాలను రచయిత బీబీసీతో ఇలా పంచుకున్నారు.

ఎస్.ఎస్.రాందాస్ నౌక గురించి తొలిసారిగా నేను విన్నది మా నాన్న నోటి నుంచే. అప్పుడు నేను చిన్నపిల్లాడ్ని. మా నాన్న ఓ మిల్లులో పనిచేసేవారు. మాది మధ్యతరగతి కుటుంబం. అప్పట్లో మాకు రేడియో ఉండేది. టీవీ మాత్రం విలాసవంతమైన వస్తువు కిందే లెక్క. కానీ, మా నాన్న చాలా బాగా కథలు చెప్పేవారు. రోజూ రాత్రి పడుకునే ముందు ఓ చక్కటి కథ వినేవాళ్లం. ఓ రోజు రాత్రి ఎస్.ఎస్. రాందాస్ నౌక ప్రమాదం గురించి ఆయన మాకు చెప్పారు.

ఫొటో సోర్స్, Kishor Belekar

ఫొటో క్యాప్షన్,

బర్కు షేత్ ముఖ్ధం

సినిమాగా తీయాలని..

ఆ విషాద ఘటన చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతుండేది. 2006లో దాన్ని ఓ సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం ఎస్.ఎస్. రాందాస్ ప్రమాదం గురించి, అందులో ప్రయాణించిన వారి వివరాల కోసం పరిశోధన మొదలు పెట్టా.

చాలా సమాచారం సేకరించా. వందల కొద్ది వార్తా పత్రికలను తిరిగేశా. ఈ విషయంలో పరిశోధకులు ఖాస్గీవాలే నాకు చాలా సహాయపడ్డారు.

నా కథ కోసం మొదట బర్కు షేత్ ముఖ్ధం ( ప్రమాదం జరిగినప్పుడు ఈయన వయసు 10 ఏళ్లు)ను కలిశా. అక్కడి నుంచి నా ప్రయాణం దక్షిణాఫ్రికాలో ఉన్న అబ్దుల్ ఖయిస్‌ను కలవడంతో ముగిసింది.

ఫొటో సోర్స్, Kishor Belekar

రాందాస్ పేరు ఎందుకు పెట్టారంటే..

రాందాస్ నౌకను స్వాన్ అండ్ హంటర్ కంపెనీ నిర్మిచింది. విలాసవంతమైన క్వీన్ ఎలిజబెత్ నౌకను నిర్మించింది కూడా ఈ సంస్థే. రాందాస్ నౌక పొడువు 179 అడుగులు, వెడల్పు 29 అడుగులు. దాదాపు వెయ్యి మంది ప్రయాణించే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 1936లో దీన్ని సముద్రంలో ప్రవేశ పెట్టారు. కొన్నాళ్లకు ఇండియన్ కోపరేటివ్ స్టీమ్ నావిగేషన్ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది.

ఆ కాలంలో భారత్‌లో స్వాతంత్ర్య పోరాటం తీవ్రంగా జరుగుతోంది. చాలా మంది స్వదేశీ ఉద్యమకారులు కలిసి ఈ నౌక సంస్థను స్థాపించారు. కొంకణ్ తీరంలో సర్వీసులు నడిపే ఈ సంస్థను సుఖర్ బోట్ సేవగా పిలిచేవారు.

స్థానికుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ తన నౌకలకు జయంతి, తుకారం, రాందాస్, సెయింట్ ఆంటోని, సెయింట్ ఫ్రాన్సిస్ తదితర పేర్లు పెట్టింది.

రాందాస్ నౌక ప్రమాదానికి గురైన దారిలోనే దానికంటే ముందు మరో రెండు నౌకలు మునిగిపోయాయని నాకు తెలిసింది. చాలా కొద్దిమందికి మాత్రమే ఈ రెండు ప్రమాదాల గురించి తెలుసు.

రాందాస్ ప్రమాదం కంటే ముందు అంటే 11 నవంబర్ 1927న ఎస్.ఎస్. జయంతి, ఎస్.ఎస్. తుకారం నౌకలు ఒకే దారిలో ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఖళాసీలు, ప్రయాణికులు కలిపి మొత్తంగా జయంతిలో ఉన్న 96 మంది చనిపోగా, తుకారం నౌకలో ఉన్న 146 మందిలో 96 మంది మృతిచెందారు.

ఫొటో సోర్స్, Kishor Belekar

అమావాస్య రోజున ప్రయాణం

దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇదే దారిలో ఎస్.ఎస్.రాందాస్ నౌక మునిగిపోయింది. నౌక ప్రమాదం జరిగిన సమయంలో అందులో 48 మంది ఖళాసీలు, 18 మంది సిబ్బంది, 673 మంది ప్రయాణికులు ఉన్నారు. టికెట్ తీసుకోకుండా వచ్చిన 35 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అంటే దాదాపు 778 మంది ప్రయాణిస్తున్నారు.

17 జులై 1947 ఉదయం 8 గంటలకు ముంబయిలోని అలీబాగ్ సమీపంలోని జెట్టీ దగ్గర ఎస్.ఎస్.రాందాస్ తన చివరి ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

ఆ రోజు అమావాస్య కావడంతో చాలా మంది పనికి వెళ్లలేదు. మత్య్సకారులు, వ్యాపారులు కూడా నౌకలో ఉన్నారు.

నౌక డెక్ పైన కొంతమంది ఇంగ్లిష్ అధికారులు కుటుంబాలతో కలిసి ఉన్నారు. నేను కలిసిన బర్కు షేట్ ముక్దమ్ వయసు ఇప్పుడు 90 ఏళ్లు. ప్రమాదం జరిగిన సమయంలో అతని వయసు 10 ఏళ్లు.

అబ్బాస్ కయిస్ వయసు 89 ఏళ్లు. ఆయనను నేను దక్షిణాఫ్రికాలో కలిశాను. ప్రమాదం జరిగిన సమయంలో అతని వయసు 12 ఏళ్లు. కొంతమంది గర్భవతులు కూడా అప్పుడు నౌకలో ప్రయాణిస్తున్నారు.

ఫొటో సోర్స్, Kishor Belekar

లైఫ్ జాకెట్ల కోసం కొట్లాట

ప్రయాణికులు అందరూ నౌకలోకి రాగానే 'వార్ఫ్ సూపరింటెండెంట్' విజిల్ ఊదాడు. అప్పుడు నౌక పెద్ద శబ్దం చేసుకుంటూ ముందుకు కదిలింది. ఒకవైపు కూలీలు నిచ్చెనలు తొలగిస్తుండగానే కొంతమంది నౌక ఎక్కేశారు.

ఆ రోజు ముంబయిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ప్రయాణికులు తడవకుండా ఉండేందుకు నౌక లోపల టార్పాలిన్‌లు పరిచారు. నౌకలో ఉన్నవారిలో చాలా మంది ఒకరికొకరు తెలిసినవారే.

అప్పుడప్పుడు నౌక రాళ్లను తాకుతూ కుదుపులకు గురవుతోంది. ప్రయాణికులకు ఇదేమీ కొత్త అనుభవం కాదు. సముద్రం లోపలికి వెళ్లేటప్పుడు నౌకలు ఇలానే ఉంటాయి.

తీరం నుంచి 13 కిలోమీటర్ల దూరం కూడా వెళ్లక ముందే వర్షం మరింత ఎక్కువైంది. తీవ్రమైన గాలులతో రాకాసి అలలు నౌకపై విరుచుకు పడుతున్నాయి. డెక్ పైకి నీళ్లు చేరడం మొదలైంది. ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.

నౌకలో పరిమిత సంఖ్యలోనే లైఫ్ జాకెట్లు ఉన్నాయి. వాటిని తీసుకొనేందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు.

కెప్టెన్ షెయిక్ సులేమన్, చీఫ్ ఆఫీసర్ ఆడమ్ భాయి ఎంత మొత్తుకున్నా వాళ్లు వినడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images

టార్పాలిన్‌లో చిక్కుకున్న ప్రయాణికులు

నౌక ఒకవైపు వంగిపోగానే ఈత వచ్చిన వాళ్లు వెంటనే సముద్రంలో దూకేశారు. కొంతమంది లైఫ్ జాకెట్లు వేసుకొని దూకారు. మరికొంతమంది దేవుడ్ని ప్రార్ధిస్తూ నౌకలోనే ఉండిపోయారు.

ఎస్.ఎస్.రాందాస్ నౌక గల్స్ ఐస్‌లాండ్ సమీపంలోకి రాగానే ఓ పెద్ద కెరటం దాన్ని అడ్డుకుంది. దీంతో నౌక పూర్తిగా ఒక వైపు వంగిపోయి సముద్రంలో మునిగిపోయింది. టార్పాలిన్ కవర్లు కప్పిఉండడంతో చాలామంది అందులోనే చిక్కుకుపోయారు.

ఇప్పటి వరకు భారత నౌక ప్రయాణ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ప్రమాదం. ఉదయం 9 గంటలకు ప్రమాదం జరిగితే ముంబయి వాసులుకు సాయింత్రం ఐదు గంటలకుగాని తెలియలేదు.

నౌక కెప్టెన్ సులేమన్ తీరం వరకు ఈదుకుంటూ వచ్చి స్థానికులకు చెప్పడంతో ఈ ప్రమాదం గురించి ప్రపంచానికి తెలిసింది.

17 జులై 1947న రాందాస్ నౌక మునిగిపోయింది. నెల రోజుల తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది.

దేశమంతా సంబరాల్లో మునిగితేలితే ముంబయిలోని చాలా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విషాదంతో గడిపాయి. తమ వారి జాడ కోసం సముద్రం వైపు చూశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)