ప్రెస్ రివ్యూ: 'శబరిమల ఆలయంలోకి మహిళలూ వెళ్లొచ్చు'

  • 19 జూలై 2018
Image copyright Getty Images

కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు విస్పష్టం చేసిందంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

10-50 మధ్య వయసు బాలికలు, మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆ దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భారత యువ న్యాయవాదుల సంఘం తదితర పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన రాజ్యంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.

''పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు, మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26 ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Image copyright JithenderReddy/ FB

'సీఎం మనవడు తినే బియ్యమే హాస్టల్‌ పిల్లలకు'

సీఎం కె. చంద్రశేఖర్‌రావు మనవడు తినే నాణ్యమైన బియ్యాన్నే గురుకుల పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఏంపీ జితేందర్‌రెడ్డి అన్నా రని 'సాక్షి' రాసింది.

ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టాన్ని సవరిస్తూ డిటెన్షన్‌ విధానాన్ని విస్తృత పరిచేందుకు బుధవారం లోక్‌సభలో తెచ్చిన బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడారు.

ఐదో తరగతిలో ఉత్తీర్ణత సాధించకుంటే పైతరగతిలో ప్రవేశానికి అనర్హుడిని చేసే నిబంధనను తొలగించాలని కోరారు.

స్కూళ్లలో మౌలిక వసతుల లేమి చిన్నారులను తీవ్రంగా వేధిస్తోందని ఆయన అన్నారు.

Image copyright Getty Images

మందుల వ్యాపారంలో విదేశీ పెత్తనం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ.. దేశంలోనే రెండో అతిపెద్ద ఫార్మసీ స్టోర్‌ చెయిన్‌ సంస్థగా ఖ్యాతికెక్కిన మెడ్‌ప్లస్‌లో పెట్టుబడులు పెట్టి దేశీయ మందుల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చూస్తోందంటూ 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనం రాసింది.

ఇప్పటికే ఫ్యాషన్‌, కిరాణా, వినోదం తదితర రంగాల ద్వారా భారతదేశంలో ప్రవేశించిన అమెజాన్‌ సంస్థ.. ఫార్మసీ విభాగంపైన కూడా దృష్టి పెడుతూ.. ఆన్‌లైన్‌ మోడల్‌లో కస్టమర్లకు ఫార్మసీ సేవలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

ఇందుకు గానూ ప్రస్తుతం డజను రాష్ట్రాల్లో 1400కు పైగా మెడికల్‌ స్టోర్లతో 2.5 లక్షల రోజూవారీ వినియోగదారులకు సర్వీసులు అందిస్తున్న 'మెడ్‌ప్లస్‌'ను హస్తగతం చేసుకోవాలని చూస్తోంది.

ఇక అమెజాన్‌ దారిలోనే.. మరో అమెరికా అగ్రగామి శీతల పానీయాల సంస్థ కోకాకోలా సైతం భారత హెల్తీ డ్రింక్‌ మార్కెట్‌ పై మక్కువ చూపుతోంది.

ఎప్పటి నుంచో భారత మార్కెట్లో పోషక పానీయాలను(హార్లిక్స్‌, బూస్ట్‌, మాల్టోవా వంటి బ్రాండ్లు), మందుల ఉత్పత్తులను సప్లై చేస్తున్న గ్లాక్సో స్మిత్‌ క్లైన్‌ (జీఎస్కే)ను కొనుగోలు చేయాలని కోకాకోలా ప్రణాళికలు వేస్తుండటమే ఇందుకు నిదర్శనమని 'నవతెలంగాణ' రాసింది.

Image copyright AFP

ఏసీబీకి పట్టుబడ్డ పీసీబీ అధికారి

అక్రమార్జనతో కోట్లు కూడబెట్టిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారి సత్యనారాయణ ఏసీబీకి దొరికిపోయారంటూ 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

అవినీతి సొమ్ముతో పోగేసిన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుని, ఆ అధికారిని ఏసీబీ జైలుకు పంపింది.

విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్‌లలో ఏకకాలంలో సత్యనారాయణ ఇల్లు, బంధువులు, బినామీల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.

మార్కెట్‌ విలువ ప్రకారం దాదాపు రూ. 32 కోట్లకు పైగా స్థిరాస్తులు, బంగారు నగలు, వెండి సామాన్లు, లాకర్లలో నోట్ల కట్టలు, బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లను ఏసీబీ స్వాధీనం చేసుకొంది.

ఆయా పరిశ్రమల యజమానుల నుంచి సత్యనారాయణ లంచాలు తీసుకుని రెడ్‌ జోన్‌లో ఉన్న వాటికి గ్రీన్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

రాష్ట్రపతి Image copyright Telangana I & PR

తెలంగాణ గిరిజన యువకుడికి గౌరవం

ప్రాణాలు లెక్క చేయకుండా పర్వతారోహణ చేసి రికార్డు నెలకొల్పిన రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ పర్వతారోహకుడు ఆంగోత్ తుకారాంను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అభినందించారని 'నమస్తే తెలంగాణ' రాసింది.

యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన ఆంగోత్ తుకారాం ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.

కిలిమంజారో పర్వతంపై 18 అడుగుల జాతీయ జెండాను ఎగురవేయడంతోపాటు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలంటూ ప్రచార సందేశాన్ని పంపించాడు.

తుకారాంను బుధవారం రాష్ట్రపతిభవన్‌కు ఆహ్వానించిన కోవింద్.. రికార్డుపత్రాన్ని అందజేసి ప్రశంసించారు. తుకారం దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నాడని కొనియాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)