ఒక్క రోజులోనే మారిన ఇంటర్ ఫలితం... నిన్న 0 మార్కులు, నేడు 99 మార్కులు : ప్రెస్ రివ్యూ

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు

తెలంగాణలో ఓ విద్యార్థినికి మొదట ఓ సబ్జెక్ట్‌లో ఇంటర్ బోర్డ్ తొలుత 'సున్నా' మార్కులు వేసిందని, మరుసటి రోజు అదే సబ్జెక్ట్‌లో ఆమెకు '99' మార్కులు వచ్చినట్లు ఫలితాలను సవరించిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని కరిమల జూనియర్‌ కళాశాలకు చెందిన గజ్జి నవ్య ఇటీవల సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాశారు.

ఒక్క తెలుగు మినహా అన్ని సబ్జెక్టుల్లో ఆమెకు 95కుపైగా మార్కులు వచ్చాయి. తెలుగులో మాత్రం ఇంటర్ బోర్డు సున్నా మార్కులే వేసింది.

గతేడాది ఆమె మండల టాపర్‌ కావడంతో తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దినపత్రికల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది.

కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఇంటర్ బోర్డు ఈ అంశంపై స్పందించింది.

నవ్యకు తెలుగులో వచ్చిన మార్కులను 99కి సవరించింది.

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం అపోహలేనని, బోర్డు అధికారుల అంతర్గత తగాదాల వల్ల ఇవి రేగినట్లు తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి వెల్లడించారు.

ఈ అపోహలను తొలగించేందుకు తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ (టీఎ్‌సటీఎస్‌) ఎండీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఒక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని, పొరపాట్లను సరిదిద్దుతామని చెప్పారు.

ఫలితాల విషయంలో అనుమానాలు ఉంటే రీకౌంటింగ్‌, వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు'' అని ఆంధ్రజ్యోతి ఈ కథనంలో తెలిపింది.

'బాబ్రీని కూల్చినందుకు గర్వంగా ఉంది'

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సమయంలో తాను అక్కడికి వెళ్లానని, మసీదుపైకి ఎక్కి కూల్చానని భాజపా నాయకురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించినట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ కథనం రాసింది.

''బాబ్రీమసీదును కూల్చే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు గర్వంగా ఉందని ప్రజ్ఞాసింగ్ అన్నారు.

దాన్ని కూల్చే అవకాశం, శక్తి భగవంతుడు తనకు కల్పించాడని, అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నిర్మించి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు జారీ చేసింది.

రాజకీయ నాయకులు విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంలో మతసామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి, సంయమనం పాటించాలని నాయకులకు సూచించింది.

తాను శపించడం వల్లే ముంబయి ఉగ్రదాడి సమయంలో ఏటీఎస్ అధిపతి హేమంత్ కర్కరే ప్రాణాలు కోల్పోయారంటూ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలు చేసినందుకు కూడా ఇప్పటికే ఈసీ నోటీసు జారీ చేసింది'' అని నమస్తే తెలంగాణ ఈ కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్‌ చెప్తే మోదీపై ప్రియాంక పోటీ

కాంగ్రెస్ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించినట్లు 'సాక్షి' దినపత్రిక కథనం రాసింది.

''భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలను కాపాడుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రియాంక అన్నారు.

తమ పార్టీ అధికారం కోసం పోటీచేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.

సంకుచిత భావజాలంతో వ్యవహరించే వ్యక్తుల నుంచి, అసమ్మతిని అణచివేసే వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యాన్ని, అసమ్మతి గొంతుకను ఎన్డీయే ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ప్రియాంకను ఓ దొంగ భార్యగానే ప్రజలు చూస్తారన్న కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తమ కుటుంబంపై బీజేపీ నేతల విమర్శల దాడి నిత్యం ఉండేదేనని బదులిచ్చార''ని సాక్షి ఈ కథనంలో వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

భారత అణ్వాయుధాలు దీపావళి కోసమా - నరేంద్ర మోదీ

తీవ్ర హెచ్చరికలు చేయడంతోనే పాకిస్తాన్ భారత వాయుసేన పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడుదల చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు 'ఈనాడు' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

''పైలట్‌ పాక్‌కు చిక్కినప్పుడు జవాబు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయని, అప్పుడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పాక్‌ను హెచ్చరించామని మోదీ అన్నారు.

మోదీ 12 క్షిపణులను సిద్ధం చేశారని, పరిస్థితి విషమిస్తోందని రెండు రోజుల తరువాత అమెరికాకు చెందిన సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

దాంతో పైలట్‌ను విడుదల చేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిందని చెప్పారు.

ప్రధాని పదవి ఉన్నా, లేకపోయినా ఉగ్రవాదులతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు మోదీ వెల్లడించారు.

అణ్వాయుధాలు ఉన్నాయంటూ పాక్‌ చేసే బెదిరింపులకు భయపడేది లేదని, భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దీపావళి కోసమేమైనా అట్టిపెట్టుకున్నామా అని అన్నారు.

ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి తాను తప్ప ఇంకెవరున్నారని ఆయన ప్రశ్నించారు.

ఉపగ్రహాల విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయని, దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి అంశానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందా అని మోదీ ప్రశ్నించించారు'' అని ఈ కథనంలో ఈనాడు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)