మారిటల్ రేప్‌ చట్టానికి ఉన్న అడ్డంకులేంటి?

  • సరోజ్ సింగ్, విభురాజ్
  • బీబీసీ ప్రతినిధులు
మహిళ, మారిటల్ రేప్

ఫొటో సోర్స్, SPL

'పెళ్లంటే అర్థం భార్య ఎల్లప్పుడూ భర్తతో సెక్స్‌కు సిద్ధంగా ఉండాలని కాదు' - ఒక ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్న గీతా మిత్తల్, సి.హరిశంకర్‌ల ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఇది.

మారిటల్ రేప్(దాంపత్య రేప్)పై ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని రిత్ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్‌లు దిల్లీ హైకోర్టులో దాఖలు చేశాయి.

రిత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు చిత్రా అవస్థీ బీబీసీతో మాట్లాడారు. ఈ పిటిషన్ నేపథ్యాన్ని ఆమె వివరించారు.

రేప్‌కు ఇచ్చిన నిర్వచనంలో వివాహితలపై వివక్ష ఉన్నట్టు కనిపిస్తుందన్నది ఆమె వాదన. భర్త తన భార్యపై జరిపే రేప్‌ను కూడా నిర్వచించి దానికి ఓ చట్టం తేవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం. అనేక మంది మహిళల అనుభవాలను ఆమె తన పిటిషన్‌కు ప్రాతిపదికగా చూపారు.

ఈ పిటిషన్‌ను రెండేళ్ల క్రితం వేశారు.

ఇదొక ప్రజాహిత వ్యాజ్యం కాబట్టి దిల్లీలో పని చేసే మెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే ఎన్‌జీవో కూడా కోర్టులో తన వాదనల్ని వినిపించింది. మెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ పురుషుల హక్కుల కోసం పని చేస్తుంది.

మెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు అమిత్ లఖానీ దీనిపై స్పందిస్తూ.. "వివాహితలపై వారి భర్తలు ఎలాంటి దౌర్జన్యానికి పాల్పడినా చట్టంలో అనేక సెక్షన్లున్నాయి. వాటి సహాయం పొందవచ్చు. అలాంటప్పుడు మారిటల్ రేప్‌పై విడిగా చట్టం దేనికి?" అని ప్రశ్నించారు.

ఇంతకూ 'రేప్'కూ, 'మారిటల్ రేప్'కు తేడా ఏంటనేది అసలు ప్రశ్న.

రేప్ అంటే ఏంటి?

ఏ వయసు మహిళనైనా సరే, ఆమె ఇష్టానికి విరుద్ధంగా లేదా ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరంలో(యోని లేదా మలద్వారం) ఎవరైనా వ్యక్తి తన శరీరంలోని ఏ భాగాన్ని జొప్పించినా అది రేప్ అవుతుంది.

ఆమె రహస్యాంగాల్లోకి జొప్పించే లక్ష్యంతో ఎవరైనా ఆమెకు హాని తలపెట్టే ప్రయత్నం రేప్ అవుతుంది.

ఆమె నోటిలో ఎవరైనా తన మర్మావయ భాగాన్ని జొప్పిస్తే అది రేప్ అవుతుంది.

ఆమెతో ఓరల్ సెక్స్ చేయడం రేప్ అవుతుంది.

ఫొటో సోర్స్, Thinkstock

ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, ఒక వ్యక్తి ఎవరైనా మహిళతో ఈ కింద ఇచ్చిన పరిస్థితుల్లో సంభోగానికి పాల్పడ్డట్టయితే దాన్ని రేప్‌గా వ్యవహరిస్తారు.

1. మహిళ ఇష్టానికి విరుద్ధంగా

2. మహిళ అనుమతి లేకుండా

3. మహిళను చంపేస్తామని లేదా హాని చేస్తామని లేదా ఆమె దగ్గరివారికి ఎవరికైనా ఏమైనా చేస్తామని భయపెట్టి ఆమెను సంభోగానికి ఒప్పిస్తే.

4. మహిళ సెక్స్‌కు అంగీకరించిన సమయంలో ఆమె మానసిక స్థితి సరిగా లేనట్టయితే, లేదా ఆమెపై ఏవైనా మత్తు పదార్థాల ప్రభావం ఉంటే, జరుగుతున్నదేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో సదరు మహిళ ఉంటే.

కానీ ఇందులో ఒక మినహాయింపు కూడా ఉంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న భార్యతో శారీరక సంబంధాలు నెరపడం కూడా నేరమే అని సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో చెప్పింది. దానిని రేప్‌గా పరిగణిస్తారని చెప్పింది. మైనర్ భార్య ఏడాదిలోపు దీనిపై ఫిర్యాదు చేయవచ్చు.

ఈ చట్టంలో వివాహిత మహిళ (18 ఏళ్లకు పైబడిన)తో ఆమె భర్త బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని ఎలా భావించాలన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అందుకే మారిటల్ రేప్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

మేరిటల్ రేప్ అంటే ఏంటి?

భారతదేశంలో "దాంపత్య అత్యాచారం" లేదా "మారిటల్ రేప్" చట్టం దృష్టిలో నేరం కాదు.

అందుకే ఐపీసీలోని ఏ సెక్షన్లో కూడా దీనికి నిర్వచనం లేదు. దీనికి ఎలాంటి శిక్ష ఉన్నట్టు నిబంధనలు కూడా లేవు.

కానీ ప్రజాహిత వ్యాజ్యం వేసిన రిత్ ఫౌండేషన్‌కు చెందిన చిత్రా అవస్థీ మాత్రం "భర్త తన భార్య అనుమతి లేకుండా బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే అది నేరమే" అంటారు.

ఫొటో సోర్స్, TwitterManekaGandhi

2016లో మారిటల్ రేప్ గురించి వ్యాఖ్యానించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ "పాశ్చాత్య దేశాల్లో మారిటల్ రేప్ వాదన ఎక్కువగా ఉండచ్చు, కానీ, భారత దేశంలో పేదరికం, విద్య స్థాయి, మత విశ్వాసాల కారణంగా వివాహిత మహిళలపై అత్యాచార వాదన సరికాదు" అన్నారు.

మారిటల్ రేప్‌ను నేరంగా ఖరారు చేయాలంటూ దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు 2015లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ కోర్టు "దీనివల్ల వివాహ బంధాలు అస్థిర పడొచ్చు" అని వాదించింది.

మారిటల్ రేప్‌ను నేరంగా ఖరారు చేయలేమని దిల్లీ హైకోర్ట్ కేంద్రంతో స్పష్టం చేసింది. "అలా చేయడం వల్ల వివాహ వ్యవస్థ అస్థిరతకు గురవుతుందని, భర్తలను వేధించడానికి భార్యలకు ఇది ఒక సులువైన పద్ధతి అవుతుంది" అని వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెబుతుంది?

హిందూ వివాహ చట్టం భార్యాభర్తలకు పరస్పరం కొన్ని బాధ్యతలను నిర్ణయిస్తుంది. ఇందులో సహజీవనం హక్కు కూడా ఉంటుంది.

చట్టం ప్రకారం సెక్స్‌కు అంగీకరించకపోవడం క్రూరత్వం అవుతుంది. దీని ఆధారంగా విడాకులు కోరవచ్చు.

అసలేంటీ వివాదం?

ఒక వైపు అత్యాచార చట్టం, మరో వైపు హిందూ మ్యారేజ్ యాక్ట్. రెండింటిలో నిబంధనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. దాంతో మారిటల్ రేప్ చట్టంపై గందరగోళం నెలకొని ఉంది.

మెన్స్ వెల్‌ఫేర్ ట్రస్ట్‌కు చెందిన అమిత్ లఖానీ "రేప్ అనే మాట ఎప్పుడూ థర్డ్ పార్టీగానే ఉండాలి. వైవాహిక బంధాల్లో దాన్ని ఉపయోగించడం తప్పు" అంటారు.

ఇటు రిత్ ఫౌండేషన్ మాత్రం "మారిటల్ రేప్ చట్టం లేకపోవడం వల్లే మహిళలు దానికి బదులు గృహహింస లాంటి చట్టాల సాయం తీసుకుంటున్నారు. అది వారి వాదనకు బలం ఇవ్వడానికి బదులు బలహీనం చేస్తోంది" అని అంటోంది.

నిర్భయ అత్యాచార కేసు తర్వాత జస్టిస్ వర్మ కమిటీ కూడా మారిటల్ రేప్ కోసం ప్రత్యేక చట్టం చేయాలని సిఫార్సు చేసింది. పెళ్లి తర్వాత సెక్స్‌కు కూడా అంగీకారం, సమ్మతి ఉండాలని చెప్పింది.

ఫొటో సోర్స్, Thinkstock

అయితే మహిళల వాదనేంటి?

మారిటల్ రేప్‌పై విడిగా చట్టం లేకపోవడం వల్లనే మహిళలు తమపై జరుగుతున్న హింసను ఎదుర్కోడానికి తరచూ 498(ఎ) చట్టం సాయం తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

అయితే, 498(ఎ) సెక్షన్లో భర్త లేదా అతడి బంధువులు ప్రవర్తనను కూడా కలిపారు. ఒక మహిళకు మానసికంగా, శారీరకంగా హాని కలిగిస్తే, లేదా ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పిస్తే, దోషి అయిన భర్తకు ఈ సెక్షన్ ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

అత్యాచార చట్టంలో గరిష్ఠంగా జీవిత ఖైదు, బాధితురాలిని అత్యంత హేయంగా హింసిస్తే ఉరిశిక్ష వేయాలనే నిబంధన కూడా ఉంది.

1983 ఐపీసీ సెక్షన్ 498(ఎ) వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత 2005లో ప్రభుత్వం గృహ హింస ఫిర్యాదుల కోసం "ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రం డొమెస్టిక్ వయలెన్స్" పేరుతో ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది.

ఇందులో అరెస్టు లాంటి శిక్షకు బదులు జరిమానా, రక్షణ లాంటి సాయం అందించే నిబంధనలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, youtube

తర్వాత ఏం జరగొచ్చు?

మారిటల్ రేప్‌పై కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఈ డిమాండ్‌తో గత రెండేళ్లుగా దిల్లీ హైకోర్టులో వాదనలు నడుస్తున్నాయి.

ఈ కేసులో తర్వాతి విచారణ ఆగస్టు 8న జరగనుంది. ఆ రోజున రెండు పక్షాలూ తమ తరఫున కొత్త వాదనలు వినిపించనున్నాయి.

ప్రపంచంలోని మిగతా దేశాల్లో దీనిపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే దానిపై కూడా చర్చ జరగనుంది. ప్రస్తుతానికి దీనిపై తీర్పు రావడానికి ఇంకాస్త సమయం పట్టచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)