మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు చెందిన ప్రైవేటు సంస్థ ఎస్సార్ ఆయిల్, రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు.
భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల సమక్షంలో ఆ ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు.
దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని.. వాటిన్నింటినీ ప్రధానమంత్రి కార్యాలయం నివృత్తి చేయాలని కుటుంబరావు డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "బ్యాంకుల నుంచి విచ్చలవిడిగా రుణాలు తీసుకుని ఎస్సార్ గ్రూపు వారు పలు పరిశ్రమలు పెట్టారు. 2016 అక్టోబర్‌లో గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ఎస్సార్ ఆయిల్ సంస్థలో వాటా అమ్మకానికి సంబంధించి రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్నెఫ్ట్తో డీల్ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల సమక్షంలోనే ఆ ఒప్పందం కుదిరింది. అది రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు గ్రూపు సంస్థకు మధ్య జరిగిన డీల్. కానీ.. దాన్ని రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంగా చెప్పారు" అని కుటుంబ రావు ఆరోపించారు.
ఫొటో సోర్స్, Getty Images
2016 అక్టోబర్ 15వ తేదీన గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, వీటీబీ బ్యాంకు ప్రెసిడెంట్, ఛైర్మన్ ఆండ్రీ కొస్టిన్ల సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న రాస్‌నెఫ్ట్ ప్రెసిడెంట్, ఛైర్మన్ ఇగోర్ సెచిన్, ఎస్సార్ సహ వ్యవస్థాపకుడు శశి రూయా
ఆ ఒప్పందం వల్ల ఎస్సార్ ఆయిల్లో పెట్టుబడి పెట్టిన మదుపరులు తీవ్రంగా నష్టపోయారని కుటుంబరావు ఆరోపించారు.
"2016 మార్చిలో ఎస్సార్ ఆయిల్ సంస్థ నికర విలువను రూ. 3500 కోట్లు అని బ్యాలెన్స్ షీట్లో చూపించారు. మరి అదే ఏడాది అక్టోబర్‌లో రూ. 73 వేల కోట్లకు ఆ సంస్థ ఎలా అమ్ముడుపోతుంది?
ఈ ఒప్పందం చేసుకోక ముందే ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్ కంపెనీ నికర విలువ రూ.3,500 కోట్లేనని చెప్పి మదుపరుల్ని బయటకు పంపారు. ఆ తర్వాత రూ.73 వేలకు దాన్ని అమ్మారు.
ఆ సమయంలో నోట్ల రద్దు(డీమానిటైజేషన్) వల్ల దేశం మొత్తం అతలాకుతలమై ఉంది. దాంతో చాలావరకు మీడియా సంస్థలు ఈ ఎస్సార్ ఆయిల్ ఒప్పందం వ్యవహారాలను పట్టించుకోలేదు.
ఇందులో భారత్ ఒక్కటే కాదు.. రష్యా, చైనాల పాత్ర కూడా ఉంది. దాంతో ఇది అంతర్జాతీయ వ్యవహారంగా మారుతోంది. దీనికి సంబంధించి మేము ఇప్పటి వరకూ సేకరించిన వివరాలను త్వరలోనే ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పంపుతాం" అని కుటుంబరావు తెలిపారు.
ఫొటో సోర్స్, Eenadu
'మోదీ చైనా ఎందుకు వెళ్లారు?'
ఎస్సార్, రాస్‌నెఫ్ట్ ఒప్పందంపై అనుమానం వ్యక్తం చేసిన రష్యా ఆర్థిక మంత్రిని అరెస్టు చేశారని కుటుంబరావు అన్నారు.
"ఆ ఒప్పందం జరిగిన సమయంలో రష్యా ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు. ఆ మంత్రి జైలుకెళ్లారు. రాస్‌నెఫ్ట్ వాటాలో కొంత భాగాన్ని ఖతార్‌కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది.
ఖతార్ కంపెనీ నుంచి ఆ వాటాను చైనాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. అతన్ని చైనా ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆ వ్యక్తిని అరెస్టు చేసిన వారం రోజులకే ప్రధాని మోదీ చైనా వెళ్లారు. ప్రధాని షెడ్యూల్లో లేకుండా అకస్మాత్తుగా చైనా పర్యటనకు వెళ్లడానికి గల కారణమేంటో ప్రధానమంత్రి కార్యాలయం చెప్పాలి" అని కుటుంబరావు డిమాండ్ చేశారు.
ఈ డీల్‌ను రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంగా చూపడంతో భారత్‌కు రావాల్సిన రూ. 20 వేల కోట్ల పన్ను రాలేదన్నారు.
ఫొటో సోర్స్, facebook.com/Klnbjp
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
అవన్నీ అబద్ధాలే: కన్నా లక్ష్మీనారాయణ
ఎస్సార్ ఆయిల్ డీల్ విషయంలో కుటుంబరావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
"టీడీపీ సిద్ధాంతమే గాలి పోగు చేసి గోల చేయడం. 25 ఏళ్లుగా గమనిస్తూనే ఉన్నాను. టీడీపీ వాళ్లు తమకు నచ్చినట్టుగా కథలు అల్లి, వార్తలుగా రాయిస్తారు. వాళ్లు చెప్పేవన్నీ పూర్తిగా అబద్ధాలే. ఆ అబద్ధపు ఆరోపణలకు ఏం సమాధానం చేప్తాం? మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, నాలుగేళ్లు ప్రధాన మంత్రిగా ఎటువంటి మచ్చలేని వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన మీద వీళ్లు ఆరోపణలు చేయడం అసంబద్ధం" అని కన్నా వ్యాఖ్యానించారు.
ఫొటో సోర్స్, Getty Images
2014 డిసెంబర్ 11వ తేదీన దిల్లీలోని హైదరాబాద్‌హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుని ఆలింగనం చేసుకుంటున్న వీటీబీ బ్యాంకు ప్రెసిడెంట్, ఛైర్మన్ ఆండ్రీ కొస్టిన్, ఎస్సార్ సహ వ్యవస్థాపకుడు శశి రూయా
ఫొటో సోర్స్, Mea
పదేళ్లపాటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు ఎస్సార్ గ్రూపు, రాస్‌నెఫ్ట్ మధ్య 2014లో ఒప్పందం కుదిరింది
ఏమిటీ ఆ ఒప్పందం?
రష్యా నుంచి పదేళ్ల పాటు చమురు దిగుమతి చేసుకునేందుకు వీలుగా 2014 డిసెంబర్లో రష్యా ప్రభుత్వ రంగ చమురు సంస్థ రాస్నెఫ్ట్తో ఎస్సార్ గ్రూపు అవగాహన ఒప్పందం చేసుకుంది.
ఆ తర్వాత 2016 అక్టోబర్‌లో గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ఎస్సార్ ఆయిల్ లిమిటెడ్‌లో 98.26 శాతం వాటా అమ్మకానికి సంబంధించి డీల్ కుదిరింది.
అందులో 49.13 శాతం వాటాను రాస్‌నెఫ్ట్ కొనుగోలు చేసింది. ట్రాఫిగురా మరియు యూసీపీ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు కలిసి మిగతా 49.13 శాతం వాటాను దక్కించుకున్నాయి.
ఈ మొత్తం కొనుగోలు డీల్ 12.9 బిలియన్ డాలర్లు(ప్రస్తుతం భారత కరెన్సీలో దాదాపు రూ. 89 వేల కోట్లు) అని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
దేశంలోకి వచ్చే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని 2017 ఆగస్టు 21న రాస్‌నెఫ్ట్ సంస్థ తన వెబ్సైట్లో వెల్లడించింది.
"అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎస్సార్ చమురు శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేయడం ద్వారా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించాం" అని రాస్‌నెఫ్ట్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఘనాలో శవాల్ని ఆర్నెల్ల దాకా పూడ్చరు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- #GroundReport ప్రకాశం జిల్లా: తవ్విన కొద్దీ కన్నీరే, నీటి చుక్క జాడలేదు
- అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?
- రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు
- ఓజోన్ రంధ్రం పెద్దది కావడానికి చైనా కారణమా?
- ‘రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)