ప్రెస్ రివ్యూ: 'కొట్టిచంపడం కొత్తేమీ కాదు' - లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

ఫొటో సోర్స్, Getty Images
‘‘దేశంలోని పలు ప్రాంతాల్లో కొట్టిచంపుతున్న ఘటనలు చోటుచేసుకోవడం వాస్తవమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రమే దేశంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నది సరి కాదు. అంతకు ముందు నుంచే ఇలాంటి ఈ ఘటనలు జరుగుతూ వస్తున్నాయి’’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో చెప్పినట్లు 'నవ తెలంగాణ' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
నవతెలంగాణ కథనం ప్రకారం.. ఇలాంటి ఘటనలపై సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని కేంద్ర హోంమంత్రి చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి చెప్పిన ఈ సమాధానంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్‌నాథ్‌సింగ్ సమాధానాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై దాడితో పాటు ఇటీవల కాలంలో దేశంలో చోటుచేసుకుంటున్న కొట్టిచంపుతున్న ఘటనలను ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తాయి.
ఈ అంశాన్ని మొదట రాజ్యసభ జీరో అవర్‌లో సీపీఐ(ఎం) ఎంపీ రంగరాజన్ లేవనెత్తారు. 'యువ మోర్చా, ఏబీవీపీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో వేయాలి. అలాగే వాళ్లు పాల్పడుతున్న ఈ రకమైన దాడులను సభ ఖండించాలి' అని రంగరాజన్ డిమాండ్ చేశారు.
'మనదేశంలోనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మనది నాగరిక దేశమని, నాగరిక సమాజమని చెప్పుకుంటున్నాం. కానీ మన సాటి మనుషులకు ఏం జరుగుతోంది? దళితులను కొట్టిచంపుతున్నారు. ముస్లిములను, మైనార్టీలను చంపుతున్నారు. ఈ దేశపౌరులమని చెప్పుకునేందుకు గర్వపడాలా?' అని సీపీఐ ఎంపీ రాజా అన్నారు.
హింసకు పాల్పడుతున్నవారికి, విద్వేషం సృష్టిస్తున్నవారికి, కొట్టిచంపు తున్న ఘటనలకు పాల్పడుతున్నవారికి ఈ ప్రభుత్వం నుంచి అండదండలు అందుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు.
సామాజిక మాధ్యమాల్లోని పుకార్లు, నకిలీ వార్తల ఆధారంగా దేశవ్యాప్తంగా కొట్టిచంపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఎంసీ ఎంపీ సుఖేందో శేఖర్ చెప్పారు. ఇందుకు సంబంధించి సమగ్రమైన చట్టం చేయాలన్నారు.
ఇదే అంశాన్ని ఇటు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దేశవ్యాప్తంగా భావప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోందని, రాజకీయ ప్రత్యర్ధులపై, భిన్న అభిప్రాయం కలిగిన వ్యక్తులపై భౌతిక దాడులు ఒక పరంపరగా జరుగుతున్నాయని తెలిపారు.
జీరో అవర్‌లో లేవనెత్తిన అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమాధానం చెప్పారు.
"ఇలాంటి ఘటనలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా మాత్రమే జరగడం లేదు. గతం నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఈ ఘటనలను పూర్తిస్థాయిలో ఖండిస్తున్నాను. పుకార్లు, అనుమానం, నకిలీ వార్తల వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఘటనలపై సమర్థవంతమైన దర్యాప్తు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. పోలీసులు, శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోనిది. ఇది కేంద్ర ప్రభుత్వ అంశం కాదు. అయితే కేంద్ర ప్రభుత్వంగా 2016లో, 2018లో రెండుసార్లు రాష్ట్రాలకు సూచనలు చేశాం" అని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
ఫొటో సోర్స్, HC.TAP
రిజర్వేషన్ 50% దాటుతోందో లేదో పునఃపరిశీలించండి: హైకోర్టు
వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ ప్రోగ్రామ్‌ను పునఃపరిశీలించి.. వివరాలను కోర్టుకు సమర్పించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్, కాళోజీ హెల్త్ వర్సిటీలకు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ''మెడికల్ సీట్ల భర్తీలో ప్రతిభావంతులకు అన్యాయం జరగకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోకూడదు. ఉభయ తారకంగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చన్న వాదోపవాదాలు జరిగినప్పుడు రెండు సూచనలు వచ్చాయి. వాటిలో ఒకటి.. మొత్తం రిజర్వేషన్ 50 శాతం దాటుతోందా లేదా అని చూడడం. రెండోది, స్లైడింగ్ లేకుండా ప్రముఖ కాలేజీల్లో మెరిట్‌తోనే సీట్లను భర్తీ చేయడం. అప్పుడు ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుంది. రిజర్వుడు అభ్యర్థులు ఇబ్బందులు పడరు'' అని న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రిజర్వుడ్ అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కోటాలో సీట్లు పొందితే.. తర్వాత వాటిని వదులుకుని రిజర్వుడ్ కేటగిరీలో మరో కాలేజీలో చేరితే.. సదరు ఓపెన్ కోటా సీటును తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001లో జీవో 550 జారీ చేశారు.
దాని ప్రకారం.. రిజర్వుడ్ కేటగిరీకి చెందిన ఓ విద్యార్థికి మంచి ర్యాంకు వచ్చిందనుకుందాం. అతనికి ఓపెన్ కోటాలోనూ, రిజర్వుడ్ కోటాలోనూ సీటు వస్తుంది. సదరు విద్యార్థి తొలుత ఓపెన్ కోటాలో సీటు తీసుకున్నాడని అనుకుందాం. ఆ తర్వాత అతనికి నచ్చిన మరో కాలేజీలో రిజర్వేషన్ కేటగిరీలో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఓపెన్ కోటాను వదులుకుని రిజర్వేషన్ కోటాలో వచ్చిన సీటులో చేరాడని అనుకుందాం.
ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ కోటా సీటును మెరిట్ ఆధారంగా ఇవ్వరాదని, దానిని మళ్లీ రిజర్వుడు అభ్యర్థితోనే భర్తీ చేయాలని జీవో 550 స్పష్టం చేస్తోంది. ఏటా ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ జరుగుతోంది. కానీ, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఓపెన్ కేటగిరీ విద్యార్థులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. దానితో జీవో 550 అమలుపై కోర్టు స్టే ఇచ్చింది. ఫలితంగా, మెడికల్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది జీవో 550ని అమలు చేయలేదు.
దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 250 మంది అభ్యర్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ జీవోను అమలు చేయాలని కొందరు, వద్దని మరికొందరు వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లపై గురువారం విచారించిన హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఫొటో సోర్స్, Getty Images
నగదు పరిమితి కోటి రూపాయలు.. దాటితే సర్కారు స్వాధీనం!
ప్రజలు గరిష్టంగా కోటి రూపాయల వరకూ నగదును కలిగిఉండేలా నిబంధనల్ని సవరించాలని జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేంద్రానికి సిఫార్సు చేసినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఈ పరిమితిని దాటి నగదు కలిగిఉంటే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది.
‘సాక్షి’ కథనం ప్రకారం.. ప్రజలు గరిష్టంగా కలిగిఉండే నగదు పరిమితిని తొలుత రూ. 15 లక్షలు, ఆ తర్వాత రూ. 20 లక్షలకు పెంచాలని కొన్నిరోజుల క్రితం కేంద్రానికి సిట్ విజ్ఞప్తి చేసింది.
ఈ విషయమై జస్టిస్ షా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రజలు గరిష్టంగా రూ. కోటి మేర నగదును ఉంచుకునేలా నిబంధనల్ని సవరించాలని సిఫార్సు చేశాం. ఈ పరిమితిని మించి నగదు దొరికితే మొత్తం డబ్బుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించాం' అని చెప్పారు.
ఇటీవల తమిళనాడులోని ఓ సంస్థలో ఐటీ దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం దొరకడంపై స్పందిస్తూ.. 'అధికారులు దాడుల్లో స్వాధీనం చేసుకుంటున్న నగదును చూడండి రూ. 160 కోట్లు.. 177 కోట్లు. దీనిబట్టి రూ. 20 లక్షల నగదు పరిమితి ప్రయోజనకరం కాదని అర్థమవుతోంది' అని వ్యాఖ్యానించారు.
2014లో నల్లధనం కట్టడికి సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ ఎంబీ షా (రిటైర్డ్) నేతృత్వంలో సిట్ ఏర్పాటైందని ‘సాక్షి’ చెప్పింది.
ఫొటో సోర్స్, Getty Images
లంచం ఇచ్చేవారికీ ఏడాది వరకూ జైలుశిక్ష: రాజ్యసభలో బిల్లు ఆమోదం
లంచం ఇచ్చేవారికీ జైలుశిక్ష విధించాలని తొలిసారిగా ప్రతిపాదించిన ఓ అవినీతి నిరోధక బిల్లును రాజ్యసభ ఆమోదించిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. పాత అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ ఈ బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టారు. మూజువాణి పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
లంచం ఇచ్చేవారికీ.. ఏడాది వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. లంచం స్వీకరించేవారికి కనీసంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. వ్యక్తులతోపాటు సంస్థలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
చరిత్రాత్మక బిల్లుగా దీన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభివర్ణించారు. అవినీతి కేసుల్లో విచారణలు త్వరితగతంగా జరిగేలా, దుర్బుద్ధితో చేసే ఫిర్యాదుల నుంచి అధికారులకు (పదవివిరమణ చేసినవారికీ) రక్షణ కల్పించేలా ఈ బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సివచ్చినవారు.. ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల్లోపు విచారణ సంస్థలకు సమాచారం అందించి మినహాయింపు పొందవచ్చని అన్నారు. ఈ గడువును పెంచే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉందని ‘ఈనాడు’ పేర్కొంది.
ఫొటో సోర్స్, AMARAVATHI / TWITTER
రాజధాని నిర్మాణం ప్రైవేటుకే.. పలు సంస్థలతో ఇప్పటికే చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పలు సంస్థలతో చర్చలు జరిపిందని. సిఆర్డిఏ విధివిధానాలపై కసరత్తు చేస్తోందని పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఇప్పటి వరకూ రాజధాని పరిధిలో పిపిపి పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇక ముందు నేరుగా కంపెనీలు, నిర్మాణ రంగ సంస్థలకు భూములు కేటాయించే విధంగా నూతన విధానాన్ని రూపొందించనున్నారు. దీనిపై ఇప్పటికే డిఎల్ఎఫ్, శోభా, ప్రెస్టీజ్, మైహోం, షాపూర్జీ పల్లోంజి, అపర్ణా, రాడియస్, ఎస్ ఆర్బన్, జివికె, ఆర్ఎంజెడ్, ఎన్ఎస్ఎల్ సంస్థలో ఒక విడత చర్చలు పూర్తి చేశారు. వారి వద్ద నుండి కొన్ని సూచనలు తీసుకున్నారు.
రాజధాని పరిధిలో ఏర్పాటు చేయనున్న సమ్మిళిత అభివృద్ధి ప్రాంతాల్లో (మిక్స్డ్ యూజ్) ప్రైవేటు సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నివాసాలు, వ్యాపార కార్యకలాపాలు ఒకేచోట ఉండే విధంగా భవనాలు నిర్మించనున్నారు. సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ మినహా అన్ని ప్రాంతాల్లోనూ మిక్స్డ్ యూజ్‌కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. వీటిల్లో బహుళ అంతస్తుల నిర్మించడం ఆర్థికంగా సిఆర్డిఏకు భారంగా మారనుంది.
ప్రైవేటు వ్యక్తులను తీసుకురావడం ద్వారా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెంచాలని నిర్ణయించారు. రాజధానిలో రూపొందించి తొమ్మిది థీమ్ సిటీల ప్రధాన కేంద్రంగా ఈ సమ్మిళిత అభివృద్ధి ప్రాంతాలు ఉండనున్నాయి. దీని నుండి బయటపడేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
భూములు ఇవ్వడం, వాటిని అభివృద్ధి చేసి నిర్వహించి బదలాయించడం వంటి నిబంధనలు కాకుండా నేరుగా వ్యాపార రంగాలకే భూములు కేటాయించి, వచ్చే లాభాల్లో వాటాలు తీసుకోవాలనే ప్రతిపాదన ఒకదాన్ని సిద్ధం చేశారు. దీంతోపాటు ఇప్పుడున్న భవన నిర్మాణాల ఒప్పందాల పద్ధతిలో కాకుండా సిఆర్డిఏకు ఎక్కువ షేర్ ఉండేలా మరో విధానాన్ని రూపొందించినట్లు తెలిసింది. ఈ రెండు పద్ధతుల్లోనూ భూమిని డెవలప్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసి ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనే ప్రతిపాదననూ సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం: ఎడిటర్స్ కామెంట్
- మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- తెలంగాణలో రిజర్వేషన్ల చిచ్చు : గోండులు వర్సెస్ లంబాడాలు
- రాజ్యాంగం చెబుతున్నా IIMలు రిజర్వేషన్లు పాటించవా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)